భూక్యా తన తండ్రీ తమ్ముడూ గోటీలుగా వెళ్లారని ఎక్కువగా కుంగిపోలేదు. అధిక భాగం పంట నూర్చి, ఇంటికి చేర్చి, భద్రపరచబడినది. ఇంకా కొద్ది భాగం పంట పొలాలలో మిగిలింది. ఇంకా కొన్ని దుంపలు నవంబర్లో తవ్వాల్సి ఉన్నది. కొంత మొక్క జొన్నచేను కూడా ఉన్నది. ఇంటిముందున్న పెరటి తోటలో అడవి తీగలతో కంచె కట్టి ఉన్నది. అందులో ఎర్రటిమిరప పండ్ల కోసం అడవి నుండి మైనా పిట్టలు, నెమళ్ళు వస్తున్నాయి. సాలీ జాగ్రత్తగా కర్రతో వాటిని తోలు తుంది. ఒక దొండ తీగ ఇంటి పైన వెదురు బొంగు లపై విస్తారంగా పాకింది నూనూగు పిందెలు ఆకుల నుండి తొంగిచూస్తున్నాయి. భూక్యా ఇంటి చుట్టూ తిరిగి పరిశీలించినప్పుడు అవి కనిపిస్తాయి.
అతడు తన తండ్రి నుండి ఉల్లాసవంతమైన స్వభావాన్ని ఆశావహంగా జీవించడాన్ని నేర్చుకున్నాడు.
అతడు వరి పొలాలపై చూపు సారించి ఇంకొక నెలయితే పంట నూర్పుకి వస్తుందని అనుకున్నాడు. అతని పొలాలు గ్రామంలో అందరి పొలాల కంటే సారవంతమైనవి. కుటుంబ అవసరాలకు చాలినంత దిగుబడినిస్తాయి. మిగిలిన భాగంలో
అనేక రకాల చిరుధాన్యాలు కూడా పండించవచ్చు.
జనవరి నెలలో గ్రామమంతా హడావిడిగా ఉంది. పంట నూర్పిడి సరి అయిన సమయం. వరి, మాండ్యా(రాగులు), అవిసె, సువాన్, కందులు వంటి పంటలు నూర్చి ఇంటికి చేరుస్తారు. కాబట్టి గ్రామస్తులంతా సూర్యోదయానికి కంటే ముందే పొలాలకు చేరుతారు. ఎవరు విరామంగా కనబడరు. భూక్యా కూడా పనిలో నిమగ్నమై ఉన్నాడు, తమ సమస్యల గురించి ఆలోచనలతో. అతడు తన పొలంలో మిగిలిన పంటను సేకరిస్తున్నప్పుడు తమ ఊరి యువతులు వాగు వద్ద కనిపించారు. నోటిలో పండ్ల పుల్లలను నములుతూ నడుస్తున్న వారిలో ఏదో ఆకర్షణ ఉంది. పొలం పక్క నుండి పోతున్న వారిని ఓరగంట గమనిస్తూ ఉన్నాడు అతడు. కొందరు బట్టలు ఉతకడానికి కొందరు అడవి నుండి తెచ్చిన ఆకులను దుంపలను వన్డే ముందు కడగడానికి, కొందరు నీళ్ల కోసం కుండలను పట్టుకొని నడుస్తున్నారు.
కొన్నిసార్లు వాళ్లలో కమిలీ కూడా తనకిష్టమైన ఎరుపు నీలం గీతల చీర కట్టుకొని కనిపించేది. ఆమె కాళ్ళు అనచ్ఛాదితంగా తొడల వరకు కనిపించేవి, అందరూ పరజ స్త్రీల లాగే ఆమె నల్లటి కురులలో ఎర్రటి పువ్వులను పెట్టుకునేది. సూర్యకాంతిలో మెరుస్తున్న ఆమె ముఖాన్ని చూస్తూ చూపు తిప్పుకోలేక పోయేవాడు. ఆమె కనుమరుగు అయ్యేవరకు చూస్తూ ఉండేవాడు.
పక్క పొలంలో కూలీలు కోరస్ గా పాడుతున్నప్పుడు వారి పాటలో హెచ్చుతగ్గుల కంపనాలు, అతనిని ఆలోచనల్లో ముంచెత్తేవి. త్వరలో పంట ఇంటికి చేరుతుంది. కొంత ధాన్యాన్ని అమ్మి కమిలీ వాళ్ళ నాన్నకు పెళ్లి కూతురుకి ఇచ్చే ధనాన్ని (కన్యాశుల్కాన్ని) ఇచ్చి ఆమెను ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్నాడు.
