మత విశ్వాసాలు – అపశృతులు

మొన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో, నిన్న ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో, ఆ ముందు… బోలె బాబా ఆశ్రమంలో
(పాదధూళి కోసం)… చెప్పుకుంటూ పోతే ఎన్నో… గాలిలో కలిసిపోతున్న ప్రాణాలెన్నో? జాగ్రత్తలెన్ని తీసుకున్నా ఇలాంటి అపశ్రుతులెందుకు జరుగుతాయి?
భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న తొక్కిసలాటల్లో అశువులు బాస్తున్న ప్రాణాలెన్నో! ఈ తొక్కిసలాట జరగడమనేది మతసంబంధ కార్యక్రమాలలోనే కాదు, ఫుట్ బాల్ క్రీడా ప్రాంగణాల్లోనూ, సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమాల్లోనూ… ఒక రకంగా చెప్పాలంటే, ఎక్కడైనా జన సందోహమెక్కువగా ఉంటుందనుకున్న ప్రదేశాలలో ఈ తొక్కిసలాట జరగడమనేది సాధారణమై పోయింది. అయినా ప్రజలు, అటువంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరవుతారో ఒకసారి అవలోకిద్దాం.
మత విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమాలలో పుణ్యం సంపాదించుకోవడమే ధ్యేయమైతే, మిగిలిన వాటిలో తమకిష్టమైన బాబాలనో, క్రీడాకారులనో, నటీనటులనో దగ్గర నుండి చూసామని చెప్పుకోవడం కోసం హాజరవుతారు. లింగ, వయోభేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాల నుండి వీటికి హాజరవుతారు. కొంతమంది విశ్వాసంతో వస్తే, మరి కొంతమంది, మేము కూడా ఆ కార్యక్రమానికి వెళ్లామని చెప్పుకోవడానికి… ముఖ్యంగా యువత… వస్తారు.
జనసమ్మర్దం ఎక్కువగా ఉండే కార్యక్రమాలకు ఎంతమంది వస్తారనేది ఇంచుమించుగా లెక్కలు వేసుకుని ప్రభుత్వాలు, తగిన ఏర్పాట్లను చేస్తూనే ఉంటాయి. అయినా విషాదాలు చోటు చేసుకుని, అయినవారికి కన్నీళ్లు మిగిల్చిపోతుంటాయి. వీటిని అరికట్టలేమా?
ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో జరిగిన విషాదం గురించి. భోగి పర్వదినాన మొదలైన ఈ కుంభమేళాలో 15 కోట్ల మంది, జనవరి 28 వరకు గంగాస్నానం చేశారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది హాజరైనా, ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని అందరూ సంతోషిస్తున్న వేళలో, జరగకూడనిదే జరిగి పోయింది. 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనికి కారణాలు ఏమిటన్నది మనం పరిశీలిస్తే, ఒకే ఒక్క విషయం అర్థం అవుతుంది.
ఒకేరోజు, ఒకే సమయానికి, ఒకే స్థలానికి, ఎక్కువ మంది చేరుకోవడం… మహాకుంభ మేళా, పుష్య మాసపు చివరి రోజు, మౌని అమావాస్య, అమృత ఘడియల్లో దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, దానధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే జనవరి 29, మౌని అమావాస్య నాడు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లనే చేసింది. కాని, ఉదయం రెండు గంటల సమయంలో ఒకేసారి భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి, తొక్కిసలాటకు దారి తీసింది. దానికి తోడు చీకటిగా ఉండడంతో, ఏమి జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి… దాంతో కొంతమంది కింద పడి ప్రాణాలు కోల్పోతే, మరి కొంతమంది గాయాల పాలయ్యారు.
12 కిలోమీటర్లు పొడవునా 44 పుష్కర ఘాట్లతో ఉన్న నదీతీరంలో స్నానం చేయకుండా, ఆ ఒక్క ప్రదేశానికే, ఆ సమయంలోనే, ఆ రోజే, వెళ్లాలని అనుకోవడమెందుకు?
