తిరునగరి దేవకీ దేవి గారితో తరుణి పత్రిక ముఖాముఖి !!

తిరునగరి దేవకీ దేవి:–నమస్కారం! మయూఖ పత్రిక  నన్ను పరిచయం చేస్తున్నందుకు ముందుగా నా కృతజ్ఞతలు!

దేవకి:–  నా నేపథ్యం అంటే… ఒక రకంగా ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబం మాది. మా తాత గారి పేరు తిరువెంగళం. ఆయన హుజూరాబాద్ వాస్తవ్యులు. అక్కడ వాళ్లు మిరాశి దారులు. చుట్టుపక్కల గ్రామాలు వారి ఆధీనంలో ఉండేవి. తాతగారు ఆయుర్వేద వైద్యులు, జ్యోతిష పండితులు, ఇంటికి ముగ్గులు కూడా పోసేవారు. నా అతి చిన్న వయసులోనే తాతగారు మరణించారు. వారు ఓ తీరు మంచి జీవితాన్నే గడిపారు. తాత గారికి ఆరుగురు మగసంతానం, ఇద్దరు ఆడసంతానం. ఆరుగురు మగపిల్లల్లో చిన్నవారు చనిపోయారు. ఈ ఆరుగురులో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, మా చిన్న బాబు వెంకటేశ్వర్లు, మా బాపు ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. కానిగి ( ప్రభుత్వంతో సంబంధంలేని ప్రైవేట్ పాఠశాల) బడి నడుపుకునేవారు. మా తాతగారు చనిపోయాక అక్కడ జీవించే పరిస్థితులు లేవు.   మా అమ్మ అందంగా ఉండడంతో అమ్మని ఇష్టపడి కోడలిగా చేసుకోవాలనుకున్నారు. అలా బాపు అమ్మను పెళ్లి చేసుకున్నారు.  కానీ మా అమ్మమ్మ తాత గార్లకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. వైద్యం మీదనే కుటుంబం నడిచేది , ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేవారు. కాబట్టి కట్నం కూడా అడగని మా తాతయ్య సంబంధం నచ్చి మా అమ్మని బాపుకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.  వారి స్థితి బాగుంది కనుక మంచి సంబంధమే అనుకున్నారు. తొమ్మిదవయేట పెళ్ళై, అత్తవారింటికి పోయిన తర్వాత అంతా ఆమెకు అయోమయంగా అనిపించిందట. మా నాన్న అందంగా ఉండేవాడు కాదు- అమ్మ చాలా బాగుండేది. ఆ పెళ్లిని చూసిన వారంతా కాకి ముక్కుకు దొండ పండు అని పదేపదే అని సరికి చిన్న వయసులో ఆ మాటలు ఆమె మనసు మీద ఒక ముద్ర పడింది. ఎందుకో అత్తగారింట ఇమడలేకపోయింది. దాంతో  మా మేనమామలు మా అమ్మను, బాపును హనుమకొండకు తీసుకొని వచ్చారు. ఆయన పాఠశాలకు ఎక్కడా శాశ్వత స్థలంలేక, సగం కట్టి ఆగిపోయిన ఇండ్లలోనూ, చిన్నకోవెలలోను,  పెద్ద కోవెలలోనూ పాఠశాల నడిపేవారు. బ్రాహ్మణవాడ, మచిలీబజార్, నరసింహారావు అనే వకీల్ ఇంట్లో, గుడిబండల దగ్గర ఇలా ఒక చోట ఉంటూ లేకుండా నడిపారు. ఈ కానిగిరి  బడిలో అన్ని తరగతులు ఉండేవి. ఒక్కడే పంతులు. సంవత్సరం పొడుగునా ఎప్పుడూ అడ్మిషన్లు ఉంటాయి. ఒక విద్యార్థి రెండు రూపాయలు ఇచ్చేవాడు. కొందరు ఇవ్వక మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. నాకు మా చెల్లెలికి వయసులో నాలుగున్నర ఏండ్లు తేడా ఉంది. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఖాదీ ఉద్యమం జరుగుతున్నది. అంబర్ చరఖా  శిక్షణ అని ప్రవేశపెట్టారు కాంగ్రెస్. ఆ ట్రైనింగు అమ్మకు మామయ్యలు ఇప్పించారు. ట్రైనింగ్ చేసి టీచరుగా జాయిన్ అయింది.  కానీ ఉద్యోగరీత్యా అన్ని ఊర్లకు తిరగాల్సి వచ్చేది. తక్కువ జీతం అక్కడొక ఇల్లు, సంసారం. ఇక్కడొక ఒక సంసారం ఇలా ఆర్థికంగా ఇబ్బందిగానే ఉండేది. చిన్న మామయ్యలు జీవితంలో స్థిరపడలేదు. అందుకే  అమ్మమ్మ మా దగ్గర ఉండేది.     హనుమకొండలో బ్రాహ్మణవాడలో మాకు చిన్న గుడిసె ఉండేది. నాలుగు గోడలు, రెండు తడకలు అంతే ! ఏ రోజు చక్కెర చాపత్తా.. ఆ రోజే కొనుక్కోవాలి. చారనా ( పావలా)  చక్కర, దొవ్వాన ( రెండు అణాలు)  చాపత్తా కొనుక్కునే వాళ్ళం. ఒక్కోసారి అణా చాపత్తా కూడా తెచ్చేవాళ్ళం. మా అమ్మమ్మ పరిస్థితి ఏంటి అంటే? ఆరుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఆమెకు విపరీతమైన తలనొప్పి వ్యాధితో బాధపడేది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే నరాలను పొరపాటుగా కత్తిరించగా దాంతో కంటి చూపు పోయింది. చూపులేకున్నా మా ఇద్దరినీ పోషించింది, అన్ని పనులు చేసేది.
ఆ పరిస్థితుల్లో పెరిగాము. నాకు చిన్నప్పటినుండి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువే!  ఆ పరిస్థితులు నన్ను అలా తయారు చేశాయేమో? పాఠశాలలో డ్రామాలు వేయడం, ఉపన్యాసాలు, ఇవ్వడం మోనో యాక్షన్ మొదలైనవి చేసేదాన్ని. చాలా చురుకుగా ఉండేదాన్ని. నాకు పాఠశాలలో మంచి గుర్తింపు ఉండేది. ఎనిమిదవ తరగతికి వచ్చిన తర్వాత మంచి మార్కులు వచ్చినవి. ఈ లోపు మా అమ్మ ప్రాజెక్టు అయిపోయింది. అమ్మ మళ్లీ ఉపాధి వేటలో పడింది. వార్తా పత్రికలో వయోజన విద్య  వ్యాపార ప్రకటన ఒకటి వచ్చింది. పెద్దవారికి చదువు చెప్పాలి, అక్కడ జాయిన్ అయింది. దాంతో మా మేనమామ నాకు చదువులో ఉన్న శ్రద్ధను చూసి, జనగామకు తీసుకొని పోయాడు.
9 ,10, 11 తరగతులు  మామయ్య దగ్గర ఉండి చదువుకున్నాను. అది నా జీవితంలో ఒక గొప్ప మలుపు! చాలా చురుకుగా అన్నిట్లో పాల్గొనేదాన్ని.
ఆ సమయంలో  అమ్మకు నల్లగొండ జిల్లా సిరిపురంలో మళ్లీ అంబరచరక ప్రాజెక్టు పని వచ్చింది.  నేను జనగామలోనే చదివాను కానీ పై చదువులకు తప్పకుండా హన్మకొండకు పోవాల్సి వచ్చింది. అంతవరకు తెలుగు మీడియంలో చదివాను.
ఉమెన్స్ కాలేజీలో మ్యాథమెటిక్స్ చదవాలనుకున్న నేను మామయ్య నన్ను సైన్స్ లో చేర్పించారు. దాంతో పియుసి ఫెయిల్ అయ్యాను. 1968లో అమ్మ వెండి వడ్డాణం అమ్మి, ట్యుటోరియల్ కు ఫీజు కట్టిస్తే, తిరిగి చదివి పాసయ్యాను. అప్పుడు అమ్మతో కలిసి ఉన్నాను. ట్రైనింగ్ లో ఫెయిల్ కూడా కావడం వల్ల అమ్మకు టీచరు ఉద్యోగం రాలేదు.

ఎంతో కష్టపడి  ఆఫీసుల చుట్టూ తిరిగి ఫీజు మాఫీ చేయించుకున్నాను. అదీ మా పరిస్థితి. కానీ మళ్లీ టర్మ్  ఫేజ్ కట్టటమెలా? అని ఆలోచించి హోమ్ ట్యూషన్ ఉదయం ఒకటి, సాయంత్రం రెండు ఇంటింటికి పోయి చెప్పేదాన్ని. ఆ డబ్బులు బట్టలు, పుస్తకాలు మొదలైనవాటికి సరిపుచ్చుకునేదాన్ని. మధ్యాహ్నం కాలేజీకి పోయేదాన్ని ఆ సమయంలోనే అంటే ఈ కాలేజీలో చేరకముందు 69లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ట్యూషన్ చెప్పి వస్తుంటే దోస్తులు హైస్కూల్ చదివే వారు ఉద్యమం జరుగుతున్నదని చెప్పినప్పుడు విని నిజమే! మనకు అన్యాయం జరిగింది కదా! మనమే కొట్లాడాలని దానిలో పాల్గొన్నాను.

P U C లో ఫెయిల్ కావడం వల్ల ఒక సంవత్సరం, తెలంగాణా ఉద్యమం వల్ల మరో సంవత్సరం వృథా అయ్యింది. అప్పుడు ఆలస్యంగా విద్యా సంవత్సరం మొదలైంది ఆర్ట్స్ కాలేజీలో మ్యాథ్స్-  అప్లైడ్ మాథ్స్ తో అప్లై చేశాను .ఆ గ్రూప్ కు తగినంత మంది లేరని ఆ కోర్సును రద్దు చేశారని, వేరే బ్రాంచ్ తీసుకోవాలంటే నాకు తెలుగు ఇష్టం కనుక తెలుగు, సంస్కృతం, చరిత్ర  సబ్జెక్ట్ లు ఎన్నుకొని బి.ఎ లో చేరాను. ఇలా కో ఎడ్యుకేషన్ లో చేరడానికి కారణం ఉమెన్స్ కాలేజీలో ధోరణి నాకు నచ్చలేదు. వారి హడావుడి, ఫ్యాషన్లు అవన్నీ నాకు నచ్చవు. అందుకే ఆర్ట్స్ కాలేజీలో కో ఎడ్యుకేషన్ లో చేరాను.

