దొరసాని

60 వ భాగం

ఆరు నెలలు గడిచాయి. బాల సదనంలో పిల్లల సంఖ్య పెరిగారు తల్లిదండ్రులు నమ్మకంగా అక్కడ వదిలి వెళుతున్నారు పిల్లలందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉండడం చూసి ఇలాంటివి వాళ్ళ ఊళ్ళల్లో ఉంటే బాగుంటుంది అని ఎంతోమంది అనుకునేవాళ్లు…

పిల్లల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న నీలాంబరి గురించి ప్రభుత్వం వరకు తెలియ వచ్చింది ప్రభుత్వ అధికారులు వచ్చి నీలాంబరిని ఇంటర్వ్యూ తీసుకున్నారు ..ఆమె తన స్వార్జితంను బాలసదనం కోసం ఖర్చు పెట్టడం ..దానికి ఇంటి సభ్యులు సహకరించి వాళ్లు కూడా ఆర్థికంగా సహాయం చేయడము.. ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు ఎన్నారైలు సహకరించడం వల్ల ఇంత పెద్ద బాధ్యత తాను సులభంగా తీసుకున్నానని నీలాంబరి చెప్పడం ప్రభుత్వ అధికారులకు ఎంతో నచ్చింది. ” ఇలాఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు “అని ప్రశంసించారు కూడా. నీలాంబరి భూపతి ల దంపతులకు సన్మానం చేశారు

ఈ స్ఫూర్తితో మరికొన్ని పట్టణాలలో ఇలా స్వచ్ఛందంగా సదనాలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది, ఇది నీలాంబరి విజయంగా చెప్పుకోబడింది…

కొన్నాళ్లు గడిచాయి ఒకరోజు బాలసదనం నుండి వచ్చిన సౌదామిని పెరట్లో కూర్చుని ఏదో ఆలోచనలో పడిపోయింది.. ఈ లోకంలో లేనట్లుగానే అక్కడ కూర్చుని ఉంది. ఆమె ఆలోచన అంతా సాగర్ గురించే ఇంకా ఎన్నాళ్ళు ఎడ బాటు అని సౌదామినీ మనసు తపించిపోతుంది..

పెరట్లోకి వచ్చి చూసిన నీలాంబరి సౌదామినినీ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక చూసి లోపలికి వెళ్ళిపోయింది ..ఆమెకు కూడా వీళ్ళ పెళ్లి త్వరగా చేస్తే బాగుండు అనిపించింది.

అలా ఈ లోకంలో లేనట్లు కూర్చున్న సౌదామినికి వెనక నుండి తన భుజం మీద ఎవరో చేయి వేసినట్లు అనిపించింది.. ఒక్కసారి భయంతో వెనక్కి తిరిగి చూసింది… ఆమె ఆశ్చర్యానికి ఆనందానికి హద్దులు లేవు.. ఇది కలా నిజమా అన్నట్లుగా అలాగే చూస్తూ ఒక్కసారిగా “సాగర్ “అంటూ గట్టిగా హత్తుకుని పోయింది…

సాగర్ కూడా సౌదామిని రెండు చేతులతో చుట్టేసి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు… సౌదామినికి ఆఆనందం కాస్త కన్నీటి రూపంలో బయటకు వచ్చింది.. అలా ఏడుస్తున్న సౌదామితో..

” ఇంకెందుకు నేను వచ్చేసాను కదా! ఏడవకు ఇంకా మనల్ని ఎవరూ విడదీయలేరు” అన్నాడు సాగర్.

” ఎలా వచ్చావు సాగర్ అసలు ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు” అన్నది నవ్వుతూ సౌదామిని.

” వచ్చేది అమ్మకు తెలుసు నేను అక్కడ కంపెనీలో రిజైన్ చేసి ఇక్కడే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుందామని ఆలోచనతో వచ్చాను వాటి గురించి ఒక ప్రణాళిక కూడా చేసుకున్నాను అయితే నువ్వు ఆశ్చర్యపోయే మరొక నిజం నీకు చెప్తాను” అన్నాడు నవ్వుతూ..

” నిజమా ఇంత మంచి వార్త నాకు ముందుగా తెలియజేయలేదు ఎందుకు? రోజు నీకోసం ఎదురు చూస్తున్నాను అత్తయ్య కూడా నాతో అనలేదు” అన్నది సౌదామిని.

” నేనే వద్దన్నాను చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను ఇంతకీ నేను చెప్పే మరో వార్త అడగాలని లేదా?” అన్నాడు సాగర్.

