పున్నమి చంద్రుడు పండు వెన్నెలను కాస్తున్నాడు ఆ రాత్రి. సాలీ నెమ్మదిగా నడుస్తూ యువతులు పడుకునే డార్మిటరీ వైపు వెళ్తున్నది .ఆమె తలలో చక్కటి సువాసన ఇచ్చే మల్లెపూల గుత్తి ఉన్నది. ఆమె ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా తన జుట్టు దువ్వి తల కుడి వైపు చక్కటి కొప్పు పెట్టింది.
వారి కుటుంబం తలలపై ఉన్న కష్టాల ఛాయ తొలగిపోయింది. తన తండ్రి అన్నలు జైలుకు పోతారని భయపడింది. కానీ వారు వాటిని తప్పించుకొని గోటీలుగా వెళ్లడానికి సిద్ధపడ్డారు. అయినా కొండకోనల్లో బతికే గిరిజనులకు కష్టాలు తీరేవి కావు. కొండలపై నుండి ప్రవహించే వర్షపు నీరు వారి కన్నీళ్లను తుడిచి నవ్వులను పూయిస్తూంది.
సాలీ అందంగా శ్రద్ధగా కొప్పు పెట్టుకొని, తనకిష్టమైన ఎరుపు నీలిరంగుల గళ్ళ చీర కట్టుకుంది. పర్వతాలు అద్భుతమైన వెన్నెల కాంతిని ఆస్వాదిస్తూ అలలు అలలుగా ఎగిసిపడుతూ ఉన్నాయి. సాలీ మామూలుగా నడుస్తూన్నది. ఆమె కాళ్ళు నిశ్శబ్దంగా కదులుతూ యువకులుండే డార్మిటరీ వైపు నడిచాయి.
ఫారెష్టు అధికారులు ఊళ్ళోలేని సమయాన్నిగిరిజన యువత పండుగ చేసుకుంటున్నారు. అపాయం తొలిగి జీవితం మధురంగా మారింది మళ్ళీ ఒకసారి. భూక్యా తాగిపడి డుంగడుంగ సంగీతంలో నానుతున్నాడు అన్నీ మరిచి.
సోమ్లా తన చిన్నకొడుకు టిక్రాతో కలిసి ఎప్పటిలానే ఇంటి కాపలాగా పడుకున్నాడు. రేపటి నుండి వారు గోటీలు.
*** *** ***
నవంబర్ మాసపు ఒక మంచు కురిసే ఉదయం దాన్ని దీపావళి పండుగ నెల అంటారు సోమ్లా అతని చిన్న కొడుకు టిక్యా షావుకారి వద్దకు వెళ్లారు తమ రుణగ్రస్త జీవితాన్ని ప్రారంభించడానికి దారిలో ఎత్తయిన కొండలు గంభీరంగా దారికి ఇరువైపులా మంచుతో చుట్టబడి కొండ శిఖరాలు చుట్టలు చుట్టలుగా మంచును వదిలించుకుంటూ విచ్చుకుంటు ఉన్నాయి అక్కడ ఆ చిన్న కొండలు ఇరుకైన అడవిదారి ఇరువైపులా వడ్డీ వ్యాపారుల వాడి కోరలా అన్నట్టు ఉన్నాయి. ఎత్తుపల్లాల పర్వత ప్రాంతం పచ్చని పూలతో నిండి పంటతో మెరుస్తున్నది. ఆ ఉదయపు వెలుతురు కాంతి చూడడానికి బంగారు రంగు పువ్వులన్నీ పర్వతాలను ఎత్తైన ప్రాంతాలను మైళ్ళ పొడవున కప్పేసినట్టు ఎనిమిది దిక్కుల దిక్పాలకులు నేలపై వడ్డీ వ్యాపారులుగా మారి బంగారంగా మారిన ఆ నేలను చుట్టూ ఆక్రమించి కూర్చున్నట్టు అనిపించింది సోమ్లాకి. అక్కడ వారు ప్రశాంతంగా సౌకర్యంగా కూర్చుని ఉంటే, తనూ తన కొడుకు జీవితాలకు బానిసత్వాన్ని ధరించి నడుస్తున్నట్టు అనిపించింది.
