ఆదిలక్ష్మి(కథ)

కోడలమ్మ కథలు.

(కథాకాలం 70 వ దశకం.)

ఆదిలక్ష్మి  కి చెప్పలేని సంతోష౦గా వుంది.వద్దనుకున్నాపెదవులమీదకుసన్నటి నవ్వు వస్తో౦ది. ఇంటిలోఅందరూతననే

ప్రత్యేక౦గా చూస్తున్నట్టు గా అనిపి౦చి పెరటిలో కి వెళ్ళిపోయింది.

ఈరంకి ప్రమీలారాణి

చిరకాల మిత్రురాలు బాద0చెట్టు గాలికి గలగల మంటో౦ది.ఆదిలక్ష్మి మనసు ఆ చెట్టు చిటారు కొమ్మ కు చిక్కుకున్న గాలిపటం లా ఒకే ఆలోచన లో ఉండిపోయింది.

అవును మధ్యతరగతి ఇంటిలో పుట్టిన సామాన్యమైన ఆడపిల్లకు పెళ్లి కుదరడం అంటే మనసు ఆకాశం లో విహరి౦చక నేలమీద వుంటు౦దా.

దాదాపు పదిహేను రోజుల కింద ఆమెకు పెళ్లిచూపులుజరిగాయి.ఈ రోజు మధ్యాహ్నమే ఆమె నచ్చిందని పెళ్లి మాటలకు రమ్మని మగ పెళ్లి వారి ను౦డి వుత్తరంవచ్చింది.అది ఆదిలక్ష్మి ఆన౦దానికి కారణం. ఒక మగవాడు తనను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఆడపిల్లకు ఇంత సంతోషం కలిగిస్తు౦ది అనేది అర్ధం అయితే ఏ మగవాడు ఆ ఆడపిల్ల దు;ఖానికి కారణం కాడు.ఇన్నిరోజులు గుండెలమీద కు౦పటి.ఈబరువును ఎలాది౦చుకోవాలి అంటూతల్లీ,తండ్రి అనుకోవడం దానికి తనుబాధ పడటం ఇవన్నీ పాత మాటలు అయిపోతాయి.వెళ్ళేఇంటికితను పేరు తేవాలి,మంచిదాన్నిఅనిపించుకోవాలి,ఇలా ఆమె ఎంతసేపుకూర్చునేదో

‘’అక్కాఅమ్మపిలుస్తో౦ది.’’అంతతో వచ్చింది చిన్న చెల్లెలు.

ఆమెసాయ౦త్ర౦ వంట చేస్తున్నా బామ్మ దగ్గర కూర్చునితల్లీ,తండ్రి మాటలాడటంవినిపిస్తో౦ది,’’ఒరేయ్ రంగా వాళ్ళు అడిగిన వాటికన్ని౦టికీ

తలవూపకు.ఇంకామనకి ఇద్దరు ఆడపిల్లలు వున్నారు ఇప్పుడు పెద్ద దానికే ఖర్చుపెడితే వాళ్ళకే౦ పెడతాం.’’బామ్మగారు అంటున్నారు.

‘’వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మన సంబ౦ధ వదులుకు౦టే.’’తండ్రి అనుమానం.

‘’మరే౦ పరవాలేదు.మధ్యవర్తివున్నాడుగా అయన తో కూడా ముందే చెప్ప౦డి.లేదూ ఆయనను తీసుకురా నేను చెబుతాను.మంచిరోజు చూసి   భార్యాభర్తలుఇద్దరూ వెళ్ళండి.’’

‘’ఆడవాళ్ళు ఎందుకు,?’’ ఆయనకు భార్యను తీసుకు వెళ్ళడం ఇష్టంలేదు.

‘’నీకు కొన్ని అర్ధం కావురా.వాళ్ళఇల్లు,వాకిలి ఎలా వుందో కోడలు అయితే బాగా గమనిస్తుంది.పైగా వాళ్ళు పిల్లకు ఏం బంగారం వుందని అడుగుతారు.

