ఒడిపిళ్ళు

ధారావాహికం 6 వ భాగం

మరుసటి రోజు ఫారెస్ట్ గార్డ్ ఏమీ జరగనట్టుగా భుజంపై తుపాకీ, చేతిలో కర్రతో ఊరు వదిలి వెళ్ళాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, జరిగిన దాని గురించి. కానీ.. కొత్త అవమానాన్ని తనలో దాచుకుని వెళ్ళాడతడు. గ్రామస్తులంతా అతని వెంట చాలా దూరం వెళ్ళి సాగనంపారు. ఆ తరువాత అతడు కనుమరుగయ్యాడు.

సోమ్లా అతని పిల్లల జీవితం, అలవాటయిన దారివెంట నడుస్తున్న ఎడ్లబండి వలె సాగుతోంది. పగటి వెలుతురు మసగబారే వరకు తండ్రి కొడుకులు కష్టపడి “మాలి ధమాకా కొండ” పై చెట్లను నరుకు తున్నారు. వారి గొడ్డళ్ళ చప్పుడు ఆ కొండ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. సాయం సమయంలో కుటుంబ సభ్యులంతా ఒక్క చోట చేరి అవీ ఇవీ మాట్లాడుకుంటున్నారు. రాత్రి సమయంలో అమ్మాయిలు స్త్రీల డార్మెటరీకి వెళ్తున్నారు. డుంగుడుంగా మోగించడం, ఒకరిపై ఒకరు పాటలు పాడుకోవడం ముందటి వలెనే మామూలుగానే కొనసాగుతోంది. కానీ రాత్రి సమయంలో సోమ్లా కంటి శుక్లాలు ముదరడం వల్ల సరిగా చూడలేకపోతున్నాడు. అంతా బాగున్నట్టు హాయిగా నవ్వుకునే సమయంలో ఉన్నట్టుండి ఎవరిదో అదృశ్యమైన హస్తం తన గొంతును నొక్కుతున్నట్లు, ఏదో జరగబోతోంది అని భయం అతన్ని కమ్ముకునేది. కొండ లోయలను కప్పేసి నల్లటి మేఘంలా అతని ముఖాన్ని కప్పేసేది. అతడు భయం కరమైన కోపంతో అధికారులు చేసే దుర్మార్గాన్ని తలుచుకొని బాధపడేవాడు. ఆ సమయంలో ఏదో తెలియని భయంతో రెండు చేతులు జోడించి నుదుటి పై ఉంచుకొని అతను ఏడవడం మొదలు పెట్టేవాడు. గిరిజనుల దేవుళ్ళైనందరినీ వేడుకుంటూ. లార్డ్ జాకర్, నిసాని ముండా, భూదేవి నాకు ఏ చెడు జరగనీయకుండా చూడండి. మీకు కోళ్లను పావురాలను బలి ఇస్తాను అంటూ ప్రార్థించేవాడు.

ఒక పక్షం గడిచింది, తర్వాత నెల గడిచింది కానీ ఫారెస్ట్ గార్డ్ తిరిగి రాలేదు. సోమ్లా దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఫారెస్ట్ గార్డ్ బదిలీ అయి ఉంటాడని, రానే రాడని భావించి హాయిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాడు. మళ్లీ ఒకసారి గొప్పగా ఆనందంగా తనను తాను భావించు కున్నాడు. తండ్రి కొడుకులు అడవిలో చెట్లను నరికే కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నారు. పని మధ్యలో ఆపినప్పుడు, వారు కొండ దిగువన లోయల్లో.. పశువుల కాపరులు రహస్యంగా సారా కాసే చోటికి వెళ్తున్నారు. అక్కడ మద్యం తాగి నృత్యం చేస్తూ కొత్త శక్తిని తమలో నింపుకుంటున్నారు. ఆ విధంగా తమ అలసటను మర్చిపోతున్నారు.

ప్రతిరోజు అడవి నరికి విశాలంగా చేస్తున్నారు. వారు నరికే చెట్లు, కాల్చే కలప రాజు గారికి సంబంధించిన సంపద అని వారికి తెలియదు. కానీ చట్టం దృష్టిలో వారు నేరస్తులు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లో కాకుండా రహస్యంగా మద్యాన్ని కొనడం తాగడం చేసేవారు. వారి తలలు రాళ్ల వంటివి పై విషయాలు పరిశీలనలు వారికి తెలియడం చాలా అరుదు. వారి దృష్టిలో అడవిలో కొండలపై పెరిగే సంపదంతా వారికోసమే అనుకుంటారు. సూర్యుని కాంతి, వర్షము, గాలి, నీరు ఎటువంటి నిబంధనలు లేకుండా వాడుకున్నట్టు అడవి సంపద కూడా తమకోసమే అని భావిస్తారు.

సోమ్లా కలగన్నట్టుగా కష్టపడ్డ కొద్దీ ఎక్కువ భూమిని ఎక్కువ ఇళ్లను పొందే కాలం దగ్గర పడిందనుకుంటున్నాడు. భూక్యా తన ప్రేయసి కమ్లీ కోసం, సాలీ ఆమె ప్రియుడు హేమ్లా కోసం కలలు కంటున్నారు. ఇది వారికి కలలుగనే సమయం.