మనసా, వాచా, కర్మణా పరిశుద్ధంగా ఉండడం, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం, పరిశుద్ధమైన భావాలుంటే చాలు నన్ను పూజించినట్టేనని, ఇవేవీ లేకుండా చేసిన హోమము, దానము, తపస్సు, మరి ఏ ఇతర క్రియ అయినా ఇహపరాలలో ఫలమివ్వదని, మనం చేసిన కర్మలే మనను అనుసరిస్తాయని గీతాబోధకుడే స్వయముగా అర్జునునితో చెప్పాడని భగవద్గీతలో నేర్చుకుంటూనే ఉంటాం.
పైగా హిందూ శాస్త్రాలలో, ఏ క్రతువు గురించి చెప్పినా అందులో దానధర్మాల ప్రసక్తి ఉంటుంది. దానర్థమేమిటి? అవసరంలో ఉన్న వారిని ఆదుకోమన్న అర్థమే. వీటన్నిటినీ వదిలి, ఆ రోజే, ఆ సమయంలోనే, ఆ త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తే, చేసిన పాపాలన్నీ పోతాయనుకుంటే, భగవంతుడు చెప్పిన కర్మ సిద్ధాంతానికి విలువేమిటి?
అందుకని మనం చేయాల్సిందేమిటంటే, మంచి చెప్పే మత విశ్వాసాలను, బోధనలను అనుసరిద్దాం, ఆచరిద్దాం. చేసిన పాపాలు చేసేసి, ఒక్క స్నానంతో ఆ పాపాలన్నిటినీ కడిగి వేసుకుందామనే మూఢనమ్మకాలను విడిచిపెడదాం. ఈ విషయం అందరూ పాటిస్తే, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమవ్వకుండా ఉంటాయి. అందుకని ప్రజలు కూడా, గుడ్డిగా ఎవరు ఏది చెప్తే అదే నిజమని భ్రమించకుండా, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, జన సాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, వృద్దులు ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం.
అలాగే న్యూస్ చానల్స్, పత్రికా యాజమాన్యాలు మూఢాచారాలను పెంచే వార్తలను ప్రోత్సహించకుండా, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారిలో అవగాహన పెంచే కార్యక్రమాలను చేస్తూ, ధర్మాధర్మ విచక్షణ తెలియజేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తూ, సమాజంలో జరుగుతున్న చెడుని పదే పదే చూపించకుండా, తక్కువ ప్రాధాన్యమిచ్చి, సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ద్వారా, మంచిని ప్రోత్సహించే కార్యక్రమాలను ఒకటికి రెండుసార్లు టెలికాస్ట్ చెయ్యడం ద్వారా, సమాజమూ బాగుపడుతుంది. మన పూర్వీకులు నమ్మిన సనాతన ధర్మమూ పునరుత్తేజమవుతుంది.
అలాగే ప్రభుత్వాలు కూడా, అధిక ప్రాధాన్యం సంతరించుకున్న ఇటువంటి కార్యక్రమాలలో, వి.ఐ.పి. లు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పేరుతో, సామాన్యులను కట్టడి చేసి, వారు వెళ్లగానే ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. అందుకని జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విఐపి ల, రాకపోకలను నియంత్రిస్తే, చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు.
అలాగే, సామాన్య ప్రజల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఏర్పాట్లలో తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, జనసాంద్రత ఎక్కువున్న ప్రదేశాలలో, కఠిన నిబంధనలను అమలు చేస్తూ, సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రజలలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదనే విషయాలపై ముందు నుండి అవగాహన పెంచగలిగితే, ఇటువంటి విషాదాలను అరికట్టవచ్చు. భక్తులకు మధురానుభూతులను మిగిల్చవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు – శ్రద్ధేష్ నందిని..

తిరునగరి దేవకీ దేవి గారితో తరుణి పత్రిక ముఖాముఖి !!