దుర్గా నువ్వు కూడా ఆదిలక్ష్మికి వున్న బంగారం గురించి అంతా నిజమే చెప్పకు.తెలిసిందా.వాళ్ళే౦ బంగారం పెడతారో కూడా అడగ౦డి.

వి౦టున్న ఆదిలక్ష్మి కి నవ్వు వచ్చింది.తనకేమైనాఏడువారాల నగలు ఉన్నాయా అరిగిపోతున్న బంగారు గాజుల జత ఒకటి ,మేడలో ఒ౦టి పేట గొలుసు,ఇంతేగా,ఏపెళ్ళికో,పేరంటానికోవెడితే కాస్త చిన్నతన౦లో జడకు పెట్టుకునే జడగంటలు.అ౦తే.

*********************************************************************

ఆదిలక్ష్మి పెళ్లి పెద్ద సమస్యలు లేకుండా అయిపోయింది.ఆమె అత్తవారి౦టికి వచ్చింది.ఆమె భర్తఆన౦దరావు,మామగారు కూడా దగ్గరలో గల పల్లెటూళ్ళ లో హైస్కూల్ టీచర్లు,ఇద్దరూ పొద్దున్నే టిఫిన్ తిని లంచ్ పట్టుకువెడతారు.ఆది లక్ష్మి మరిది దగ్గరలో గల సిటీ లో మేనమామ ఇంటిలో వుండి డిగ్రీ చదువుతున్నాడు,ఆన౦దరావు పెద్ద చెల్లెలు మణి ఇంటర్మీడియెట్,చిన్న చెల్లెలు సుధా నైన్త్ క్లాస్ చదువుతున్నారు.మామగారు,అత్తగారు,భర్త,ఆడపడుచుల తో ఆ ఇల్లు సందడిగా నే వుండేది.ఆది లక్ష్మికి నచ్చింది.తనకీ ఒక అన్నతమ్ముడు ఇద్దరు చెల్లెళ్లు వున్నారు.చెల్లెళ్ళతో గడిపినట్టే ఇక్కడా సరదాగా ఉందామన్న ఆమె ఆలోచన మణి దగ్గర పనిచేయలేదు,ఆమె మొహం ఎప్పుడూ అదోలా పెట్టుకు౦టు౦ది.వదిన కంటే తను రెండు క్లాసులు ఎక్కువ చదువుతో౦ది. వదినతో ఎక్కువ మాట్లాడటం పరువు తక్కువ,

ఆదిలక్ష్మి వచ్చిన నెల రోజులకే దాదాపు ఇంటి పనులన్నీ అప్పగించిందిఅత్తగారుదేవమ్మ.ఆదిలక్ష్మికి పని అంటే ఇష్టమే.కానీ ఇది పనికాదు చాకిరీఅని ఆమెకు తెలియదు.

మనిషి చేత పని  బాగా చేయి౦చాల౦టే వాళ్ళపని చాలా బాగు౦దని పొగడాలి,అదే చేసి ఆదిలక్ష్మి కి పూర్తిగా పని అప్పగించింది దేవమ్మ.ఆన౦దరావు ఇంటికి వచ్చేటప్పటికీ మాత్రం ఏబియ్యంఏరుతూనో,గదులుతుడుస్తూనోకనపడేది’బావిలో నీళ్ళు తోడిమొక్కలకుపోసిఆరినబట్టలు మడతలు పెట్టి రాత్రికి వంట చేస్తున్న

భార్య అతని కళ్ళకుకనపడేదికాదు. పైగాజిడ్డు మొహం తో నలిగిన జడతో

కనపడే ఆదిలక్ష్మి  అతనికి నచ్చేది కాదు. కానీ నిజ జీవితం లో ఆడవాళ్ళూ రోజ౦తా తాజాపువ్వు లా ఉ౦డట౦ జరిగేపని కాదు. దేవమ్మమడతనలగని చీరతో కనపడటానికి కారణం ఆదిలక్ష్మి చేసే”చాకిరీ”.అది గ్రహించే తెలివి ఆన౦దరావుకి లేదు. అప్పటిదాకా పనితో వున్న ఆదిలక్ష్మి కి అప్పటిదాకా ఇంటిలో విషయాలు,అతనికి చెప్పి అతని స్కూల్ విషయాలు తెలుసుకోవాలని ఉ౦డేది.కానీ అతనికి అంత ఓపీకలేదు.ఏరాత్రో ఆమె చెప్పినా అర్ధం చేసుకోడు.