ఇంకొక విషయం మీకు చెప్ప మర్చిపోయాను. నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా మేనమామ ఒక చమత్కారంగా ఉన్న వివాహ ఆహ్వాన పత్రికను చూపించారు. హడే బడే నామ సంవత్సరం ఏలూరు అమావాస్య నాడు అని పైన హెడ్డింగ్ ఉంది. అది చదివి తమాషాగా అనిపించి దాని ఆధారంగా ఒక నాటకం రాసి మా తోటి విద్యార్థులను కూడా పిలిచి ఆ నాటకం గండయ్య అనే కౌన్సిలర్ కు చూపించాను. గణేష్ ఉత్సవాలలో ఈ నాటకం వేస్తామని అనుమతి ఇవ్వమని అంటే ఆయన సరే అన్నాడు. ఆరోజు వర్షం పడి ఆగిపోయింది. తెల్లవారి వేసాము. ముందురోజు వేషాలు వేసుకుని ఇంటికి పోతే అది చూసి  నా దోస్త్ నిర్మల వాళ్ళ నాన్నమ్మ చెంప మీద ఒక్కటేసి, నాటకాలు వేయ వద్దన్నారట! ఆమె తెల్లవారి రాకపోయేసరికి ఆమె పాత్ర ఇంకొకరికి ఇచ్చి ఆ నాటకం ప్రదర్శించాము. పియుసి లో కూడా కాలేజీ డే కి తుపాకి రాముడు వెంకట్రాముడు వేషం వేశాను. బాగుందని వన్స్ మోర్ అని మళ్ళీ వేయమన్నారు. ఆ కాలంలో కాలేజీలో ముస్లిం ఘోషాపద్ధతి ఉండేది. ముస్లిం ఆచారాలు స్పష్టంగా కనపడేవి. ఎలా అంటే కాలేజీ చుట్టూ క్లాసులు ఉండేవి, మధ్యలో ఆడవారికి తరగతులుండి, వాటిచుట్టూ ఓ కాంపౌండ్ ఉండి, ముందు వరండా ఉండి , అందరిని లోపలికి పంపకపోయేవారు.
ఆపా అనే ఒక ఆమె కాపలాగా ఉండి, ఎవరైనా కలువడానికి వస్తే ఆమె పరిమిషన్ తో పోయి  మాట్లాడి వచ్చేవాళ్ళం. లోపల టెన్నికాయిట్ వంటి ఆటలు ఆడే వసతి ఉండేది.  ఏవైనా మీటింగ్ లు అయితే ఆపా ముందు నడుస్తుంటే మేము వెనుక నడుస్తూ వెళ్లే వాళ్ళం. అలా డిగ్రీ అయిపోయింది.   ఎమ్. ఏ చదవాలని తెలుగుకు దరఖాస్తు చేసుకున్నాను. ఎకనామికల్ గా బ్యాక్ వర్డ్ గా నాకు 50 రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్ వచ్చేది. తర్వాత 70 రూపాయలు చేశారు. తర్వాత కాలేజీలో ఎమ్.ఏ చదివేటప్పుడు హాఫ్ ఫ్రీ షిప్ వచ్చింది. ఇలా ఇదే క్రమంలో నేను ట్యూషన్ చెప్పిన ఫీజులు కూడా ఆ చదువులకు వాడే దాన్ని.

