త్యాగయ్య పాదాల చెంత చేరిన స్వర సుమం – బెంగుళూరు నాగరత్నమ్మ

“భజన సేయ రాదా” అంటూ ( అఠాణా రాగం) లో ఆ మహనీయుడు కూర్చిన కృతి వారి చెవిని సోకిందో లేక “ఇంతకన్నా ఆనందమేమో ఓ రామ రామ” (బిలహరి రాగం) లోని కృతి వారి ఎద తలుపు తట్టిందో తెలియదుగానీ కర్ణాటక నుండి కదిలిన వారి అడుగులు “ఏ తావున నేర్చితివో ” (యదుకుల కాంభోజి రాగం), “దరిని తెలుసుకుంటి “(శుద్ధ సావేరి రాగం) అంటూ కావేరి నదీతీరంలోని ఆ మహనీయుడి సమాధి మందిరాన్ని వెతికి, వారి కృతులను విశ్వవ్యాప్తం చేసి, ఆ నాదబ్రహ్మ పాదాల చెంత తనువు చాలించిన స్వర సుమం బెంగళూరు నాగరత్నమ్మ గురించి తెలుసుకుందాం.

కర్ణాటక రాష్ట్రం, మైసూర్ కు దగ్గరలోని నంజనగూడు అనే చిన్న గ్రామంలో పుట్ట లక్ష్మమ్మ (దేవదాసి) – సుబ్బారావు (వకీలు) కి 03/11/1878 బహుధాన్య కార్తీక శుద్ధ నవమి రోజు జన్మించారు. వీరికి ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలి వేయడంతో వీరి తల్లి పలు కష్టాలకోర్చి , పట్టుదలతో వీరిని పెంచారు. ఐదు సంవత్సరాల వయసులో ఉండగానే దేవదాసి దీక్షను పొందారు.గిరిభట్ట తమ్మయ్య అనే గురువు వద్ద కన్నడం, తమిళం, సంస్కృతం, తెలుగు, కళలు అభ్యసించారు. వయసుకు మించిన తెలివితేటలు, ధారణాశక్తి వల్ల ప్రతి విషయాన్ని త్వరగా ఆకళింపు చేసుకొని ,9 సంవత్సరాలకే గురువును మించిన శిష్యురాలై గురువు అసూయకు పాత్రురాలయ్యారు. పుట్ట లక్ష్మమ్మ పూర్వీకులు మైసూర్ ఆస్థానంలో గాయకులు, సంగీత విద్వాంసులు కావడంతో, తన కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిన తర్వాతే మైసూర్ లో అడుగు పెడతానని ప్రతిజ్ఞ పూని, పలు ప్రదేశాలు తిరిగి, చివరికి కూతురి ప్రతిభ వికసించడానికి బెంగుళూరే అనువైన ప్రదేశం అనే నిర్ణయానికి వచ్చి, ప్రఖ్యాత వయెలిన్ విద్వాంసుడైన తన అన్న వెంకటస్వామప్ప ఇంట్లో ఉండడానికి తగు ఏర్పాట్లు చేయడంతో, అక్కడే నాగరత్నమ్మ సంగీత, నృత్య శిక్షణ పొందారు. త్యాగరాజ శిష్య పరంపరలోని వాలాజీ పేట వేంకటరమణ భాగవతార్ మరియు అతని కొడుకైన కృష్ణస్వామి భాగవతార్ల శిష్యుడైన మునిస్వామప్ప అనే వాయులీన విద్వాంసుని వద్ద సంగీతం, కిట్టన్న అనే నాట్యాచారుని వద్ద నాట్యం, తిరువేంగడాచారి వద్ద అభినయ శాస్త్రం అభ్యసించి, నాలుగు సంవత్సరాల కఠోర శ్రమతో అన్నిటిలో నిష్ణాతురాలయ్యారు. తన 14 వ. ఏట తల్లి మరణం కృంగదీసినప్పటికీ, తట్టుకొని 15 వ. ఏట వేదికపై మొదటి ప్రదర్శన ఇచ్చారు. నాట్యంలో ఆమె ప్రదర్శించిన ప్రతిభకు గాను మైసూర్ పాలకుడైన జయచామ రాజేంద్ర వడయార్ ఆమెను మైసూర్ ఆస్థాన నర్తకి గా నియమించారు.

