మార్గశీర్షం

అనంతంగా సాగిపోయే కాలాన్ని గణించడానికి ఎన్నో రకాల పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా వారి వారి సంస్కృతి సంప్రదాయాలు బట్టి ఏర్పడి ఉన్నాయి. కానీ మన భారత దేశంలో మాత్రం ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి సంవత్సరాలు, ఆయనాలు, ఋతువులు, నెలలు, పక్షాలు,వారాలు, నక్షత్రాలు, రాత్రి పగళ్ళు కింద విభజన ఉంది. అలాగే ఏ భాష వారికి ఆ భాషను సంబంధించిన సంవత్సరాల పేర్లు కూడా ఉన్నాయి. ఇంగ్లీషువారు జనవరి నుండి ప్రారంభిస్తారు. మనము తెలుగువారము చైత్రము వైశాఘము ఇలా పేర్లు ఉన్నాయి. వీటికి ఆ పేర్లు ఉట్టినే రాలేదు. ఖగోళ శాస్త్రం ప్రకారం నక్షత్రాల ఆధారంగా ఏర్పాటు చేశారు మన ఋషులు వేదాల నుండి గ్రహించి. ఏడు గ్రహాలు ఆధారంగా ఏడు వారాలు ఏర్పడ్డాయి ప్రకృతిలో వచ్చే మార్పులు బట్టి ఏర్పడిన నెలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు మన వేదాలలో. ఖగోళంలో పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం ఉన్న రోజును గణన చేసి మార్గశిరము అని ఈ నెలకి పేరు పెట్టారు. సూర్యుడు ఈ నెలలో వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యమానం ప్రకారము ఇది ధనుర్మాసం. మనది చంద్రమానం అనుసరించే పద్ధతి గనుక మార్గశిర మాసం అని అంటాము.
తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉన్నాయి. కార్తీకం అంతా శివ పూజలు చేసి ఈ మార్గశిరములో విష్ణువుని ఆరాధిస్తాము. ఆది గురువైన ఆది శంకరులు “పంచాయతనం” అనే పూజను ప్రవేశపెట్టారు. ఒకే చోట శివ, విష్ణు సూర్యుడు, గణపతి,అంబిక లను పూజిస్తారు. వీరు పంచభూతాలకు ప్రతీకలు. ఇప్పుడు ఆ పద్ధతి పోయి విడివిడిగా పూజ చేయడం మొదలుపెట్టారు.ఇప్పటివరకు మనం భాద్రపదంలో గణపతిని, ఆశ్వీజంలో అంబికను, కార్తీక మాసంలో శివుని ఆరాధించాం. ఈ మార్గశీర్షంలో విష్ణు పూజలు జరుగుతాయి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు” మాసానాం మార్గశీర్షాహం” అని నొక్కి మరీ చెప్పారు. పంచభూతాల్లో విష్ణువు జలస్వరూపం. కార్తీక మాసంలో దామోదర రూపంలో, మార్గశిరంలో విష్ణు రూపంలో ఉండటం వలన ఈ నెలలో ప్రాతస్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. విష్ణు ఆలయాలన్నీ ఎంతో వైభవంగా ఉంటాయి ఈ నెల అంతా. విష్ణు అలంకార ప్రియుడు కదా. సూర్యమానమైన ధనుర్మాసంలో వైష్ణవులు నెల రోజులు తిరుప్పావై అనే తమిళ పాశురాలను పారాయణ చేసి, గోదాదేవి పూజలు చేస్తారు. ధనుర్మాసం మొదటి రోజు నుండి ఆవు పేడతో కళ్ళాపు చల్లి అందమైన ముగ్గులు తీర్చిదిద్దుతారు. కొన్ని ప్రాంతాలలో ఆవు పేటతో గొబ్బెమ్మలు చేసి శ్రీకృష్ణుని ప్రతిగా పూజలు చేస్తారు. ఈ ధనుర్మాసము సంక్రాంతితో ముగుస్తుంది. భోగి రోజున గోదా శ్రీరంగనాధ కళ్యాణం రంగ రంగ వైభవంగా జరుపుతారు వైష్ణవ దేవాలయాలలో.