అతడు తన వరి పొలాల పై చూపు సారించాడు. ఇరువైపుల బంగారు రంగులో అలలుగా కదులుతున్న పంటపొలాలను చూసుకున్నాడు. పొలాల అవతల కొండలు గుహలతో అడవి విస్తరించి ఉన్నది. కనుచూపుమేర ఆ దృశ్యం నీలం నలుపు ఆకుపచ్చ వర్ణాలతో చిత్రకారుడు గీసిన చిత్రం వలె ఉన్నది. ఆ వరి పొలాలన్నీ తమ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చినవి. తరతరాల నుండి అతని తాత ముత్తాతల ప్రేమతో చెమట స్పర్శతో తడిసి ఆ నేలంతా మృదువుగా మారింది. భూక్యాకు అది కేవలం భూమి చెక్క మాత్రమే కాదు. అతని గత తరాల చరిత్రకు సజీవ సాక్ష్యం. అతని పూర్వీకుల కష్టసుఖాల, ఆచార వ్యవహారాల మార్పుల కథల సంపుటి. ముందు తరాల వారు, రాబోయే తరాల వారికోసం చనిపోయిన వారి భస్మాలు నీళ్లలో కలిసి విత్తనాలుగా మొలకెత్తి భవిష్యత్ తరాలకు వసంతాన్ని అందిస్తాయి, అని అనుకుంటాడు భూక్యా.
అంతలోనే ఒక్కసారిగా అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఒక ఊహ నిండిపోతుంది. అతని అంతరంగం అంతవరకు ఉన్న దృశ్యాన్ని రహస్యంగా కిందకు జార్చి వరి పొలాల వెనుక కమిలీ ఊహ వచ్చి నిలబడుతుంది. అతని పంట పొలం, అతని ప్రేయసి కమిలీ – ఇల్లంతా వరిధాన్యంతో, మనసంతా కమిలీ నిండిపోతుంది. ఎడతెగని ఊహలతో భూక్యా మనసులో కమిలీ నిండుతుంది..
*** *** *** *** ***
కొన్నిసార్లు పని ఎక్కువై రాత్రి ఆలస్యం అయినప్పుడు సోమ్లా, టిక్యా ఇంటికి తిరిగి వెళ్లలేరు. అటువంటప్పుడు షావుకారు ఇంటిదగ్గర పడుకొని తెల్లవారి మళ్ళీ పనిలోకి వెళ్తారు అచ్చంగా తమ ఇళ్లలో నిద్ర లేవగానే చేసినట్టుగా. కొన్నిసార్లు షావుకారు తన పశువులను మేపడానికి అడవికి పంపేవాడు. కొందరిని అడవిలో యజమాని కోసం చెట్లు నరికేందుకు పంపేవాడు.
షావుకారు తన గుర్రపు తట్టుపై ప్రయాణిస్తూ, తన గోటీలు అందరూ సరిగా పని చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించే వాడు. అతడు ఇస్తున్న డబ్బుకు సరిపడా శ్రమ చేస్తున్నారా లేదా అని అతని భయం. కానీ గోటిలకది ఫలితం లేని సేవ. వేతనం ఉండదు, కూలి ఉండదు, రుణం తీర్చే ప్రయత్నంలో చేస్తున్న శ్రమంతా వృధా. తమ తండ్రి తాతలు తీసుకున్న అప్పు కింద పని చేసేవారు మొదట్లో. అప్పు తీర్చేందుకు గోటీలుగా పనిచేయడం తేలిక అనిపించేది మొదట్లో. చాలా ఆతృతగా రోజులు లెక్కించు కునేవారు విముక్తి కోసం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పనికి అంతం లేకుండా పోయింది. ఏదో ఒక రకంగా ఏదో రహస్య కారణం ఆ వెట్టి కాలాన్ని రుణ గ్రస్త వేతన రహిత వెట్టిచాకిరీగా కొనసాగుతూ ఉండేది. అప్పుడిక పనిచేసిన రోజులను లెక్కించడం మరిచిపోయేవారు. సమయం యొక్క స్పృహను మరిచి పని చేయడం కోసమే జీవిస్తున్నట్టు, తామెందుకు పనిచేస్తున్నారో, తమను తాము ఎప్పుడూ ప్రశ్నించుకునే వారు కాదు. కానీ షావుకారు మాత్రం వారిపై చక్ర వడ్డీ లెక్కలు మర్చి పోయేవాడు కాదు. రోజు రోజుకి ఆ తప్పుడు లెక్కలతో గోటీల బానిస సంకెళ్ళు బలంగా బిగుసుకు పోయేవి. వెట్టిచాకిరికి అంతం లేకుండా ఉండేది.
