కుటుంబ వ్యవస్థ యొక్క విలువలు, మానవ సంబంధాల మాధుర్యాలను పునస్మరిస్తూ కవితా కుసుమాలతో కూర్చిన కవితా సంపుటి కవన కుసుమాలని ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు అన్నారు. ఫిబ్రవరి 2 ఆదివారం రోజున గుండవరపు హనుమంతరావు కళావేదిక త్యాగరాయ గాన సభ చిక్కడపల్లిలో భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సాహిత్య సభకు హాజరై డాక్టర్ అన్నమరాజు సుమాల్య రచించిన కవన కుసుమాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి ఆరాధన, సామాజిక విలువలతో కూడిన కవితలతో రచించిన కవన కుసుమాలు అలతి పదాలతో కూడి చక్కని భావుకతతో పాఠకులను ఆకట్టుకుంటాయని అన్నారు.పండిత వంశాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకున్న అన్నమరాజు సుమాల్య చక్కని కవిత్వం అందించారని అభినందించారు. విశిష్ట అతిథిగా హాజరైన పద్యభాషి డాక్టర్ రాధశ్రీ మాట్లాడుతూ సుమాల్య గారి కవిత్వం సరళమై, సుబోధకమే అందరి హృదయాలను అలరిస్తుందని తెలిపారు . ప్రముఖ కవి చౌడూరి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు చౌడూరి నరసింహారావు కవన కుసుమాలు పుస్తకాన్ని సమీక్షించగా కవి, రచయిత లోడె రాములు వేదిక పైకి అతిథులను ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి గంప ఉమాపతి ఆధ్వర్యంలో చౌడూరి నరసింహారావు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించబడింది కవితలను ఆలపించిన కవులను సర్టిఫికెట్, శాలువా మెమొంటోలతో ఈసందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో కవులు సాహిత్య అభిమానులు పండితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.