ఈ మాసంలో కొన్ని ప్రదేశాల్లో మార్గశిర లక్ష్మీవారాల వ్రతాలను ఆచరిస్తారు కొన్ని నియమాలతో. అంతేకాక నెలంతా ఎన్నో విశేషమైన రోజులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి స్కంద షష్టి లేక సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు ఆరోజు సుబ్రహ్మణ్యస్వామిని సంతాన లభ్యం కోసము, క్షేమం కోసం శక్తి కొలది పూజ ఉపవాసాలు చేస్తారు. మార్గశిర శుక్ల అష్టమిని కాలభైరవాష్టమని పిలుస్తారు. ఆరోజు కాలభైరవుని పూజించి మృత్యు భయం తొలగించమని వేడుకుంటారు. మార్గశిర శుద్ధ ఏటాదశి వైకుంఠ ఏకాదశి. దేవాలయాల్లోని ఉత్తర ద్వారం కూడా దైవదర్శనం చేసుకుంటారు భక్తులు. దాని వలన మోక్షం లభిస్తుందని భావిస్తారు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్రతం(హన్మద్వ్రతం) చేస్తారు. మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి. ఆయన త్రిమూర్తి స్వరూపుడు. గురుస్వరూపుడు కూడా.మార్గశిరపౌర్ణమిని కొన్నిచోట్ల కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆరోజు యమధర్మరాజుని పూజిస్తారు.( ఎందుకంటే ఈ కాలం ఎక్కువగా రోగాల బారిన పడే కాలం )
శరదృతువు వెళ్లి శశిరఋతువు ప్రవేశం కనుక చలి పెరిగి శరీరానికి అసౌకర్యం కలిగించే కాలం. వాత,పిత్త, కపాలలో ఎన్నో మార్పులు చోటుచేసుకుని అనేక వ్యాధులు బయటపడతాయి. అన్నిటికీ పెద్దలు ఆయా కాలాలకు తగ్గట్టు స్నాన, జప ఉపవాస, ఏకబుక్తాలు ఏర్పాటు చేశారు. కానీ నేడు వాయువు,నీరు కాలుష్యం అవటం వల్ల ప్రకృతిలో అనేక మార్పులు వచ్చి తెలియని అనేక కొత్త రోగాలు వచ్చి చేరుతున్నాయి. మనుషుల శారీరక స్వభావం కూడా మారిపోయింది. బిపి,షుగర్,థైరాయిడ్ వంటి రోగాలు ప్రతి వారిలోనూ ప్రబలిపోతున్నాయి. వాటి కోసం ముందుల వాడకాలు కూడా ఎక్కువయ్యాయి. అందుకే ఏ పూజా పునస్కారాలు చేయాలన్నా శారీరక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటి జీవితాలు యాంత్రిక జీవితాలు. అనారోగ్య కారణంగా ఉపవాసాలు దీక్షలు చేయ లేనివారు బాధపడక్కర్లేదు. మంచి సుగుణాలే భగవత్ పూజ అనుకొని, ఇతరులకు మేలు చేస్తూ, ఉన్నంతలో దానధర్మాలు చేస్తూ ప్రశాంతంగా అదే భగవంతుని సేవగా భావిస్తూ ప్రశాంతంగా జీవనం గడపడం అవసరం. ప్రతి పనిని భగవత్ ప్రీతిగా, అర్పణ బుద్ధితో చేయండి. స్నాన, జప పూజలన్నీ మానసిక ప్రశాంతత కొరకే కదా. భాహ్య పూజ కన్నా మానసిక పూజ ఎంతో ఉన్నతమైనది. అందరిలోనూ… నీలోనూ…. కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే అంతా దైవమయమే.
లోకా సమస్త సుఖినోభవంతు

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

లాయర్ సలహాలు