“జీ తరస్తా , హాత్ నహీ పోంఛ్ తా … ” “మనసు తలుస్తుంది. కాని…. చెయ్యి చేరదు”. అనే మాట ప్రసిద్ధి చెందిన మాట. ఇది ధనాన్ని.. వస్తువులను …దానం చేసే విషయంలో కొంతమందిలో కలిగే భావన. దీనికి మూల కారణం పిసినారితనం ఉండవచ్చు. ఎందుకు ఇవ్వాలి లే అనే నిర్లక్ష్య భావమూ ఉండవచ్చు. ఇద్దాం అనుకున్న వ్యక్తి ఇవ్వబోతున్నప్పుడు అర్హత లేదు అనిపిస్తే కూడా ఇవ్వకపోవచ్చు.
కానీ పై సామెత మాత్రం ఇవ్వాలనే మనసు లేని వాళ్ళని గురించి చెప్పిందే. అయితే ఇక్కడ దానగుణం గురించి చెప్తూ అందులోనూ జ్ఞాన దానం గురించి చెప్తున్నప్పుడు జ్ఞానం ఇతరులకు ఎంత పంచితే అంత మనకు చేరుతుంది అనే మంచి మాట కూడా గుర్తు రావాలి. జ్ఞానదానం భావం ప్రస్ఫుటిస్తుంది.
జ్ఞానం అంటే ఏంటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఒక ఆచరణాత్మకమైన మెటాకాగ్నిషన్ జ్ఞానం. అంటే ధ్యానం అంత గొప్పది… సమాచార విజ్ఞానయానమంత గొప్పది.. జ్ఞాపకశక్తితో వ్యూహాలను తెలుసుకోవడానికి ఉపయోగించే మాట, సమస్య పరిష్కారానికి కావలసిన స్వీయ నిర్దేశిత అభ్యాసం అనవచ్చు.
పరుగు పందెం లో ఉన్న మనిషికి మనం గెలుస్తామా ఓడుతామా అనే ఊహ .. జ్ఞానం ..ఉంటుంది. అదే ఒక గుర్రం పరుగు పందెంలో పరిగెడుతూ ఉంటే.. దానికి గెలుపు ఓటముల విషయం బోధపడదు. అంటే ఆ విషయ స్పృహ లేదు జ్ఞానం లేదు. నమ్మకము విశ్వాసము వంటి భావాలు మనిషికి ఉంటాయి. అలాగే,జంతువులకు కూడా ఓ విశేషమైన గ్రహణ శక్తి ఉంటుంది. వాస్తవాస్తవాల పరిజ్ఞానం కలిగి ఉండడం హేతుబద్ధమైన అంతర్దృష్టి కలిగి ఉండడం శాస్త్ర విజ్ఞానం పట్ల నమ్మకమం,గురి కలిగి ఉండడం, చారిత్రక దృష్టి కోణంలో ఆలోచించగలగడం వంటివన్నీ
ధ్యానానికి సంబంధించినవే. న్యూట్రియన్స్ న్యూట్రాన్స్ అంటే ఏంటో శాస్త్ర జ్ఞానం కలిగి ఉండడం, పరిమాణాత్మక పరిశోధనా జ్ఞానం లేకున్నా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకున్నా, గణిత శాస్త్రం ,సామాజిక శాస్త్రం , మానవ శాస్త్రం తెలియకపోయినా కొన్ని గుణాత్మకమైన విషయాల జ్ఞానాలు ప్రతి వ్యక్తి లోపల ఉంటాయి.
ఈ జ్ఞాన పరిజ్ఞాన గుణాత్మక విషయాల విషయం కంటే ముఖ్యంగా మనిషి లోపల మనిషిని అనే తత్వం ఉంటే ఈ విజ్ఞానం అంతా సఫలీకృతమైనట్టే.
” శ్రేయో హి జ్ఞానం అభ్యాసాద్ జ్ఞానాద్ ధ్యానం శిష్యతే” యాంత్రిక అభ్యాసం కంటే జ్ఞానాన్ని సంపాదించడం ఉత్తమం అనే భావం ఉన్న ఈ శ్లోకాన్ని తలచుకుప్పుడు భౌతిక పురోగతి ఆధ్యాత్మిక పురోగతుల విషయాన్ని గ్రహింపుకు తెస్తుంది .
