డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకున్నాం. ఈ వ్యాధిని మానవుల్లో కనుగొని నాలుగు దశాబ్దాలైనా, ఇంతవరకు దానిని పూర్తిగా నివారించే మందులను కనిపెట్టలేకపోయాం. దానికి ముఖ్య కారణమేమిటంటే, ఆ వైరస్ తన యాంటీజెనిక్ నిర్మాణాన్ని తరచుగా మారుస్తూ వుండడం. అందువల్లనే వ్యాక్సిన్ ను కూడా యింతవరకూ తయారు చెయ్యలేకపోయాం.
ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా, యీ వ్యాధిని నియంత్రించాలనే ఉద్దేశ్యంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, 1988 నుండి ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదం ద్వారా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తేదీన జరుపుతూనే ఉంది.
ఈ వ్యాధి బారిన పడిన వారందరి హక్కులు పరిరక్షించబడితే, ప్రపంచంలో ఎయిడ్స్ అంతమవుతుందనే ముఖ్యాంశంతో, 2030 నాటికి ఎయిడ్స్ ను అంతం చెయ్యాలనే సంకల్పంతో ఈ సంవత్సర నినాదం “Take the rights path: My health, my right!” రూపుదిద్దుకుంది. ఇక్కడ హక్కులంటే, ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారందరికీ, దేశాల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా, సమాజంలో యే విధమైన వివక్షతా లేకుండా, ఒకే రకమైన పరీక్ష మరియు చికిత్సా విధానాలు, అందుబాటులోకి వస్తే, ఎయిడ్స్ వ్యాధిని అదుపు చెయ్యగలమనేదే ముఖ్యోద్దేశం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 39.9 మిలియన్లైతే, 2023లో కొత్తగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకినవారు 1.3 మిలియన్లని, ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 6.3 లక్షలని అంచనా.
ఈ శతాబ్దంలో కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగా గజగజలాడించిందో మనందరికీ తెలిసిందే. రెండేళ్లు ప్రపంచమంతా అతలాకుతలమైనా, చివరకు వ్యాక్సిన్ కనిపెట్టి దానిని మనం అదుపు చెయ్యగలిగాం. అలాగే గత శతాబ్దం చివరిలో… వివరంగా చెప్పాలంటే 1981లో మొదటిసారిగా కనుగొనబడిన ఎయిడ్స్ అనే ఈ వ్యాధి ప్రపంచాన్ని అదేవిధంగా వణికించినా, యిప్పటికీ దానిని పూర్తిగా నయం చేసే మందులు గాని, వ్యాక్సిన్లను గాని కనిపెట్టలేకపోయాం. దానికి ముఖ్య కారణం, వాటిలో ఉండే ఏంటీజెనిక్ వైవిధ్యం- మాటిమాటికి వాటి జన్యువులలో వచ్చే మార్పులు. అందుకని ఏ చికిత్స అయినా పూర్తిగా ఈ వైరస్ ను రూపుమాపలేక పోతుంది.
1981, జూన్ 5వ తారీఖున, అంతవరకు ప్రపంచంలో లేని వ్యాధిని మొదటిసారిగా, అమెరికాలో కనిపెడితే, 1982లో దానికి ఎయిడ్స్ ( ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్) అనే పేరు పెట్టారు. సిండ్రోమ్ అంటే పలు రకాల జబ్బులు కలిసినదని అర్థం. 1983లో వ్యాధికారక వైరస్ క్రిమిని కనుగొని, దానికి హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్) అనే పేరు పెట్టారు. చింపాంజీలకు, గొరిల్లాలకు వ్యాపించే సిమియన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ అనే క్రిమిలో, మార్పులు జరిగి హెచ్ఐవి క్రిమిగా మారిందని, సైంటిస్టుల అభిప్రాయం.
ఈ వైరస్ దానంతట అది ఏమీ చేయదు. కాని మానవ రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసి, రోగి వివిధ వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది. ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి సంక్రమించే పద్ధతులు- శారీరక సంపర్కం, రక్తమార్పిడి, సూదులు- సిరెంజులు మరియు వ్యాధి ఉన్న తల్లి నుండి బిడ్డకు.