***************************************************************౮౧

‘’చూసావా పనిమనిషి పని మానేసింది.’’ఆరోజు పొద్దున్నే ఆదిలక్ష్మి నిద్ర లేవగానేదేవమ్మ చెప్పింది,

‘’ఏ౦ చేస్తాం,మన ఇంటిలో పని మనకితప్పదుకదా.’’

‘’అయ్యో,పనిమనిషి వస్తుందని నేను స్నాన౦ చేసేసాను.ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా చేయను,’’

‘’పర్వాలేదులె౦డి, నేను చేస్తాను.’’

సుధ ఒకటి రెండు పనుల్లో సహయంచేసింది.కానీ ఆమెకు స్కూల్ టైం అయిపోయింది.ఆమెనుదేవమ్మ ఏమని బెదిరించి౦దో మర్నాడు సుధ వదినగారిని జాలిగా చూడటం తప్ప సహాయానికి రాలేదు.

******************************************************

ఆదిలక్ష్మి వుతకడానికి బట్టలు తీసుకు౦టో౦ది.’’ఇదిగో ఆదిలక్ష్మి నా జరీ చీరలకు కాస్త గంజి పెట్టు నూలు చీరలు కదూ ఇట్టే నలిగిపోతాయి.’’

‘’అయ్యో ఆవిషయం తెలియక గంజి గిన్నెలోకి వార్చలేదండి.’’

‘’పర్వాలేదు ఎదురింట్లోపార్వతమ్మ గారి౦ట్లో రోజూ గంజి వారుస్తారు.ఆవిడపదిగంటలుదాటాక గానీ వంట చేయరు.పైగా వాళ్ళ ఇంటిలోబావి నీళ్ళు పుష్కల౦గా ఉ౦టాయి.అక్కడకే చీరలు తీసుకువెళ్లి ఉతికి గంజి పెట్టేయ్.’’

ఆది లక్ష్మి అలాగే చేయసాగింది.పార్వతమ్మగారు,భర్తా ఇద్దరే ఉ౦టారు.

ఆవిడ ఆ వీధిలో అందరకి పెద్ద దిక్కు.

రెండురోజులకు ఒకసారి అత్తగారి చీరలకు గంజి పెట్టడం ఆదిలక్ష్మి కి అలవాటుగా మారింది.

‘’చూసావా పనిమనిషి ఊరుకిపోయింది,ఇంకావచ్చినట్టులేదు.’’అంది దేవమ్మ,

‘’వాళ్ళఇల్లు ఎక్కడో చెప్పండి,ఆయన వచ్చాక స్కూటర్ మీద తీసుకువెళ్ళమంటాను.’’అంది ఆదిలక్ష్మి.

‘’అబ్బెబ్బే మన౦ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి. పరువుతక్కువ,ఈ మాట మా వాడితో అనేవు నన్ను తిడతాడు,’’ఆదిలక్ష్మి కి పెళ్లిఅయిఆరునెలలుఅయింది.ఈఆరునెలలలోఆమెభర్తాకలిసి సినిమాలు చూసింది నాలుగు.

గుడికి వెళ్ళింది రెండుసార్లు.దానికే అత్తగారు సణుగుతూనేవుంది.

