కొడుకు సునీల్ అత్తగారూ, మామగారూ వచ్చి అప్పుడే దగ్గర దగ్గర నెల రోజులు కావస్తోంది. అయినా తిరుగు ప్రయాణం మాటే కనబడడం లేదు. ఏంటో ఎంత ఉద్యోగం చేసి సంపాయిస్తున్న కూతురైతే మాత్రం అల్లుడింట్లో అంతలా తిష్ఠ వేసుక్కూర్చోవడానికి వాళ్ళకి ఏమీ అనిపించదా? పైగా అల్లుడి తల్లీ తండ్రీ ఇద్దరూ పెద్ద తలకాయలే… మనం వాళ్ళ కాళ్ళకి అడ్డంగా ఉండడం భావ్యం కాదనే ఇంగితం ఉండక్కరలా…..? ఏమిటో పిదపకాలం పిదప బుద్ధులూనూ..! అయినా ఎవరినని ఏం లాభం? మన బంగారం మంచిదయితే ఊళ్ళోవాళ్ళని అనుకునే అగత్యం ఎందుకూ…..ఇలా సాగిపోతున్నాయి అరుణ ఆలోచనలు. ఇంతలో భర్త ఆనందరావు పిలుపుతో అటుకేసి అడుగులు వేసింది.
***
ఆనందరావు దంపతులకు ముచ్చటగా ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు సునీల్ భార్య సుమ. సునీల్ సాఫ్టువేర్ ఇంజనీరు. సుమ కంప్యూటర్ సైన్స్ చేసింది. ఇద్దరూ బధ్యతాయుత పోస్టుల్లో ఉన్నారు.
చిన్న కొడుకు సుధీర్ గుంటూరులో భార్యతోపాటు ఉంటున్నాడు. అతను కూడ ఓ ఉన్నత పదవిలో ఉన్నాడు. కూతురు సుకేశిని ఎమ్.కామ్. వివాహం అయి భర్తతో యూ.ఎస్ లో సెటిల్ అయిపోయింది.
సుమ ఉద్యోగస్తురాలు కావడంచేత ఉదయం వెళ్తే సాయంకాలం కానీ ఇంటికి రాలేదు. మామూలుగా తనే వంటా అదీ చేసి ఆఫీసుకి వెళ్ళినా తల్లితండ్రులు వచ్చాక బాధ్యత అంతా తల్లిమీదే పడేసి తాను రెడీ అయి ఆఫీసుకి వెళ్ళిపోతోంది. అరుణ మాత్రం, కొంత వయసు, మరికొంత వియ్యపురాలి హోదా చూపించాలన్న సాకు కారణంచేత ఆ తంటా ఏదోవియ్యపురాలినేపడనిమ్మని తాను మాత్రం టీవీ వీక్షణమో లేక భర్తతోనో కాలక్షేపం చేసేస్తోంది. అయినా ఆవిడకు ఏదో అసంతృప్తి….ఈ వియ్యాలవారిని ఇంట్లో పెట్టుకుని తేరగా పోషించాల్సివస్తోందేనని అహంభావం తలెత్తుతూ ఉంటుంది ఆమెకు. రోజులు గడుస్తున్నాయి………!
***
ఆ రోజు ఉదయాన్నే సుమ తండ్రి దయానంద్ బాత్రూంలో అనుకోకుండా జారి పడడంతో ఇంటిల్లిపాతీ కంగారు పడ్డారు. ఆయన్ని అల్లుడు సునీలే లేవనెత్తి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఎలాగోలా ఆయనచేత బ్రేక్‌ఫాస్ట్ తినిపించి, హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. అక్కడ ఎక్స్‌రేలు ఇతర అక్కర్లేని టెస్ట్‌లు అవీ చేయించాక తుంటి బోన్ ఫ్రాక్షర్ అయిందని డాక్టర్లు చెప్పారు. అంతేనా ఒకరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక చూసి సర్జరీ అవసరమా లేదా చెప్తామని చెప్పారు. అందుకు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసి, హడావిడిగా ఇంటికి వచ్చిన సునీల్, రెడీ అయి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. సుమ మాత్రం తల్లికి తోడుగా ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి వంటా వార్పూ చూసుకోవడం మొదలు పెట్టింది.
మధ్యాహ్నం అవుతుండగా వంట ముగించి, తల్లికీ తండ్రికీ భోజనం తీసుకుని వెళ్ళివస్తానని అత్తగారికి చెప్పి హాస్పిటల్‌కి
బయలుదేరింది సుమ.
