వృత్తిలో రాణిస్తూ ప్రవృత్తితో పేరుగాంచిన శ్రీమతి మీరాగారు…
మా అమ్మగారి పేరు గాయత్రి.నాన్నగారు కళ్లే. శంకరశాస్త్రి గారు. తహసిల్దారుగా తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసారు. అమ్మకు ఆంధ్రప్రభ వంటి పత్రికలు చదవడం ఇష్టం. అందుకే నాకూ ఆ అభిరుచి ఏర్పడిందేమో. మేము అయిదుగురు అక్కచెల్లెళ్ళం, ఒక్కడే తమ్మ్ముడు. కాకినాడ మున్సిపల్ స్కూల్లో తరువాత పి.ఆర్ కాలేజిలో. చదువుతున్నరోజుల్లో మా ఇంగ్లీష్ మాస్టారు చిన్న బులుసుగారి ప్రోత్సాహంతో కాలేజి మాగజైనుకి రెండు చిన్న కథలు రాసాను. అదే నా రచనా వ్యాసంగానికి మొదలు. నేను బి ఏ మొదటి సంవత్సరంలో వుండగానే అమ్మ పరమపదించడం,మేము కాకినాడ నుండి అనంతపురం వచ్చేయడం జరిగింది. అమ్మ ప్రేమతో నిండిన కాకినాడ జ్ఞాపకాలు ఇప్పటికి మనసునిండా వున్నాయి.
శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ; పి.హెచ్.డి అందుకున్నాను. మా శ్రీవారు తంగిరాల సుబ్రహ్మణ్యం గారు , నేను ఇద్దరం ఆంగ్ల ఉపాధ్యాయులం కావడం యాద్రుచ్చికం. దరిమిలా ఇద్దరం 1994, 1995 లలొ రాష్త్ర ఉత్తమ అధ్యాపకులుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అవార్డ్స్ పొందాము.
ముప్ఫైఏళ్ళ ఉద్యోగ జీవితంలో ఎందరో విద్యార్థుల అభిమానం పొందాను. నా విద్యార్థులు ‘పెద్దవాళ్ళు పెళ్ళి చేస్తామంటున్నారని చదువు మానేస్తామన్నా, ‘ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవని క్రుంగి పోతున్నా ‘నేను దాటిన ఒడిదుడులుల గురించి చెప్పి పట్టుదలతో సాధించలేనిది లేదని ప్రోత్సహించిన సందర్భాలు, “మేడం! నేను మీలాగా చదువుకుని వుద్యోగం చేస్తాను.” అన్న అమ్మాయిలను చూసి సంతోష పడిన సందర్భాలు ఎన్నో .
కాలేజిలో డ్రమటిక్స్ సెక్రెటరిగా వున్నప్పుడు విద్యార్ధినులతో శ్శాస్త్రీయ న్రుత్య ప్రదర్శనలు, నాటికలు వేయించడం, యూనియన్ సెక్రెటరీగా చిన్మయానంద వంటి ప్రముఖుల సభానిర్వహణ బాధ్యత వహించడం, చంద్రబాబు మానస పుత్రిక ” జన్మభూమి” కార్యక్రమంలో విద్యార్థినులతో కలిసి మురికి పేటలను శుభ్రం చేయడం, యెయిడ్స్ వ్యాధిని నిలువరించే ఉపన్యాసాలు, కాలేజి అమ్మాయిలతో విజయవాడ, వైజాగ్,రాజమండ్రి,కాకినాడ వైజ్ఞానిక ఎక్స్కర్షన్ మంచి జ్ఞాపకాలు.
నేను డా.శ్రీ ఎం.వి.రామశర్మ ( ఎస్ వి యూనివెర్శిటీ వైస్ చాన్సలర్ ) గారి వద్ద పి .హెచ్ .డి చేసేటప్పుడు, నా ఉద్యోగ బాధ్యతా నిర్వహణ సమయంలోను, మా ముగ్గురు అమ్మాయిలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే విషయం లోను మావారు సుబ్రహ్మణ్యంగారు అడుగడుగునా నాకు అండగా వుండి నడిపించారు. పెద్దమ్మాయి ఆస్త్రేలియాలో రెండవ, మూడవ అమ్మాయిలు అమెరికాలో మంచి ఉద్యోగాలలో భర్త, పిల్లలతో స్థిరపడ్డారు.
రచయిత్రి పరిచయం:
పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం )
చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు.
ఉద్యోగం :- ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ.
నా పి హెచ్ డి థీసిస్ ” ఢిల్లి ప్రిస్టెజ్ పబ్లిషర్స్ ” విమెన్ వాయిసెస్” గా ప్రచురించారు.నేను రాసిన అనేక ఆంగ్ల వ్యాసాలు త్రివేణి, విమెన్ నావెలిస్ట్స్ మొదలైన సాహితీ సంకలనాలలో ప్రచురితం.
తెలుగు రచనలు:-
కథలు:- 1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురించారు.
నవలలు 4 :- 1. మనిషి-మమత ( ఆంధ్రప్రభ వారపత్రిక)2. చెదరినస్వప్నం;3.సిద్ధసంకల్ప;4.సంహిత ( ఆంధ్రప్రభ, స్వాతి పత్రికలలో)
కథాసంకలనాలు:- 1.ఆశలమెట్లు 2.కలవరమాయెమదిలో,3.వెన్నెలదీపాలు,4.మంగమ్మగారిఅమెరికాకథలు,5.మనసుపరిమళం,6.ఏదేశమేగినా,7.జగమంతకుటుంబం, 8. ” వేకువలో- చీకటిలో”, 9. “ద కేజ్ అండ్ అదర్ స్టోరీస్” ఆంగ్లకథా సంకలనం.