ఉస్మానియా అప్లియేటెడ్ పీ.జీ సెంటర్ అక్కడ పి.జీ పూర్తి చేశాను. ఫలితాలు రాగానే జనగామ లోను, వికారాబాద్ కాలేజీలోనూ అధ్యాపకురాలుగా దరఖాస్తు పెట్టాను. రామరాజు గారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా ( ప్రిన్సిపాల్)  గాను ఉండేవారు ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. వికారాబాద్ లో జాయిన్ అయ్యాను. విద్యకు సంబంధించి మిగిలిన చదువు కొనసాగడానికి అవకాశం చిక్కలేదు. నా వెంట వికారాబాద్ కు  చెల్లెలు, పిన్ని  వచ్చి, రెండు సంవత్సరాలున్నారు నాకు తోడుగా.. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలో శంకరయ్య గారితో పరిచయమైంది. ఆయన కూడా మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా అదే కాలేజీలో పనిచేస్తున్నారు. ఆయన అభ్యుదయ భావాలు ఉన్నవారు. అంతేకాదు మేము ఆర్థికంగా నిలదొక్కుకొని, కట్నాలు ఇచ్చి, పెళ్లి చేయగలిగిన పరిస్థితి మా నాన్నగారికి లేదు!  చదివే ఇబ్బందిగా సాగింది.
నా జీతం 450 రూపాయలతో మొదలైంది. ఇంటి కిరాయి 50 రూపాయలు.
అమ్మకు కూడా పంపాలి . ఇలాంటి పరిస్థితుల్లో శంకరయ్య గారితో పెళ్లి బాగుంటుందని ఇద్దరం మాట్లాడుకున్నాం  ఆయన పూర్తిగా వామపక్ష భావజాలంతో ఉన్నారు .అలా అని పార్టీలతో సంబంధం లేదు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి.మహబూబ్  నగర్ నుండి ఆయన జైలుకు కూడా పోయి వచ్చారు. మా ఇద్దరి ఆలోచనలు కలుస్తాయని నిర్ణయించుకున్నాం. మా మామయ్యలకు చెప్పాము. ఆయన ప్రభావం నామీద ఉంది కాకపోతే మామయ్య ఆధ్యాత్మికవాదులు. నేను ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు నాకు ఏం జరుగుతున్నది అనిపించేది… మనం నమ్మేదొకటి… చేసేది ఒకటి.. జనాలు దైవభక్తిని గొప్పగా చెప్తున్నారు…. ఆ దైవభక్తి ఉన్న వాళ్ళు నమ్మకం ఉంటే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి కదా! చాలా మంది ప్రదర్శన గా భక్తి పరులవలె కనిపిస్తున్నారు. దైవభక్తి ఉంటే వారిలో వచ్చిన మార్పు ఏమిటి? అని ఆలోచించుకున్నప్పుడు శంకరయ్య గారి పద్ధతి బాగుందనిపించి, ఇద్దరం నిర్ణయం తీసుకున్నాము. పెద్దలు అంగీకరించారు. ఇంటి ముందటే పెళ్లి జరిపించారు. పర్చారంగా రావు గారింట్లో కిరాయికి వెళ్లేంతవరకూ  కుర్చీలు గాని మంచాలు లాంటివి గాని లేవు. కరెంటు లేదు. 69 లో నీటి కరువు వస్తే మా మేనమామ వాళ్ళు స్వయంగా నీటి బావి తవ్వుకున్నారు. వాళ్లకి కూడా ఐకమత్యత, కష్టించి పని చేయాలని ఒక పద్ధతి ఉండేది. ఆ బావినీళ్లు సరిపోకపోతే ఇంకా అవసరమైతే ఉప్పర వాడకుపోయి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. మాది ప్రేమ వివాహం కాదు. నేను కుదుర్చుకున్న పెళ్లి. నలుగురు మామయ్యలు తల 500 రూపాయలు వేసుకొని వచ్చిన వారికి అన్నం పెట్టారు. మా పెళ్ళికి హర గోపాల్ గారు, వరవరరావు గారు, పి.వి సుబ్బారావు గారు వచ్చారు. వారి సమక్షంలో పూలదండలు మార్చుకున్నాము. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్ బాబు గారు అధ్యక్షత వహించారు. మమ్మల్ని అభినందించారు. శంకరయ్య తరఫున వారి ఒక్క అన్న తప్ప ఎవరూ రాలేదు. మహబూబ్ నగర్ ఘన్పూర్ దగ్గర చిన్న పల్లెటూరు పర్వతాపురంలో పెరిగారు కనుక  కులాంతర వివాహాలు వారికి తెలియదు.  అందుకే రాలేదు. నా పెళ్ళికి నేనే ఒక కార్డు వేయించాను. ఫలానా శంకరయ్యతో నా పెళ్లి అవుతున్నదని, బాపు పేరు పెట్టి ప్రింట్ చేయించాను. శంకరయ్య ఒక లెటర్ మీద ఫలానా దేవకి దేవితో నా పెళ్లి జరుగుతున్నది మీరందరూ రాగలరని రాసి వెనుక స్టాప్ లిస్టు దానికి పెట్టి అటెండర్ తో అందరి దగ్గరికి పంపారు.
పిల్లలకు ఆదర్శంగా ఉండేందుకు మేము మా పెళ్లి గురించి బయట ఎక్కడా బయటపడలేదు. ఒక్కసారిగా ఆ  పెళ్ళి సర్కులర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్ళిలోశంకరయ్య గారికి భోజనాల హడావుడి వద్దని చాయ్ బిస్కెట్లు ఇద్దామన్నారు. కానీ ఎంతో దూరం నుండి వచ్చి ఆకలితో పోవడం ఎందుకు అని నాకు నచ్చక భోజనాలు ఏర్పాటు చేశాం.
శంకరయ్యను చూసినప్పుడు ఆయన అభ్యుదయ భావాలు విన్నప్పుడు నాకు ఒక హీరోలా అనిపించింది. కానీ అసలు జీవితం ప్రారంభమయ్యాక నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఆయనకు సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ.. అవసరమైన వారికి సహాయపడాలనే తత్త్వం ఆయనది. నాకు ఆ గుణం నచ్చే పెళ్లి చేసుకున్నాను.పెళ్లికి ముందు అది బాగానే ఉంది. కానీ శృతిమించడంతో తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ నేను ఏదైతే ఇష్టపడ్డానో దాన్ని వ్యతిరేకించ వద్దు కదా! అని ఒక సిద్ధాంతానికి ఆకర్షితురాలినై పెళ్లి చేసుకున్నాను. అది సమస్య అనుకోవద్దు కదా! ఆ   సంఘర్షణతో చాలా రోజులు ఇబ్బంది పడ్డాను. ఇల్లు పట్టించుకోకుండా “సివిల్ లిబర్టీస్” రంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా, కన్వీనర్ గా ఉండి ఎక్కడ ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పోవడం… రావడం, అదేకాక చైతన్య కళా సాహితీ అని ఒక లిటరరీ కమిటీ ఉండేది. దానికి సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలో ఆయనకు శ్రమతో పాటు చాలా డబ్బులు ఖర్చైయ్యేవి. అది సరే వచ్చేవారు పోయేవారు భోజనాలు పెట్టడం, తను మ్యాథమెటిక్స్ లెక్చరర్ కాబట్టి ఆ రోజుల్లో పిల్లలు  చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి గదులు కిరాయికి తీసుకొని, వండుకొని తిని చదువుకునేవారు. ఇప్పుడు అప్ అండ్ డౌన్, లేదా హాస్టల్స్ తో ఆ బాధ తప్పింది. ఆ పిల్లలు ఏ సమయమైన “సార్! ఆ ఫలానా లెక్క రావడం లేదు” అని తిందామని కూర్చునే సమయంలో కూడా వచ్చేవారు. విసుగు అనుకోకుండా ఆ లెక్కలు చెప్పేవారు. అలా ఎంతోమందికి  చెప్పేవారు. కొంతమంది పిల్లలు వారికి కూర్చుని చదువుకునే జాగలేక  వచ్చి కూర్చొని చదువుకునేవారు. వాళ్లేమీ ఫీజు ఇవ్వకపోయేవారు.  కొందరు  వాళ్ళు కట్టాల్సిన ఫీజు “సార్! సార్! స్కూల్లో ఫీజు కట్టాలి, నాకు ఇంటి నుంచి వచ్చినాక ఇస్తా” అని అడిగితే  వారి ఫీజులు కూడా కట్టేవాడు శంకరయ్య.  వచ్చిన పేరు చచ్చినా పోదట  అని ఒక మంచి పని చేయడం వేరు, ఆ మంచిని నిలబెట్టుకోవడం వేరు! దానికోసం చాలా కష్టపడాలి !అలా ఆయన మంచితనం దుర్వినియోగం చేసిన వాళ్లే ఎక్కువ! అవన్నీ చూస్తున్నప్పుడు నాకు వాటిని వ్యతిరేకించాలని అనిపించేది. నాదీ కుటుంబమే కదా !నేను అలా చేయాల్సి వచ్చేది. ఎవరికేసమస్య వచ్చిన తానే భుజాలకి ఎత్తుకునేవారు.
ఉదాహరణకు బ్యాంకులో లోన్లు తీసుకొని డబ్బులు సమయానికి కట్టకపోతే, బ్యాంక్ వారు పంచనామా  చేసి, ఇల్లు వేలం వేసి పోతారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారంగా చేయరు. అటువంటి వారొస్తారు.   గవర్నమెంట్ తరఫున కూడా జనాలను మోసం చేసేవారు గ్రామాలలో ఉండేవారు. వారు కూడా వచ్చి శంకరయ్యను సాయమడిగేవారు. ఒకసారి మహబూబ్ నగర్ నుండి కులకచర్ల అవతల ఒక అతను బీదవాడు. తన పనేదో తాను చేసుకునేవాడు. ఎవరి జోలికి పోయేవాడు కాదు! కానీ ఎవరిని లెక్క చేయని మనస్తత్త్వం. పనికాగానే హాయిగా రామకోటి రాసుకుంటూ కూర్చునేవాడట. తమకు లొంగి ఉండలేదని బాణామతి పేరుతో  చంపేశారు. ఆయన కుటుంబం శంకరయ్య గారి దగ్గరకు వచ్చారు. వస్తే దాని కొరకు అప్పీల్ చేసి ఆ రోజుల్లో పదివేల రూపాయలు గవర్నమెంట్ నుండి ఇప్పించారు కొడుకుకు. దానితో చిన్న ఇల్లు వేసుకుని దానికి శంకరయ్య అని పేరు పెట్టుకున్నారు. అలాంటి పనులు చేసేవారు.  ఆయన దగ్గర నాటకాలు ఆడి డబ్బులు లాక్కోవడం తనని  మాలిన ధర్మం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎందుకంటే కాలేజీలో పని, ఇలా సమస్యల కోసం తిరగడం షుగర్ ఎక్కువై అది గమనించక ఆరోగ్యం పాడైంది. న్యాయంగా ఉండి నిలదీయడంతో కాలేజీలోనూ గొడవ అయి సస్పెండ్ చేశారు. రకరకాల బాధలతో నేను phd చేయలేకపోయాను. అలా జీవితం సాగింది. అబ్బాయి పదో తరగతిలో ఉన్నప్పుడు నేను పిహెచ్డి చేయగలిగాను. అమ్మాయిని 6 వతరగతిలో గవర్నమెంట్ వారి నవోదయ స్కూల్లో చేర్పించాము. అబ్బాయి మాతోనే ఉన్నాడు.
ఐదు సంవత్సరాల తెలంగాణ విమోచన ఉద్యమ నవలలు స్త్రీ చైతన్యం అనే టాపిక్కుతో తెలంగాణకు జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని ఆ అంశంపై సిద్ధాంత గ్రంథం రాశాను. ఉద్యమాలు చేసిన దాన్ని తెలంగాణ వారికి ఏమేమి అన్యాయాలు జరిగాయో నాకు అవగాహన ఉండటం వల్ల, వలస పాలకులు తర్వాత వచ్చిన వారు అంతకుముందు కూడా నైజాం కాలంలో కూడా ఇక్కడ ప్రజలంతా బడుగు వర్గాలవారు చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఆ పరిస్థితులను వెలికి తీయాలి కదా! ముఖ్యంగా స్త్రీల కోణంలో ఆలోచించడం నాకు ఇష్టం.  మామూలుగా ఎక్కడ ఏ పని చేసినా… స్త్రీలను  పిలిచి ఊరికే అలా బొమ్మలవలె  వేదికల మీద  కూర్చోబెడతారు. నిజంగా సముచిత స్థానం ఇవ్వరు. వారి నైపుణ్యాలను తెలుసుకొనే ప్రయత్నం చేయరు. వారి ఉద్ద్యేశ్యాలను అడగరు! వారికి ప్రాధాన్యత ఇవ్వరు.   ఉద్యమంలో మహిళలు చాలా పకడ్బందీగా పనిచేశారు  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వాళ్ళు లేకపోతే ఉద్యమం నడవకపోయేది. మల్లు స్వరాజ్యం, అచ్చమాంబ, కనకమ్మ, అనసూయ, ఐలమ్మ, పెసర సత్తెమ్మ, నర్సక్క ఇలా వీళ్ళందరూ ఎంతో పనిచేశారు. ఆయుధాలు కూడా పట్టుకున్నారు. ఇంకా కొంతమందికి అవకాశం ఇవ్వలేదు కానీ వారు కూడా ఆయుధాలు పట్టడానికి సిద్ధంగానే ఉండేవారు. వాళ్ళు వంటలు చేసేవారు. అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు, అక్కడ కూడా పెళ్లిళ్లు అయ్యేవి పిల్లల్ని కనేవారు. ఆ పిల్లల బాధ్యత కూడా ఆడవాళ్లు తీసుకున్నారు. ఎందుకంటే ఉద్యమాలలో పిల్లలు ఉండకూడదు. అడవిలో ఒకవేళ సైన్యం వస్తే వాళ్ల ఆచూకీ తెలవకూడదు కదా! పిల్లలు ఏడుస్తే బయటపడుతుందని…
కనకమ్మ  తన చంటిపిల్లవాడిని బొగ్గు బాయి దగ్గర  పెట్టేసి వచ్చింది. అంత గొప్ప త్యాగం చేసింది. అది చాలామందికి తెలియదు.    అచ్చమాంబ కాన్పులు చేసేది. సుగుణ వంటలు చేసేది. అనసూయ తన తోటి ఉద్యమకారులు అనారోగ్యంతో ఉంటే పోలీసులు వస్తుంటే భుజం మీద ఎత్తుకొని పరిగెత్తింది. అలాంటి పనులు చేశారని వారందరి గురించి రాయాలి కదా! నేను తీసుకున్నది నవలలు… నవలలకు నిజంగా జరిగిన దానికి ఎంతో తేడా ఉంది! అసలు రచయితలు స్త్రీల త్యాగాలు పాఠకులకు చెప్పారా? లేదా? అని రాయాలనుకొని, ఎక్కడెక్కడ అయితే వాళ్ళు సరిగ్గా రాయలేదో దాన్ని నిలదీశాను! సాధారణంగా ఎంత ఉద్యమకారులైనా, ఎంత రైతాంగ పోరాటాన్ని సమర్థించినా మగవారికి  ఎక్కడో లోలోపల ఆధిపత్య ధోరణి ఉంటుంది. అలా రాయడం అంత ఇష్టం ఉండకపోవచ్చు కానీ నేను మాత్రం చాలా నిక్కచ్చిగా రాశాను. కృష్ణాబాయి అనే విరసం సభ్యురాలు ఒకచోట పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమంలో ఉన్నప్పుడు కష్టపడ్డారు. జనాలని ఆకర్షించేందుకు నాటకాలు వేశారు. ఆ నాటకంలో పాత్రను భార్య పాత్రను పోషించమన్నారు. ఆమె కూడా ఉద్యమకారిణి అయినా ఇష్టపడలేదు. అయితే ఏం చేశాడంటే నువ్వు నాటకంలో నటిస్తా అనేదాక అన్నం తిననని రెండు రోజులు ఉపవాసం ఉన్నాడు. పాపం ఆమె తప్పనిసరై ఆయన కొరకు నటించింది. ఇది చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే? పార్టీలో కూడా పాతివ్రత్యం తప్పలేదు అని రాశాను. ఆమె చదివింది.
ఆమెను ఒప్పించాలి కానీ బెదిరించకూడదు! అని నా అభిప్రాయం. కొందరు మగవారు వామపక్ష భావజాలం లేకపోయినా భార్యలకు ఎంతో తోడ్పడుతారు. ఆ భావాలున్నవారు కూడా కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తుంటారు. అక్కడ కూడా ఆధిపత్య ధోరణి ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైతే పనులు చేస్తారు! చేయమంటే చేయరు. భావాలు ఉండడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు! ఉద్యమంలో ఆడవాళ్లు చాలా గొప్పగా పని చేశారు అలా ఉద్యమాల్లో పని చేసిన నవలలు 21 లో ఆడవాళ్ళ ప్రమేయం ఉన్న నవలలను మాత్రమే నేను తీసుకున్నాను నా గైడ్ జయధీర్ తిరుమలరావు.

