“నేటి భారతీయమ్” (కాలమ్)

“యుక్తవయసులో భావోద్వేగాలు”

యుక్తవయసులో భావోద్వేగాలు చాలా ఎక్కువగా వుంటాయి. దానికి రెండు కారణాలు, ఒకటి హార్మోన్లైతే, రెండవది వాటి నుండి వచ్చే శారీరక మార్పులు. అంతవరకు ఒకలా వుండి, హఠాత్తుగా, తమలో తమకే తెలియని మార్పులేవో… దాంతోపాటు తమను చూసిన వాళ్ళ దృష్టి కోణం కూడా మారుతూ వుంటే, యేమి చెయ్యాలో తెలియని ఒకానొక అయోమయ, గందరగోళ పరిస్థితి.
ఆ సమయంలో తల్లిదండ్రులు చెప్పే ఏ మాటైనా వారిని కట్టడి చేసేదిగా మాత్రమే పిల్లలు భావిస్తారు. ఆ కట్టుబాట్ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. మనమేమి చెప్పినా వాళ్లల్లో లోపాలను వెతుకుతున్నామని మాత్రమే భావిస్తారు.
ఒకవేళ తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోతే, మీకేమీ తెలియదు అని అనడానికి కూడా వెనకాడటం లేదు పిల్లలిప్పుడు. విద్యావంతులైన తల్లిదండ్రుల మాట కూడా వింటారన్న గ్యారెంటీ ఐతే లేదు. ఎర్లీ టీనేజ్ లో వున్న అయోమయ స్థితినుండి, అన్నీ మాకే తెలుసు, మీకేమీ తెలియదనే స్థితిలో వుంటారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఆ ప్రభావాన్ని యింకొంచెం యెక్కువ చేసేవిగానే వుంటున్నాయి. గురువులను చులకన చేసేలా సంభాషణలు, తల్లిదండ్రులను తక్కువగా చూసేలా హావభావాలు, ఈనాటి సినిమాల్లో మరీ యెక్కువగా వుంటున్నాయి. అవి చూసి, టీనేజ్ పిల్లలు అవే నిజమనుకుంటూ, వాటిని అనుకరిస్తున్నారు.
అంతవరకు చిన్నపిల్లలుగా వాళ్లను చూసినవాళ్లు, నువ్వు పెద్దయ్యావు, అలా వుండకు… యిలా వుండకు అనడం, వాళ్లలో గందరగోళానికి మరింత కారణమవుతుంది. దానికి తోడిప్పుడు, శరీరంలో జరిగే మార్పులను అర్థం చేసుకునే వయసు రాకముందే, పిల్లల్లో యుక్తవయసు చాలా తొందరగా వస్తుంది. ఆడపిల్లల్లో ఐతే మరీ అన్యాయం.
ఈ సమయంలోనే తల్లి చాలా మెలకువగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలను మానసికంగా సన్నద్ధం చెయ్యవలసి వుంటుంది. ఆ శారీరక మార్పులనేవి సహజమని, అదే సమయంలో శారీరక మార్పులెందుకొస్తాయి, ఆయా సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి స్పర్శ (గుడ్ టచ్), హాని చేసే స్పర్శల (బ్యాడ్ టచ్) గురించిన అవగాహన వాళ్లకు కల్పించడం, చెయ్యాల్సి వుంటుంది.
చాలా సులభంగా, తొందరగా ఆకర్షణలకు లోనయ్యే వయసిది. ఇంటికన్నా బయట ప్రపంచం అందంగా కనిపించే దశ యిది. ఈ వయసులో పిల్లల ఆలోచనలకు వ్యతిరేకంగా యేమి చెప్పినా, అది వాళ్ళ లేతమనసుల మీద ముద్ర వేస్తుంది. అత్యంత అపాయకరమైన దశ యిది… పిల్లలకూ, తల్లిదండ్రులకు కూడా.
ఈ దశలో తల్లిదండ్రులు పిల్లల కూడా, కూడా వుంటూ, మంచిచెడ్డల గురించి చెప్తూ వుంటే, పిల్లలు బయట ఆకర్షణలకు లోనయ్యే అవకాశం తక్కువగా వుంటుంది. ఆపోజిట్ సెక్స్ వైపు ఆకర్షణనేది సహజమని, దానిని నియంత్రణలో వుంచుకోవడం భవిష్యత్తుకు మంచిదని, సుతిమెత్తగా ఉదాహరణలు చెబుతూ, పిల్లలకు అవగాహన కల్పిస్తే, టీనేజీల్లో మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామనే వారి శాతం బాగా తగ్గుతుంది.
యిప్పుడు తీసుకునే నిర్ణయాలపైనే వారి భవిష్యత్తు ఆధారపడి వుంటుందని…జీవితంలో స్థిరపడ్డాకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించాలని, ఈ మధ్యకాలంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే, వాటి ప్రభావం వారిమీద జీవితాంతం వుంటుందని, చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా జీవితం తయారవుతుందని, పిల్లలకి విపులంగా చెప్పాలి.
కాని అంత చిన్న వయసు పిల్లలకు యిటువంటి విషయాలు చెప్పడం చాలా కష్టసాధ్యం. ఈ సమయంలోనే తల్లిదండ్రులు తమ తెలివితేటలను ఉపయోగిస్తూ, జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. పిల్లల మనసు కష్టపడకుండా, చాలా సున్నితంగా అవసరమైనంత మేరకు, నెమ్మది నెమ్మదిగా వాళ్లకు పూర్తి అవగాహన కలిగేలా చెయ్యాలి. ఈ సమయంలో పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించగలగాలి.
ఏ చిన్న పొరపాటు జరిగినా, దానికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే నిజాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడు, యే పిల్ల/ పిల్లవాడు, వారి జీవితాన్ని పణం పెట్టే, నిర్ణయాలను యెప్పటికీ తీసుకోరు. వాళ్లలో ఆ అవగాహన కల్పించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. మనం తీసుకునే నిర్ణయాలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుందనే విషయం పిల్లలకు గ్రాహ్యమైనప్పుడు, వారి జీవితం వడ్డించిన విస్తరే. సర్వేజనా సుఖినోభవంతు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హైమావతి పాటలు

అర్పిత