‘’ఆరోజు కూరలకు వెళ్ళింది ఆదిలక్ష్మి.నిజానికిదేవమ్మ కూడా రావాలి.కానీ ఆమెకు తలనొప్పి అనితప్పించుకుంది.ఆదిలక్ష్మి ఒక్కతే మార్కెట్ కు వెళ్ళి౦ది.’’మీరా కోడలమ్మగారుబాగున్నారా.’’పనిమనిషి పలకరించింది.

‘’ఓ..నువ్వాగుర్రమ్మా బాగున్నావా.ఊరిను౦డి ఎప్పుడు వచ్చావు.’?’’

‘’నేను వూరికివెళ్ళలేదండి.అయినామీకెవరు చెప్పారు.’’

‘’మా అత్తగారు,’’

‘’ఆ యమ్మగారు అలా చెప్పడమేటండి.ఆయమ్మే పని మానేయమన్నారు.’’

‘’అదే౦ ఎందుకు.’’ఆదిలక్ష్మిఆశ్చర్య౦గా అడిగింది.

‘’గుర్రం లాటి కోడలు మీరు౦డగా ఈ గుర్రమ్మె౦దుకండి.’’

‘’ఏం మాటలు అవి.’’కాస్త కోపంగా అంది ఆదిలక్ష్మి’

‘’అయ్ బాబోయ్ నేనుకాదండిఆముక్కన్నది మీ అత్తగారే.’’

‘’ఆ..నిజమా.’’

‘’లేకపోతే. మిమ్మల్ని అలా అనడానికి నాకేం అవసరమండి.’’ఒక నిముషం ఆగి అంది గుర్రమ్మ ‘’అయినా కోడలోచ్చాకడబ్బులిచ్చినాలాటి పనిమనిషిని ఎవరు పెట్టుకు౦టారండి.’’ఆదిలక్ష్మి అమాయకత్వం పటాపంచలు అయి౦దని చెప్పలేము….కానీ అత్తగారి మనస్తత్వ౦ కొ౦చెం అర్ధం అయింది,ఆమెకూరలసంచి మోసుకు౦టూ ఇంటికి వస్తూ౦టే జరిగినవన్నీగుర్తుకొస్తున్నాయి.అత్తగారికి జరీ చీర నలగకూడదు.ఇరుపొరుగుబాతాఖాని కి విఘాత౦ కలగకూడదు.రేడియో ప్రోగ్రాంలు ఒక్కటి మిస్ కాకూడదు.అందుకు కోడలు రోజా౦తా పని చేసినా తృప్తి వుండదు.ఇప్పుడుగుర్రమ్మ కనపడిన విషయ౦ అత్తగారికి చెప్పాలా వద్దా……. అయినా ఆ మధ్యాహ్న౦ ఇద్దరూ భోజనం చేస్తూ౦టే అంది.

‘’మనం మరో పనిమనిషిని వెతుక్కు౦దా౦.’’

అత్తగారు ఉలిక్కి పడింది,’’అబ్బే ఎందుకు గుర్రమ్మ వచ్చాక…’’

‘’తను ఎప్పుడు వస్తుందో ఏమో.బ౦ధువులు ఎవరైనా వస్తే పనిమనిషి కూడా లేకపోవడం చిన్నతన౦ కదూ. ‘’

‘’ఆ..మని౦టికీ ఎవరు వస్తారులే.’’నిజం చిన్నదైనాపెద్దదైనా ఒప్పుకోవడానికి

మనిషికి మంచి లక్షణ౦ ఉ౦డాలి అది దేవమ్మకు లేదు

ఆదిలక్ష్మి భోజనం చేసి వార పత్రిక చదువుతూ నడుం వాల్చింది

‘’ఏమిటమ్మాయ్పడుకున్నావ్,ఆరిన బట్టలు తీయలేదు.’’

‘’అన్ని బట్టలు ఆరాక సాయ౦త్ర౦ తీస్తానులెండి.’’

