ప్రియమైన వాళ్ళు
కొందరుండే వాళ్ళు
నాదే అనుకునే చిన్న పెంకుటిల్లు
అల్లుకున్న జాజిమల్లి పొద
ఇంటిముందు
సాయంకాలం పూచే రుద్రాక్షలు
గురుగులాడుకున్న పిల్లలు
అలిగి
అల్లరిపడే తోబుట్టువులు
అందమైన గతమొకటి ఉండేది
ప్రియమైన వాళ్ళు
కొందరుండే వాళ్ళు
శూలాలు గుచ్చుకొని
విలవిలలాడి పోయినప్పుడు
జిందాహొనా జరూరీ హై
అంటూ భుజంమీద మోసిన వాళ్ళు
లెక్కలేనన్ని చిక్కుల్లో
చిక్కుపడకుండా ఉంటే
తప్పుకోకపోయేవారు
నిమిషాలు లంకెలు
కలుపుకుంటాయి
ఏటేటా మడుగులో కొత్తనీరు చేరినట్టు
మనషులు కలిసి మాయమైపోతుంటారు
బాగా రంధి పడ్డ రాత్రి
మృదువైన గులాబీ నీడలాగా
కనురెప్పల మాటున తచ్చాడుతుంటారు మనవాళ్ళుగా మనలేకపోయినా
ప్రియమైన వాళ్లుగా
కొందరుండి పోతారు