రాణీ రాణమ్మ – పాట విశ్లేషణ

చిత్రం : మా పల్లెలో గోపాలుడు
దర్శకత్వం : కోడి రామకృష్ణ
నిర్మాత : ఎస్. గోపాల్ రెడ్డి
సంగీతం: కే.వి. మహదేవన్
తారాగణం : పూర్ణిమ, అర్జున్, రాజా,గొల్లపూడి మారుతీ రావు

భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడిన ‘మా పల్లెలో గోపాలుడు’ అనే చిత్రంలో స్నేహితురాళ్లతో విహారయాత్రకు వచ్చిన కథానాయక(పూర్ణిమ), గోదావరి నదిలో సరంగు అయిన కథానాయకుడు (అర్జున్) ల పరిచయం ఆహ్లాదకరంగా సాగుతూ స్నేహం , ఆరాధన, ప్రేమ వంటి పలు మలుపులు తిరుగుతూ చివరికి ఆమె జీవితంపై ఆవరించిన నీలినీడల కారణంగా కలత చెందుతూ కథానాయకుడు పాడే పాట.

పల్లవి:”రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ”

చరణం:  “నీ వేడుక చూడాలనీ
నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరీ వచ్చానమ్మా”

ఈ ఇద్దరు మనుషుల మధ్య పరిచయం ఒకరి హృదయంలో స్నేహాన్ని మరొకరి హృదయంలో ప్రేమను చిగురింపజేస్తుంది. ఆమెకు ఆ విషయాన్ని తెలియజేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడం, ఆమెకు మరొకరితో పెళ్లి జరగడం, ఎక్కడున్నా ఆమె ఆనందంగా ఉండటమే తనకు కావలసిందని మనసును సమాధానపరుచుకొని, మౌనంగా ఆరాధిస్తూ
ఒకరోజు ఆమె ఇంటికి వస్తాడు.

ఆమె జీవితం ఎలా ఉండాలని తను కోరుకుంటున్నాడో అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో మౌనంగా భరించలేకా అలా అని ఎదురు తిరగనూలేక(ఆమె వైవాహిక జీవితానికి దెబ్బ తగులుతుందన్న భయంతో) తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు.

ఒక వ్యక్తిని మనః స్ఫూర్తిగా ప్రేమిస్తే, సర్వకాల సర్వావస్థల యందు ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని, ఆనందాన్ని ఆ మనసు కోరుకుంటుందేతప్ప ఏ విధమైన వ్యతిరేక భావాలకు ఆ మదిలో చోటుండదు. ఆరాధన అనేది బంధాలు, అనుబంధాలు, స్నేహాలు, లింగభేదాలు వీటన్నింటికీ అతీతమైన పవిత్రమైన భావన. చూడగలిగే శక్తి ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోగలుగుతాం, అర్థం చేసుకోగలిగే మనసు ఉన్నప్పుడే అందులోని సౌరభాన్ని ఆస్వాదించగలుగుతాం.

గోదావరి నదిలో పడవ నడుపుతూ మొదటిసారి తను ఆమెను చూసినప్పుడు ఆ నదీమ తల్లి పరవళ్లన్నీ ఆమె నవ్వులైన అప్పటి ఆనందంగానీ, ఆ హుషారుగానీ ఆమెలో మచ్చుకైనా కానరాక , అవన్నీ ఏమైనాయంటూ వేదన చెందుతూ ఉంటాడు.

“రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలనీ….
నీ అడుగులు కందకుండా నా అరి చేతులుంచాలనీ….
ఎంతగా అనుకున్నానూ….
ఏమిటి చూస్తున్నానూ…

అష్టైశ్వర్య సంపన్నమైన జీవితం అనుభవించాలనీ, ఆమె కాలిబాటల వెంట పూలతివాచీలు పరచాలనీ కోరుకునే అతని మనసు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న ఆమె జీవితాన్ని చూసి నలిగిపోతూ ఉంటుంది.

“పన్నీటీ బతుకులోన కన్నీటి మంటలేనా…..”

ఉన్నతమైన వ్యక్తిత్వమున్న ఒక మహాసాధ్వికి, నైతికంగా పతనమైన ఒక పురుషుడితో ముడివడితే, ఆ స్త్రీ హృదయంలో జరిగే కల్లోలానికి నిలువుటద్దం ఈ కథానాయక పాత్ర.

“రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా….

సహనం స్త్రీకి కవచమనీ
శాంతం అందుకు సాక్ష్యమనీ
ఉన్నాను మౌనంగా…..
కన్నులు దాటని కన్నీరుగా……
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా…..”

ఇది స్త్రీ జాతికున్న వరమో, శాపమో నాకు తెలియదు గానీ ‘స్త్రీలకు నోట్లో నువ్వు గింజ నానదు’ అనే నానుడి ఉన్నప్పటికీ కూడా అది అన్ని సందర్భాలలో సరైనది కాదని నిరూపించడంలో వీరు దిట్టలు.

ఎంత దుర్భరమైన గృహహింసలో మగ్గుతున్నప్పటికీ కూడా ఆ విషయాలేవీ గడప దాటనివ్వకుండా, చివరికి పుట్టింటి వారికి కూడా తెలియనీయకుండా సమన్వయ పరచుకోవడంలో వీరు సిద్దహస్తులు.

సహనం అనే కవచాన్ని ధరించకపోతే ఆ గడపలో ఆమె ఉనికి ప్రశ్నార్థకమే. ఆ ఉనికిని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో శాంతి సూత్రాన్ని వల్లెవేస్తూ, కాలాన్ని వెళ్లదీస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఆమె మనసు కొవ్వొత్తిలా కాలిపోతూ, ఆత్మగౌరవం హారతి కర్పూరమైపోతూ ఉంటుంది.

“గుండె రగిలి పోతు ఉంటే గూడూ మేడా ఒకటేలే….
కాళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే…..

బండబారిన గుండెకు కలిమిలేములుగానీ, కష్టసుఖాలు గానీ ఏ విధమైన భేదాన్ని చూపించలేవనీ, నిస్పృహ ఆవరించిన ఆ మనసుపై పరస్పర విరుద్ధమైన ఈ రెండు భావాలు, పరిస్థితులు ఏ విధమైన ప్రభావాన్ని చూపించలేవనే విషయాన్ని అతనితో చెబుతూ ఉంటుంది.

“ఎదురుగా పొంగే సంద్రం
ఎక్కడో ఆవలి తీరం
ఎదురీత ఆగదులే
విధిరాత తప్పదులే….”

సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆమె మనసు పరిష్కారం కానరాక విలవిల్లాడుతూ ఉంటుంది. ఉగ్రరూపం ధరించిన సముద్రం ఉప్పెనై తనను ముంచేస్తున్నప్పటికీ, విధికి తలవంచి మౌనాన్ని ఆశ్రయించానంటూ నిర్వేదాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది.

మృగానికైనా కొన్ని విలువలుంటాయేమోగానీ, ఏ కోణంలో చూసినా ‘మంచి’ అనే పదానికి ఆచూకీ లేని ఆ ప్రయాణం ఆమెకు మొసళ్ళతో నిండిన సముద్రం వలెకాక మరింకెలా అనిపిస్తుంది.

ఒక రోగి శరీరంలో ఉన్న జబ్బును నయం చేయడానికి ఒక సమర్ధవంతమైన వైద్యుడు ఔషధాలతో ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగానూ ప్రయత్నించి, గత్యంతరం లేని పరిస్థితుల్లో అది శరీరంలోని మరిన్ని అవయవాలకు సోకకుండా ఉండడానికిగాను ఆ వ్యక్తి శరీరం నుండి రోగగ్రస్తమైన ఆ భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తాడు.

అదే సూత్రాన్ని అనుసరించి కథానాయక తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో కథను చక్కని మలుపు తిప్పుతూ, సమాజానికి గొప్ప సందేశాన్నందించిన కథారచయిత అభినందనీయులు. దర్శకనిర్మాతలకు, తారాగణానికి, సాంకేతిక బృందానికి, సందేశాన్ని సానుకూల భావనతో స్వీకరించి ఆదరించిన ప్రేక్షకలోకానికి అందరికీ పేరుపేరునా అభినందనలు, వందనాలతో…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మసి అంటని స్పటికం

…సూర్య భగవానుడు…