ఇదే సమయం అనుకుని కోడలు అటు వెళ్ళగానే తలుపులు వేసి తన గదిలోకి వచ్చింది అరుణ. ఆకలేస్తున్నట్లుంది కాబోలు భర్త తన పిలుపుకోసం ఎదురుచూస్తున్నాడు. ఉరుమురిమి మంగలం మీద పడ్డట్లు అరుణకి తన అక్కసు ఎవరిమీద తీర్చుకోవాలో తెలీక భర్తని టార్గెట్ చేస్తూ ఇలా అంది ” చూసారా చూసారా…. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో అవుతుందని, అసలే వీళ్ళు కదలడం లేదేమిట్రాని నేననుకుంటుంటే, చూడండి ఏమైందో? మూలిగే నక్కమీద తాటికాయ పడడం అంటే ఇదే….హు నేనేమన్నా మీకు మాత్రం చీమ కుట్టినట్టుకూడ ఉండదు.” ” ఇప్పడేమైంది?” అన్నాడు తాపీగా ఆనందరావు.
” ఇంకా ఏమవ్వాలి? ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? మీరిలా అన్నింటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండబట్టే వ్యవహారం
ఇంతదాకా వచ్చింది. ఇంకా ఏమవ్వాలండీ…??? మీ వియ్యంకుడుగారు భార్యతోసహా నెల రోజులనుంచీ తిష్ఠ వేసినందుకే నేను చిరాకు పడుతుంటే ఇప్పుడు ఆయనగారు హాస్పటల్ పాలయ్యాడు. ఇప్పుడు ఆ విరిగిన బోన్ అతుక్కోవడానికీ, ఆయన పూర్తిగా నార్మల్ అవడానికి కొన్ని నెలలైనా పడుతుంది. అప్పటిదాకా మనం రాంభజనే…. ఏం చేస్తాం… ఖర్మ ఖర్మ…. అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.
” అయితే నన్నేం చేయమంటావు అరుణా” అన్నాడు ఆనందరావు విస్తుపోతూ…!
మళ్ళీ అందుకుంది అరుణ ” ఏం చేయమంటావంటారేంటీ…. మీరు తలుచుకుంటే అన్నీ చేయగలరు. ఏం అన్నిటికీ అలా మౌనంగా చూస్తూ ఊరుకోకపోతే, ఇంటికి పెద్దగా ఓ మాట అబ్బాయితో అంటే మీ సొమ్మేం పోతుంది? కాస్త వాడితో అరేయ్ ఏంటీ మీ అత్తగారూ, మామగారూ అలా రోజులతరబడి మనింట్లో మకాం వేస్తుంటే ఏం బావుంటుందిరా…? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అని కాస్త బుద్ధి చెప్పొచ్చుకదా…..?”
” అదికాదు అరుణా నువ్వనుకుంటున్నట్లు చేసే ఆ రోజులు పోయాయి. మనకి కొడుకు మీద ఎంత హక్కుందో ఈ రోజులలో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా స్వతంత్రురాలైన కూతురి మీద కూడ తల్లి తండ్రులకు అంతే హక్కుంది.ఎక్కువ మాట్లాడావంటే అమ్మాయి విడాకులు తీసుకుని ఎంచక్కా దర్జాగా తల్లినీ తండ్రినీ పోషించుకోగలదు. అందుకే అబ్బాయి తల్లితండ్రులుగా మనం కాస్త సర్దుకుపోవాలి. మాటి మాటికీ తేరగా పడి తింటున్నారనేముందు కాస్త వెనకా ముందూ కూడ ఆలోచించాలి. అందుకే ఆ రోజులలో పిల్లనిచ్చుకున్న తల్లితండ్రులు వియ్యాలవారి ముందు ఒదిగి ఒదిగి ఉండేవారు. కానీ ఇప్పుడా అగత్యం వారికి లేదు” అన్నాడు శాంతంగానే…!
” అయితేమాత్రం మనసాంప్రదాయం, అనాదిగా వస్తున్న నమ్మకాలూ అన్నీ ఎలా మరిచి పోతామండీ! ఆడపిల్ల సొమ్ము తినకూడదని మనకు తరాలనుంచీ బోధింపబడుతూ వచ్చింది. మనతెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లో అయితే ఈ విషయాన్ని ఎంతో సీరియస్‌గా పాటిస్తారు తెలుసా! ఇప్పటికీ అక్కడ ఆడపిల్ల ఇంట్లో పచ్చి మంచినీళ్ళుకూడ ముట్టని వాళ్ళు ఉన్నారు నార్త్ లో. వాళ్ళసలు కూతురింట్లో దిగనుకూడ దిగరు. ఏ హోటల్లోనో లేక బంధువుల ఇంట్లోనో దిగుతారు. అందుకే ఈ విషయంలో మాత్రం మీతో నేను ఏకీభవించలేను సుమండీ…!” హాట్ హాట్‌గా జవాబిచ్చింది అరుణ.