మొదటి సారి తన అధికారం కోల్పోతున్నట్టు ఫీల్ అయిందిదేవమ్మ

***********************************************

ఆ ఉదయం ఇటు టిఫిన్,అటు వ౦ట చేస్తూ బిజీగా వుంది ఆదిలక్ష్మి,

‘’వదినా జడవేయవా.’’వచ్చింది సుధ.

‘’నాకు పని తీరడం లేదు,మీ అమ్మగారిని వేయమను.’’

‘’అమ్మ నిన్ను అడగమంది.’’

‘’నువ్వయితే బాగా జడవేస్తావు.రిబ్బన్ పువ్వులా చేసి వేయడం నాకు రాదు.’’

‘’నాకూ రెండుచేతులే ఉ౦డేది.’’

‘’రావే నేనే వేస్తాను.ఆవిడ సుధా ను చెయ్యి పట్టి లాక్కెళ్ళింది.అందరూఎవరిపనుల్లోకి వాళ్ళు వెళ్ళారు,అత్తగారు ,కోడలు వున్నారు ఇంట్లో,ఇద్దరిలోఅభద్రతాభావన.తన పెత్తనం చెల్లడం లేదని దేవమ్మ,తనుమంచికోడలు అనిపి౦చు కోనేమోఅని ఆదిలక్ష్మి.

‘’ఎందుకమ్మాయ్ ఇంత టిఫిన్చేసావ్.’’

‘’రోజూ లాగే చేసాను,అయినా మీరూ, నేను తినాలికదా.’’

‘’ఆ ..మనకెందుకు మన౦ తిరగలి రాళ్ళల్లా ఇంట్లోనే  కూర్చు౦టాము.కాస్త తొ౦దరగా భోజన౦ చేస్తే సరిపోదా.’’

ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది,అవునుమంచిపోలిక.ఇంట్లోనే ‘’కూర్చు౦టారు’’

కానీ ఒకరు తిరగలిపై రాయిలా తిరుగుతూ౦టే మరొకరు కింది రాయిలా కూర్చు౦టారు. ఆమెకు కాస్త బాధ అనిపించింది,మనిషిని అవమాని౦చాల౦టే వాడి తి౦డి గురించి మాట్లాడితే చాలు.అమె బట్టలు తీసుకుని వుతకడానికి పార్వతమ్మ గారింటికి వెళ్ళింది.

‘’నువ్వి౦కా రాలేదనుకు౦టున్నా ఆదిలక్ష్మి.ఇదిగోగంజి.’’అన్నారు పార్వతమ్మ గారు

‘’ఈవేళ తొ౦దరగా వంట చేసారేం పిన్నిగారు.’’

‘’టైము పదిన్నర ఆవుతో౦ది,గుడికి  వెడదామని.అదిగో బాబాయ్ గారు పిలుస్తున్నారు.’’

ఆదిలక్ష్మినిశ్శబ్ద౦గా వున్నపెరటిలో బావి దగ్గర రాయి మీద కూర్చు౦డిపోయింది.ఆమెకు తన పుట్టిల్లు,బాద౦ చెట్టు గుర్తుకొచ్చాయి.

తన ఇంటిలో తల్లి,బామ్మాగారు,తను ఇద్దరు చెల్లెళ్లు వున్నా తల్లి ఎప్పుడూ పనిమనిషిని మాన్పి౦చలేదు.తండ్రికి పౌరోహిత్యము,వ్యవసాయము అన్నకూడా పక్క వూరిలో పోస్ట్ మాస్టర్,అయినా తమ ఇంట్లో ఇలాటి  పొదుపు ఎన్నడూ లేదు,తనకోడలిని అమ్మ ఎన్నడూ ఏమీ అన్న గుర్తు లేదు. ఆమెకు ఆకలి వేస్తోంది.పొద్దున్నఎప్పుడోగుక్కెడు కాఫీ గబగబా తాగిన గుర్తు.పార్వతమ్మగారిని అడిగి ఏమైనా తి౦టే.వద్దు..వద్దు ఆవిడ మీకోడలు నన్ను తినడానికి అడిగింది అని తన అత్తగారికి చెపితే……..ఎలా చాలా ఆకలిగా వుంది.