దేవకీదేవి:— ఇది నా కథా సంపుటి. రకరకాల సందర్భాలలో  నా దృష్టికి వచ్చిన విషయాలను కథలుగా మలిచాను.    కరోనా టైం లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి?  ఈ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? అవి కుటుంబానికి ఎంత ఇబ్బంది కలిగించాయి? జనాల ఆలోచన విధానం ఎలా ఉంది? స్త్రీల మీద కరోనా మరింత బాధ్యతను ఎలా పెంచింది ?తర్వాత ఒంటరిగా ఉన్నవారు వృద్ధులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఇవన్నీ నన్ను ఆలోచింపచేసాయి. ఆ నేపథ్యంలోనే  ముస్లిమ్ ల మీద ఒక అపవాదు ఉండేది. వారి వల్లనే కరోనా ఎక్కువ అవుతున్నదని, వారిని సమాజానికి దూరంగా ఉంచడం జరిగింది.   దానిలో నిజమెంత వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు? టెక్నాలజీ కరోనాను ఎలా గెలవగలిగింది? వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారంటే  ఉదాహరణకు పవర్ కట్ అయిందనుకోండి! లిఫ్ట్ పనిచేయదు. బజారు నుండి కొనుక్కొని వచ్చిన వస్తువులు మోసుకొని అన్ని మెట్లు ఎక్కలేరు. ఎవరూ సహాయం చేయరు. వాన పడితే కరెంటు పోయి రోడ్ నిండా నీళ్లు ఉండటంతో ఆర్డర్ చేసిన ఆహారం అందకపోవడం ఇలాంటివి ఎన్నో…

ఇక భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎందుకూ పనికిరారు అని చూసే సమాజాన్ని చూసినప్పుడు నన్ను ఆలోచింపజేసింది. భర్త చనిపోవడానికి ముందే వారి కార్యక్రమాలే వారు చావుకు కారణం అవుతాయి. బంధువులకు సహాయంచేయాలనే ఆరాటంలో వాళ్ళ శరీరాన్ని నిర్లక్ష్యం చేసుకుంటారు. ఆ చనిపోయిన వ్యక్తి తన నిర్లక్ష్యం వల్ల భార్య, కుటుంబం ఎంత క్షోభను అనుభవిస్తారో చెప్పలేం. అంతేకాదు చనిపోయిన అతని భార్య సమాజం నుండి విసిరి వేయబడుతుంది. సహాయం పొందిన వారికి  ఈమె సహాయం కనపడదు. ఆమెవల్ల ఏదో కీడు జరుగుతుందని అనుకుంటారు. వారిని అవమానపరచడం ఇటువంటి వాటిని రాశాను. తర్వాత ఇంత ఆధునిక యుగంలో కూడా వారిని విధవలుగా తయారు చేయడం నాకు నచ్చదు.

భర్త లేని ఆడవారికి వేరే అస్తిత్వం ఉండాలి, వేరే రూపం ఇవ్వడం పితృస్వామ్య భావజాలంలో ఒకటి. అలా చేస్తే వారు పునర్వివాహాలు చేసుకోకుండా కుటుంబానికి అంకితమై పిల్లలను సాకుతూ… ఇంటెడు చాకిరి చేస్తూ పడి ఉండాలనే ఒక స్వార్థం. వాటి గురించి కథలు రాశాను.

ఎదుటి వారికి సహాయం చేయాలని అనుకునే వారిని ఎలా దురుపయోగం చేస్తారని, మహిళలను చిన్నచూపు చూసే అంశాలు ఆచారాలను పిచ్చిగా నమ్మడం, వాటి వెనుక అర్థం గమనించకుండా నడుచుకోవడం ఇవన్నీ నాకు ఒక కథ వస్తువులైనాయి. తర్వాత స్త్రీలకు ఇంటి బాధ్యత అంతా వాళ్లే అప్ప చెప్పడం వల్ల ఇంట్లో సమస్యలు ఎలా వస్తాయని? నేటి ఆలోచన విధానంలో పిల్లల పెంపకంలో కెరీర్ ప్రధానం అనుకుంటున్నారు కానీ, ర్యాంక్ రావాలి, మంచి ఉద్యోగం రావాలని కేవలం చదువుకే ప్రాధాన్యతనే ఇస్తున్నారు. అలా పిల్లల్ని పెంచడం వల్ల వారికి పుస్తక జ్ఞానం తప్ప లౌకిక జ్ఞానం లేకుండా ఆ పిల్లలకు సమస్యలు వస్తున్నాయి. కేవలం పుస్తక జ్ఞానం కాకుండా రెండూ ఉండాలని కొన్ని కథలలో రాశాను.

ఈ పిడికిట ఇసుక అని ఎందుకు పేరు పెట్టానంటే పిడికిట్లో ఇసుకను పట్టుకుంటే అది నిలవదు! క్రమంగా జారిపోతుంది. మెల్లమెల్లగా అంతా అయిపోతుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కుటుంబ సంబంధాలు కూడా మనకు తెలియకుండానే మెల్లగా జారిపోయాయి. ఇదివరకు మనం అమ్మమ్మ ఇంటికి, మేనమామల ఇంటికి, మేనత్తల ఇండ్లకు పోతే హాయిగా కుటుంబ సభ్యుల వలే కలిసి మెలిసి ఉండేవాళ్ళం. మన పెళ్లిళ్లయి మనం ఒక కుటుంబం ఏర్పరచుకున్నాక తర్వాత ఆ ఇంటికి వెళితే వారు మనను చుట్టాల వలె లేదా పరిచయస్తుల వలె కాఫీ తీసుకుంటావా? చాయ్ తాగుతావా? అని అడిగే వరకు వస్తుంది. అంతవరకు నా అనుకున్న బంధం కడకు తోసి వేసిన వైనం.. ఒకప్పుడు  అందరంకలిసే ఉన్నాం కదా? పనులుకూడా కలిసే చేసుకున్నాంకదా? గమ్మత్తుగా తెలియకుండా ఆ ఇంటికీ, బంధుత్వాలకూ దూరమవుతాం. మన ఇంట్లో కూడా అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్ళు  ఒకప్పుడు ఎంతో బాండింగ్ తో  ఒకరి మధ్య ఒకరు ప్రేమతో ఉండి కలిసి మెలిసి పెరిగిన వాళ్ళమే!  పెళ్లయిన తర్వాత వారి సంసారాలు వారివి. వారి జీవన విధానం వేరు! తల్లితండ్రులు మెల్లగా బయట వారై పోతారు. ఏదైనా ఇంటి విషయాలు చర్చించుకుంటే అల్లుడు- బిడ్డ కలిసి చర్చించుకుంటారు. ఈ తల్లిదండ్రులను కలుపుకోరు! అటు కొడుకు- కోడలు వారి మధ్య చర్చించుకుంటారు… కానీ ఆ విషయాలు ఏవీ అత్తమామలకు చెప్పరు. అక్కడ ఇక్కడ తల్లికి సంబంధం ఉండదు.

విదేశాలకు పోతే ఇంకా విచిత్రమైన పరిస్థితి మేనల్లుండ్లో- మేనకోడళ్ళను తన పిల్లల వలే అంతకంటే ఎక్కువగా చూసుకున్న వ్యక్తి.. తరువాత భార్యతో ఆమె బంధువులతో మమేకం అవుతారు. ఇటువైపు మొక్కుబడి సంబంధాలు మిగులుతాయి. చివరకు ఆ కుటుంబంలోని స్త్రీకి భర్త కూడాచనిపోతే.. చివరి రేణువు ఎప్పుడు రాలిపోతుందో తెలువదు… అని భావం. ఇలాంటి రకరకాల సమస్యలను తీసుకొని ఈ పిడికిట ఇసుకను సంకలనం చేశాను.

దేవకేదేవి:- చాలా ఉన్నాయి నేరము- శిక్ష అనే కథ నా అనుభవం కాదు కానీ, నా పరిశీలన! నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది. చిన్న ఆధారాలతో  రుజువు చేయబడుతుంది. రుజువైన వారి మానసిక వేదన వారిపై పడిన మచ్చ మాసిపోవు కదా! అందులో ఒక పాత్ర ఇలా అంటుంది అరేయ్ నువ్వు పనికి రాకపోతే చంపి పడేస్తా కొడకా ఏమనుకున్నావో అని అంటాడు నేరము శిక్ష కథలో…. చంపింది అన్నవాడు కాదు. వేరే అతను చంపేస్తాడు. ఫోన్ ఆధారంగా నువ్వే చంపావని నేరం మోపుతారు. అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి? ఇలా రాశాను కథా సంపుటి ఆలస్యమైనా పరిశీలన చేయడంలో లేట్ అయినా బాగానే ఉపయోగపడింది.

అరుదైన ఛాయాచిత్రం అనే కవితా సంపుటిలో రైతులకు సంబంధించిన అంశాలున్నాయి. కథల్లో కూడా వ్యవసాయం మీద కథ రాసాను. సన్నకారు రైతులను భూస్వాములు ఎలా అదుపులోనికి తీసుకుంటారని, వారిని కొత్త టెక్నాలజీ అని పెట్టుబడిదారులు ఎలా మోసం చేస్తారని, రైతుకు సంబంధించిన సమస్యలను రాసాను. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఉద్యమం జరుగుతున్నప్పుడు వచ్చిన హావ భావాలన్నీ కవితలుగా రాసాను. ఒక్కొక్క సంఘటనకు ఒక్కో కవిత, నాకు వ్యక్తిగతంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సరైనవిగా అనిపించనివి, మహిళలకు సంబంధించినవి బతుకమ్మ మీద కవితలు ఒక సంపుటిగా వేసాను.   ఇదే కాకుండా బతుకమ్మ పాటల్లో స్త్రీ మనోభావాలు అని రాసాను. ఎందరో బతుకమ్మ మీద వేల వ్యాసాలు రాసారు. మళ్ళీ దీని మీద నువ్వు ప్రాజెక్టు ఎందుకు చేయాలి? అని కొంతమంది అన్నారు. కానీ ఎంతసేపు బతకమ్మ తయారీ నేపథ్యం, ఆధ్యాత్మికత నేపథ్యంవాటి గురించి రాసారే కానీ స్త్రీలు ఎట్లా పాటలు పాడుకున్నారు? ఆ పాటలలో ఏ సంఘర్షణ? ఉంది పాటల్లోఆడ పిల్లలు పుట్టగానే వాళ్లకు పనులు రావాలనుకునేవారు. అవి ఎలా నేర్పారు ? మొదలైనవి రాసాను. ఉదాహరణకు జనకు జనకునింట అనే పాటలో బొమ్మరిల్లు కట్టడం, ధాన్యాన్ని దంచడం,చెరగడం ఇలాంటివన్నీ పెద్దలు నేర్పిస్తున్ననట్టుగా ఉంటుంది. ఆ  పాటలు ఆ రోజుల్లో బాల్యవివాహాలు ఉండేవని తెలుపుతున్నది. ఆ పాటలలో అల్లుండ్లలకు అలుకలు; అర్జునుడు భార్య సుభద్రతో  మీ అమ్మ వాళ్లు నాకేమీ కట్నకానుకలు ఇచ్చారు? అనే సంవాదం చేయడం అంటే జానపద పాటలలో పౌరాణిక పాత్రలు కనపడతాయి. శివుడు పార్వతి మొదలైన పాటలలో తమను తాము చూసుకుంటూ… చెప్పే పాటలు గురించి రాసాను.   అక్కడితో సరిపోదు! కలవారి కోడలు కలికి కామాక్షి  పాటను గమనిస్తే  ఎందుకీ కన్నీళ్ళు ఏమి కష్టాలు అని అడుగుతాడు అన్న తర్వాత ఏంచెప్తాడంటే వాకిట్లో బాలుడు అంబాడేదాకా ఓర్చుకో ! అంటాడు. అంటే  నీకు సంతానం కలిగే దాకా పరిస్థితి ఇలానే ఉంటుంది!  అందుకని ఓపిక పట్టు! అన్న మాటలకు మనకర్ధమైయ్యేదిమిటంటే? ఆడపిల్లకు పెళ్ళి అయితే సరిపోదు! సంతానం కలుగక పోతే అత్తవారింటినుండి పంపిచేస్తారని… అలాంటి ఇబ్బందులు తెలిపే పాటలున్నాయి.

