సంక్రాంతి పండగ మూడురోజుల సంతోషాల సంరంభం.
అంబరాన్నంటే ఆనందాల వెల్లువ.
మకరరాశిలోకి సూర్యభగవానుని ప్రవేశం,
ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం.
అనువైన కాలం దానధర్మాలకు, పుణ్య కార్యాలకు.
మోక్షమందించే కాలం మానవాళికి.
అక్షయపాత్రతో హరిదాసుల ఆగమనం
హరిలో రంగ హరి అంటూ చిరుతలతో
ధనధాన్యాలు దానంచేసే జనం కృష్ణార్పణం అంటూ,
ఆ శ్రీహరియే తమ ఇంటికి వచ్చాడని.
గంగిరెద్దులవాళ్ళు ప్రత్యక్షం తమ డూడూబసవన్నలతో .
వారు సంతసించి మన భిక్షకు
అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు
అని ఆటలు ఆడిస్తూ,
పిల్లా పాపలతో చల్లగా ఉండాలి, ధనధాన్యాలతో
అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ తిరుగుతారు ఊరూరా.
పంటసిరులతో నిండిపోయి కళకళలాడే లోగిళ్ళు.
తమ కష్టాన్ని మరచి ఆనందంతో పొంగిపోయే రైతన్నలు.
నలుమూలల నుండి చేరుకుంటారు
జనం తమ సొంత గూళ్ళకు.
సంక్రాంతి పండగ తనవారితో అనందంగా జరుపుకోవాలని.
సంవత్సరం పాటు తాము పడ్డ కష్టాలు, బాధలు మరచిపోవాలని.
నింగిలోని ఇంద్రధనుసు నేలపై విరిసినట్లు,
ఇంటిముంగిట వర్ణరంజితమై వెలిసే రంగవల్లులు.
నవధాన్యాలే నైవేద్యంగా, సుమరాణులతో అలంకరింపబడిన
ఆదిలక్ష్మి రూపాలైన గొబ్బిళ్ళు రంగవల్లుల్లో.
ఆటలు ఆడుతూ,పాటలు పాడుతూ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతారు అతివలు.
భోగిమంటలు వెయ్యడం,పసిపిల్లలకి భోగిపళ్ళు పొయ్యడం,
బొమ్మలకొలువు పెట్టడం భోగిరోజు.
పిండివంటలు, పూజలు , దానధర్మాలు చెయ్యడం సంక్రాంతి రోజు.
తమ కష్టంలో పాలుపంచుకున్న పశువులను పూజించడం
రైతన్నలు కనుమ రోజు.
పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేయడం ఉత్సాహంగా.
విందులు, వినోదాలతో గడపడం ఆనందంగా.
సంక్రాంతి పండగ అంటే మనసులో ఉప్పొంగే సంతోషాల సంద్రం,
విరిసే ఆనందాల హరివిల్లు.
సంక్రాంతి శుభాకాంక్షలతో.