వీరు పాతికేళ్ల వయసులో ఉండగా వీరి గురువైన మునిస్వామప్ప మరణం వీరి జీవితంలో పెద్ద మలుపని చెప్పవచ్చు. వారి మరణానంతరం నాగరత్నమ్మ తన నివాసాన్ని బెంగుళూరు నుండి చెన్నైకి మార్చడం, అక్కడ స్నేహితురాలైన వీణాధనమ్మాల్, గురువైన పూచి శ్రీనివాస అయ్యంగార్ ల ప్రోత్సాహంతో తన ఇంట్లో నిర్వహించే కచేరీలు, భజనలకు పలువురు సంగీత విద్వాంసులు హాజరవడంతో ఆమె చాలా ఖ్యాతి గడించి, దక్షిణ భారతదేశమంతటా కచేరులు నిర్వహించి కళాభిమానుల నీరాజనాలందు కున్నారు.

సంగీత,నాట్య, అభినయ శాస్త్రాల్లోని ప్రావీణ్యానికి కన్నడ, తెలుగు, తమిళ, సంస్కృత భాషల్లోని పట్టు తోడైన కారణంగా కృతులు,వర్ణాల్లోని సాహిత్యంపై చక్కని అవగాహనతో పాడటంతో సంగీతం భావపూర్ణమై శ్రోతలను, ప్రేక్షకులను అలరించింది. వారి కచేరీలలో స్వరకల్పన కంటే రాగాలాపనకే ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చారు. యదుకుల కాంభోజి రాగం పాడని కచేరీలు అరుదనే చెప్పవచ్చు. స్త్రీ గళంలోని లాలిత్యం, పురుష గళంలోని గాంభీర్యం మిళితమైన కొంగొత్త గళమాధుర్యం వీరికి వర ప్రసాదమవడంతో, తనదైన బాణి సృష్టించుకుని శ్రోతల హృదయాలలో పీఠం వేసుకున్నారు.

సంగీత, నాట్యాలకు ఎనలేని సేవ చేయడమే కాకుండా, చక్కని రచయిత్రిగా, సాంస్కృతికవేత్తగా, వ్యాఖ్యాతగా కూడా రాణించారు. ‘జైమినిభారతం ‘ , ‘రాజశేఖర విలాసం’, ‘కుమార వ్యాసభారతం ‘వంటి గ్రంథాల నుండి పద్యాలను పఠిస్తూ, వాటిపై చక్కని వ్యాఖ్యానాలు చేసేవారు.

తిరుపతి వేంకట కవులు రచించిన ‘శ్రవణానందం’ అనే పుస్తకంలో ముద్దుపళని విరచితమగు రాధికా సాంత్వనం చదివి, ఏదో అనుమానం పొడసూపడంతో, మనసంగీ కరించక పుస్తకము అసలు ప్రతిని కొని చదివి, రెండింటికీ చాలా తేడాలున్నాయనీ , నాంది లోని కొంత భాగాన్ని తొలగించి ‘శ్రవణానందం ‘ లో ప్రచురించారని గ్రహించారు. తొలగించిన ఆ భాగం నాగరత్నమ్మ తల్లి,అమ్మమ్మలు అనుసరించిన దేవదాసి సంప్రదాయానికి సంబంధించినది కావడంతో ఆ మినహాయింపు వారికి నచ్చక విషయాన్ని సవరించి పుస్తకాన్ని తిరిగి ముద్రణ గావించారు. ఇది వారిలోని ఆత్మాభిమానానికీ, పట్టుదలకు నిదర్శనంగా మనం గ్రహించవచ్చు. మద్రాసు ప్రెసిడెన్సీ లో దేవదాసీల సంఘం మొదటి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.

పేగు తెంచుకుని పుట్టిన తన కూతురు అకాల మరణం పాలవడంతో మాతృత్వంపై ఉన్న మమకారంతో ఒక పాపను పెంచుకోగా, వీరి ఆస్తిపై కన్నేసిన పాప తల్లిదండ్రులు పాలలో విషం కలిపి పాప చేత పంపించగా, భయంతో చేతులు వణికిన పాప పాల గ్లాసును కింద పడేసి, అసలు విషయం చెప్పడంతో, ఐహిక భోగాలపై విరక్తి కలిగి,ఆ రామచంద్రుని పాదాల చెంత తప్ప మరెక్కడా తనకు సాంత్వన లభించదన్న నిర్ణయానికి రావడం, దానికి తోడు ఒకనాటి రాత్రి వీరికి కలలో త్యాగరాజుల వారి సమాధి మందిరం దర్శనమై,త్యాగరాజుల వారికి స్మారక భవనం నిర్మించాలనీ, కర్ణాటక సంగీతాన్ని శాశ్వతం చేయాలననీ,దానికి అనుగుణంగా ఒక వేదిక నిర్మించాలనీ ఆజ్ఞ అందుతుంది.