వడ్డీ వ్యాపారి రామచంద్ర పటేల్ ఉండే ‘తోటగూడ’ సోమ్లా ఉండే ‘సరసుపాదార్’ మధ్య ఎనిమిది మైళ్ళ దూరం. దారంతా అడవి గుహలతో నిండి ఉంటుంది గమ్యం చేరే సరికి ఎండ ఎక్కింది. ఊరు బయట అంత వడ్డీ వ్యాపారికి చెందిన విశాలమైన పొలాల్లో మాండ్య పంట కోస్తున్నారు.
సోమ్లాకి కూడా సొంత పొలం ఉండేది.
“ఈ సంవత్సరం మన పంటను మనం తొందరగా నూర్చవచ్చు . కానీ వచ్చే సంవత్సరం ఎట్ల కొడకా” అని టిక్యాతో అన్నాడు తండ్రి.
తండ్రి మనసులో బాధను చెప్పకుండానే అర్థం చేసుకున్నాడు టిక్యా . వచ్చే సంవత్సరం తాము ఇద్దరూ షావుకారు వెట్టిలో ఉంటారు. పోడు వ్యవసాయం చేస్తూ వరి, మాండ్యాలను పండిస్తూ, వందలకొద్దీ ఆవుల పాలుపిండుతూ , అతనికోసం కొత్త కొత్త ఇళ్ళను నిర్మిస్తూంటారు. తమ పొలాల్లో వ్యవసాయం చేసేవారు లేక పిచ్చిమొక్కలతో గడ్డితో నిండిపోద్ది.
“అన్న భూక్యా చూసుకుంటాడు పొలాల సంగతి. మనిద్దరం కలిసి చేసేదానికంటే ఎక్కువ చేస్తాడు. వ్యవసాయం గురించి నువ్వు బాధపడకు. అతడు చేయలేనన్ని పొలాలు మనకు లేవు. మన భూమి బీడు పడదు” అన్నాడు టిక్యా తండ్రితో.
ఆ మాటలతో తండ్రికి ఊరటకలగలేదు. భూక్యా ఇంకా చిన్నవాడే తనంతట తను స్వయంగా ఏమీ చేయలేడు అనుకున్నాడు.
ఇద్దరూ మౌనంగా నడిస్తూన్నారు. పంటమీద ముసిరిన చీడపురుగుల్లా మందల కొద్దీ కూలీలు పంటను కోస్తూన్నారు. వారిలో స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. నాలుగు రూకలు సంపాదించడం కోసమో పట్టెడు మాండ్యా కోసమో రోజంతా కష్టపడతారు. కానీ వారి నవ్వులు గాలిలో తేలి పోతున్నాయి, బినా గడ్డిపై తెల్లటి పూల పరిమళాల వలె ఆ నవ్వులు మెరుస్తూన్నాయి నిశ్చింతగా. అప్పుడే వారు కోరస్ గా పాట మొదలుపెట్టారు.
మాండ్యా పొలాల్లో రోజు కూలీలం
చెమట చిందిస్తాం ఈ నేలన
పండిన పంటలను చేరుస్తాం
బేగిన ధాన్యం నింపి
బండ్లతో చేరుస్తాము భద్రంగా
ఎవరికోసం నిలువ చేసేదంతా నా సఖీ
అదంతా నీ కోసమే కదా ప్రియా
నా తోటలో మొక్కజొన్న పొత్తులు నీకోసమే
నా చేనులో పండిన ధాన్యం నీకోసమే
ఇంట్లో వండిన మద్యంతాగి
మత్తెక్కి నీకోసం కదిలే చూపులతో
నేను నిన్ను పిలుస్తాను ప్రియా
నువ్వు తప్పక రావాలి సుమా
కానీ నువ్వు గుట్టుగా రావాలి ప్రియా
నింగిన వెన్నెలకాచే వేళ
నెమ్మదిగా కదులుతూ చెట్ల క్రీనీడల్లో
అయినా నేను నీ కోసం ఎదురు చూస్తాను
నాకేమో సిగ్గు నాకెంతో భయము
ఊరినిండా చుట్టాల మయము
ఒకవేళ నే కంట పడితే భయంతో పారిపోతాను అయినా కానీ ఓ ప్రియా
మన రక్తాన్ని చెమట నీటిగా మార్చాము బుజ్జగింపుల రేగుపండ్లన్నీ నీకోసమే
నా ప్రియా అన్నీ నీకోసమే
పాట వింటున్నా సోమ్లా గుండె బాధతో ముక్కలు అయిపోయింది . తనకది సౌందర్యమూ స్పృహ లేనటువంటి ఒక నిస్సార మైన పాట. ఎవరికోసం, ఎవరికోసం అంటూ నిరాశతో తనలో తాను దుఃఖించాడు. బండ్లపై తరలించబడే ఫలాల్లో తమకు దక్కేది శూన్యం.
