ఒక వీలునామా(Will deed) అనేది వ్యక్తి తన ఆస్తిని మరణానంతరం ఎలా పంచుకోవాలని కోరుకుంటున్నారో తెలియజేసే న్యాయపరమైన పత్రం. ముఖ్యంగా మహిళలు వీలునామా రాయడం లేదా వీలునామా ద్వారా తాము పొందిన ఆస్తి విషయంలో పలు న్యాయ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
మహిళల కోసం వీలునామా లో ముఖ్యాంశాలు:
1. వీలునామా రాసే హక్కు: భారతదేశంలో, పురుషుల మాదిరిగానే, మహిళలకూ తమ స్వంత ఆస్తి లేదా వారసత్వంలో వచ్చిన ఆస్తిపై వీలునామా చేయడానికి పూర్తి న్యాయ హక్కు ఉంది. ఈ హక్కు భారత వారసత్వ చట్టం, 1925 కింద రక్షించబడింది. వివాహిత, వివాహం కాని, లేదా విధవ అయిన మహిళలు కూడా వీలునామా చేయవచ్చు, తమ ఆస్తిని మరణానంతరం ఎలా పంచవలెనో నిర్ణయించవచ్చు.
2. ఆస్తి పంపిణీ: ఒక మహిళ తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికే ఇవ్వగలదు. పిల్లలు, భర్త, బంధువులు, వేరే కుటుంబ సభ్యులు లేదా కుటుంబేతర సభ్యులకు కూడా ఇవ్వగలదు. ఈ విషయంలో ఎటువంటి లింగ భేదాలు వయోపరిమితులు ఉండవు.అలాగే, ఆమె తన ఆస్తిని అనేక లబ్దిదారులకు పంచి, ఒక్కొక్కరికీ ఏ వాటా ఇవ్వాలనేది కూడా స్పష్టంగా చెప్పవచ్చు.
3. వారసత్వ లేదా వంశపారంపర్య ఆస్తిపై హక్కులు: మహిళలకు వారసత్వంలో వచ్చిన ఆస్తి లేదా స్వయంగా సంపాదించిన ఆస్తిపై వీలునామా చేయడానికి పూర్తి హక్కు ఉంటుంది.
4. హిందూ మహిళల ఆస్తి హక్కులు: హిందూ వారసత్వ చట్టం, 1956 (2005 సవరణ) ప్రకారం, కుమార్తెలు కూడా కుమారుల మాదిరిగా వంశపారంపర్య ఆస్తిపై సమాన హక్కులను పొందుతారు, మరియు వారు కూడా ఆ ఆస్తిని తమ వారసులకు వీలునామా ద్వారా అందించవచ్చు.
5. భర్త యొక్క ఆస్తి: ఒకవేళ భర్త వీలునామా చేయకుండా లేకుండా మరణిస్తే, భార్య భర్త ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు. కానీ, భర్త వీలునామా చేసి ఉంటే, భర్త తన ఆస్తిని ఎలా పంచుకోవాలో నిర్ణయించగలడు, భార్యకు ఎంత ఆస్తి వస్తుందనేది భర్త నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఒక వితంతువు ఆమెకు వచ్చిన ఆస్తిని తన ఇష్ట ప్రకారం తన వారసులకు ఇచ్చేయవచ్చు.
6. వీలునామా నమోదు(Registration): ఒక వీలునామా చట్టపరంగా చెల్లుబాటుగా ఉండటానికి దానిని నమోదు చేయాల్సిన అవసరం లేదు, కానీ నమోదు చేయడం ద్వారా మరణానంతరం ఏవైనా వివాదాలు నివారించవచ్చు. ఇది మహిళల వీలునామా కు కూడా వర్తిస్తుంది.
7. వీలునామా రద్దు మరియు మార్పులు: ఒక మహిళ తన మరణానికి ముందు ఎప్పుడైనా వీలునామా లో మార్పులు చేయగలదు లేదా రద్దు చేయగలదు, వీలునామా చేసే సమయంలో ఆమెకు మానసిక స్థితి సరిగ్గా ఉండాలి.
8. మహిళల హక్కుల పరిరక్షణ: ఒక మహిళ వీలునామాలో లబ్ధిదారులలో ఒకరైతే, ఆమె హక్కులు చట్టపరంగా రక్షించబడతాయి. ఎవరైనా వీలునామా లేదా ఆమె వారసత్వ హక్కులను సవాలు చేస్తే, ఆమె తన వాటా కోసం న్యాయపరంగా రక్షణ పొందవచ్చు.
9. ముస్లిం మహిళల ఆస్తి హక్కులు: ఇస్లామిక్ చట్టం ప్రకారం, ముస్లిం మహిళలు ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కలిగి ఉంటారు, మరియు వారు కూడా వీలునామా చేయగలరు, కానీ కొంత పరిమితితో. ముస్లిం వ్యక్తి తన ఆస్తిలో ఒక మూడవ వంతు మాత్రమే వీలునామా చేయగలడు, మిగిలిన రెండు మూడవ వంతు ఇస్లామిక్ వారసత్వ చట్టాల ప్రకారం పంచబడాలి.
ఈ విధంగా మహిళలు తమ ఆస్తిని, వారసత్వాన్ని సమానంగా పురుషుల మాదిరిగానే వీలునామా ద్వారా నిర్ణయించవచ్చు.