కోసలరాజ్య రాజధాని
అయోధ్య నగర రాజు దశరథ మహారాజుకు కౌసల్య,కైకేయి,సుమిత్ర అనే ముగ్గురు భార్యలు. ఎంతకాలం నుండో సంతానం లేక బాధపడుతున్న దశరథునికి కులగురువు వశిష్ఠ మహాముని చెప్పగా అశ్వమేధ యాగం,పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు.అగ్నిదేవుడు ప్రత్యక్షమై గిన్నెలో పాయసం చేతబట్టి దశరథునికి ఇవ్వగా దశరథుడు పట్టమహిషి కౌసల్యకు సగం కైకేయికి సగం ఇవ్వగా కౌసల్య కైకేయి ఇద్దరు వారి భాగాల్లో సగభాగం సుమిత్రకు ఇవ్వగా అందరూ ఆ మహిమాన్విత పాయసం సేవిస్తారు.
పాయసం మహిమతో ముగ్గురు రాణులు గర్భం దాలుస్తారు.ఒక శుభసమయాన చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం నాడు పండంటి కుమారుని కన్నది కౌసల్య.కైకేయి ఒక కుమారుని,సుమిత్ర ఇద్దరు పుత్రులను కన్నారు. దశరథ మహారాజు పెద్దకుమారునికి శ్రీరాముడు,రెండవవకుమారునికి భరతుడు,సుమిత్రా తనయులకు లక్ష్మణ,శత్రుఘ్నులు అని నామకరణం చేస్తారు.
చిన్నప్పటినుండి సకల విద్యలు నేర్చుకుంటూ తల్లుల , తండ్రి ప్రేమను చూరగొంటూ వినయసంపన్నులై పెరిగి పెద్దవారైనారు.
బ్రష్మర్షి విశ్వామిత్రుడు వచ్చి యాగసంరక్షణ కొరకు రామలక్ష్మణులను వెంట పంపమని కోరగా దశరథుడు పసి బాలురు వారిని అడవులకు పంపించను అనగా విశ్వామిత్రునికి కోపం వస్తుంది. అది చూసి వశిష్ఠుడు దశరథునికి నచ్చచెప్పి పంపమని చెప్పగా పంపిస్తాడు. రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు అరణ్యానికి బయలుదేరుతాడు.
రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఆస్త్రశస్త్ర విద్యలను నేర్పించారు. యాగం చేస్తుండగా తాటకి మొదలైన రాక్షసులు యాగానికి అడ్డు పడగా రాక్షస సంహారం చేశారు రామలక్ష్మణులు.
యాగం నిర్విఘ్నంగా పూర్తి చేసి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల ను తోడ్కొని వెళుతూ మిథిలానగరం చేరుకుంటారు.
జనక మహారాజు సీతాదేవికి స్వయవరం ఏర్పాటు చేసి హరవిల్లు విరిచినవారికి సీతమ్మ నిచ్చి వివాహం చేయాలని నిశ్చయం జరుగుతుంది.
నలుదిక్కుల నుండి రాజులు విచ్చేసి ప్రయత్నిస్తారుగాని శివధనస్సును ఎత్తలేకపోయిరి.లంకాధీశుడు రావణాసురుడు సైతం హరుని విల్లును ఎత్తలేక అవమానంతో మిన్నకుండెను.
గురువు విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరామచంద్రుడు సులభంగా శివధనుస్సు ఎత్తి సునాయాసంగా ఎక్కుపెట్టగా రాజులందరు ఆశ్చర్యచకితులైరి.
జనక మహారాజు మనసు ఆనందంతో నిండిపోయి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
” ఊహకు కూడా అందని సంఘటన నా కళ్ళముందు జరిగింది.ఈ దాశరథి బలపరాక్రమాలు ప్రత్యక్షంగా చూశాను.నా కుమార్తె వీర్య శుల్క . అంటే వీరత్వం కలిగినది . కాబట్టి ఆమెతో సాటి అయిన వీరునికే ఇవ్వాలన్న నా ప్రతిజ్ఞ ఈరోజు నెరవేరింది.నాకు ప్రాణ సమానురాలైన సీతను ఈ రామునికిచ్చి వివాహం చేస్తాను.నువ్వు అనుమతిస్తే వేగంగా వెళ్లే దూతలను శుభ సమాచారంతో అయోధ్యకు పంపుతాను వారు దశరథ మహారాజును ఆహ్వానించి తీసుకువస్తారు” అనగానే
విశ్వామిత్రుడు అలాగే చేయమన్నాడు.
జనకుని దూతలు వెంటనే ప్రయాణమై అయోధ్యకు చేరి రాజదర్శనం చేసుకొని ” మీరు ఉపాధ్యాయ పురోహిత సమేతులై మిథిలకు వచ్చి ఈ వివాహం జరిపించి తనను ధన్యుణ్ణి చేయమని మా ప్రభువు జనకమహారాజు ఆహ్వానిస్తున్నారు” అని విన్నవించారు.