ఈ ప్రేమంతా వ్యర్థం ఖాళీ అంతా శూన్యం కేవలం హేళనలు నిందలు మాత్రమే గుండెను గుచ్చుతూ తమకు దక్కేది.
పర్వతాలను కప్పబడిన ఆకాశం, అడవి , లోయలూ విశాలంగా వ్యాపించిన పొలాలు అన్నీ ఫారెస్ట్ అధికారుల కోసం, వడ్డీ వ్యాపారుల కోసం, రుణ గ్రస్త కార్మికులు కూడా వారి కోసమే.
……….
ప్రతిరోజు తండ్రీకొడుకులు వేకువనే ఇంటి నుండి బయలు దేరుతారు. రోజంతా పని చేస్తారు. రకరకాల పనులు అనేక గ్రామాల్లో “ఖానాబాయ్, పీపల్ పదార్, కుట్టింగా” వంటి మైళ్ళ కొద్ది దూరంలో ఉన్న ఊర్లకు వెళ్లి , సాయంత్రం వచ్చేవారు. అప్పుడు వాళ్ళ భుజాలపై ఉన్న సొరకాయ బుర్రలు ఖాళీగా మిగిలేవి, చెరొక గొడ్డలి, తలపై టోపీ, ఆకులతో కుట్టపడ్డ అచ్ఛాదన వీపుల మీద, ఇది రుణగ్రస్త కార్మికుల వేషం.
పని అయిపోగానే ఇంటి వైపు తిరుగు ప్రయాణం మొదలు పెట్టేవారు. వారి అరచేతులు కమిలిపోయి, ముంజేతులు పేలిపోయే అంత నొప్పితో, నోరు ఎండి పోయి, బాగా అలసి, విసిగిపోయి మాట్లాడాలంటే కష్టంగా ఉండేది. మౌనంగా వారి నడక సాగేది.
కొండలు గుహలు గుసగుసలాడే అడవి దారిలో రాత్రి వలన కలిగిన విరామంతో చేయవలసిన పని వదిలి చుక్కలు పొడిచిన చీకటిలో నడుస్తున్నారు వారు ఆరాత్రి. నక్కల ఊళలు పెడుతున్నాయి. అప్పుడప్పుడు జింకలు అరుస్తున్నాయి హెచ్చరిక చేస్తున్నట్టు. పోతు జింక కీచు మంటూ ప్రాణాపాయం నుండి తప్పించుకొని పరుగులు పెట్టేది. పులుల చేత పీడించపడుతున్న అడవి అది. అంతా చీకటితో చుట్టబడి ఉంది. రక్షణ లేని ఇద్దరు కష్టపడి కొండలు లోయలు దాటుతూ ఇంటి వైపు నడుస్తున్నారు.
రుణగ్రస్త కూలీలకు జీవితంలో ఈరోజుకు మరో రోజుకు తేడా ఏమీ ఉండదు. షావుకారు ప్రతిరోజు వారి పనిని కొలతలతో లెక్క వేస్తాడు. పని తగ్గినా పనిలోకి ఆలస్యంగా వచ్చినా కార్మికులను బూతులు తిట్టడం తోపాటు పని ఎక్కువ అప్పగిస్తాడు. ఆ విధంగా ఏ మార్పులు లేకుండా రోజులు గడుస్తున్నాయి వారికి. అన్ని చీకటి రాత్రులే వెన్నెల వెలుగులు ఉండవు వారికి.
*** *** *** ***