శాంతం – ప్రశాంతం ఓ అవసరం

7-12-2024 తరుణి పత్రిక సంపాదకీయం

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఊరికే అన్నారా పెద్దలు! నోరు స్వతంత్రంగా మాట్లాడలేదు మెదడు ఇచ్చే ఆదేశాలను సందేశాలను అందుకొని మాట్లాడుతుంది మెదడు కు భావాలను అందజేసేది మనసు, అస్తత్వం. గుండె వీటన్నింటికీ ఆధార భూతం. గుండె ఆగితే మెదడు పనిచేయదు. మెదడు సంకేతాలిస్తేనే శరీరమూ,మనసు పని చేస్తాయి. ఆలోచనసుకు రూపం ఉన్నదా? లేదు. చనకు రూపం ఉన్నదా? లేదు. ఇవి మనిషి చైతన్యాలను ప్రతిబింబించే చేతల ద్వారా తెలుస్తాయి.ఇదంతా సైన్స్ కి సంబంధించిన విషయం.కానీ, అంతర్లీనంగా ఉన్నదంతా మానవ స్థితి,మనస్థితి , బ్రతుకు. భావ బంధాలు, భవ బంధాలు ,బ్రతుకు బంధాలు చెప్పడం కొరకే.
అరిషడ్వర్గాలు ఉంటాయి అని భారతీయ చైతన్య వికాస
కలిగింది. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆరు అంత శత్రువులను జయించాలంటే మనుషులు చాలా సాధన చేయాల్సి చేయాలి. మనసును అదిమి పట్టుకోవడం కోసం కొంత నైనా శ్రమ చేయాల్సి వస్తుంది. పుట్టుకతో మనిషి క్రూరడు కాదు పరిసరాలు మారుస్తుంటాయి. ఇది తెలిసిన విషయమే కాబట్టి శాంతిని కోరుకోవడంతో ఆ అంతః శత్రువులను జయించగలం. వాటిని అధిగమించాలని ఆలోచన ఉంటే శాంతిని సహనాన్ని అలవర్చుకుంటాం.
Emotional state అంటే భావోద్వేగపు స్థాయి అనేది మనిషి ఆలోచనలను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ ఎమోషన్స్ ని రసాలు అంటాం మనకు నవరసాలు ఉన్నట్టుగా సాహిత్యంలో రూపకల్పన చేసుకున్నాం.
శృంగార రసం దీన్నే ప్రేమ రసం అని కూడా అంటారు, హాస్యరసం, కరుణరసం,రౌద్రరసం ,వీర రసం, భయానక రసం, భీభత్సరసం, అద్భుత రసం ,శాంతరసం ఈ నవరసాలు మనిషిని వీడకుండా ఉంటాయి. భరతముని నాట్య శాస్త్రంలో ప్రముఖంగా చెప్పబడినటువంటి రసాలు.
చిట్టచివరగా చెప్పబడిన శాంతరసం మొట్టమొదటిగా అందరూ కోరుకోవాల్సినటువంటి ఎమోషన్. శాంతం భూషణం. సంస్కారాన్ని అలవరుస్తుంది. సహనమైనా శాంతమైనా మనిషికి నిగ్రహ శక్తినిస్తాయి. తన కోపమే తన శత్రువు మన శాంతమే తనకు రక్ష అని వేమన ఎప్పుడో చెప్పాడు. ఇది యుగాలు మారినా తరాలు మారినా సర్వకాల సర్వావస్థల లో సరైనటువంటి సూక్తి. శాంతి తో ఉంటే ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆవేశాన్ని నిలువరిస్తుంది కాబట్టి ఈ సుగుణాన్ని ఎప్పుడైనా ఎవ్వరైనా కోరుకోవాలి. అహంభావ వికారాలను అదుపు చేస్తుంది. ఎగో ఎస్ట్ అని పేరు తెచ్చుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఆ వ్యక్తిపై ఉండే భయానికో అవసరాలకు వాళ్ళ ముందు తలవంచి మాట్లాడతారే గాని దూరం వెళ్లిన తర్వాత తప్పకుండా మనసులోనైనా తిట్టుకుంటారు ఇంతగా గర్వం ఎందుకు ఇంత కోపం ఎందుకు మంచి పేరు సాధిస్తారా అని అనుకోకుండా ఉండరు. కాయ క్షేత్రం ఏదైనా సరే ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తారు పరిసరాలలో ఉన్న వ్యక్తులు. కీలకమైన సమయాలలో చక్కని నిర్ణయం తీసుకోవడానికి శాంతమే బలాన్నిస్తుంది.
