లేడీ గాగా.. డేన్ వారెన్ తో కలిసి రాసిన కవిత.
*********
నువ్వు చెప్పు…అంతా బాగవుతుందని..
కాలంతో పాటు అంతా సర్దుకుంటుందని
ఒక్కసారి చెప్పు.. నన్ను నేను కూడగట్టుకుంటాను..లేచి నిలబడుతాను.
నాతో మళ్లీ చెప్పు.. నువ్వు బాగుంటావని ..
నీకు తెలిసిందంతా చెప్పు
నేను బాగవడానికి.,మళ్లీ మాములు అయిపోవడానికి..
అసలేమీ జరగనట్లే ఉండడానికి., నీకేం తెలుసో అంతా చెప్పు.
సరేలే.. నాకు జరిగిన ఆ రేప్., నీకు జరిగేదాకా తెలీదు ఎలా ఉంటుందో…
నా అనుభవం నీకెలా వాస్తవంలోకి వస్తుంది..నీదెలా అవుతుంది?
అస్సలు కాదు గాక రాదు.. నా నొప్పి నీ అనుభూతి కాలేదు..ఎప్పటికీ.. అది నీకు జరిగితే కానీ.
అయినా..తలెత్తు కుని..ధైర్యంగా ..బలంగా నిలబడమని
పడిపోయాక..లేచి నిలబడి
ముందుకు సాగిపోవాలని
ఒక్కసారి నాకు చెప్పు చాలు
చెప్తావా మరి? అయినా నేను నడచిన దారుల్లో నువ్వు నడిస్తే కానీ…అప్పటిదాకా .. అవును అప్పటిదాకా నీవన్నీ ఒట్టి మాటలుగానే ఉంటాయి.
నాకు జరిగింది నీకూ జరిగితేనే ..బహుశా నీ మాటలు కూడా వేరుగా వస్తాయి.
నీ ప్రపంచం కాలి పోయినప్పుడో., బధ్ధలు అయినప్పుడో..
నీవు నిలబడ్డ తాడు అంచుకు నువ్వు చేరుకుని జారిపోబోయినప్పుడో ..అదిగో అలాంటప్పుడు కానీ నీ మాటలు నేను కోరుకున్నట్లుగా ఉండవు మరి.
అసలు నా చెప్పుల్లో నీ కాళ్ళు పెట్టి నిలబడేదాకా..
నువ్వు .,నేనయ్యేదాకా
అసలు నీ నుంచి నేనేమీ వినదల్చుకోలేదులే..
ఎందుకంటే నాకు జరిగింది నీకు జరగలేదు కాబట్టి.. ఆ బాధ నీకర్ధమే కాదు కాబట్టి.
నీ కది వాస్తవం కాదు కాబట్టి
నువ్వు .,నేను కాదు ,కాలేవు కాబట్టి.
నాలా నీకది జరిగేదాకా..
నిజంగా జరిగేదాకా
నాకెలా అనిపిస్తుందో..నాకెంత బాధ ..కలిగిందో నీకు తెలిసే అవకాశమే లేదు..
అయినా..
నువ్వో మాట చెప్పు.. ఇంత జరిగినా అంతా బాగవుతుందని…శిరస్సు వంచకుండా
ముందుకే పోవాలని
ఆగిపోకూడదని…చెప్తావా
ఈ నాలుగు మాటలు?
అయినా ఎలా చెప్తావులే..
నీకు జరిగితే కానీ…!!
స్వేచ్చానువాదం– గీతాంజలి.