అందరికీ శనార్థులు …!
మంచిగున్నర? కొత్త సంవత్సరం ఎట్లున్నది? పోయిన యాడది ఎట్లనో,ఈ యాడాది గూడ అట్లనే. మనం కష్టం చెయ్యకపోతే ఏ యాడాదైనా.. ఏముంటది కొత్త చెప్పుండి. “కామ్ మే పరమాత్మ హై” “కృషి యే ఖుషి ” గంతే మరి.
మనిషికి అన్నిటికన్న ముఖ్యమైంది ఆరోగ్యం, ఆరోగ్యం కాపాడుకోక పోతే మాత్రం, తర్వాత చానా కష్టపడాలి. చానా మూల్యం చెల్లించాలి. ఒకరిని గౌరవిస్తున్నారు, ఒకళ్ళకు మంచి మార్కులు వచ్చినాయి జీవితంల గౌరవం అందుకుంటున్నరు అంటే వాళ్లకి ఆ అర్హత వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. మనము అర్హత సంపాదించుకోవాలే అని అనుకోవాలే.
ఈయాల మనకి ఏం కావాలి అన్న దానిమీద మనము అర్హతను సంపాదించుకోకపోతే మనిషిఇయ్యాల కృషి చెయ్యకపోతే భవిష్యత్తుల దానికి మూల్యం చెల్లించాలి అంటరు.దానికి ఇంగ్లీషులో ఒక మంచి సామెత అదే ప్రావర్బ్ ఉన్నది చెప్తా వినండి.
హక్కు గాని, గౌరవం గాని, ఒట్టిగనే రావు గదా!దానికోసం మంచిగ కష్టపడాలి. చెడ్డదారుల కష్టపడితే చెడ్డ పేరు వస్తది గానీ మంచి పేరు రాదు.
ఈ సూత్రము మనకు మన ఇంటికి మాత్రమే పరిమితం కాదు సమాజం, దేశం, ప్రపంచం గిట్ల దునియా మొత్తం ల ఇదే సూత్రం పని చేస్తది. పని లేకుండా.. అది గూడా సక్కగా పని లేకుండా గౌరవం దక్కాలి అనుకుంటే ఆడ బొక్కనే పడ్తది.
మనకు ఏదైనా హక్కు కావాలంటే, ముందుగా మనం దానికి అర్హత పొందాలె
కృషి మరియు పట్టుదల: విద్య, ఉద్యోగం లేదా వృత్తిల విజయం పొందాల్నంటే నిరంతర కృషి జెయ్యాలి.. ఎవల్లో ఇచ్చే అవకాశాలను మీద ఆశ వడకుండ,, మన కృషితోని ఆ అవకాశాలను సంపాదించాలె.
Earn the right or pay the price” అని. అంటే… ఏందో సూతాం. దీనికి రెండు భాగాల అర్థం వివరిస్త..
1. “Earn the right”అర్హతను సంపాదించు.
ఈ భాగం ఏం చెబుతది అంటే.ఏదన్న హక్కు లేదా ఘనత పొందనీకి మనం కష్టపడి శ్రమించి, ఆ అర్హతను సంపాదించాలి. మనం పొందే సన్మానాలకు, మనం అడిగే హక్కులకు మన ప్రతిభ కారణం కావాలి అని అర్థం.
ఇగురం,క్రమశిక్షణ, ధైర్యం, ఉండాలె మల్ల పొందనీకి.
ఇంట్లనే కాదు , సమాజంల, పనిచేస్తున్న దగ్గర, అసలు దునియా మొత్తంల గూడ మనకు ఒక హక్కు ఉండాలె , గౌరవం రావాలంటే, ఖచ్చితంగ పనే జెయ్యాలె. మనం ఏందన్నది సరియైన తొవ్వల పోయి చూపెట్టాలే.
మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, నెల్సన్ మండేలా అసొంటోళ్లు ఒట్టిగనే గొప్పోళ్ళు అయ్యిన్రా.. తమ కృషితోని సమాజంల ప్రాధాన్యత సంపాదించుకున్నరు. తమను నమ్ముకున్నోళ్లకు, తమ దేశానికి గంత సేవ చేసిండ్రు. వారి నిబద్ధత, త్యాగం తోని తమ హక్కులను సాధించకున్నరు.
జాతి,కుల, లింగ, ఆర్థిక అసమానతలు అనేక సమస్యలతోని పోరాటం జేసి సమాజంల హక్కులను పొందిన్రు.
ఇంగ రెండో బాగం సూద్దాం…!
2. “Pay the price” ధర చెల్లించు అని అర్థం, ధర అంటే పైసల లెక్క కొలుసుడు కాదు. టైం కు చేయకపోతే తర్వాత ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి అదే ధర లేకుంటే మూల్యం చెల్లించుడు అంటే.
ఇయాల జేసేది సక్కగుండక పోతే రేపటికి ఏ ఫలితం వచ్చినా అనుభవించాలి కదా!
ప్రతి చర్య అంటే పనికి,ఫలితముంటది అనే న్యాయాన్ని ఇది తెలుపుతది.సరైన మార్గంల పోకపోతే, మన తప్పుల ధర మనమే చెల్లించుకోవాలె గదా చెల్లె!