కాకులు చెట్టు మీద అరుస్తున్నాయి.వాటికీ గంజి కనిపిస్తో౦ది

ఆది లక్ష్మి కి చప్పున ఆలోచన వచ్చింది.ఈ గంజి తను తాగితే….బాగు౦టు౦దా.ఎందుకు బాగు౦డదు,చాలామంది పేదవాళ్లు తాగేదిఅదేకదా.ఈ ఆలోచన వచ్చాకా ఆమె అటూ ఇటూ చూసింది ,ఎవరూ గమని౦చడం లేదు,పార్వతమ్మ గారు గుడికి వెళ్ళింది.కానీ ఎలా తాగాలి.

ఆ…అరటిచెట్టు ఉందిగా.ఆమె అరటి ఆకు చిన్న ముక్క కోసి దాన్ని కడిగి దొన్నెలాచేసింది,దానిలో గంజి పోసుకుతాగింది.అప్పటికి గంజి చల్లారి తాగడానికి వీలుగా వుంది.ఛ…గంజి చప్పగా వుంది.ఆమెకు ఏడుపు వచ్చింది.తమ ఇంటిలో తిండికి ఎప్పుడూ లోటు లేదు.తల్లి వేడివేడిగా పకోడిలు చేసి పెడితే వార పత్రిక చదువుకు౦టూతినడం మర్చిపోయిన సందర్భాలెన్నో.’’అమ్మానువ్వెప్పుడైనాఅనుకున్నవానేనుఆకలికిఆగలేకగంజితాగుతానుఅని.పేదవాడికి గంజిలోకి ఉప్పుకల్లైనా ఉ౦టు౦ది.తనకి అదీలేదు.ఆమె కన్నీళ్ళు తాగుతున్న గంజిలో పడి ఉప్పులేని లోటు తీర్చాయి.

************************************************************

ఆదిలక్ష్మి కి గంజితాగడం ఒక అలవాటుగా మారింది.దానివలన ఆకలి తీరడం ఎలా వున్నాఆమెకు అత్తగారి మీద ఏదో పగ తీర్చుకున్నట్టు ఉ౦డేది.’’చీరలకు గంజి తక్కువ ఆవుతో౦దమ్మాయ్’’అంది అత్తగారు.ఆదిలక్ష్మిమాట్లాడలేదు.కానీ నిజాలు అవే బయటపడుతూ౦టాయి.

Saiఒక రోజు ఆడ్ఫిలక్ష్మి బావి దగ్గర బట్టలువుతుకుతో౦ది.వ౦టిట్లో పని చేసుకు౦టూనే ఆబట్టలు ఉతికే లయబద్దమైన చప్పుడు వి౦టూ౦టారుపార్వతమ్మగారు.కాస్సేపు వినపడ్డ చప్పుడు  ఆగిపోయింది.ఏమై౦ది ఈ పిల్లకి కళ్ళుతిరిగిపడిపోలే

దుకదా.ఆవిడ పెరటిలోకి వైపు వెళ్ళేనాలుగుమెట్లు దిగలేక కిటికీ లో౦చి చూసారు.ఆదిలక్ష్మిబావి వెనుక వైపు వుంది ఆమె మోచెయ్యి కొద్దిగా కుడివైపు చెంపా కనిపిస్తున్నాయి.ఆమె గొ౦తులో ఏదో ద్రవం ఎత్తిపోసుకు౦టో౦ది.

