రేపటి రోజు ఎలా ఉండబోతోంది అనేది తెలియనంత అమాయకంగా ఎవరూ ఉండరు. క్షణం లో ఏంముంచుకొస్తుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. కానీ తమదైన ధైర్యంతో మనుషులు తప్పకుండా ఎదుర్కొంటారు. ప్రపంచీకరణతో ఇంతగా పెరిగిన ఆధునికత, నగరీకరణ అతలాకుతలం చేస్తున్నా కూడా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి వ్యక్తి సిద్ధపడం చూస్తున్నాం. అయితే నిన్నటి రోజు ఈరోజు రాదు. ఈ నిజం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. క్యాలెండర్ లో రోజులు మారినంత సులువు కాదు జీవితం గడవడం. కొంత సంస్కరణ వాదాన్ని మోసే వాళ్లకు సమతా దృక్పథాన్ని వంట పట్టించుకున్న వాళ్లకు మరీ కష్టం. ఎందుకంటే, చుట్టూ ఉన్న అన్యాయాలను సహిస్తూ రోజులను గడపడం. ఏది పట్టించుకోకుండా విలువలకు విలువ ఇవ్వకుండా ఉండే వాళ్ళకి ఏ బాధలూ ఉండవు. అయితే ఏ ఒక్కరూ పూర్తి సమాజాన్ని మార్చలేరు ఏ ఒక్కరూ సంఘానికి మొత్తం మేలులను చేయలేరు. అయినా కానీ తన పరిధిలో ఉన్న తన వంతు బాధ్యతను పూర్తి చేస్తే చాలు.
కొన్ని జ్ఞాపకాల నుండి కొన్ని ప్రశ్నలు మొలవాలి. కొన్ని పనులు జవాబులుగా నిలవాలి. మనం అనుకుంటాం పిల్లలకేం తెలుస్తాయి ….వాళ్ళు ఏమి పట్టించుకోరు …ఈ తరం వాళ్లు మరీను అని. కానీ అది అర్థసత్యమే. పిల్లలు పట్టించుకుంటారు ! చూస్తారు !!అబ్జర్వేషన్ మోడ్ లోనే ఉంటారు ఈ అబ్జర్వేషన్ నుంచే వాళ్ళ మాటలు బయటికి వస్తూ ఉంటాయి. వాళ్ల మాటలను తేలికగా తీసేయకూడదు.
పిల్లల ముందు ఆడవాళ్ళను గురించి చులకనగా మాట్లాడితే స్త్రీ రక్షణ అనేది నీదైన ఒక సామాజిక బాధ్యత ఎలా అవుతుంది? మనం నేర్పిస్తున్న ఆలోచనలు ఏమిటి ? అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటే చెడు మాట్లాడకుండా ఉండాలనీ,అస్తమానం ఎదుటి వాళ్ళలోని తప్పులను ఎంచడానికే మన సమయాన్ని వినియోగించకుండా ఉండడానికి ప్రయత్నిస్తే తప్పకుండా న్యూ జనరేషన్ బాగుపడుతుంది.
ప్రేమలను గాడి తప్పనియవద్దు. బాధ్యతలను ఒక గూటిలోకి తెచ్చుకోవాలి. ఇవి పిల్లలకు అలవర్చాలి అంటే పెద్దవాళ్లు ఆచరించాలి. నీతులు చెప్పడానికే బాగుంటాయి ఆచరణ కష్టం. ఆచరించని నీతులు చెప్పడం అనవసరం. ఇవన్నీ పిల్లలు తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు.
అలవిమాలిన ప్రేమ కన్నవాళ్ళపై ఉండడం సహజం. కానీ అదే అతి అయ్యిందో.. తప్పకుండా బెడిసి కొడుతుంది. ఒక్కసారి చేతిలోంచి జారిపోయిన నమ్మకం తిరిగి పునరుద్ధరించడానికి చాలా కాలం పడుతుంది.
యువత కు కొన్ని ప్రశ్నలు సంధిద్దాం….ఏది సరైన అవగాహన? ఏది సరైన సమాధానం? యువకులు చాలా ఆలోచించి తమ జీవితాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకోవాలి జీవితం ఎప్పుడు మొదలవుతుంది?
ఉద్యోగంతోనేనా? పెళ్లితోనేనా? పిల్లల్ని కనడంతోనా? ఈ మూడూ జీవితంలో ముఖ్యమైనటువంటివే! ఈ మూడింటికి పునాది ఏంటి? అంటే.. ఇప్పుడు ఉన్న ఆర్థిక స్వావలంబన, ఆత్మాభిమాన స్వావలంబన ,సహన వివేచనాల నడవడిక స్వావలంబననా? ఇవన్నీ ఒక్కసారిగా ఊడి పడవు. పుల్ల పుల్ల సేకరించి గూడు కట్టుకునే పిట్ట లాగా, ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టే విధానంలా చిన్నప్పటినుంచి అలవర్చుకోవాలి. ఇవన్నీ చిన్న పిల్లలకి ఎలా అర్థమవుతాయి? కావు !అందుకే ఈ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. సమస్యలను సమాజాన్ని జీవితాన్ని అర్థం చేసుకునే వయసువచ్చే వరకు తల్లిదండ్రులు మంచి విలువలను నేర్పిస్తే… ఆ తర్వాత వాటిని వేలు పట్టి నడిపించుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత కుటుంబం మొత్తంగా తీసుకుంటే… తప్పకుండా యువత భవితలో ఇవి సాధిస్తుంది. ఈ తరానికి ఒకరోజు తనదై తీరుతుంది.