హక్కు అనేది ఒక బాధ్యతతోని వస్తది. బాధ్యత ను యాది మర్శి హక్కు గావాలంటే ఎట్ల కుదుర్తది. మనం అర్హత పొందనీకి అవుస్రమైన ప్రయత్నాలు చెయ్యాలి. ఈ ప్రయత్నం లేకపోతే ఆ హక్కు మిస్ అయ్యే అవకాశం ఉంటది, లేదా దానికి ఎదుర్కునే ప్రతిఫలం తట్టుకోక తప్పదాయే!
ఒక విద్యార్థి మంచి మార్కులు పొందాలె అనుకుంటే, ఆ హక్కును సంపాదించనీకి కష్టపడి చదవాలె. కష్టం -శ్రమ లేకుండ పరీక్షల్ల మాత్రం ఎక్కువ మార్కులు రావాలకుంటే కుదురదు. తక్కువ మార్కులే వస్తయి.. ఇదే… “ధర చెల్లించడం” అయితది.
గట్లనే.. ఒక లాయర్ ఉన్నడు అనుకుందాం…క్లయింట్‌కు న్యాయం చేయ్యాల్నంటే, ఆ హక్కు సంపాదించనీకి కేసును లోతుగ అర్థం చేసుకుని, మంచి వాదనలు అందించాలె. లేకపోతే పరాజయం వస్తది. అతనికి అదే మల్ల చెల్లించవలసిన ధర అవుతది.
పిల్లలు చిన్నగున్నప్పుడు ఇల్లు, భార్య పిల్లలు అనేవి పట్టించుకోకుండా తిరిగిన భర్తకి, ఆయన ముసలోడైనంక తన మాట ఇంటలేరు, తనను పట్టించుకుంట లేరు అని బాధపడితే అర్థం ఏమన్న ఉన్నదా..!?. రైట్ టైం ల పిల్లలకి ఏం చేయలేదు, గనుక ఆయనకు హక్కు లేదు ఇప్పుడు. ఆయన మాట ఇనలేదని బాధపడాల్సిన పరిస్థితి వస్తది.
పెద్దలు జెప్పిన ముచ్చట ఏందంటే..”ఫలితాలు అనేవి శ్రమించే విధానం మీద ఆధారపడి ఉంటయి”
ఇదే మాట ఇంగ్లీష్ల జెప్పిన
‘Earn the right or pay the price’
“హక్కును సంపాదించు, లేకపోతే మూల్యం చెల్లించు”
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పూర్తిగ సత్తేనాస్ అయిపోయిన జపాన్ దేశం, తమ కష్టంతోని, తమ తెలివితేటలతోని, తమ దేశభక్తితోని ఇప్పుడు దునియాల మంచి Salt తెచ్చుకొని నిలబడే! ఇదే మరి సత్తా చూపిచ్చి గౌరవం పొందుడు అంటే!! ఇదే మరి హక్కును సంపాదించుకునుడు అంటే.!!
“కడుపుల కుండ కదలొద్దు గాని తాటి కల్లు ముంత నోటి కాడికి రావాలంటే ఎట్ల వస్తది!?. ”
హక్కు అంటే బాధ్యత. బాధ్యతను గూడ పద్ధతిగ చేసినోనికే హక్కు వస్తది. అది అర్థం చేసుకోవాల్సిన ముచ్చట!.
శివరాఖరున మనం అర్థం
చేసుకోవాల్సింది ఏందంటే తమ్ముళ్లు శెలెండ్లు ఇనుండి..!
హక్కుల కోసం గింత గూడ కృషి జేయకుండ, స్వార్థంతోని వ్యవహరిస్తే మనుషులు వాళ్ళవ్యక్తిగతంగ నష్టపోవుడే గాక సమాజంల గూడ ఏమి ఇజ్జతుండదు. చిత్తశుద్ధి లేకుండ shortcuts గెలవాలని అనుకుంటే పేరు గౌరవం అన్నీ గట్లనే షార్టకట్ అయితయి.
“హక్కును సంపాదించు లేకపోతే మూల్యం చెల్లించు” అన్నది చాలా మంచి మాట.అర్థం చేసుకుంటే చాలా గొప్పగ ఎదుగుతం. ఎప్పుడు కూడా పని చేసుకుంట పోవాలే. మనకు పని మీద గూడ ఇంట్రెస్ట్ వస్తది. సరి అయిన తొవ్వలనే నడవాలి.సరైన తొవ్వ మన కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగ పడ్తది.గిట్ల మంచి పనులు చేసుకుంట పోతే అందరము సల్లగుంటము. మనకు మంచి పేరు, గౌరవము,ప్రశాంతత అన్ని దక్కుతయ్. ఏమంటరు చెప్పుండి. మనకు బాధ్యతను గుర్తుచేసేదే హక్కు.
జీవితం అనేది ఒక పోరాటం, ఒక ఆరాటం. ఈ పోరాటంల విజయాన్ని సాధించేందుకు కృషి, పట్టుదల, నిజాయితీ చానా ఆవుసరం. మనకున్న అవకాశాలను సద్వినియోగం జేసుకుంట మన హక్కులను సంపాదించుకోవాలె. లేకుంటే, వాటిని కోల్పోయి మూల్యం చెల్లించనీకి సిద్ధంగుండాలే!
అందుకే………
హక్కును సంపాదించు, లేకపోతే మూల్యం చెల్లించు.
మొదలుపెట్టి ముందుకు సాగుదాం.
ప్రేమతో
మీ
రమక్క