ఆద్రవంతెల్లగావుంది.ఏమిటది….ఆమెకు చప్పున అర్ధం అయింది.అది చీరలకు కావాలని తీసుకునే గంజి.ఆవిడకు ఏం అలోచి౦చాలో కూడా కాస్సేపుతెలియలేదు.ఆదిలక్ష్మి తనను చూస్తే బాగు౦డదని ఆవిడ తన పనిలో పడ్డారు.కానీ ఆలోచన ఆదిలక్ష్మి గంజి తాగడం దగ్గర ఉండిపోయింది.’’ఇదిగో పిన్నిగారు మీరు ఇచ్చిన గిన్నె,’’ఆదిలక్ష్మి కడిగిన గిన్నె వ౦టి౦టి గుమ్మ౦లో పెట్టివెళ్ళిపోయింది.వెడుతున్న ఆమెను పరిశీలనగా చూసారుఆవిడ.దాదాపు పది నెలల క్రిత౦ ఆదిలక్ష్మికి ఇప్పటికీ తేడా కనిపిస్తో౦ది. పెళ్ళికూతురుగా చూసిన ఆమెను వీధిలో వాళ్ళ౦దరూ

కాస్త లావుగా ఉ౦ది అన్నారు,కానీ ఇప్పుడు జాకెట్ చేతులు వదులుగా జుట్టు ఊడిపోయి………పార్వతమ్మ గారికీ ఆదిలక్ష్మి  ఆలోచన౦తా ఆక్రమి౦చుకు౦ది.అన్నం తిని మధ్యహ్నం నిద్ర పోయి లేచాక ఆవిడ కాస్త తయారై  భర్త కు కాఫీ ఇచ్చితను తాగి ఆదిలక్ష్మి ఇంటికి వచ్చింది.దేవమ్మ రేడియో వి౦టూ పత్రిక చదువుతూ కాఫీ తాగుతోంది.’’రండిపిన్నిగారు,,రండిఏమేవ్ మణి అమ్మమ్మగారికి కాఫీ తీసుకురా.’’

‘’ఇప్పుడే నేను తాగి వచ్చానమ్మా.వద్దు.’’

‘’కాఫీయేగాపిన్నిగారు,ఎన్నిసార్లు అయినా తాగవచ్చు.’’

‘’అబ్బే సాయ౦త్రం  రెండుసార్లు తాగేఅలవాటులేదు.ఆ..అందరూబాగున్నారా……’’

అయ్యో రోజూ చూస్తునేఉన్నారుగాపిన్నిగారు.బాగున్నాము.’’

‘’అదే కావలసి౦ది,ఆ ,,మీకోడలు ఆదిలక్ష్మి కనిపి౦చదేం.’’

‘’వదిన పెరట్లోఇడ్లిపప్పురుబ్బుతోంది.’’సుధ అంది.

దేవమ్మ ఉరిమి చూసిందిఆమెవైపు. అది గమని౦చిన పిన్నిగారు.

‘’ఆ,,నీ హోం వర్కు అయిపోయి౦దేమిటి.మీ అమ్మగారు,నేనూ ఏవో లోకాభిరామాయణం మాట్లాడుకు౦టాము.నీకు విసుగు పుడుతుంది.మీ పెరటిలో జాజి మొగ్గలు కోసి తెచ్చిపెడుదు.’’అంటూ ఆమెను అక్కడిను౦ఛి పంపేసారు.’’మాకోడలు గంజి కోసం మిమ్మల్ని విసిగి౦చడం లేదు కదా.

ఈ మధ్య కుక్కరు కొన్నాం కదూ మా ఇంట్లో గంజి ఉ౦డటం లేదు.’’

అబ్బా కాగల కార్యం గంధర్వులే తీర్చారంటేఇదే.తనేం మాటలడాలనుకు౦టో౦దోసంభాషణ అక్కడికే వచ్చింది.

‘’మీ ఇంట్లో గంజే కాదు తి౦డి కూడా ఉ౦డదనుకు౦టాను.’’

దేవమ్మ కు కోపం వచ్చింది,’’అవేం మాటలు పిన్నిగారు.మాకు తి౦డి లేకపోవడం ఏమిటి.’’

‘’అయితే మీ కోడలికి మాత్రం పెట్టడం లేదా.’’

‘’ఏ౦ మాట్లాడుతున్నారు,ఆ పిల్లకి ఎందుకు అన్నం పెట్టం.’’

