కనిపిస్తే చాలు కళ్ళముందు శతకోటి నక్షత్రాలు పూసి
నీ పరిమళం నా ప్రాంగణమంతా ఎగసి ఎగసి
ఇద్దరం ఒక్కసారి ఆగి .. ఆగి చూసుకుంటూ
పరిగెత్తి హత్తుకోవడమే మరచి నిశ్చేష్టులమై నిలిచి
యుగాల కింద విడిపోయి ఇప్పుడే మళ్ళీ కలిసినట్టు
కళ్ళ వాకిళ్లు తెరిచి మనసు లోగిళ్ళలోకి పిలిచి
మంచు మైదానాలలో నడిచి నడిచి
నీ రూపాన్ని తాగిన కళ్ళు మరి దేన్నీ తాకక
మత్తిలి సోలి పోయినప్పుడు
అలలు అలలుగా నీ నవ్వు నా మనోతంత్రుల్ని మీటినట్టు
నీ స్పర్శ నా సమస్త దేహాన్నీ విద్యుదీకరించి
నీ పలకరింత ఒక స్వరతంత్రిగా మారి మధురస్వనమై మోగినప్పుడు
ఉత్సాహానికి తప్ప ఇక దేనికీ లొంగక
ప్రపంచం నుండి వడివడిగా విడివడిన
దృశ్యాలు కనురెప్పలపై వాలుతున్నాయి
రాత్రి వెన్నెలతో దిగులు దివిటీల నా కళ్ళను వెలిగించుకుని
కరగని మంచుకన్నా కఠినమైన నిశ్శబ్దపు కారణం వెదుకుతూ
కొలతకు అందని ఈ దూరపు దీర్ఘతని అంచనా వేస్తూ
కలతకు నెలవైన మది పరివేదనను వెక్కిళ్ళతో లెక్కిస్తూ
ఓరిమి లేని సమయాన్ని కూరిమి చేకూర్చని విఫల యత్నాన్ని
చిగురంత విశ్వాసాన్ని కలిగించలేని బంధాన్ని
నిందిస్తూ ఆశగా నిన్ను అభ్యర్థిస్తున్నా ..
మళ్ళీ ఎప్పటిలా ఉండకూడదూ !