షావుకారు రామచంద్ర పటేల్ అతని గుర్రంపై ప్రయాణిస్తూ కొత్త భూములను ఆక్రమించుకోవడానికి, కొత్త కొత్త రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలుపుకోవడానికి, తిరుగుతూ ఉండేవాడు.
సోమ్లా, టిక్యా గోటీలుగా పని కొనసాగిస్తున్నారు. వారి నరాలు చచ్చుపడ్డాయి. అన్ని రకాల బాధలు స్పర్శను కోల్పోయాయి. వారికి ఎటువంటి ఫిర్యాదు లేదు.
ఎండ కొద్ది కొద్దిగా పెరుగుతోంది చెట్లు ఆకులు రాలుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అడవంత అలిసి నిద్రపోతున్నట్టు ఉన్నది. సోమ్లా, టిక్యాలు అవిరామంగా పని చేస్తూనే ఉన్నారు. మధ్యలో తమ వెంట తెచ్చుకున్న సొరకాయ బుర్ర లోని రాగి సంకటితో గొంతు తడుపుకుంటున్నారు. సూర్యాస్తమయంలో వెలుతురు మసకబారుతున్నది. తెచ్చుకున్న గంజి ఆఖరి గుటక కూడా అయిపోయింది. సూర్యుడు కొద్దికొద్దిగా ధరమ్ దూర్ పర్వతాల వెనుకకు జారుకున్నాడు. రుణ గ్రస్త కూలీలు ఒకరోజు గడిచిందని భావించారు.
తండ్రి కొడుకులు పొలాల నుండి పంటను రెండింతల బరువులు మోస్తూ యజమాని ఇంటికి చేర్చారు. ఓదార్పు కోసం, స్వాంతన కోసం సోమ్లా తన కొడుకును “మీ అన్న భూక్యా ఇంతకంటే వందరెట్లు పని మన పొలాల్లో చేయగలడు కదా” అని అడిగాడు.
టీక్యా తన తండ్రికి ధైర్యాన్ని ఇస్తూ “అవును నాన్నా” అంటాడు.
**** *** *** **** **
సాయంత్రం పని నుండి ఇంటికి వచ్చిన భూక్యా కాళ్లు వేళ్ళాడేసి వరండాలో కూర్చున్నాడు. తన అంగ వస్త్రంతో వంటికి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు. తన తండ్రి స్థానంలో కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకున్నాడు, కనుక తానొక ఉన్నత స్థాయిలో ఉన్నట్టు భావించుకుంటూ, తండ్రి అలవాట్లను అనుకరిస్తున్నాడు. తండ్రిలానే సగం కాల్చి చల్లార్చిన చుట్టను చెవి సందు నుండి గుంజి నోట్లో పెట్టుకొని వెలిగించి, గంభీరంగా చెల్లెళ్ళను పిలిచాడు.
“ఓ సాలీ మాలీ ఇంకా ఎంతసేపు వండుతారు ? ఒక్క పాత్ర వండడానికి మీకు ఎంత సమయం కావాలి?” అని అన్నాడు.
“మళ్లీ తాగుతావా ఈ సాయంత్రం ” అని అడిగారు అతని చెల్లెళ్ళు.
” ఎక్కువ మాట్లాడకండి. నేను చెప్పినట్టు చేయండి. నాకు తాజా సారా కావాలి. పొయ్యి మీద కుండ పెట్టండి, అర్థమయిందా ?” అన్నాడు. అతనికి వీలైనంత ఘాటైన వెచ్చటి తాజా సారాయి అంటే ఇష్టం. అతను తనకోసం మట్టితో చిన్న సారాబట్టిని తయారు చేసుకున్నాడు. (మాహువా పూల) విప్పపూల తో సారా కాయడానికి. అతను సారా గుటకలు వేస్తూ పాడినదే పాడుతూ ఓకే పాట పాడుతుంటాడు.
“అదిగో వస్తోంది నా కమిలీ, నా కమిలీ నా సొగసైన కమిలీ వస్తోంది” అంటూ పాడుతూ, తన చెల్లిని డుంగుడుంగా వాయిద్యం తెమ్మని ఆదేశించాడు. పరజా సంప్రదాయంలో తన పాటను స్థిరంగా పాడేందుకు.
అతని చెల్లెళ్లకు తెలుసు సారా మత్తులో భూక్యా ఏమి చెయ్యబోతున్నాడో, వాళ్లు నవ్వుకున్నారు.
అతని గానం మధ్యలో అతని వధువు తన ఇంటికి ఎలా వస్తుందో వర్ణిస్తూ నిద్రలోకి జారుకొని గురక మొదలు పెడతాడు. అప్పుడు అతని చెల్లెళ్ళు తమ పని ముగించుకొని యువతుల డార్మెటరీకి బయలుదేరుతారు పడుకునేందుకు.
*** *** ***