సంస్కృతి, వారసత్వ పరిరక్షణపై చైతన్యం రావాలి

పి. అనురాధ గారితో వంగ యశోద ముఖాముఖి

కూలిన గోడలు, పగిలిన కుండ పెంకులు, చెల్లని నాణేలు ఇవే మన జీవనయానానికి సజీవ సాక్ష్యాలు అంటారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు పి. అనురాధ గారు. ఎనిమిది పదుల వయసులోనూ భుజానికి కెమెరా వేసుకుని, తనతో పాటు పిల్లలను, యువతను తీసుకుని హైదరాబాద్ వీధుల్లో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. ఒక కట్టడం శతాబ్దాల చరిత్రకు చిహ్నం. ఒక శిథిల భవనం ప్రజల జీవనవిధానాన్ని తెలిపే చిరునామా.. ఇవి సాంస్కృతిక, వారసత్వ అద్భుత నిర్మాణ కౌశలానికి ప్రతీకలు. చరిత్రలో నిలిచిన మన వారసత్వ సంపదను కాపాడే ప్రయత్నం ప్రతిఒక్కరూ చేయాలంటారు ఆమే. ఇన్ టాక్ (ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ )లో మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఆమె పరిచయం మన తరుణి పాఠకుల కోసం..

తరుణి : నమస్కారం మేడమ్. ఇప్పటికీ మీరు కెమెరా పట్టుకుని ఎన్నో కట్టడాల ఫొటోలను ఫ్రేమ్స్ లో బంధిస్తుంటారు. మీరు మాకు ఎంతో స్ఫూర్తి. అందుకే మీ గురించి మా తరుణి పాఠకుల కోసం చెప్పండి.

అనురాధ గారు : తరుణి పాఠకులకు అభినందనలు. మీ పత్రిక పేరు బాగుంది. ఆడవాళ్లు ప్రపంచం తెలుసుకోవాలి. అప్పుడే సమానత్వం సాధ్యమవుతుంది. ఇక నా గురించి చెప్పాలంటే ముందుగా హైదరాబాద్ సంస్థానాల గురించి చెప్పాలి. హైదరాబాద్‌ సంస్థానం పరిధిలో ఉన్న 16 సంస్థానాలు దోమకొండ, అమరచింత, వనపర్తి, గద్వాల, సిర్నెపల్లి తదితర ప్రాంతాలు ఉండేవి. మా తాతగారు సిర్నెపల్లి సంస్థానాధీశులు. నాన్నమ్మ రాణి జానమ్మ. ఆమె వనపర్తి సంస్థానం ఆడపడుచు. వారి హయాంలో ప్రజల అవసరాలను గుర్తించి పరిపాలన కొనసాగేది. సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇక మా సంస్థానంలో పరిపాలనా సలహాదారులుగా హిందూ, మౌల్సాసాబ్‌, ఉదాసిన్‌ సిక్కు ఉండేవారు. స్వాతంత్య్రానంతరం పోలీస్‌ యాక్షన్‌ ద్వారా నిజాం రాష్ట్రం విలీనం కావడంతో సంస్థానాలన్నీ ప్రజాస్వామ్యంలో కలిసిపోయాయి.

స్వాతంత్య్రం వచ్చాక మా నాన్న శ్రీరాములు భూపాల్‌ హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్‌లో జాయిన్‌ అయ్యారు. ఆయన బదిలీపై పోయిన ప్రతి జిల్లాల్లో అక్కడి వారి జీవనవిధానం, సంస్కృతి, భాష తెలుసుకునే వీలు కలిగింది. దక్కన్‌లో తెలుగు, ఉర్దూ లతో పాటు మరాఠి, కన్నడ, పర్షన్‌, ఆంగ్లం ఇలా అనేక భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నింటిలో కొన్ని నేర్చుకునే అవకాశం కలిగింది. చిన్నతనం నుంచే కట్టడాలు, భవనాలపై మక్కువ ఉండేది. అమ్మ కథలు చెప్పితే నాన్న చరిత్ర చెప్పేవారు. కెమెరా పై పెంచుకున్న మక్కువను చూసి తాతయ్య కెమెరా కొనిచ్చి దాన్ని ఎలా వాడాలో నేర్పించారు. ఆ తర్వాత నచ్చిన ప్రతిదీ నా కెమెరాలో బంధించేదాన్ని.

