హలో అండీ బావున్నారా? శ్రావణమాసం వచ్చిందీ వెళ్ళిందీ. బాద్రపదం కూడ వచ్చేసింది.. మీరంతా కూడ పండుగలూ, నోములూ వ్రతాలు వినాయక చవితితో సహా,భక్తి శ్రధ్దలతో చేసుకున్నారని తలుస్తాను.
ఈ రోజు ఉషోదయంలో సరికొత్త, టాపిక్తో మీ ముందుకొచ్చానండోయ్! అదేంటంటే మనం ఇన్నాళ్ళుగా అత్తగారూ వర్సెస్ కోడలూ, కోడలూ వర్సెస్ అత్తగారు అంటూ,బోల్డంత చర్చించుకుంటూ వచ్చాం కదా…….కానీ అసలు మనం ఇప్పటివరకు చర్చించుకోని విషయం ఇంకోటి ఉందండీ!
అదే వదినా ఆడపడుచులు. అసలు ఈ ఆడపడుచులు ఉన్నారు చూసారూ…తమ తమ అన్నతమ్ముళ్ళ భార్యల మీద ఓ ఒకటే అత్తగార్ల కన్నా ఎక్కువగా పెత్తనం చెలాయించేస్తూంటారండీ!
అందుకే ఆడపడుచు అర్ధమొగుడని ఊరికే అనలేదు.
వదినలమీద, మరదళ్ళ మీద తమకు సర్వహక్కులూ ఉన్నట్లు ప్రవర్తించేస్తూంటారు! అత్తగార్లతోనైనా ఎలాగో అలా నెట్టుకు రావచ్చుగానీ, ఈ ఆడపడుచుల వంకర మాటలూ, వెటకారాలూ, గడుసుదనంతో కూడిన మాటలూ భరించడం చాలా కష్టమండీ! అంతే కాదు వీళ్ళతో బహు జాగ్రత్తగా ఉండకపోతే మనం ఏదో యాధాలాపంగా నోరు జారి ఏమైనా సరదాగా ఏదో అన్నామనుకోండి, అవన్నీ హైకమాండ్కి చేరవేయబడతాయి, తెలుసునా! అందుకే మన జాగ్రత్తలో మనం ఉండటం ఎప్పటికైనా మంచిదే! సో బివేర్………!
ఇక పోతే, తల్లి గురించి ఏమైనా చెప్తే ఈ కొడుకులు అర్ధం చేసుకుంటారేమోగానీ, వారి అక్క చెల్లెళ్ళ మీదగానీ అన్న దమ్ములమీదగానీ , ఈగ కూడ వాలనీయరండోయ్…..అంటే అలా అని, అందరు ఆడపడుచులు అలా ఉంటారని కాదు…..కొంతమంది మెత్తటివాళ్ళు కూడ ఉంటారు.ఇక చూసుకోండి వాళ్ళతో ఆ వదినగార్లు , మరదళ్ళూ ఫుడ్బాల్ ఆడినట్లు ఆడుకుంటారు సుమా! మెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుదధేస్తుందన్న సామెత వినే ఉంటారు! అట్లాంటి అమాయక శాల్తీలు చాలాఅరుదుగా ఉంటారనుకోండి. అది వేరే విషయం……..!
అంతేకాదు ఈ ఆడపడుచులకు, వాళ్ళ అన్న తమ్ముళ్ళ మీద ఎంత ఎనలేని ప్రేమంటే, మా అన్నయ్యకిదిషఠం, అదిష్ఠం అంటూ తమ స్వహస్తాలతో చేసి పెట్తారేగానీ , మా వదినకి ఇదిష్ఠం అని చేసి తెచ్చి పెట్టే ఆడ పడుచులను, (చాలెంజ్ చేసి చెప్పగలను) ఎవరూ చూసి ఉండరు.
నేను ఇప్పుడు ఒక మరదలు, ఆడపడుచుల గురించిన ఒక ఎపిసోడ్ వ్రాయబోతున్నాను .సో బీ రెడీ ఆల్ ఆఫ్ యూ………
ఓ సారి ఓ పెద్దాడపడుచుగారు కొత్తగా పెళ్ళైన తన తమ్ముడింటికి షార్ట్ విజిట్గా ( అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకూ అన్నమాట)వెళ్ళింది.అప్పటికి ఆ సో కాల్డ్ మరదలు పిల్ల స్నానంకూడ చేయలేదు.వంట సంగతి దేముడెరుగు. అప్పుడు సమయం పన్నెండవుతోంది.
