ఒక్కసారిగా బాల్యమంతా కదలాడింది. ఉదయం ప్రార్థన చేయడం దగ్గర నుండి తరగతి గదిలో పాఠాలు వినడం.. ఆటల సమయంలో ఆటలాడుకోవడం ఒక్కొక్కసారి స్నేహితులతో దెబ్బలాడుకోవడం ..సమయం తెలవకుండా గడిచిపోయిన బాల్యం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు..
క్షణాల్లో ఆవిరైపోయిన బాల్యం తిరిగి చూసుకుంటే ఆ మధురిమ అపూర్వం.
” వర్ణా! నీకు గుర్తుందా ఈ గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకున్నామో… నేను ఎక్కువగా కబడ్డీలో ఉండే దాన్ని నువ్వేమో కోకోలో ఉండే దానివి మా అమ్మ నన్ను ఎప్పుడు “నీకు అన్ని మగరాయుడు ఆటలే కావాలి” అనేది.
నాకు అమ్మ అలా అంటే కోపం వచ్చేది “మగ ఆటలు ఆడ ఆటలు అని సెపరేట్గా ఉండవమ్మా “అని అరిచేదాన్ని..
” అవును మన డ్రిల్ మాస్టారు మనల్ని ఎంత బాగా ఆడించేవారు ఒక్కొక్కసారి మనం టెన్నికాయిట్ ఆడాలంటే రింగు కోసం ఆఫీసుకు వెళ్లే వాళ్ళం అందరం ఒకేసారి గట్టిగా అరిచే వాళ్ళము..
” రింగ్ సార్ రింగ్ సార్” అని..
“సార్ అనేవాడు నేను రింగ్” సార్ ని కాదు.. ఓపిక పట్టండి ఇస్తాను” అని అందరికీ అని ఒక ఐదు ఆరు రింగ్స్ మనకు ఇచ్చేవాడు…” అన్నది వర్ణ.
” నీకు గుర్తుందా మనిద్దరం గ్రౌండ్లో నుండి క్లాస్ కి వెళ్ళిపోతున్నాము అప్పుడు మన హిందీ సారు మనిద్దరినీ పిలిచాడు.. ఇద్దరము స్కర్ట్స్ వేసుకునే ఉన్నాము.. కానీ నాకు మాత్రమే చెప్పాడు..
” నువ్వు రేపటినుండి నిండు లంగాలు వేసుకొని రా అని.. ఎందుకు నాకు మాత్రమే చెప్పాడో నాకు చాలా రోజుల వరకు అర్థం కాలేదు”
” అవునే నాకు కూడా గుర్తుంది.. అవును నీకు మాత్రమే ఎందుకు చెప్పాడు?” అన్నది వర్ణ..
” పోవే తెలిసి అడుగుతావు నేను కొంచెం బొద్దుగా ఉండేదాన్ని కదా అందుకు” అన్నది సౌదామిని చిరుకోపంగా…
ఇద్దరు మెల్లగా గేటు దగ్గరికి వెళ్లారు గేటు దగ్గర ఉన్న అటెండర్ వెంకటయ్య ఇంకా అక్కడే పని చేస్తున్నాడు కాకపోతే వృద్ధాప్యపు చాయలు కనపడుతున్నాయి…
ఇద్దరూ వెంకటయ్య దగ్గరికి వెళ్లి..
” అంకుల్ బాగున్నావా” అడిగారు ఇద్దరూ.
” ఆ బాగున్నా బిడ్డ మీరెవరు గుర్తుపడ్తలేను” అన్నాడు వెంకటయ్య.
“నేను సౌదామిని ఇది వర్ణ.. ఎన్నోసార్లు మేము కింద పడితే నువ్వే లేపి మాకు అయోడిన్ పెట్టి బ్యాండేజ్ వేసే వాడివి, మమ్మల్ని నువ్వు చిన్నమ్మ బుజ్జమ్మ అని పిలిచే వాడివి. గుర్తొచ్చిందా” అని చెప్పింది సౌదామిని.