సమిష్టి కుటుంబాలలో ఆమెకు బతుకమ్మ ప్రసాదం తినాలని బుద్ధి పుడితే, ఆమె అత్తని అడుగుతుంది! ఆమె మామను అడగమంటుంది… ఇలా ఇంటిల్లిపాదిని అడుగుతూనే పోయింది. చివరకు భర్తను అడిగితే కానీ ఆమెకు బతుకమ్మ ప్రసాదం దొరకదు. అంటే సమిష్టి కుటుంబంలో ఈ రీతి- రివాజులు అన్ని ఈ పాటలలో తెలుస్తాయి.  ఇంకా మగవాళ్ళ బహుభార్యాత్వం లో ఆడవాళ్ళు ఎంత ఆరాట పడ్డారనేది గంగా-గౌరి సంవాదంలో తెలుస్తుంది.  పెళ్లిళ్లు చేయకపోతే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారని అప్పగింతల పాటలో వారి బాధ, అప్పగింతల తర్వాత అత్తగారింట్లో అందరితోటి మంచిగా ఉండాలని ఆట్లా ఉంటే నీకు కావాల్సినవన్నీ  కొని ఇస్తామని తల్లిదండ్రులు సుద్దులు చెబుతారు. అవి చెప్పడంతో పాటు ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు ఉండేవని తెలుస్తుంది. ఆ పాటలలో అలుకలు ఎలా ఉండేవి అంటే అర్జునుడు సుభద్రతో మీ అమ్మ వాళ్ళు నాకేం కట్నకానుకలు ఇచ్చారు? అనే సంవాదం చేయడం జానపద పాటలలో పౌరాణిక పాత్రలు కూడా కనపడతాయి. శివుడు పార్వతి మొదలైన పాత్రలలో తమను తాము చూసుకుంటూ అనుభవించే పాటలున్నాయి. సమస్యలు, సంప్రదాయాలు ఆచారాలు అన్నింటిని కూర్చుకున్న పాటలున్నాయి. ఆడవాళ్లు వారికే అర్థమయ్యే భాషలో ఒకరితో ఒకరు చెప్పుకునే పాటలు పైకి ఒక అర్థంతో కనబడుతుంది, లోపల ఇంకొక అంతరార్థం ఉంటుంది. అవి చమత్కారమైన పాటలు.        పండుగ పూట పదిమంది ఒకచోట చేరి పండుగ చేసుకుంటున్నప్పుడు అందరూ వింటారని, విని వారి జీవితాలు మార్చుకుంటారనీ ఇలా బతుకమ్మ పాటల్లో ఎన్నో విషయాలు రాసారు.

                                తిరునగరి దేవకీదేవిగారితో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

మలిదశ తెలంగాణ ఉద్యమం రాకముందు జడ్చర్ల రైలు ప్రమాదం, వసంత వాగు (యశ్వంతాపురం) రైలు ప్రమాదం, లాతూరు భూకంపం, నక్క ఆండాలమ్మ పాట చాలా ప్రసిద్ధి పొందినవి. (భువనగిరి) ఎన్ గోపి అక్కను రజాకార్ మూమెంట్లో వాళ్ళు చాలా ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు. అదే ఇతివృత్తం గా పాట వచ్చింది. అలా కాలానుగుణంగా సమాజంలోని ఏ సమస్య ఉంటే దాన్ని తీసుకొని బతకమ్మ పాటలుగా మలుచుకున్నారు. మలి దశ ఉద్యమంలో కూడా బోలెడు పాటలు వచ్చినవి. స్త్రీల మనోభావాలను తీసుకున్న ఆ పాటల పరిణామం ఎలా జరుగుతూ వచ్చింది అనేది తీసుకున్నాను. ఏడేడు తరాల కథ అని తెలంగాణ కథ ( సిడి) గురించి కూడా రాశాను. ఎవరెవరు రాశారో దొరికినంత వరకు తీసుకున్నాను. వృద్ధులకు సంబంధించిన పాటలు, కమ్మరి, చేనేత వారివి, వ్యవసాయానికి సంబంధించిన పాటలు కూడా వివరించడం జరిగింది.

దేవకీదేవి:– ఉద్యమ కాలంలో నేనొక విద్యాసంస్థకు సంబంధించిన వ్యక్తినే కాదు . PUC పరీక్షలు రాసి, సెలవులు గడుపుతున్న విద్యార్థిని. మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ , హైస్కూలు మొదలైన విద్యార్థులను నాయకులంతా, యూనియన్ నాయకులుగా విద్యార్థులు ముందుకు వచ్చారు. నేను మొదట నిరాహార దీక్షలో పాల్గొన్నాను. అప్పటి నిరాహార దీక్ష చాలా పద్ధతి ప్రకారం 24 గంటలు కూర్చొనే వాళ్ళం. అలా రెండుసార్లు నిరాహార దీక్ష చేసాను.ఆ తర్వాత ఆఫీసులలోనికి వెళ్లి పికెటింగ్ కూడా చేశాము .ఆ చేస్తున్నప్పుడు వెంట వచ్చిన విద్యార్థులు ఎక్కడికో వెళ్లారు. విద్యాసంవత్సరం వృధా అవుతుందనుకున్నారో? లేక వారింట్లో పెద్దలు కోప్పడి వద్దన్నారో తెలియదు! కానీ వాళ్ళు ఇళ్ళకే పరిమితమైపోయారు. 1969 ఏప్రిల్ 16న బాలికల ర్యాలీ తీశారు. జీవన్ లాల్ కాంప్లెక్స్ నుండి వేయి స్తంభాల గుడి వరకు అందరం కూర్చున్నాము. ఇంకో గుంపు వచ్చి చెట్ల కింద కూర్చున్నారు. వాళ్లు కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు. నేనెందుకు మాట్లాడకూడదు? అనిపించింది. తెలిసీతెలియని ఆ సమయంలో ఆంధ్రా వారితో మనకు జరుగుతున్న నష్టం గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి వలె ఎందుకు ప్రశ్నించకూడదని ఆవేశంగా మాట్లాడి, కొంగు నడుముకు కట్టుకొని మాట్లాడిన! మొట్టమొదటిసారి అది పేపర్లో వార్త లాగా ఫోటో వచ్చింది. అప్పుడు నన్ను నేను మొదటిసారి పత్రిక లోచూసుకున్నాను. ఆ తర్వాత వేరే వాళ్ళు రాకపోవడం నేనే వీళ్ళందరికీ నాయకత్వం వహించడం, ఆ తర్వాత  మిగతా ఆడపిల్లలను సమీకరించాను. అలా చాలామంది వచ్చారు. నాతో పాల్గొన్నవారు మిగతా ఆడపిల్లలు చాలా మందే ఉన్నారు. కానీ అందరూ అన్ని సందర్భాల్లో నాతో కలిసి రాలేదు. ఇంకొకటి ఏమిటంటే ఆ రోజుల్లో హాస్టల్స్ లేవు! విద్యాలయాలు మూసేసారు. మలిదశ ఉద్యమంలో హాస్టల్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అందరూ గుంపుగా గుమి కూడడం గుంపుగా రావడం అనేది సులువు. ఆడపిల్లలు బయటకు రావడం కష్టం. ముఖ్యంగా ఉద్యమాలలో పాల్గొనడం అంటే  పెద్దలు వద్దనే వారు. అలా కూడగట్టుకోవడంలో నేను విజయవంతమైనాను. హనుమకొండ చౌరస్తాలో రాస్తారోకో చేసే వాళ్ళం. కాసేపు చేయగానే పోలీసులు వచ్చి మమ్మల్ని వ్యాన్లో ఎక్కించుకొని పోతుంటే, వ్యాన్ ఎక్కి జోరుగా ఉపన్యాసం ఇచ్చేదాన్ని. ఆవేశంతో మాట్లాడి హంగామా చేసేవాళ్ళం. మగ ఉద్యమకారులు పిల్లలు బాగా సహకరించే వారు. మేము కూడా ఉద్యమం చేయాలని వారికి ఉన్నది. పోలీస్ స్టేషన్ కు పోయిన తర్వాత రికార్డు చేసి నినాదాలు చేసేవాళ్లం. మా వెనుక ఉద్యమ నాయకులు ఉండేవారు మాకు టీలు, బిస్కెట్లు తెప్పించేవారు. ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కే వాళ్ళం. ఏప్రిల్ లో కోర్టుకు పోయినప్పుడు మమ్మల్ని అందరినీ జడ్జి ముందు నిలబెడితే పిల్లలందరూ ఉద్యమం చేస్తున్నారు కదా !అని అనుకునేవారు ఇంకో విషయం తప్పక చెప్పాలి. ఇక్కడ జడ్జీలు స్థానికులు కారు. కానీ వ్యతిరేకులు కారు. వాళ్లంతా ఉద్యమం పట్ల సముఖంగానే ఉన్నారు. చట్టం ప్రకారం వాళ్ళు ఏదైనా చేయాల్సి వస్తే చేస్తారు. ఉద్యమంలో చనిపోయిన 367 మంది ఇక్కడ స్థానిక పోలీసుల వల్ల చనిపోలేదు. సిఆర్పి అంటే (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ) వల్ల చనిపోయారు. అందుకే మేము చిప్ప పోలీస్! డౌన్ !డౌన్!!  అని స్లోగన్ ఇస్తూ సమ్మె చేసాం!