అప్పుడీ ఆడపడుచుగారు మరదల్ని ఒక్క చూపుతో నిలదీసింది……ఆ చూపులో పన్నెండవుతున్నా ఇంకా స్నానం కూడ చేయలేదా అన్న ఎన్నో భావాలు కనపడ్డాయి ఆ మరదలికి.
“ఈ రోజు ఆదివారం కాబట్టి స్నానం చేయడానికి ( తను ఉద్యోగస్థురాలు లెండి ) కొద్దిగా బద్ధకించాను వదినగారూ! “అంటూ ఆవిడ
అడక్కపోయినా సంజాయిషీ ఇచ్చుకుంది.
“సరే ఇంక వంట కూడ అయి ఉండదు కదా….సరేలే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా , నేను ఈ లోపల వంట ప్రయత్నాలు చేస్తాను.”
“అయ్యయ్యో వద్దండీ ……మీకెందుకూ శ్రమ, నేను స్నానం చేసొచ్చి అరగంటలో చేసేయనూ “ అని మర్యాద చేసింది అర్ధమొగుడికి. అప్పుడావిడ అన్న మాటలు వ్యంగ్యానికి పరాకాష్ట!
“అదేంటీ నువ్వు అర గంటలో చేస్తే నేనేనా చేయలేనిది? నేను పది నిమిషాలలో చేసి చూపిస్తా! అని ఓ సవాలు విసిరింది. బాబోయ్ ఈవిడతో వేగటం కష్టం బాబూ నేనేమైనా ఇంకా అంటే ఆవిడ ఇంకేమంటుందో అని ఠారెత్తిన ఆ మరదలు, అతి వేగంగా బాత్రూంలో దూరి తలుపు వేసుకుంది.
ఆనక త్వర త్వరగా స్నానం చేసి కిచెన్‌లోకి దూరిన ఆ మరదలికి ఎంతో ఆసక్తిగా వంట చేయడంలో మునిగి పోయిన ఆడపడుచు దర్శనమిచ్చింది. ఇంతలో సరిగ్గా అప్పుడే పనమ్మాయి నేను వెళ్తున్నానమ్మా! అన్నది. ఇంతలో ఈ మరదలు “అప్పుడే వెళ్ళకు నాకు కూరగాయలు తెచ్చిపెటాలి “ అంది. “ ఏం తెమ్మంటారమ్మా త్వరగా చెప్పండి, అవతల నాకు ఇంకా ఇళ్ళున్నాయి” అన్నది. ఓ ముప్పావు కిలో వంకాయలు, ముప్పావు కిలో బెండకాయలు, కిలో టమాటాలు తీసుకు రా అని పురమాయించింది. అదంతా విన్న మన ఆడపడుచుగారు , “ నాకు తెలీక అడుగుతాను, మీరుండేది ఇద్దరే కదా, మీకు అన్ని కూరలెందుకూ అని నిలదీసింది. దానికి సమాధానంగా “ అదికాదు వదినగారూ మా ఆయన కూరలూ పళ్ళూ ఎక్కువగా తినాలి అంటారండీ అందుకే…..” అంటూ నీళ్ళు నమలసాగింది.
“ మా ఆయన అంటావేంటీ, నీకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడ తెలీదా? ముందు నాకు తమ్ముడు ఆ తరువాతే నీకు ఆయనయ్యాడు తెలిసిందా?” అని గర్జించింది.
“మరి ఏమనాలండీ ?” అన్నది బిక్కు బిక్కుమంటూ ఆ మరదలుపిల్ల.
“ ఏముందీ మీ తమ్ముడుగారు అనాలి” అన్నది
“ ఓ అదా, అదికాదండీ ఇక్కడ మా కాలనీలో అందరం ప్రెండ్స్మే ఉన్నాము. కాబట్టి మా ఆయన, మావారు అనడమే అలవాటు. అందుకే అలవాటు కొద్దీ అలా వచ్చేసింది ఏమనుకోకండి వదినగారూ అని బ్రతిమాలింది ‘ ఇదెక్కడి గొడవరా బాబూ’అని మనస్సులోఅనుకుంటూ!
ఇక భోజనాలూ, సాయంకాలం టీకాఫీలయి ఆ ఆడపడుచుంగారు నిష్క్రమించాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఆ మరదలు.
చూసారా ఇలా ఉంటుంది ఈ ఆడపడుచులతో వ్యవహారం! అలా అని అందరూ అలాగే ఉంటారని అనడం లేదండోయ్….! మళ్ళా ఇది చదివి నా మీదకి దండయాత్రకి వచ్చేరు! నేనసలే అమాయకురాలిని! మీకు తెలీదేమో!!!
*
మాధవపెద్ది ఉష