గణపతి పుట్టిన రోజు వేడుకలు

వినాయక చవితి రాబోతున్నది, మన గణేశుని పుట్టిన రోజు ఘనంగా చేయాలి అని అన్నారు పరమశివుడు  పార్వతితో. ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా అవునూ అన్నది. అక్కడే ఉన్న గణపతి అన్నీ వింటున్నాడు. ఇంతలో పరమశివుడు నాయనా గణేశా నీకు ఈ సంవత్సరం ఏమి బహుమతి ఇయ్యమంటావో చెప్పు అన్నారు. వినాయకునికి బుద్ధిలో తళుక్కుమని ఒక ఆలోచన మెరిసింది.

తండ్రీ నాకు నా  పుట్టిన రోజు వేడుకలు భూలోక వాసులు ఎలా చేసుకుంటున్నారో చూడాలని ఉంది. మీరు అనుజ్ఞ ఇస్తే నేను ఆ రోజు భూలోకంలో సరదాగా తిరిగి వస్తాను అన్నాడు. సరే నీ ఇష్టం నాయనా. నీ సంతోషం కన్నా మాకు ఏమి కావాలి అన్నారు తల్లిదండ్రులు ఇద్దరూ. మహానంద పడ్డాడు గణపతి.

పుట్టిన రోజు రానే వచ్చింది. గణపతి భృంగిని, నందిని తనతో భూలోకం తిరిగి రావటానికి రమ్మన్నాడు. ఇద్దరినీ తీసికెళ్తే ఎలా నాయనా, మీరు వచ్చేటప్పటికి మేము కూడా అంతా అలంకరణ చేసి తయారుగా ఉండేలిగా. అందుకని ఒకరిని తీసికెళ్ళు వెంట అన్నది మాత. అలాగే వీలయినంత త్వరగా కైలాసం చేరండి. మేము కూడా మీతో గడపాలి కదా అన్నది. సరే అన్నాడు గణపతి. నంది, నేను ఇక్కడే ఉండి మాతకు పుట్టిన రోజు వేడుకలలో సహాయం చేస్తాను. భృంగిని తీసికెళ్ళండి అన్నాడు. సరేనని వినాయకుడు భృంగితో బయలుదేరాడు భూలోకానికి.

ఇద్దరూ అందమైన యువకులులాగా మారి భూలోకంలో దిగారు. సుందరంగా ఉన్న మనుష్యులు రోడ్డుమీద తిరుగుతుంటే అందరూ తలలు త్రిప్పి మరీ చూడసాగారు. గర్వంతో పొంగిపోయినాడు గణపతి.

ముందుగా ఒక ముసలమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె గణపతి మట్టి విగ్రహం ముందు కూర్చుని కన్నీరు కారుస్తూ ఉండటం చూసి ఏమయింది మామ్మా ఏడుస్తున్నావు? అని అడిగారు.

ఏమి లేదు నాయనా, ఈ రోజు వినాయక చవితి కదా, స్వామికి పూలు, ప్రత్తి కొందామంటే వేయి రూపాయలకు తక్కువ ఏదీ లేదు. పోనీ గరిక తెచ్చుకుందామంటే ఎక్కడా గరికే లేదు. అన్నిచోట్ల ఇళ్లు కట్టేసి గరిక లేకుండా పీకేశారు. కొబ్బరి కాయ కొందామంటే చాలా ధర చెపుతున్నారు. బీదదాన్ని, నేనేమి చేయను నాయనా. అందుకే బాధపడుతున్నా అన్నది. ఏమీ బాధపడకు మామ్మా. అన్నిటి కన్నా భక్తి ముఖ్యం. నీకు వచ్చిన పద్యాలు చదువుకొని, అక్షింతలతో పూజచేసి, కాస్త బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసుకో చాలు. స్వామి సంతోషిస్తారు చెప్పాడు గణపతి. సరే నాయనా, మంచి సలహా ఇచ్చావు. నూరేళ్ళు నా ఆయుష్షు కూడా తీసుకుని సుఖంగా జీవించండి దీవించింది ముసలమ్మ.

అక్కడ మంచి మరొక చోటికి వెళ్ళారు. పెద్ద హాలు దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. ఒక ప్రక్కమైకులో పాటలు వినపడుతున్నాయి. మరొక ప్రక్క ఆ పాటల కనుగుణంగా అబ్బాయిలు, అమ్మాయిలు డాన్స్ లు చేస్తున్నారు. పెద్ద స్టేజి మీద పెద్ద వినాయకుడు. అయితే ఆ స్టేజిమీద ఒక్క వినాయకుడి విగ్రహమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దేశభక్తులవి, వేరే దేవుళ్లవి, ఇలా ఇలా ఎన్నో. ఆ గణపతి కూడా ఏదో ప్రత్యేక భంగిమలో ఉన్నాడు. ఇదేమిటి భృంగీ ఈ విగ్రహాలన్ని ఎందుకు ఉన్నాయి ఇక్కడ అన్నాడు గణపతి భృంగితో. అదే నాకూ అర్థం కావటం లేదు అన్నాడు భృంగి.