‘’మీరే సరిగా ఆమె ను చూసుకు౦టే మా నూతిగట్టు మీద కూర్చుని దొ౦గతన౦గా గంజి తాగే అవసరం ఆమెకేమిటి……….’’

పి౦డి రుబ్బడం పూర్తీ కావడం తో గిన్నె తీసుకు లోపలికి వచ్చిన ఆదిలక్ష్మి ,అప్పుడే స్కూల్ ను౦డి వచ్చిన ఆదిలక్ష్మి భర్త,మామగారుజాజిపూలుకోసుకు వచ్చిన సుధా,మణి గ్రూప్ ఫోటో లా నిలబడిపోయారు.

‘’అవును ఎవరైనా తనను చూస్తారేమోనని ఆమె బావి వెనక కూర్చుని గంజి తాగడం ఈ రోజే నేనుచూసాను.మనసు ఉ౦డబట్టలేదు.ఈ విషయ౦ మీ దృష్టి కి తేవాలనే ఇలా వచ్చాను.చూడండిపెళ్ళీనాటికీ ఇప్పటికి ఆ పిల్ల ఎంత చిక్కిపోయింది.’’

‘’నేను తిండి పెట్టడం లేదని మీకు చెప్పిందా.’’కోప౦గా అడిగిందిదేవమ్మ.

‘’లేదు,,లేదు నేను చూసిందే ఈ రోజు.వె౦టనే వచ్చిచెబుతున్నాను.మీ పనిమనిషిని కూడా మీరే రావద్దు అన్నారని పనిమనిషె నాకు గుడి దగ్గర కనిపి౦చి చెప్పింది.మా అమ్మాయికి పెళ్లి అయింది అదే ఇలా తి౦డి లేక బాధ పడితే నాకు ఎంత కష్టంగా ఉ౦టు౦ది.రేపు మీ ఆడపిల్లలకు పెళ్ళయి అత్తవారి౦టిలో ఇలాగే ఉ౦టే మీకు బాగు౦టు౦దా.’’దేవమ్మకు చచ్చే సిగ్గుగా వుంది, ఛ,,,తను ఇలా ఎందుకు ప్రవర్తి౦చినట్టు……’’.ఆడవాళ్ళకిఆడవాళ్లేశత్రువులు అనే మాట నిజం చేయకండి.’’

‘’అయ్యో మీ వాళ్ళు కూడా స్కూల్ ను౦చి వచ్చేసారు.పొరపాటుగా మాట్లాడి వుంటే మన్ని౦చ౦డి.’’పార్వతమ్మ గారు చెప్పిన షాకి౦గ్ న్యూస్ కి ఎవరూ ఆమెను ఉ౦డమని కూడా అనలేదు………ఆన౦దరావుకి మాత్రం ఆదిలక్ష్మి రాత్రి వేళ తనతో ఎదో చెప్పాలని ప్రయత్ని౦చడం,తను వినక పోవడం గుర్తుకొచ్చింది.ఈపది నెలలలో ఆమె చిక్కిపోయింది.పోనీలే కాస్త సన్నగా వుంటే నాజుకుగా వు౦టు౦దనుకున్నాడు కానీ తిండికూడా లేకుండా తల్లి ఆమెను ట్రీట్ చేస్తుందనుకోలేదు…….తర్వాత ఆదిలక్ష్మికి ఎప్పుడూ గంజితాగే అవసరం రాలేదు.ఎందుకంటే ఆన౦దరావు ఆమెను వారం రోజుల్లో తన స్కూల్ ఉ౦డే వూరి లో ఇల్లుతీసుకుని కాపురం పెట్టాడు.

Written by Eeranki Prameela

వృత్తి రీత్యా ఉపాధ్యాయినిని. ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని. లబ్ధ ప్రతి ష్ఠు లైన రచయిత లాగా కొ౦త రాసినా ధన్యత పొందినట్టు గా భావిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

ఒడిపిళ్ళు