” అది కాదోయ్ కూతురింట్లో ఉండటం వాళ్ళకు మాత్రం బాగుంటుందా? ఏదో మన అబ్బాయి కూడ ఆ మాత్రం చనువివ్వబట్టి కానీ వాళ్ళకి మాత్రం పరాయి ఇంట్లో ఫ్రీగా ఉంటుందా అరుణా! వాళ్ళేదో నాలుగు రోజులకి బదులు మరో నాలుగు రోజులు కూతురుతోనూ అల్లుడితోనూ సరదాగా కాలక్షేపం చేద్దామని ఉండిపోయి ఉండవచ్చుకదా…..ఇంతలోనే ఈ ఉపద్రవం ముంచుకొస్తుందని వాళ్ళు మాత్రం అనుకున్నారా..? అంతా దైవలీల అరుణా! కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. అందుకే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం కొంచం మానవత్వం చూపించాలోయ్! అంతేకానీ ఓ ఊరికే ఆవేశపడి నోరు పారేసుకుంటే ఎలా చెప్పు?” అన్నాడు కాస్త అనునయంగా.
” నాకు తెలుసులెండి మీరెప్పుడూ ఇంతే…. ఏవో నాలుగు మాయ మాటలు చెప్పి నా నోరు మూయించడం మాత్రం బాగా తెలుసు….అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది ఎవరో బెల్ రింగ్ చేయడంతో.
***
ఆ పట్టున కోడలు సుమ నాన్నగారికి తుంటికి సర్జరీ అయి ఆ తరువాత కన్వాలసన్స్ అంటూ పూర్తిగా కోలుకోవడానికి ఆల్మోస్ట్ రెండు నెలలు పట్టింది. ఆ వ్యవధి అంతా అరుణ ముళ్ళమీద ఉన్నట్లే గడిపింది. ఎప్పుడెప్పుడు వాళ్ళు వెళ్తారా ఎప్పుడెప్పుడు హాయిగా తన సామ్రాజ్యాన్ని ఒక్కత్తే ఏలుకుందామా అని రెస్ట్ లెస్‌గా గడిపింది. ఆ రోజు రానే వచ్చింది. వియ్యంకుడూ, వియ్యపురాలూ వెళ్తూ వెళ్తూ అల్లుడు సునీల్‌కు, ఆనందరావు దంపతులకూ, ఇన్నాళ్ళూ ఇంత బాగా తమను చూసుకున్నందుకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
దాన్దేముంది బావగారూ మనం ఏమైనా పరాయివాళ్ళమా? కష్టం వచ్చినప్పుడు ఒకరి కొకరం సహాయం చేసు కోకపోతే ఎలా? ఇంటికి వెళ్ళాక జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళా ఇలాంటి అనుభవాలు ఎదురుకాకుండా ఈ సంఘటన మనందరికీ కనువిప్పు కావాలి ” అంటూ సాదరంగా సాగనంపాడు ఆనందరావు.
కానీ అరుణ పైకి ఏదో మర్యాదకి మాట్లాడిందేగానీ లోలోపల ఆమెకు అసహనంగానే ఉంది. భర్త మాట్లాడినంత స్వచ్ఛంగా తాను మాట్లాడలేకపోయింది. కొడుకూ, కోడలూ వారిని సాగనంపటానికి, కూడ వెళ్ళారు.
***
ఆ మర్నాడు కొడుకూ, కోడలూ ఆఫీసులకి వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది అరుణకి. నిజానికది అరుణ ఊహించనిది. ముఖ్యంగా సుమ తల్లి ఎప్పుడూ ఏదొకటి మాట్లాడుతూ అందరితో సరదాగా కలివిడిగా ఉండేదేమో ఆమె లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడసాగింది అరుణకి. ఇంక ఊరుకోలేక భర్తతో అంది, ” ఏమండీ ఏమిటో వాళ్ళున్నప్పుడంతా అలా ఆలోచించానేగానీ నిజానికి వాళ్ళుంటే ఇల్లు ఎంతో నిండుగా కళకళలాడుతూండేది కదండీ…. ఇప్పుడు చూడండి ఇల్లంతా ఖాళీ ఖాళీగా లేదూ…!” అన్నది. ఆనందరావుకూడ అరుణతో ఏకీభవించకుండా ఉండలేక పోయాడు.