” ఆ ఆ గుర్తొచ్చింది మీరా బంగారు తల్లులు బాగున్నారు బిడ్డ !చదువు అయిపోయిందా కొలువు చేస్తున్నారా” అని అడిగాడు వెంకటయ్య.
” అవును ఇద్దరం జాబ్ చేస్తున్నాము ..లోపలికి వెళ్లి స్కూల్ అంతా చూస్తాము” అని చెప్పి వెంకటయ్య చేతిలో ఒక 500 నోటు పెట్టింది సౌదామిని..
” పైసలు నాకొద్దు” అన్నాడు వెంకటయ్య.
” నీకోసం ఏమీ తేలేదు అంకుల్ పిల్లలకైనా ఏమైనా కొనుక్కొని వెళ్ళు” అన్నది వర్ణ.
ఇద్దరు స్కూల్ లోపలికి వెళ్లారు ఆరోజు వర్షం పడుతున్నందువల్ల ఎక్కువ మంది పిల్లలు స్కూల్కు రాలేదు.
ప్రతి క్లాసును చూసుకుంటూ వెళ్లారు.. ఇంటర్వెల్ టైంలో పిల్లలందరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పదవ తరగతి క్లాస్ రూమ్కు వెళ్లారు. ఎక్కడ కూర్చునే వాళ్ళు …అల్లరి ఎలా చేసేవాళ్లు ఇవన్నీ మాట్లాడుకున్నారు కాసేపు వాళ్లు కూర్చునే ప్లేస్ లో కూర్చున్నారు… తర్వాత స్కూల్ గ్రౌండ్ అంతా తిరిగారు..
లంచ్ టైంలో ఆఫీస్ రూమ్ కి వెళ్లారు టీచర్స్ అందరూ లంచ్ కోసం ఒకే చోట కలుసుకునే స్థలానికి వెళ్లి వాళ్ళ టీచర్స్ ని అందర్నీ పలకరించారు కొంతమంది ఇక్కడే ఉన్నారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోయారు మరి కొంతమంది రిటైర్ అయ్యారు.
వాళ్ళ తెలుగు సార్ మాత్రము అక్కడే ఉన్నారు అతను ఇదే సంవత్సరం రిటైర్ కాబోతున్నాడట…
తెలుగు సార్ తో చాలా సేపు మాట్లాడారు సౌదామిని మరియు వర్ణ.. సార్ చెప్పే పద్యాలని గుర్తు చేసుకున్నారు క్లాసులో మంచి మార్క్స్ వచ్చిన పిల్లలకి తాను రచించిన పుస్తకాలను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం గుర్తు చేసుకున్నారు … సార్ కూడా చాలా సంతోషపడ్డాడు..
” ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషం తల్లీ! అన్నారు తెలుగు మాస్టారు.
” విద్యా బుద్ధులు చెప్పిన మిమ్మల్ని మేము మర్చిపోతే.. మమ్మల్ని మేము మర్చిపోయినట్లే మా తల్లిదండ్రులను మేము మర్చిపోయిన నాడు మిమ్మల్ని మర్చిపోతాము… మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పునాదిరాళ్లు వేసింది మీరంతా కదా! గురువులు లేకుంటే విజ్ఞానం ఎక్కడుంది అని చెప్పి అందరి కాళ్లకు నమస్కారం చేశారు సౌదామిని వర్ణ… వారి ఉద్యోగ విషయం కూడా చెప్పారు.
లంచ్ టైం అయిపోయిన తర్వాత ఎవరి క్లాస్ కు వాళ్లు వెళ్లిపోయారు ఉపాధ్యాయులంతా.. ఇద్దరు స్నేహితురాళ్ళు స్కూటీ పైన ఒక రౌండ్ ఊరంతా తిరిగి వర్ణ ఇంటికి చేరుకున్నారు..
ఇంకా ఉంది