దశరథుడు ఆనందించాడు. మంత్రులు,పురోహితులు,పురప్రముఖులు అందరూ ఆమోదం తెలిపారు.దశరథుడు మరునాడు ఉదయమే మిథిలకు ప్రయాణం కావాలని ,తగిన ఏర్పాట్లు చేయించమని ఆజ్ఞాపించడం,మరునాడు ప్రయాణమై నాలుగురోజుల ప్రయాణం చేసి మిథిలకు చేరుకున్నాక జనకుడు ఎదురువచ్చి దశరథునికి స్వాగత సత్కారాలు చేశాడు.
యజ్ఞం రేపు పూర్తవుతుంది.వెంటనే ఋషిసమ్మతమైన వివాహం నెరవేర్చాలని అభ్యర్థించాడు జనకుడు.
దశరథుడు నవ్వుతూ ” జనకమహారాజా! మీరు కన్యాదానం చేసేవారు మేము అందుకునేవారము” అని చమత్కరించాడు.
జనకుడు తమ్ముడు కుశధ్వజునికి కబురు పంపాడు
జనకుని అతిథి మర్యాదలకు పొంగిపోయాడు దశరథుడు.
తలపెట్టిన యజ్ఞం పూర్తయ్యింది. కుమార్తెకు తగిన వరుడు దొరికాడన్న తృప్తితో జనకుడు హాయిగా నిద్రపోయాడు.
మరునాడు అందరూ ఉచితాసీనులయ్యాక వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ క్రమాన్ని చెప్పి జనకమహారాజా! నీకు సీత,ఊర్మిళ అనే ఇద్దరు కుమార్తెలను రాముడు, లక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయవలసిందని చెప్పాడు.
జనకుడు తన వంశ క్రమం చెప్పి నా తమ్ముడు కుశధ్వజుడు. సాంకాశ్యపురాన్ని పరిపాలిస్తున్నాడు.
వశిష్ఠుడు,విశ్వామిత్రులు కొత్త ప్రస్తావన తెచ్చి” కుశధ్వజుడు ధర్మవంతుడు.సౌందర్యారాశులైన
ఇతనికున్న ఇద్దరు కుమార్తెలను భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేస్తే రెండు వంశాలమధ్య బంధం దృఢమౌతుంది” అనగా దశరథుడు సంతోషించి అలాగే అని ఒకేరోజు నలుగురు రాకుమారులకు వివాహం చేద్దామంటాడు.
తర్వాత విశ్వామిత్ర శతానందులతో కలిసి కళ్యాణమంటపం మధ్యలో అగ్ని వేదిక కట్టించారు.వశిష్ఠుడు నలుగువైపులా సమానమైన దర్భలు పరచి ,వేదిలో అగ్ని ప్రతిష్టించి మంత్రపూర్వకంగా హోమం చేశాడు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు విజయం అనే మంచి ముహూర్తంలో తోరాలు, బాసికాలు కట్టడం వంటి మంగళ కార్యక్రమాలు చేశారు.సర్వాలంకారాలు ధరించి పుత్రులు నలుగురు తండ్రి దశరథుడున్న చోటుకు వచ్చారు. అందరూ కలిసి యజ్ఞవాటికకు చేరుకున్నారు.
జనకుడు సర్వాభరణ భూషితలైన కుమార్తెలను తీసుకువచ్చాడు.
అగ్ని సమక్షంలో సీతను రామునికి ఎదురుగా నిలబెట్టి జనకుడు ఇలా చెప్పాడు.
” ఇయం సీతా మమ సుతా
సహధర్మచరీ తవ
ప్రతీచ్చ చైవామ్ భద్రం
తే పాణిమ్ గృహ్ణీష్వ పాణినా”
ఈమె నాకుమార్తె సీత.నీకు సహధర్మ చారిణి అవుతుంది. ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చేస్తే నీకు మెలౌతుంది .
” పతివ్రతా మహాభాగా
చాయేవానుగతా సదా
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా
మంత్రపూతమ్ జలం తదా”
మహాభాగ్యవంతురాలైన ఈమె పతివ్రత అయి నీడలా నిన్ననుసరించి ఉంటుంది” అని మంత్రపూత జలం విడిచి కన్యాదానం చేశాడు జనకమహారాజు.
అగ్నికి ముమ్మారు ప్రదక్షిణం చేసి పెద్దలందరికీ నమస్కరించారు.
ఈ విధంగా అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ ఘట్టం ముగిసింది.దేవదుందుభులు మోగాయి.దేవతలు పుష్పవృష్టి కురిపించారు.గంధర్వులు పాడారు, అప్సరసలు నాట్యం చేశారు.
కొడుకులు కోడళ్లను చూసి మురిసిపోయాడు దశరథమహారాజు.
శ్రీరాముని జననం, కళ్యాణము నవమి నాడే జరుగగా ఆ విశేషమైన రోజున
శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా భారతదేశం యావత్తూ పల్లె పల్లెలో వీధి వీధిలో పట్నాల్లో దేవాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుతుంటారు.
సీతా రామకళ్యాణం జగత్తుకు కళ్యాణం..
సర్వే జనాః సుఖినో భవంతు
సర్వ సన్మంగళాని భవంతు!!
చాలా బాగుంది సీతామహాలక్ష్మి గారు మీ వ్యాసం