తరుణి : చారిత్రక కట్టడాల పరిరక్షణ వైపు ఎలా వచ్చారు

చదువు అయిపోయిన తర్వాత ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో పర్యటించాను. అక్కడ ఉన్న చారిత్రక, వారసత్వ కట్టడాలపై ఎన్నో డాక్యుమెంటరీలు రూపొందించాను. అనేక దేశాలు తిరిగినప్పుడు అక్కడ వారు తమకు వారసత్వంగా వచ్చిన కట్టడాలను, భవనాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవడం గమనించాను. వేలాది ఏండ్ల చరిత్రగల తమ దేశం వైపు ప్రపంచమంతా చూస్తుంటే మనం విదేశలవైపు ఎగిరిపోతున్నాం. మన సంస్కృతిని మరిచిపోతున్నాం. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో ఎంతో కళానైపుణ్యంతో కట్టిన భవనాలను కాలం చెల్లిన భవనాలు అన్న ఛాందసంతో కూల్చేస్తున్నాం. చాలా దేశాలు అక్కడ ఉన్నమాన్యుమెంట్స్‌ను పర్యాటక ప్రాంతాలుగా మార్చడం ద్వారా తమ దేశ ఆర్థిక స్థితిని అభివృద్ధిచేసుకుంటున్నాయి. ఈజిప్ట్‌ లాంటి దేశాలు పర్యాటకరంగంపైనే ఎక్కువగా ఆధారపడి విదేశీమారకద్రవ్యాన్ని పొందుతున్నాయి. కాని, మన దక్కన్‌ ప్రాంతంలో రాష్ట్రకూటుల నుంచి అసఫ్‌జాయిల వరకు ఎన్నో వినూత్న, వైవిధ్య ఆర్కిటెక్చర్‌లో నిర్మించిన భవనాలు, కట్ట డాలు ఉన్నాయి. అయితే వాటిని సంరక్షించాలన్న అవగాహన, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకోవాలన్న ప్రణాళిక ప్రభుత్వానికి లేదు. కారణం వారికి ఆ కట్టడాల విలువ, చారిత్రక ప్రాముఖ్యత తెలియకపోవడమే ఇందుకు కారణం.

తరుణి : ఇన్ టాక్ లో ఎప్పుడు చేరారు.

గతించిన చరిత్రను బతికించడమే కాకుండా రేపటితరానికి తెలియజేసే అవకాశం ఉందన్న ఆలోచనతో స్వచ్ఛందంగా ప్రారంభించిన సంస్థ ఇన్‌టాక్‌ ((ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ ). జనవరి 27, 1985లో ఏర్పాటుచేసిన సంస్థ లో నేను సభ్యురాలిగా చేరాను. చారిత్రక కట్టాడాల గురించి సమాచారం తెలుసుకునే వీలు కలిగింది. ఇప్పటికి 35 సంవత్సరాలుగా ఇందులోనే పనిచేస్తూ వేలాది కట్టడాలను గుర్తించి వాటి ప్రాధాన్యతను వివరిస్తున్నాం. జిల్లాస్థాయిలో హెరిటేజ్‌ క్లబ్‌లు ఏర్పాటుచేసి అనేక వర్క్‌ షాప్‌లు, సెమినార్‌లు, హెరిటేజ్‌ వాక్‌లు నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు వారసత్వ సంపదవిలువ తెలిసేలా స్కూల్స్‌లలో పోటీలు నిర్వహిస్తున్నాం. స్టూడెంట్‌ హెరిటేజ్‌ క్లబ్‌లు ఏర్పాటుచేసి వారికి చరిత్రపై అవగాహన కల్పిస్తున్నాం.

తరుణి : హెరిటేజ్ వాక్ ల గురించి వివరిస్తారా

హైదరాబాద్‌లో ఎన్నో పురాతన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్ట డాలున్నాయి. కాని వాటి గురించిన సమాచారం ప్రభుత్వం వద్దలేదు. మన చుట్టూ ఉన్నవాటి చరిత్రే మనకు తెలియదు. పూర్వీకులు కట్టిన అనేక భవనాలను కూల్చివేసి ఆధునికహంగులతో నూతన భవనాలు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో కేంద్ర పురావస్తు శాఖ గుర్తించిన కట్టడాలు 137, రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తించిన కట్టడాలు 500 పైనే ఉన్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ గుర్తించిన భవనాలు ఉన్నాయి. అందుకే మేం ఆ వివరాలన్నీ సేకరించి వాటిని పరిరక్షించుకోవడానికి యువత, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ హెరిటేజ్ వాక్ చేస్తున్నాం. కరోనా సమయంలోనూ పిల్లలు ఎంతో ఆసక్తిగా ఈ వాక్ లో పాల్గొన్నారు.

తరుణి : చరిత్రను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి

మనం విదేశాల్లో చూస్తే అక్కడ చారిత్రక కట్టడాలకు ఎలాంటి విఘాతాలు కలగకుండా నిర్మాణాలు జరిగాయి. మన దేశంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. అయితే వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. భౌగోళికం నుంచి చరిత్ర తెలుస్తుంది. భాష ద్వారా ఉనికి తెలుస్తుంది ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తిస్తే మన ఉనికి నిలుస్తుంది. అభివృద్ధి పేరుతో చరిత్ర , ప్రకృతి విధ్వంసం జరగకుండా ప్రతి ఒక్కరూ జాగరూకతతో మెలగాలి. సంస్కృతి, వారసత్వ పరిరక్షణపై చైతన్యం రావాలి . మన పూర్వీకుల చరిత్ర మన ముందు రానున్న తరాలకు తెలియాలన్నదే మా ప్రయత్నం.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆమె అడవిని జయించింది

కళా తరుణి