” త్వరగా చెప్పు సాగర్ చాలా టెన్షన్ గా ఉంది” అన్నది సౌదామిని..

” నేను చక్కగా మీఊరికి వెళ్ళిపోయాను మీ అమ్మానాన్నలతో మన పెళ్లి విషయం మాట్లాడాను అందుకే ఉదయం రావాల్సిన వాడిని ఇప్పుడు వచ్చాను” అన్నాడు సాగర్.

” నిజమా మా ఇంటికి వెళ్ళావా? ఏం మాట్లాడవు వాళ్ళు ఏమన్నారు చెప్పు సాగర్ భరించలేని టెన్షన్ గా ఉంది” అన్నది సౌదామిని కంగారుపడుతూ..

” ముందుగా మీఅమ్మా నాన్నగారు ఆశ్చర్యపోయారు నేనెవరో తెలియదు కదా! నేనెవరినో చెప్పాను నేను ఇక్కడ ఏం చేయదలచుకున్నానో అదంతా కూడా వివరించాను ..నిన్ను ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో ఇవన్నీ చర్చించాను తర్వాత నా చిన్నప్పటినుండి నా చదువు నా గురించి కూడా వాళ్లకి చెప్పాను అప్పుడే అమ్మ కూడా ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడింది.. వాళ్ళు చాలా సంతోషపడిపోయారు ఇంత చక్కని మనిషిని మేము మిస్ అయిపోయే వాళ్ళం కదా! మాకు తెలియక మేము సౌదామినినీ నిన్ను, మీ కుటుంబాన్ని అందరినీ ఇబ్బంది పెట్టాము ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు మాఅమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని చెప్పారు” అన్నాడు సాగర్.

ఇదంతా వింటున్న సౌదామిని ఆనందంతో లేచి గబగబా లోపలికి పరిగెత్తింది…

” అత్తయ్యా! అత్తయ్యా!” పిలిచింది..

బయటకు వచ్చిన నీలాంబరిని గట్టిగా కౌగిలించుకొని …” చాలా సంతోషంగా ఉంది అత్తయ్య” అని కాళ్ళకు నమస్కరించింది.

“అంతా ఎప్పటికప్పుడు సాగర్ చెప్తూనే ఉన్నాడు.. ఈ తీపి కబురు వాడి నోటివెంటే నీకు చెప్పించాలని అనుకున్నాను అందుకే నీకు చెప్పలేదు” అన్నది నీలాంబరి..

అక్కడికి వచ్చిన భూపతి అందరిని చూసి సంతోషించాడు..

” మామయ్యా! ” అంటూ వెళ్లి అతని కాళ్లకు నమస్కరించింది సౌదామిని…

అప్పుడే అమెరికా నుండి కాల్ చేసిన అలేఖ్య సుధీర్ అందరితో ఎంతో సంతోషంగా మాట్లాడారు.. సౌందర్యలహరి కూడా చిన్న చిన్న మాటలతో వీళ్ళందర్నీ సంతోష పెట్టింది….

అలేఖ్య సుధీర్ కూడా త్వరలో ఇండియాకు వస్తున్నట్లు చెప్పారు ..ఇంక నీలాంబరి భూపతి ఎంతో సంతోష పడిపోయారు ..అందరం ఒకచోట ఉంటున్నాము అనే సంతోషం వాళ్లకు ఎంతో బలాన్ని ఇచ్చింది.

ఎంత సంపాదిస్తే ఏంటి! తలో ఒక చోట ఉంటే ఓ పండగ వచ్చినా సంతోషం వచ్చినా పిల్లల ఆటలను చూసినా పంచుకునే వాళ్ళు లేనప్పుడు ఏం లాభం !, కలుసుకునేంత దూరంలో ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది.. సౌకర్యాలు ఉంటున్నాయని సంపాదన బాగుంటుందని మన ఎల్లలు దాటి ఎక్కడో వెళ్లి మన ఉనికిని మర్చిపోయి అదే ఆనందం అనుకునీ జీవిస్తున్నాము.. పుట్టి పెరిగిన నేల’ కన్నవాళ్ళు’ బంధువులు స్నేహితులు అందరూ ఉంటే అదే ఆనందం కదా…

తన పిల్లలు ఆసంతోషాన్ని వెతుక్కుంటూ భారతావనికి తిరిగి వస్తున్నారని ఎంతో సంతోష పడిపోయారు నీలాంబరి దంపతులు…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కలువరేడు

రమక్క తో ముచ్చట్లు-19