మలిదశ ఉద్యమం అలా కాదు! ఇది చాలా గమనించాల్సిన అంశం. మలిదశలో వలస వచ్చిన పోలీస్ అధికారులు మా మీద మరింత పెత్తనం చేలాయించి, కొంతమందిని చాలా హింసించి ఉద్యమం నీరు కార్చే పని చేశారు. తర్వాత ఆత్మహత్యలు కూడా జరిగాయి. అప్పుడు చనిపోయిందంతా సిఆర్పి ఫైరింగ్ వల్ల.. అదొకటి గమనించాలి! ఇలాగే వరంగల్ పోస్ట్ ఆఫీసు, పెద్ద రాగన్న దర్వాజా దగ్గర, హనుమకొండ చౌరస్తాలో ఇలా వేరువేరు ప్రాంతాల్లో రాస్తారోకో చేసాము. ఆఫీసుల్లో పికటింగ్ చేశాము. ఇంత తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఒకరోజు రాగన్న దర్వాజా పోలీస్ స్టేషన్ దగ్గర మేము రాస్తారోకో చేస్తున్నాము. మమ్మల్ని తీసుకొని పోయి జీవులో ఎక్కిస్తున్నారు… మేము వ్యతిరేకించాము. కొట్లాడే క్రమంలో పోలీస్ గల్లా పట్టాను. లాఠీ గుంజితే అది విరిగిపోయింది. ఇదంతా పెద్దవారి దృష్టికి వచ్చింది. అంతకుముందు హనుమకొండ చౌరస్తాలో జరిగినప్పుడు ఏమైందంటే వరదారావు అని ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయి కాలర్ పట్టుకునేసరికి ఆయన మీదకు  ఆ అమ్మాయి చెప్పు లేపింది… అది జరిగిన సాయంత్రం పబ్లిక్ మీటింగ్  అయింది. నన్ను మాట్లాడమంటే స్టేజీ మీదికి వెళ్లిన, మేము రాస్తారోక చేయకూడదు తప్పే… మీరు అరెస్టు చేశారు చట్టాన్ని మేము గౌరవించాలి! నిజమే! ఆడపిల్లను అరెస్టు చేయడానికి ఆడ పోలీసులు కావాలి కదా! మీరు మమ్మల్ని ఎలా అరెస్టు చేశారు?  మీకు ఆడ పోలీసులు లేకపోతే మీరే చీరలు కట్టుకొని రావాల్సి ఉండే! ఆడవాళ్లు అసమర్థులని నేను ఒప్పుకున్నట్టైంది కదా!  ఆవేశంలో ఆ విషయం గుర్తుకు రాలేదు. కానీ స్టేజి మీద పోలీసులను ఇష్టమున్నట్టు తిట్టిన.. ఆ మీటింగ్ అయిపోయింది .ఇంటికి వచ్చిన.   తెల్లవారి చాలామంది మా ఇంటికి వచ్చి కలిసి పోయారు  మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అని మిమ్మల్ని తప్పకుండా పీడియాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. మీరు ఇంట్లో ఉండొద్దు! కొన్ని రోజులు ఎక్కడికైనా పోండి! అని ఎంతోమంది చెబితే జనగామ దగ్గర నవాబు పేటలో మా మామయ్య టీచరుగా పనిచేస్తారు. అక్కడికి వెళ్లి 15 రోజులు ఉండి వచ్చిన. తర్వాత ఒకరోజు అరెస్ట్ చేసినప్పుడు మీరు తప్పు కదా! ఇలా చేయకూడదు కదా! మీ అమ్మాయిలు ఎందుకు చేస్తున్నారు? అని జడ్జి అడిగితే మమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపించండి అన్నాను. ఏ జైలుకు పోతారు వరంగల్ జైలా? రాజమండ్రి జైలా? అని అడిగారు.

రాజమండ్రి ఆంధ్ర జైల్ సార్!  మాకెందుకు? వరంగల్ జైల్లో వేయండి! అన్నాను.  నీ ఇష్టం వచ్చినట్టు వేస్తామా? అని జడ్జి గారంటే మీరే కదా! సార్! ఏ జైలుకు పోతారు? అని అడిగారు! ఇప్పుడు  మీ ఇష్టం అంటున్నారు.. అని అన్నాను. అనేసరికి జడ్జి స్థాణువులా అయిపోయాడు. నేను అలా సమాధానం ఇస్తానని అనుకోలేదు. ఎక్కడైనా ఫ్రీగా గట్టిగా మాట్లాడడం, ఫ్రీగా మూవ్ అవ్వడం… ఆ క్రమంలో నేను పరకాల, జనగామ, వరంగల్, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి పోయి మాట్లాడుతున్నాను. ఫైర్ బ్రాండ్ అని నాకు పేరు పెట్టడానికి అదొక కారణం అయి ఉంటుంది.

అప్పుడు పదవ తరగతి పరీక్షలు అవుతున్నాయి ఆ పరీక్ష రాయవద్దు అని తెలంగాణ వాదులంతా నిర్ణయించుకున్నారు. కానీ కొందరికి ఒక సంవత్సరం వేస్ట్ అవుతుందని భయం. వాళ్లు పరీక్ష రాయడానికి సిద్ధమవుతుంటే ఎక్కడినుండో ఒక జీప్ తెచ్చారు. అందులో ఎక్కినాము. మేము కొద్దిగా కారంపొడి తీసుకొని  పోయాము! గేట్ దగ్గర పోలీస్ కాపలా ఉన్నారు. మేము పరీక్ష రాయడానికి పోతున్నారనుకున్నారు. లోపలికి వెళ్లి పరీక్ష రాసే వారి పేపర్లన్నీ గుంజుకొని, చించేసి, బయటపడ్డాం! అలా మూడు నాలుగు స్కూళ్లలో పరీక్ష రాయనివ్వకుండా చేశాం. అందులో నేనున్నాను. అక్కడితో ఆగలేదు, ఉద్యమం అయిపోయిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినవి 14 సీట్లు ఆ ఎన్నికల సమయంలో ఊరూరా  తిరిగి తెలంగాణ ప్రజా సమితి వాళ్ళనే గెలిపించాలని చెప్పినాము. ఆ గుంపులో నేనున్నాను. తెలంగాణ వాదులు నన్ను బాగానే ఉపయోగించుకున్నారు. ఈమె తెలంగాణ అభిమాని కాబట్టి మనం తీసుకొని పోతే బాగుంటుంది అనుకున్నారు. నేను కూడా ఎంపీలు గెలిస్తే మనకు రాజకీయంగా మంచి జరుగుతుందని, అనుకున్నాను. నేను ఆ ఎన్నికలలో చిత్తశుద్ధితో పనిచేసే ఇల్లిల్లు తిరిగి తెలంగాణకే ఓటు వేయమని ప్రచారం చేశాను. సంక్రాంతి రోజులు…  ప్రతీ ఇంటి ముందుకు వెళ్లి అమ్మా!  ఉన్నారా?  అంటే మమ్మల్ని ఆడుక్కునే వాళ్ళు అనుకున్నారేమో? కొన్ని చక్కిలాలు  తెచ్చింది వేయడానికి… ఇంకో డాక్టర్ ఇంటికి వెళితే పడుకోమని  బెడ్ చూపించింది పేషెంట్ అనుకుని. అలా తిరిగి ప్రచారం చేయడమే కాకుండా ఒక రోజున నేను స్వయంగా ఒక్కదాన్నే ఎలక్షన్ రోల్ ను తీసుకుని, మాకు సంబంధించిన ఏరియాలో ప్రతి ఇంట్లో ఓటు వేశారా? లేదా అని కనుక్కొని వేయని వాళ్ళని వేయమని బతిమిలాడి, తిరిగి వచ్చినాను. ఇదంతా తెలిసే ఫైర్ బ్రాండ్ అన్నారేమో? ఆ విధంగా పనిచేస్తే ఎం.పీ వివి గిరి గెలిచిన తర్వాత కనీసం ఒక్క మీటింగ్ పెట్టి మాకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు! మా ఉద్యమంతో సంబంధమే లేదు ఉన్నాడు.. అంత ఉత్తిదే అయింది. ప్పోగ్రసివ్  ఆర్గనైజేషన్ హన్మకొండలో ప్రారంభించారు. అందులో నేను మెంబర్ని.

అనిశెట్టి రజిత కూడా మెంబరే! దానికి కూడా అధ్యక్షత వహించాను. మరిచిపోయిన విషయం ఏమిటంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు మహిళా సదస్సు జరిగింది. ఆ మహిళా సదస్సుకు అధ్యక్షత వహించాను.ఆ సభకు ఈశ్వరిబాయి వచ్చింది. హైదరాబాదుకు వచ్చి నాయకులు నన్ను తీసుకొని వచ్చినారు. జీవన్ లాల్ గ్రౌండ్స్ లో వేలమంది ఉన్నారు. తర్వాత ( POW)  పిఓడబ్ల్యూ ఫౌండర్ మెంబర్ను. తరువాత మలిదశ ఉద్యమం.

దేవకీదేవి:– మామూలుగా స్త్రీల సమస్యలకు సామాజిక దృష్టికోణం మారాలి. పితృస్వామ్య భావజాలం అనేది ఇంకా నడుస్తూనే ఉంది. ఎన్ని ఉద్యమాలు చేసినా కొంత మార్పు వచ్చింది. ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయి. గృహహింస  జరుగుతున్నది. చదువుకొని విదేశాలకు పోయినా అక్కడ కూడా ఆడవాళ్ళు హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవి మారాలి అంటే  ఆడవాళ్ళను చూసే ఈ కోణం మారాలి! ఆడవాళ్లు  అనుభవించడానికి మాత్రమే అంటే భోగ్య వస్తువుగా చూస్తున్నారు. వారికి సమాన స్థాయిని ఇవ్వనవసరం లేదు అని అనుకుంటున్నది సమాజం.  వాళ్లకూ మెదడుంది… ఆలోచించగలరని, వాళ్ళు స్వయం శక్తిగా ఎదగగలరని అనుకోలేకపోతున్నారు. ఇది లేనంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా మార్పు ఉండదు. అలా అని మనం ఆగకుండా ఎప్పటికప్పుడు పిల్లల్ని పెంచే క్రమంలో, ఆలోచించే క్రమంలో, టీచింగ్ చేసే క్రమంల, రచనలు చేసే విషయంలో వారి స్వేచ్ఛను గౌరకిస్తూ.. నిలదొక్కుకునేలా చేయాలి! రాజకీయ నాయకులకు కూడా మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ నడుచుకోవాలి. ఇప్పటివరకు మహిళా బిల్లు లేదు. అంటే వస్తే మనకు ఎంత నష్టం జరుగుతుందో అనె ఉద్దేశంతో మహిళా బిల్లుకు మోక్షం రావడం లేదు. గ్రామాలకు సంబంధించి మహిళలకు ఎన్నికలలో నిలబడేందుకు అవకాశాలున్నాయి. కొన్నిచోట్ల పేరుకు మహిళను నిలబెట్టి వెనుక నుండి పురుషులే పాలన చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారు మాట్లాడగలుగుతున్నారు. వాళ్లు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. ఇక్కడ కూడా మార్పురావాలి. ఏ మార్పు వచ్చినా ఈ సమాజంలోని కోణం మారేంతవరకు ఆడవారి సమస్యలకు పరిష్కారం ఉండదు. అలా అని నిరాశపడి వదలకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి! ఎప్పటికప్పుడు సమస్యలను గమనిస్తూ, పరిష్కరించుకునే మార్గం వెతుకుతూ, మన పక్కన ఉన్న వారిని చైతన్య పరుస్తూ, రచనలు కావచ్చు, సంస్థలు కావచ్చు, మార్పులను తీసుకొని పోతూ ఉంటే తప్ప ప్రగతిని సాధించలేము అనుకుంటున్నాను.