నా మొదటి కథ ” పసిమనసులు” 1963 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది.మా నాన్నగారు ఎంతో ముచ్చటపడి అందరితో చెప్పుకున్నారు. ఆ ప్రొత్సాహంతోనే ముందుకు సాగాను. అడపా దడపా మాత్రమే రాసినా ఈ అరవై మూడేళ్ళలో చాలా కథలే వచ్చాయి. తెలుగు దేశంలో వచ్చిన ముఖ్యమైన పత్రికా సంపాదకులు అందరు నా కథలను ఆదరించారు. ఆ కథలే ఎనిమిది కథా సంపుటాలుగా రూపుదిద్దుకున్నాయి. వారందరికి నా కృతజ్ఞతలు.
వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు నా మొదటి కథాసంకలనం “ఆశలమెట్లు” ఆవిష్కరిస్తూ ‘మీరాబాయి చిన్న కథానికా రచనను కరతలామలకం చేసుకున్నారు ‘అనడం నా భాగ్యంగా భావిస్తున్నాను . జగమెరిగినహాస్య రచయిత శ్రీ చిట్టెన్ రాజుగారు 2007 యుగాది సందర్భంలో నా రెండో కథా సంకలనం “కలవరమాయె మదిలో” అమెరికాలో ఆవిష్కరించడం నా సుక్రుతం. నా మూడవ కథాసంకలనం ” వెన్నెల దీపాలు” గురించి వసుంధరగారు “రచన” మాసపత్రికలొ అద్భుతమైన సమీక్షరాసారు. నా సప్తమ కథాసంకలనం ” జగమంతకుటుంబం” అమెరికాలో వీక్షణం సభలో చంద్రశేఖర అజాద్, గీతామాధవి, తాటిపాముల మ్రుత్యుంజయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడడం నా అద్రుష్టం.
విహారి గారు,కూర చిదంబరంగారు, సుధామగారు వంటి విమర్శకులు నా కథల లో క్లుప్తత , గాఢత, సామాజిక స్పృహ, ఆశావహ దృక్పథం వంటి గుణవిశేషణాలను గురించి ప్రస్తావించడం సంతోషకరమైన విషయం. వారికి నా కృతజ్ఞతలు.
1966 లో ఆంధ్ర ప్రభలో నా మొదటి నవలిక ” మనిషి- మమత ఆరు వారాలు ధారా. వాహికగా వచ్చింది.ఎందుకోమరి చిన్నకథలు రాయడమే కొనసాగించాను. తరువాత ఎన్నొ ఏళ్ళకు మరో మూడు నవలలు స్వాతి మాసపత్రికలో వచ్చాయి.
కరోనా తరువాత పత్రికలు మూతబడటంతో అంతర్జాల పత్రికలు రచయితలను, చదువరులను ఆహ్వానించాయి. “గో తెలుగు”, “కెనడా తెలుగుతల్లి”,”నెచ్చెలి”,” వీక్క్షణం”, ” సుజనరంజని”, ” విహంగ”, “అచ్చంగా తెలుగు”, ” మనకథలు”,” మా కథలు”, “వంగూరి చిట్టెన్ రాజుగారి సంకలనం”, “కథాకేళి”, “టాగ్స్” ” సిరి మల్లె”, ” వంగూరి చిట్టెన్ రాజు గారి డయాస్పోరా కథలు” మొదలైన పత్రికలలో నా కథలు ప్రచురించారు.
నా కథలు ఆంగ్లంలోకి అనువదించి పంపితే ఇరవై కథల పైన నెల నెలా “నెచ్చెలి” అంతర్జాతీయ పత్రికలో ప్రచురించారు. ఆ కథలే ఇప్పుడు “ది కేజ్ అండ్ అదర్ స్టోరీస్. “ అనే ఆంగ్ల సంకలనంగా వస్తోంది. “నెచ్చెలి” సంపాదకురాలు గీతామాధవికి కృతజ్ఞతాభివందనాలు . గీతామాధవి గారు నాతో ముఖాముఖి నిర్వహించి “వీక్షణం” పత్రికలో సమర్పించారు.
ఇంకా:- కవితలు, ఆంగ్లకథలు, ఆంగ్ల సాహిత్య వ్యాసాలు ప్రసిద్ధ సాహితీ పత్రికలలో ప్రచురితం. ఆకాశవాణి కడప, కర్నూలు కేంద్రాల నుండి పలు ప్రసంగాలు కథలు, నాటికలు, ప్రసంగ వ్యాసాలు ప్రసారమయ్యాయి
ప్రశంశలు:- జ్యోతి, ఆంధ్రభూమి, రచన పత్రికలలో నా కథలు బహుమతి పొందాయి
1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండీ ఉత్తమ అధ్యాపకురాలి ” పురస్కారం అందుకున్నాను.
ఈ సంవత్సరం అమెరికా తెలుగు కథానికలో నా కథ ప్రచురితం. తెలుగు కథ శతజయంతి కథా సంకలనం “ నూరు కథలు- నూరుగురు కథకులు” లో నా కథ చోటుచేసుకుంది .ఇంకా పలు కథానికా సంకలనాలలో నా కథలు ప్రచురితం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో కథల పోటీలో రెండుసార్లు, కెనడా తెలుగుతల్లి కథల పోటీలో బహుమతులు లభించాయి