ఈ వ్యాధికి ఉన్న ఇంకొక ముఖ్య లక్షణమేమిటంటే వైరస్ సోకినా, ఇంకొక వ్యక్తికి ఈ వ్యాధిని వ్యాపింప చెయ్యగలిగినా, ఆ మనిషి ఆరోగ్యవంతుడిగా కనిపించడం. వ్యాధి సోకిన కొన్ని వారాలలో మనిషి ఫ్లూ లక్షణాలతో బాధపడడం జరుగుతుంది. ఆ తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థ వైరస్ ను అదుపు చేసి, రోగ లక్షణాలను తగ్గిస్తుంది కానీ వైరస్ శరీరంలోని కణాలతో కలిసిపోయి, మనిషి స్రావాల నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంది.ఆ సమయంలో ఆ వ్యక్తితో లైంగిక సంపర్కం పెట్టుకునే వాళ్లకు ఆ వ్యాధి సంక్రమించడం… ఈ రకంగా ఆ వ్యక్తి తనకు వ్యాధి వుందని తెలుసుకునే లోపలే, ఎంతోమందికి ఆ వ్యాధిని వ్యాపింప చెయ్యడం జరుగుతుంది. అందుకని ఈ వ్యాధిని ఇంకా అదుపు చెయ్యలేకపోతున్నాం.
ఈ వ్యాధిని నివారించడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయా దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. సులభతరమైన పరీక్షా పద్ధతులను, చికిత్స విధానాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వ్యాధి బారిన పడిన ప్రతి అందరికీ అవి అందేలా చేస్తున్నాయి. ఏ వ్యాధికీ యివ్వనంత ప్రాముఖ్యతనిచ్చి, రక్తమార్పిడి ద్వారా, సూదులు సిరెంజుల ద్వారా వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, పరీక్ష, చికిత్సా విధానాలు అందరికీ అందుబాటులోకి తెస్తున్నా, అవన్నీ ఎయిడ్స్ రోగి జీవన ప్రమాణాలను పెంచగలగడం వరకే పరిమితమవుతున్నాయి కాని, వ్యాధిని పూర్తిగా నివారించలేక పోతున్నాయి.
ఈ వ్యాధి బారిన పడినవారు ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనే యెక్కువ మందున్నారు. దీనికి ముఖ్య కారణం సరియైన మందులు, వ్యాక్సిన్ లేకపోవడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా లైంగికపరమైన నియంత్రణ చేసుకోలేక పోవడం, నివారణా చర్యలను పాటించకపోవడం. ఈ రెండూ పాటించిననాడు, వ్యాధి సోకిన వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అలా జరగాలంటే లైంగిక విద్య గురించి యువతరానికి చిన్నప్పటి నుండే అవగాహన ఉండాలి. పాఠ్యాంశాలలో లైంగిక విద్యను చేర్చినా, పిల్లలలందరికీ విద్యనందించి, వారిలో అవగాహనా శక్తిని పెంపొందించ గలిగినప్పుడు మాత్రమే, లైంగిక పరంగా కూడా వ్యాపించగలిగే ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులను అరికట్టగలం. అందుకే అవగాహన పెంచు, హక్కులను అందించు అనే నినాదంతో ముందుకొచ్చిన, డబ్ల్యూహెచ్ఓ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్దాం. 2030 నాటికి ఎయిడ్స్ వ్యాధిని అదుపు చేద్దాం.
ఇప్పటికీ కూడా హెచ్ఐవి సోకిన ప్రతి ఒక్కరికీ వారికా వ్యాధి ఉందనే విషయమే తెలియడం లేదు. తెలిసాక కూడా అందరూ చికిత్సను తీసుకోవడం లేదు. చికిత్స తీసుకున్న అందరిలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి 95-95-95 లక్ష్యాన్ని నిర్దేశించింది. అంటే హెచ్ఐవి సోకిన వారిలో కనీసం 95% మందికి, హెచ్ఐవి ఉందనే విషయం తెలియడం, అలాగే తెలిసిన వాళ్లలో 95% మంది చికిత్సను అందుకోవడం, చికిత్స అందుకుంటున్న వారిలో 95% మందికి వైరల్ లోడ్ తగ్గడమనేదే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలను రూపొందించింది.
ఇంకొక వైపు హెచ్ఐవి మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అవి కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. మ్యుటేషన్ చెందిన CCR5- డెల్టా 32 అనే ఒక రిసెప్టార్ ను, మూలకణాల మార్పిడి ద్వారా ఎక్కించి, హెచ్ఐవి ని అరికట్టవచ్చని కొన్ని కేస్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. అందరి అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. తొందరలోనే ఆ ఫలితాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని, హెచ్ఐవి వైరస్ పైన మానవాళి విజయం సాధిస్తుందని ఆశిస్తూ…