అక్కడ నుంచి మరొక చోటికి వెళ్ళారు. ఆ ఇంట్లో వాళ్లు సాదరంగా సాదరంగా ఆహ్వానించారు వీళ్లను. అక్కడ పూజా విధానము అంతా యు ట్యూబ్ ద్వారా జరుగుతున్నది.  బ్రాహ్మడు కథ ఇంగ్లీషులో చదివి తెలుగులో అర్థము చెపుతున్నాడు పూజ చేస్తున్నవారికి. వింటున్న శ్రోతలు వాళ్ల వాళ్ల సెల్ ఫోన్లలో ఆటలు ఆడుకుంటున్నారు. వినలేక, చూడలేక లేచారు ఇద్దరూ వెళ్దామని. కూర్చోండి, వెళ్ళకండి, భోజనాలు ఉన్నాయి. స్పెషలంగా బిరియానీ చేయించాము, పూరీ కూర్మా కూడా చేయించాము.  ఆ ఇంటాయన ఇంకా ఏదో చెప్పబోతుంటే, కాస్త పని ఉంది, పూర్తి చేసుకని మళ్ళీ వస్తాము అని చెప్పి బయటపడ్డారు. బయటికి వచ్చాక, ఇదేం పూజ, ఇదేమి నైవేద్యం భృంగీ అన్నాడు గణపతి. అంతే స్వామీ, ఇది కలియుగం అన్నాడు భృంగి.

మరొక చోటికి వెళ్ళారు. అక్కడ గణపతి బొమ్మలు మట్టితో కాకుండా, గాజు సీసాలతో విగ్రహం తయారుచేసి పూజలు చేస్తున్నారు. మరొక చోట చూస్తే కూరగాయలతో, మరొక చోట జీడిపప్పులతో, మరొకచోట నోట్ల కట్టలతో ఇలా వివిధ రూపాలతో దేవుడు సాక్షాత్కరించాడు. అంతేకాదు, అనేక భంగిమలలో కూడా కనపడ్డాడు. ఒకచోట పాము మీద నృత్యం చేస్తున్నట్లు, మరొక చోట పులిని ఎక్కి కూర్చున్నట్లు, మరొక చోట విమానంమీద, మరొక చోట సెల్ ఫోన్ తో మాట్లాడుతున్నట్లు, ఇలా ఇలా.

ఇదేమిటి భృంగీ, ఇలా అయితే నేను మూషికాసురుడుని సంహరించినట్లు, భావితరాల పిల్లలకు ఎలా తెలుస్తుంది అన్నాడు భృంగితో. అది అంతే స్వామీ, తెలియవలసిన అవసరం కలియుగ పౌరులకు లేదు. వాళ్లకు భక్తి కన్నా సృజనాత్మక శక్తి ఎక్కువ. అందుకే అలా తయారుచేస్తున్నారు అన్నాడు భృంగి.

చివరగా ఒక ఇల్లు చూసి కైలాసం చేరదామనుకున్నారు. తలుపు తట్టబోయి బయటికి మాటలు వినపడుతుంటే, బయటనే ఆగి వినసాగారు.

త్వరగానే ముస్తాబు కానియ్యి. టైము అయిపోతున్నది.  ఆలస్యం అయితే సరదా కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి. భోజనాలు కూడా మిగలవు. ఇంత దూరఁ వెళ్ళి ఏ సరదా ఉండదు. వినాయక పూజరాత్రి ఇంటికి వచ్చాక ఏదో శక్తి కొలది చేసి, పండు నైవేద్యము పెట్టి క్షమాపణలు అడుగుదాం, వినాయకుడు క్షమిస్తాడులే అంటున్నాడు ఇంటి యజమాని.

ఇహ వినలేక నిస్సత్తువ  వచ్చింది ఇద్దరికి. త్వరగా కైలాసం చేరి పార్వతీమాత తయారుచేసే గారెలు, ఉండ్రాళ్ళు తిని విశ్రమిద్దామని ఆఘమేఘాల మీద కైలాసం చేరారు.

ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో గణపతి తన రూపాన్ని వివిధ భంగిమలలో మలచిన భూలోకవాసుల సృజనాత్మక శక్తిని గుర్తు తెచ్చుకుని, వీరి సృజనాత్మక శక్తి ఇలాగే వృద్ధి చెందాలని ఆశీర్వదించాడు. వీరికి ఆయురారోగ్య, ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని కూడా దీవించారు.

ఇదండీ మన గణపతి పుట్టన రోజు విశేషాలు.

మనుషులకు భక్తి, జ్ఞానము తప్ప అన్నీ కలుగాలని ఆశీర్వదించారు మన గణపతి

 

        మాధవపెద్ది నాగలక్ష్మి

One Comment

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అపరాజిత

అప్రమత్తం చెయ్యాలి…