బిడారం కృష్ణప్ప అనే సంగీత వేత్త ద్వారా త్యాగరాజుల వారి సమాధి జీర్ణస్థితిని తెలుసుకుని , కొంతమంది శిష్యులతో కలిసి తిరువయ్యూరు చేరుకొని, తంజావూర్ రాజులు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఎట్టకేలకు సమాధిని కనుగొనగలిగారు.

సంగీత కచేరీలు నిర్వహించి విరాళాలు సేకరించి, మద్రాస్ లోని తన ఇంటిని మరియు తన నగలను, యావదాస్తిని అమ్మి , రేయింబవళ్లు శ్రమించి 1921 అక్టోబర్ 27 న శంకుస్థాపన జరిపి, 1925 జనవరి 7న ఆలయ కుంభాభిషేకం జరిపించడం, ‘త్యాగరాజ ఆరాధనోత్సవాలు’ పేరిట వేదిక స్థాపించడం ఆమెలోని అకుంఠిత దీక్ష, గురుభక్తి ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెబుతుంది.

ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మందిరాన్ని పునరుద్ధరించినప్పటికీ, ఆనాటి పురుషాధిక్య సమాజంలో ఆరాధన ఉత్సవాలలో స్త్రీలు పాడరాదంటూ వ్యతిరేకించడంతో దానిని వారు సవాలుగా తీసుకొని, ‘పెరియ కట్చి'(ప్రధాన బృందం) పేరిట పురుషులు ఆలయంలో నిర్వహించే కచేరీకి దీటుగా ఆలయం వెనుక భాగంలో ‘ పెంగల్ కట్చి'(మహిళాబృందం) నిర్వహించి త్యాగరాజుల వారి కీర్తనలు గానం చేస్తూ, రెండు బృందాలు విలీనమయ్యేంత వరకు పోరు సలపడం ఆమెలోని పోరాట పటిమకు, సవాళ్లను స్వీకరించే మనస్తత్వానికి నిదర్శనంగా మనం భావించవచ్చు.

వీరు పొందిన బిరుదులు:

విద్యా సుందరి
గానకళాప్రవీణ
త్యాగ సేవాసక్త
రాజమహేంద్రవరంలో శ్రీపాద కృష్ణమూర్తి గారు తొడిగిన గండపెండేరం
1949 వ. సంవత్సరంలో గృహలక్ష్మి స్వర్ణ కంకణం
వీరు రచించిన గ్రంథములు:
శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం)
మద్యపానం (తెలుగు సంభాషణ)
దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు)
పంచీకరణ భౌతిక వివేక విలక్కం (తమిళం)

నేటికీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో పంచరత్న కృతులు పాడి త్యాగయ్యను ఆరాధిస్తే, నాదస్వర గానంతో బెంగుళూరు నాగరత్నమ్మకు ఘన నివాళి అర్పించడం సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది.

భోగినిగా జీవితాన్ని మొదలుపెట్టి, సంగీతంలో మమేకమై రాగిణిగా, భవ బంధాలలో ఆనందాన్ని పొందలేక విరాగిణిగా, చివరికి ఆధ్యాత్మిక సాగరంలో మునిగి యోగినిగా తనువు చాలించారు.

ఆ మహనీయుడికి చేసిన సేవకు, అర్పితమైన ఆత్మకు ప్రతిఫలంగా వీరి సమాధిని ఆ మహనీయుని సమాధి చెంతనే అభిమానులు నిర్మించారు. చేతులు జోడించి తన సర్వస్వమైన ఆ నాద బ్రహ్మకు అంజలి ఘటిస్తున్న భంగిమలో ఆమె శిలామూర్తిని అక్కడ ప్రతిష్టించారు.

నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన కీర్తనంతో భగవంతుని చేరుకున్న ఎంతోమంది ధన్యజీవుల్లో నాగరత్నమ్మ ఒకరు. వ్యక్తిగత జీవితంలో ఆనందం మృగ్యమైపోయినప్పటికీ, సంగీతంలో మమేకమై, తన గాత్ర సౌరభంతో సంగీత ప్రియులని రసవాహినిలో ఓలలాడించిన ఆ ధన్యజీవికి కైమోడ్పులర్పిస్తూ…………..

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లాయర్ సలహాలు

మన మహిళా మణులు- డాక్టర్ మరుదాడు అహల్యాదేవిగారు..