తామరాకు మీద నీటి చుక్కల క్షణం వచ్చి పోయే కోపం మనిషికి నష్టం చేయదు కానీ బంకల మనస్తత్వాన్ని పట్టి ఉంటే అన్నీ నష్టాలే.
నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించాలి అంటే ప్రశాంతంగా ఆలోచించగలగాలి. ఇది శాంతం తో సాధ్యం. ఈర్ష సుయ ద్వేషాలను దగ్గరికి రానివ్వదు.
ఎదుటివాడలో తప్పులను ఎంచడం ఎవరు పొగిడిన దానికి పడిపోవడం అవసరం లేకుండా ఇతరులను విమర్శ చేయడం ఇవి ఏవి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకురావు.
సంకుచిత తత్వం క్షణికమైన లాభాలను ఇస్తుందేమో కానీ శాశ్వతమైన మంచి కీర్తిని మాత్రం తెచ్చి పెట్టలేదు. స్థితప్రజ్ఞులు అని ఎవరిని అంటారు ఇదిగో ఇలా ఆవేశకావేశాలు లేకుండా నియంతృత్వ ధోరణి కాకుండా సంయమనంతో సద్భావంతో శాంతంగా ఉండే వాళ్లనే స్థితప్రజ్ఞులు అంటాం. ఇవన్నీ మన భారతీయ తత్వవేత్తలు ఏనాడో చెప్పారు. ఎవరైనా మంచి పేరు తెచ్చుకున్న వాడని చూస్తే వాళ్ల గుణగణాలను వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది. అలాంటి మంచి స్థాయిని చేరుకోవడానికి ప్రయత్నించేందుకు శాంతం ఒక ఊత కర్ర వంటిది. చిమ్మ చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు వెలుగు కాగడా వంటిది. కొన్నిసార్లు ఇష్టాలను వదులుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు కష్టాలను భరించాల్సి వస్తుంది కానీ చివరికి మంచి స్థాయిలో నిలబెట్టేది మాత్రం కేవలం… కేవలం శాంత స్వభావం ఒక్కటే.
చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే రాగద్వేషాలను నియంత్రించగలిగే శక్తి వస్తుంది. కావాల్సింది విచక్షణతో ఆలోచించడం. అయితే చుట్టూ ఉన్న వ్యక్తుల మాటల ప్రభావం, చేతల ప్రభావము తప్పకుండా ఉంటుంది పెరుగుతున్న కుటుంబ వ్యవస్థ ప్రభావం కూడా ఉంటుంది. ఎంతసేపు ఎదుటి వాళ్ళ లో ఉన్న తప్పులను ఎంచాలనే స్వభావం ఉన్న తల్లిదండ్రుల మాటలు స్నేహితుల మాటలు మనిషిని కలవరపెడుతాయి ఆ కలవర కలవరపాటుతోనే గుణహీనులవుతారు. శాంతాన్ని కోల్పోతారు. కానీ శాంతం ప్రశాంతతనిస్తుంది ప్రశాంతత మెరుగైన జీవితాన్ని ఇస్తుంది.
కామ క్రోధ రాహిత్యమే శమం. శమము అంటే శాంతి. క్షమాగుణానికి మూలాధారం. ప్రశాంతము అంటే ఎక్కువ శాంతితో ఉండడం. ఎన్ని పదవులు ఉన్నా కోట్లు కోట్లు గడించినా ఎంత సంపద ఉన్నా ప్రశాంతత లేని జీవితం వ్యర్థం.
తినేది కడుపుకు బొక్కెడు బువ్వ. అంతే! మెరుగు బంగారము మింగబోరు అనే మాట ఊరికే రాలేదు.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు

దొరసాని