***
ఇది జరిగిన కొన్నాళ్ళకు అరుణ ఓ రోజు ఎవరికీ బాగాలేదంటే చూడటానికి వెళ్ళివచ్చింది. వెళ్ళడం అయితే వెళ్ళిందిగానీ అక్కడినుంచి వచ్చిన మర్నాడే అరుణకికూడ జ్వరం వచ్చింది. ఆ ఫ్రెండ్ దగ్గరినుంచే తనకుకూడ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని ఇంట్లో అందరూ అనుకున్నారు. అరుణకు ఆ మరునాడుకూడ హై ఫీవర్ ఉండడంతో అత్తగారిని చూసుకునేందుకు సుమ సెలవు పెట్టింది. భర్త సునీల్కూడ సెలవు పెడ్తానంటే వద్దని వారించింది. అంతా నే చూసుకుంటాగా నువ్వు వెళ్ళు సునీల్ అని పంపేసింది. ఇంతక్రితంవరకూ భర్తను అలా ఏకవచనంతో సంబోధిస్తుంటే కోడలివంక అదోలా చూసిన అరుణకు ఈ రోజు ఆ పిలుపులో ఎంతో ఆత్మీయత మన అనే భావన కనపడ్డాయి. ఆహా కోడలికి తమ కొడుకు మీద ఎంత ప్రేమ అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది.
ఆ వచ్చిన జ్వరం అరుణని వారం రోజులు పడక వేసేలా చేసింది. ఆ వారం రోజులూ అత్తగారిని కంటికి రెప్పలా చూసుకుంది సుమ. సునీల్ కూడ భార్యకి సహాయంగా ఆఫీసుకి సెలవుపెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. తనకు సుస్తీ చేస్తే చేసిందిగానీ ఈ వంకనన్నా కొడుకూ కోడలూ ముచ్చటగా కళ్ళముందు కళకళలాడుతూ తిరుగుతుంటే చూసి ఆనందించే భాగ్యం కలిగిందని అనుకోసాగింది అరుణ. ఇంతటి సంస్కారవంతురాలైన కోడలిగరించీ ఆమె తల్లి తండ్రుల గురించా తను అంత నీచంగా ఆలోచించింది….! మనస్సులో ఎక్కడో ఓ మూల పశ్చాత్తాపం….! ఇక ఆగలేక ఆ భావనని భర్తకి ట్రాన్స్ఫర్ చేసింది.
” ఇందులో నీ తప్పేం లేదు అరుణా! అనాదిగా మనది పురుషాధిక్య సమాజం కావడం వల్ల ఇటువంటి సంకుచిత భావాలు తరతరాలకు అందించబడ్డాయి. అందుచేత నీ పట్టాలు గాడి తప్పాయి. అది తాత్కాలికమే సుమా..! కాకపోతే నువ్వు స్వతహాగా మంచిదానివి కాబట్టి నీలో ఈ మార్పు త్వరగానే వచ్చింది. అందులోనూ కాస్తో కూస్తో చదువు సంస్కారం ఉన్న దానివి. ఆ మాటకిస్తే ప్రతీ మనిషీ స్వతహాగా మంచివాడే… కాకపోతే పరిస్థితులు అతనిని చెడ్డవాడిగానో లేక మంచివాడిగానో మారుస్తాయి.
అంతెందుకు పూర్వం కూతురి అత్తింటి వారికి అడుగులకి మడుగులొత్తి వందనార్చనాలు చేసేవారు. ఎందుకంటే ఆ రోజులలో ఇలా స్త్రీలు ఉద్యోగాలు చేయడం, తమ కాళ్ళమీద నిలబడడం అవేవీ ఎరగం. అందుకని ఆ అలుసు చూసుకుని పిల్లవాడ్ని కన్న తల్లి తండ్రులు ఎంతో డాబు దర్పం చూపించేవారు. ఆడ పిల్ల తల్లి తండ్రులను హీనంగా చూసేవారంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ రోజులలో ఆ పప్పులేని ఉడకవు. అందుకని ఇరుపక్షాలవారూ గౌరవం, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అసలు పెళ్ళంటే ఇరు కుటుంబాల కలయిక. దాన్ని సార్థకం చేసేటట్లు మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన దేశంలోని ఈ కుటుంబ వ్యవస్థ కలకాలం బతికి బట్టకడుతుంది. లేకపోతే విచ్ఛిన్నం కాక తప్పదు. నువ్వు చాలా ఈజీగానే నీ తప్పు తెలుసుకున్నావు సంతోషం…..!” అని భార్యవైపు చూసి ఓ చిరునవ్వు నవ్వాడు ఆనందరావు.