పచ్చని పంటచేల నడుమ ముచ్చటైన గృహసీమల్లోకి
మందహాసంతో తొంగిచూసిన బాలభానుడు
శంపాలతల వేలివిన్యాసాలతో
తివాచీలను తలపించే
అందమైన రంగవల్లిక నడుమ పూబంతులు దాల్చిన
గొబ్బెమ్మల కమనీయదృశ్యాలు
నిండిన ధాన్యరాశులతో కళకళలాడే ముంగిళ్ళ
ముందు పౌష్య లక్ష్మికి రైతన్నలు
కృతజ్ఞతగా సమర్పించే ఘుమఘుమలొలికే
పొంగలి నైవేద్యాలు
ఆరుబయట హరిదాసు
గానానికి సూత్రధారుని సన్నాయిరాగంతోడై
హుషారెత్తిన బసవన్నల
లయ విన్యాసాలు
నింగిలో అలరించే
గాలిపటాల జోరు
నేలపైన చిందులేసే
యువజంటల హోరు
నగరం ముగ్గు మురిపాల
సాంస్కృతిక శోభలతో
అలరారే లోగిళ్ళు
పచ్చని పల్లెలే ప్రగతికి సోపానాలన్నమాటను
నిజం చేస్తూ పరిఢవిల్లే పల్లెసీమలుగర్తొచ్చాయేమో!
బతుకుదెరువు కోసం
పట్నం బాటపట్టి
ఆధునికత మోజులో
బందీయైన జీవితాలు
పండుగవేళ సొంతగడప గుర్తొచ్చి
ముందుతరానికి పర్వదినపు తీపి గురుతులద్దాలనే
ఆరాటంతో పల్లెకోసం పరుగుపెట్టింది