దేవకీదేవి:– స్త్రీవాదమనేది స్త్రీ సమానతకు మాత్రమే ఉండాలి. వారితో సమానంగా హక్కులు ఉండాలి  ఆధిక్యత కాదు! మన మీద పెత్తనం చెలాయించడం, వారి అభిప్రాయం రుద్దడం, మన మీద దాడి చేయడం, దండెత్తడం కాకుండా మనల్ని గౌరవించాలనే తప్ప ఇక్కడ పురుషాధిక్యత ఉన్నదని…. స్త్రీ ఆధిక్యతను కాదు కోరేది! సమాజంలో మనుషులు ఎప్పుడూ మంచోళ్లు- చెడ్డోళ్ళు ఉంటారు. ఆడవాళ్ళల్లో చెడ్డ వాళ్ళు ఉంటే విమర్శించాల్సిందే ! దాన్ని ఎప్పుడూ సమర్ధించకూడదు! ఏ కోణంలో ఆమె ఆలోచించిందో? ఎలా అతన్ని ఇబ్బంది పట్టిందనేది ఎప్పుడు గర్హించాల్సిందే! అంతే కాదు స్త్రీవాదం పురుషులను అణగదొక్కడానికి కాదు! స్త్రీల సమస్యలను అర్థం చేసుకొని, స్త్రీకి కూడా గౌరవం ఇవ్వాలని, స్త్రీకి కూడా సమాన హక్కులు ఇవ్వాలనే ఉద్దేశం. మీరన్నట్టుగా కూడా స్త్రీల నుండి పురుషులకు అనేక సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పుడైతే సమానత్వాన్ని కోరుకుంటున్నామో? అప్పుడు ఇలాంటి భార్యా బాధితుల సమస్యల కిందకే వస్తుంది. భర్త బాధితులుంటే ఎంత తప్పో? భార్యా బాధితులు ఉండడం కూడా అంతే తప్పు. అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చివరగా చెప్పేదేమిటంటే? ఏ బాధితులు ఉన్నా ఒకవేళ స్త్రీ పురుషులకు; పురుషుడు  స్త్రీలకు తప్పు చేస్తే స్త్రీకే ఎక్కువ అసరు పడుతుంది. పురుషుడికి ఎక్కువ అసరు పడదు. ఆమె గమనించకపోవచ్చు కానీ నష్టపోయేది ఆమెనే! ఈ ఆధిక్యత కోసం ఆమె భర్తని ఇబ్బంది పెట్టినా ఆ ఫలితం ఆమెపై ప్రభావాన్ని చూపుతుంది. తర్వాత పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది.

దేవకీదేవి :– మీరు చెప్పిన దాంట్లో  కేవలం సెల్ఫ్ కేరీర్ , తన వ్యక్తిత్వ ఎదుగుదలను స్త్రీ ఒకవేళ చూసుకొని, పిల్లల్ని కానీ భర్తను కానీ పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అని అడిగారు కదా! అది తప్పకుండా తప్పే అవుతుంది. అక్కడ మనం గమనించాల్సింది ఆమె ఏదైతే కోరుకుంటున్నారో అందులో వాస్తవికత ఎంత? ఆమె కోరుకున్నది కరెక్టేనా? ఆమె ఆశిస్తున్నది సరైనదేనా? ఆమె కేవలం తన ఆధిక్యత చూసుకుంటున్నదా? లేదా తన పిల్లల్ని కూడా కలుపుకొని చూస్తున్నదా? అంటే పురుషాధిక్యతలో భర్త  పిల్లలను, పట్టించుకోలేదనుకోండి !అప్పుడు ఆమె ఏదైనా కోరితే అది సబబే!

ఏం లేకుండా భర్తను అణగదొక్కడం అనే భావం… పురుషుడు స్త్రీని అణగదొక్కడం అనేది ఎంత తప్పో ఈమె భర్తను అణగదొక్కడం కూడా అంతే తప్పు! సమానత్వం అనేది ఉండాలి. అప్పుడు కుటుంబం కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. అభివృద్ది మంచిగా వస్తుంది. పిల్లలకు ఏ హాని ఉండదు.

దేవకీదేవి:– మీరనే దానిలో రెండు కోణాలు ఉన్నాయి. మామూలుగా  ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ ప్రేమ పెళ్లి వరకే ఉంటున్నది. తర్వాత మామూలుగా అందరికీ  కోరికలున్నట్టే అన్నీ కావాలి. తనకు కట్నంగా ఎంతో డబ్బులు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రేమించుకున్నప్పుడు ప్రేయసిగా ఉన్నామే భార్య కాగానే అతని ప్రవర్తన మారుతున్నది. అంతకుముందు ప్రేయసికి ఇష్టమైనవన్నీ పెళ్లైయ్యాక  ఇష్టం కావడం లేదు. భార్య అంటే తన చెప్పు చేతుల్లో ఉండాలి! నేను ఏది చెప్తే అది వినాలి! అన్నప్పుడు ఇప్పటికాలానికి అనుగుణంగా ఆడ పిల్లలు కూడా చదువుకోవడం, పెంపకం బాగా లేక వాళ్ళు కూడా మగ వాళ్ళు చేస్తున్నట్టు మేము ఉద్యోగం చేస్తున్నాం కదా? అనే భావనలో ఉండి వాళ్లకు ఉన్న పని భారంతో  వీటిని భర్తలు గమనించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌవుతున్నాయి. అయితే మనం ఎప్పుడూ

ఏమాశిస్తున్నామని అంటే? అమ్మాయే సర్దుకు పోవాలని , అది కరెక్ట్ అనుకుంటే ఆమె ప్రశ్నించడం మొదలవుతుందో?  అక్కడ బ్రేక్ వస్తుంది. స్థాయిని బట్టి తప్పొప్పులు నిర్ణయించాలి. ప్రతి చోట అబ్బాయిదే తప్పని అనడం లేదు. ఇద్దరూ సర్దుకోలేకపోతున్నారు అనేది గమనించాలి! కేవలం విడాకులు తీసుకోవడం కాదు. ఎంతవరకు సర్దుకు పోగలిగారు కాలానుగుణంగా, పరిస్థితిలకు అనుగుణంగా ఆలోచనలు మారాలి.

నేనే ఆలోచిస్తుంటాను. నా కొడుకు 9 గంటలైనా నిద్ర లేవకున్నా నేనేమీ అనుకోలేదు. 9 గంటలకు వచ్చి, టిఫిన్ తిన్నాడు, పోతున్నా అన్నాడు.అదే కోడలు 9 గంటల వరకు నిద్రపోతే నేనెందుకు మామూలుగా ఫీల్ కాను ?అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఇంకా ఇలాంటి ఆలోచనల నుండి మనం బయటపడలేదు. ఆమె ఏవో పనులు చేయలేదని అనుకుంటున్నానంటే…? మన మనసు అమ్మాయి అయితే ఒక విధంగా  అబ్బాయైతే ఇంకో విధంగా ఆలోచిస్తున్నట్టే కదా! నేను ఆ పద్ధతిలో పెరిగాను. నావలెనే నా కోడలు ఉండాలి! అనేది నా అంతరాంతరాలలో ఉన్నట్టే కదా? ఆ ఆలోచనలు నా పై పని చేస్తున్నవి. అంటే అత్తల ఆలోచనలా ఉంటున్నవి. నేను నిష్కర్షగా చెప్తున్నాను. నేను  మా అబ్బాయి పని తప్పు కాదు! కోడలి పని తప్పుగా భావిస్తున్నాను కదా! ఇది మానసికంగా అమ్మాయిలు సర్దుకుపోవాలని అనుకుంటాము. అయితే మారుతున్న కాలంలో వాళ్ళ ఆలోచన అలా లేదు. అయితే మీరన్నట్టుగా ఎవరు సిద్ధంగా ఉన్నా, లేకపోయినా.. విడాకులనేది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, అది గమనించాలి! ఇప్పుడు రకరకాల సమస్యలున్నాయి. సహజీవనం చేయడం కూడా నేను ఒప్పుకోను! అది పిల్లలపై చాలా ప్రభావం చూపెడుతుంది. వ్యవస్థను విచ్చిన్నం చేస్తుంది. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఈ విషయం ఆలోచించాలి కదా! అంటే నాకు అతను ఇష్టం లేదు! ఇదివరకు ఉన్నట్టే ఒంటరిగా ఉంటాను… వెళ్ళిపోతాను.. అనుకుంటే సమాజం అస్థిరతకే దారితీస్తుంది.

దేవకీదేవి :—ఇది పెద్ద ప్రశ్నే! ఆదర్శ మహిళ అంటే రైతంగ పోరాటంలో పాల్గొన్న వారే అంటాను. ఆదర్శ మహిళలను చెప్పాలంటే ముందుగా మా అమ్మమ్మ గురించి చెప్తాను! మా తాతగారు చాలా చిన్న వయసులోనే చనిపోతే, అంతమంది పిల్లల్ని సాది- సవరించి, ఒక్క తాటిమీద నడిపించగలిగిన వ్యక్తి ఆమెనే ! మమ్మల్ని కూడా అంతా బాగా చూసింది. అందరూ బాగుండాలనుకొనేది.

గొప్పగా అంటే జ్యోతిరావు పూలే లాంటి ఎందరో ఉన్నారు. కానీ నాకంటి ముందు రోజు కనపడే మా అమ్మమ్మ కంటే ఎక్కువగా ఎవరూ అనిపించరు. నేను మా అమ్మమ్మని ఆదర్శంగా తీసుకుంటాను.

దేవకిదేవి:– తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత డిగ్రీ, పీజీ చేసి, ఉద్యోగ రీత్యా వికారాబాద్ కు వచ్చేసినాను. కానీ ఎప్పుడూ తెలంగాణ ఆస్తిత్వ ఆర్భాటం గురించి మరిచిపోలేదు. ఎప్పుడూ పిల్లలకు పాఠాలు చెప్తుండేటప్పుడు కూడా మన భాష గురించి, యాస గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడేదాన్ని. ముఖ్యంగా అధ్యాపకురాలిగా నేను స్పాట్ వాల్యూయేషన్ కు పోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఆంధ్ర లెక్చరర్లు కూడా పేపర్లు దిద్దడానికి వచ్చేవారు. తెలంగాణ పిల్లల జవాబుల గురించి, తెలంగాణ భాషను గురించి చాలా చులకనగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో నేను ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే వచ్చేదాన్ని. పాఠం చెప్పేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత 1997లో జనసభ ఏర్పడింది. ఐతే నేనెప్పుడైతే తెలంగాణ అభిమానినని జనాలకు తెలుసో వారంతా మళ్లీ నన్ను సభలలో పాల్గొనమని పిలిచారు. జనసభలో ఒక కమిటీ సభ్యురాలుగా నన్ను చేశారు. న్యాయంగా చెప్పాలంటే దానికి పెద్దగా న్యాయం చేయలేదు! బెల్లీ లలిత హత్య తర్వాత క్రమంగా జనసభ నిస్తేజమైపోయింది.