వ్యక్తిత్వ వికాసం గురించో, మానవ జీవన వికాసం గురించో అన్యులైనా మాన్యులు చెబుతూనే ఉంటారు. జ్ఞానాన్ని తమ దగ్గర దాచుకోరు. తాము నేర్చుకోవడం కన్నానూ ఇతరులకు నేర్పిస్తూ తాను వదులుకోవడంలోనూ గొప్పతనం ఉంటుంది. జాతి పునరుజ్జీవనమూ, జాతి పురోగమనమూ ఒడిసిపట్టినప్పుడే ఎల్లకాలం నిలుస్తుంది జ్ఞానం. ఇది వస్తువు కాదు .
ప్రవాహం లా కదులుతూ ఉంటుంది. కాబట్టి తెలిసిన మంచి విషయాలు పంచుకోవాలి. నలుగురికి జ్ఞానాన్ని పంచుతూ స్వీయ చైతన్యాన్ని పెంచుకోవాలి. ఋతువులతోపాటు మనము నడుస్తుంటాం. వసంత రుతు ప్రారంభమవుతూ ఉన్న ఫిబ్రవరి నెల ప్రత్యేకమైన నెల. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం జనవరిలో 30 రోజులు గడిచిన తర్వాత గడిపిన క్షణాలను మననం చేసుకోవడానికి ముఖ్యమైన నెల ఫిబ్రవరి. మానవజాతి ఆరోగ్య ప్రదాయి గా చెప్పుకునే వృక్షం ప్రాముఖ్యతను గుర్తు చేసేలా World wetlands Day ఉంటుంది అని గుర్తు చేసుకోవాలి. ఎ డే టు రైజ్ అవేర్నెస్ తెలుస్తుంది. గ్రౌండ్ హాగ్ డే ప్రాముఖ్యత కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే చిత్తడి నేల జ్ఞానం ఉంటుందని తెలుసుకోవాలి తెలియజేయాలి. అంటే మరేం లేదు ప్రమాదకరమైన విషయాలను తొలగించి వేయడానికో లేదా వ్యర్ధాలను నియంత్రించడానికో నిర్ణయించుకునే స్వీయ ఒప్పందం. నేలపై ఎంత చిత్తడి! మనసులలో ఎంత చిత్తడి!! శీతాకాలపు చివరి
రోజులు.చలి…చలి … అనే రోజులతో పెరిగిన క్రిమి కీటకాల చిత్తడి తగ్గిపోయి అప్పుడప్పుడే వస్తున్న ఎండల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కొత్త మార్గంలో పయనింప చేస్తుంది ఫిబ్రవరి. అందుకే తమదైన ఒక సాధారణ అంగీకారాన్ని తెలిపేలా ఎవరికి వాళ్లు ప్రకృతిని కాపాడుకునేలా మనస్ఫూర్తిగా నిర్ణయాన్ని సుస్థిరం చేసుకోవాలి. చేస్తున్న పనులపై శ్రద్ధ పెరగాలి . నాలుగువేళ్ళు నోట్లోకి వెళ్ళగలుగుతున్న ఒకానొక ఉద్యోగ సాయమైనా..వ్యాపార సాయమైనా ఒక పద్ధతిలో తనను తాను నియంత్రించుకోవడమనేది ఓ జాతీయ అవసరం. సహజమైన విధివిధానాలను తెలుసుకోవడం, శాస్త్రీయ భావనలతో నడుచుకోవడం ప్రకృతి సంభావిత వ్యవస్థను నిర్మించుకోవడం ముఖ్యమైనవి. ఇట్లా నడుచుకోవడం వలన అభివృద్ధి సిద్ధాంతాలను ఏకీకృతం చేయడానికి, నిర్మాణాత్మక ప్రక్రియలు చేయబట్టడానికి ఒక తాత్విక ధోరణితో లౌకిక స్వభావంతో తమలోని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రకృతిని కాపాడడం తద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేది తను పాటించడం ఇతరులకు చెప్పడం అనేదీ జ్ఞాన దానం చేయడమే. ఇట్లా చెప్పడం వలన పర్యావరణాన్ని రక్షించుకునే వాళ్లమవుతాం. అభ్యాసం , ప్రవర్తన ఈ రెండు కూడా జంతువులలోనూ ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. అటువంటి సందర్భంలో మనుషులుగా మనపై ఎంత బాధ్యత ఉందో కదా! పరిశుభ్రత పాటించకుండా ఉండవద్దని, అనారోగ్య పరిస్థితులను తెచ్చుకోవద్దనీ, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనైనా ప్రకృతికి హాని కలిగించవద్దని ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి , నలుగురితో పంచుకోవాలి. మనస్సు తలవాలి… చెయ్యి కదలాలి….! ఇదే జ్ఞాన దానం!
____****____