ఆ తర్వాత తెలంగాణ మహిళా వేదిక మళ్లీ ఇంకొక వేదిక తయారైంది. అప్పుడు కూడా నన్ను పిలిచారు. మహిళా వేదికలో నన్ను ఉండమన్నారు. దాంట్లో కూడా నేను నామమాత్రం గానే పనిచేశాను. కానీ మొత్తానికి ఈమె తెలంగాణ కొరకు మాట్లాడుతుందని ఒక ముద్ర మాత్రం పడింది. చివరగా కేసీఆర్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు ఉద్యమం ఊపందుకున్నది. అనేక చోట్ల ధర్నాలు జరగడం,

తెలంగాణ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీలో కూడా నేను సభ్యురాలుగా ఉండి పని చేశాను. పిల్లల ఉపన్యాసాలు, వ్యాసాలు వాటికి సంబంధించిన  కార్యక్రమంలో ఒక సభ్యురాలుగా ఉండి పని చేశాను. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు వాటిలో పాల్గొనేదాన్ని.

2009లో నేను పదవి విరమణ పొందిన తర్వాత, కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు అనుకోకుండా నేను ఉద్యమకారణంగానే అమరవీరుల స్థూపం నాంపల్లికి పోయాను. అక్కడ కోదండరాం గారున్నారు. నన్ను చూసి పండుగ రోజు పాలపిట్ట వలె బాగా కనపడ్డారు అని అన్నారు. ఆ సభలో మాట్లాడటం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమానికి సుముఖంగా ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అనుకోకుండా దాంట్లో చొచ్చుకు పోయాను.

నేను ఉండేది వికారాబాద్ లో కానీ హైదరాబాదుకు వచ్చి అందరిని చూసి,వాళ్ళల్లో ఒక్కదాన్నై తెలంగాణ మహిళా వేదిక అనేది ఏర్పాటయింది 16 మంది సభ్యులతో. దాన్లో అందరూ కన్వీనర్లే !అట్లా మహిళా వేదిక ద్వారా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆర్ట్స్ కాలేజీ దగ్గరకు పోవడము, మా వేదిక మీద నిర్ణయాలు చేసుకొని, ఇంకా విచిత్రం ఏమిటంటే? ఆర్ట్స్ కాలేజీలో గేట్లు మూసివేస్తే పక్కన గోడలు ఉంటే వాటిని విద్యార్థులు పగలగొట్టారు. ఆ గోడలు కూడా దూకి వెళ్లాను. అప్పటికి నాకు 60 ఏండ్లు వచ్చినవి. వాళ్లలో ఒక దానిగా నేను పోవడం, ఉపన్యాసాలు ఇవ్వడం అది విని ప్రజలు చాలా సంతోషపడ్డారు. నేను 69 లో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎట్లా జనం చప్పట్లు కొట్టేవాళ్ళో?అలా  ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో పిల్లలు నా ఆవేశాన్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు. అట్లా ఆర్ట్స్ కాలేజీలో, నిజాం కాలేజీలో, తర్వాత మెడికల్ కాలేజీలో ఇలా ప్రతి చోట ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడకు పోవడం, వంటావార్పు కార్యక్రమంలో  వికారాబాద్ లో  అనేకచోట్ల పాల్గొనేదాన్ని.

అంతే కాకుండా మానవహారం  మిలియన్ మార్చ్  ఉన్నపుడు కూడా వికారాబాద్ నుండి వచ్చి లోయర్ ట్యాంకు బండ్ దగ్గర ఆడవాళ్ళందరం కూడి, పోలీసుల కళ్ళు కప్పి ట్యాంక్ బండ పైకెక్కినాము. సాయంత్రం దాకా చాలా యాక్టివ్ గా పాల్గొన్నాము. నన్ను చూసి జనాలు ఏమిటీ ఈమెనే ఇట్ల పాల్గొన్నారు… మనం ఎందుకు పాల్గొనకూడదు, అనుకునే ఉత్సాహం  వచ్చేంతగా నేను ఎగిరిన… అదీ కాకుండా మేమందరం కలిసి 31 జనవరి 2010లో  ఆర్టీసీ ఫంక్షన్ హాల్లో ఒక మహిళా సదస్సు ఏర్పాటు చేసినాము. అట్లా వికారాబాద్ నుండి విద్యార్థులను నాలుగైదు కార్లలో తీసుకొని పోయినాము. కార్లో పెట్రోల్ నేను పోయించుకోలేదు కానీ, మిగిలిన ఖర్చులన్నీ నేనే పెట్టుకున్నా…

ఆ విధంగా పనిచేసిన తర్వాత సాగరహారం చేసినప్పుడు పోలీసులు చాలా గట్టి బందోబస్తు చేసి నెక్లెస్ రోడ్ లోకి రానివ్వలేదు. రవీంద్ర భారతి దగ్గర నుండి పోతుంటే.. అక్కడ అడ్డుకున్నారు. తర్వాత ఖైరతాబాద్ నుండి పోతే అక్కడా అడ్డుకున్నారు. రవీంద్ర భారతి దగ్గర పోనిచ్చారు. మనుషులని అడ్డు చెప్పలేదు! అక్కడినుండి లోపలికి పోయిన తర్వాత ఎక్కువసేపు స్లొగన్స్ ఇచ్చినాను. ఆఖరుకు బాష్పవాయువు ప్రయోగం చేశారు. అప్పుడు అందరం విడిపోయినాము. తిరిగి లోయర్ ట్యాంకుబండ నుండి సంజీవయ్య పార్క్ వరకు నడిచి సాగరహారం లోపలికి వెళ్ళాము. ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. ఆర్ట్స్ కాలేజీ దగ్గర విద్యార్థులను అరెస్టు చేశారు. ఎన్నోసార్లు అలా అరెస్టు అయి,  పోలీసు స్టేషన్ కు పోయి వచ్చినాము.

రైలు రోకోలు ఎన్ని కార్యక్రమాలు చేశారో అన్నిట్లో చివరి వరకు పాల్గొన్నాను. యూనియన్ వాళ్ళు తప్ప చాలా సందర్భాలలో ఒక్కదాన్నే ఉన్నాను. చివరకు  ఉద్యమం సఫలీకృతమై, తెలంగాణ రాష్రం ప్రకటించేంత వరకూ నా వయసును లెక్కపెట్టకుండా ఊరూరా తిరిగాము.   హైదరాబాదులో , వికారా బాద్ లో తిరిగాము.

తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రాత్రి 12 గంటలకు అందరితోనూ తెలంగాణకు సంబంధించిన ప్రతిజ్ఞ కోదండరాం చేయించాడు. ఆయన వికారా బాద్ కు వచ్చిండు ఆ ప్రతిజ్ఞ నాతోనే చేయించాడు. అప్పుడు కూడా 12 గంటల రాత్రి వికారాబాద్ లో నేను ఒక్కదాన్నే ఆడదాన్ని.

అట్లా తెలంగాణ కోసం కృషి చేసినాను. ఇందిరాపార్క్ దగ్గర ఎన్నో సమావేశాలు అయ్యాయి… వాటిలో కూడా మాట్లాడాను. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే 69 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేను ఏ రాజకీయ లబ్దిని ఆశించి కాదు! తెలంగాణ అస్తిత్వం కాపాడాలి! తెలంగాణ గౌరవాన్ని కాపాడుకోవాలి! మన తెలంగాణలో ఉన్న   మన నిధులు మనకు కావాలి! మన ఉద్యోగాలు మనకు కావాలి! మన సంస్కృతి మనకు ఉండాలి! అని నిలబడ్డాను. ఏమాశించి పనిచేయలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను.

పద్మజ:- మీరు తెలుగు భాషా అధ్యాపకులుగా పనిచేసారు. ఆ సందర్భంగా మీ విద్యార్థులకు పద్యపఠనం ఎలా చేయాలనీ, కావ్యగానం ఎలా చేయాలనీ చెప్పిన సందర్భంలో చెప్పిన పద్యాలను ఆలాపించండి! మయూఖ పాఠకులు వింటారు.

ఇక్కడ దేవకీదేవి గారి పద్యపఠనం

దేవకీదేవి:– ఇప్పుడు  అంటే ఈ మధ్యకాలంలో పత్రికలు ఆన్ లైన్ ( అంతర్జాలం) లోనే ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో దూసుకుపోతున్న పత్రిక  మయూఖ. మరియు ఈ పత్రిక రచయితలతో పాటు  రచయిత్రులందరినీ సమానంగా ప్రోత్సహిస్తున్న పత్రిక! రచయిత్రులకు ఒక ఊతం లాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి తప్పకుండా మయూఖ పత్రికను అభినందించాల్సిందే! ఇందులో నవలలు కూడా సీరియల్స్ గా వేస్తున్నారు. తర్వాత  ముఖాముఖిలు రికార్డింగ్ చేయడం అనేది భావితరాలకు అవసరమైనటువంటిది. ఒక్కో రచయిత ఒక్కో దశలో ఒక్కో ప్రక్రియలో రాణించారు… అని తెలుపుతుంది.

ఇందులో ప్రచురింపబడితే ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. కొందరికి అన్నం ముద్ద నోట్లోకి పోవాలంటే… విస్తరి కావాలి! అంటే మోదుగాకులు అడవి నుండి తెచ్చుకోవాలి, పుల్లలు ఏరుకోవాలి, వాటిని  కుట్టుకోవాలి, బియ్యం సంపాదించుకోవాలి! వాటిని వండుకుంటే అప్పుడు గాని అన్నం బుక్క నోట్లోకి పోదు!  అట్లాంటి జీవితాలున్న వారిని కూడా పరిచయం చేస్తున్నారు కదా అదీ సంతోషం…..

పద్మజ:- మీ విలువైన అభిప్రాయం వెలిబుచ్చినందుకు, అడగగానే ఎక్కువ సమయం గడిచిపోకుండా రచయిత్రిగా మీ సవిస్తరమైన అనుభవాలు, జ్ఞాపకాలు మా పాఠకులతో పంచుకున్నందుకు చాలా సంతోషంతో అనేక  కృతజ్ఞతలండీ!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మత విశ్వాసాలు – అపశృతులు