అనుకోకుండా ఒక రోజు కొండ శిఖరం పై చాలామంది కనిపించారు. వారంతా తెల్ల రంగు దుస్తులు ధరించి ఉన్నారు. ఒకరిద్దరి తలపై టోపీలు ఉన్నాయి. ఆ గుంపుకు ముందు నాయకుని వలె ఫారెస్ట్ గార్డ్ తుపాకీ భుజంపై పెట్టుకుని కనిపించాడు. సోమ్లా చేతిలో గొడ్డలి జారిపోయింది. దూరం నుండి వారిని చూడడంతో అతని కళ్ళకి ఒత్తిడి కలిగింది. అనుమానం లేదు. అతడు ఫారెస్ట్ గార్డే. అతడు తనకు తానే చెప్పుకున్నట్టుగా “నేనే తప్పు చేయలేదు” అనుకున్నాడు. కానీ ఏదో తెలియని భయం కమ్మేసింది. తన భయాన్ని తరమడానికి మళ్లీ గొడ్డలి అందుకున్నాడు, మధ్యలో ఆపిన పనిని కొనసాగిస్తూ వేగంగా చెట్టు నరకడం మొదలుపెట్టాడు. అధికారులకు సోమ్లా చెట్లు నరికే చోటుకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఫారెస్ట్ గార్డ్ గట్టిగా “ఏయ్ నిన్నే” అంటూ అరిచాడు.
సోమ్లా అతని ఇద్దరు కుమారులు గొడ్డళ్ళను వదిలేసి, అధికారుల వద్దకు వచ్చి, వీలైనంత నడుము వంచి నమస్కారం చేశారు. అధికారులను మీరెవరు అని అడిగే ధైర్యం వారికి లేదు. ఆడవి భూముల్లో నడుముకు చుట్టుకుని వస్త్రం తప్ప ఎక్కువ దుస్తులు ఎవరూ ధరించకూడదు. ఎవరైనా నడుము నుండి కాలి మడిమ వరకు దుస్తులు ధరిస్తే, వారిని పై అధికారి వద్దకు ఈడ్చుకు పోతారు, ఆ అధికారి ఎక్కువ దుస్తులు ధరించిన వారిని హింసిస్తాడు. అందువల్ల తమ హక్కుల గురించి ప్రశ్నించే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. అధికారులంతా ఒకరిని మించి ఒకరు ఒకరు గిరిజనులపై దౌర్జన్యాలను చేస్తారు. సోమ్లా అటువంటి వాతావరణంలో పెరిగి ఆ దౌర్జన్యాలను అర్థం చేసుకున్నాడు. వారికి విధేయులుగా ఉండడమే వారి బాధ్యత. అధికారులు ఎవరైనా సరే గిరిజనులకు సంబంధం లేదు.

వచ్చిన వారిలో ఒకరు “నిన్ను ఈ చెట్లు నరకమని ఎవరు చెప్పారు ? “అని అడిగాడు.
సోమ్లా అమాయకంగా “ఫారెస్ట్ గార్డ్ చెప్పాడు నాకు. అతడే అనుమతి ఇచ్చాడు” అన్నాడు. “ఏమిటి నీకు నేను అనుమతిచ్చానా చెట్లు నరకడానికి” అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు ఫారెస్ట్ గార్డ్.
” అబద్దాలకోరా మోసగాడా నీతిలేకుండా పుట్టిన వాడా ! అక్కడ నిలబడి నేను అనుమతిచ్చానని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం ?” అని అరిచాడు.

“అనుమతి లేకుండా మీ చెట్లను తాకే ధైర్యం ఎవరికి ఉంది స్వామీ!” అని సమాధానమిచ్చాడు. “మీరు నాకు చెట్లు నరికి సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదా , ఒకసారి అడిగాను లార్డ్ మరోసారి గ్రామ పెద్ద ఇంటి వద్ద ఉన్నప్పుడు అతని సమక్షంలో అడిగాను. అప్పుడు మీరు అనుమతి ఇచ్చారు, పని చేసుకోవడానికి. నిజం, గ్రామ పెద్ద కూడా విన్నాడు. మీరు ఎందుకు మరిచిపోయారో తెలవదు సార్” అన్నాడు.

అది విన్న సీనియర్ అధికారి అంగీకరిస్తున్నట్లు తల ఊపాడు. ఫారెస్ట్ గార్డ్ వారందరినీ తీసుకుని క్రిస్టియన్ డోంబ్ సాల్మన్ చెట్లు నరికిన చోటును చూపిస్తూ “ఇదంతా కూడా ఆ వెధవే నరికాడు ప్రభువా. నేను చెప్పే నిబంధనలన్నీ పాటించకుండా ఈ ప్రాంతమంతా చెట్లు నరికింది వాడే” అని చెబుతూ ఉండగా, పైల్వాన్, సాల్మన్ ఇద్దరూ వచ్చి ఫారెస్ట్ గార్డ్ చెప్పేది నిజమని ధృవీకరించారు.
” ఆ పరజ గిరిజనుడు, అతని కుమారులు ఇద్దరు ఎవరిమాటా వినరు. వారు ఆశపోతు వెధవలు” అంటూ సాక్ష్యం చెప్పారు.
ఆ తర్వాత చెట్లు నరికిన ప్రాంతమంతా కొలతలు వేశారు. చెట్ల మోడులను లెక్క పెట్టారు. వాటన్నింటిని ఒక కాగితం మీద రాసి నష్టాన్ని అంచనా వేశారు. మిగిలిన గ్రామస్తుల సాక్షాలను సేకరించారు. వారంతా ప్రమాణం చేసి సోమ్లా చేసిన నేరాన్ని ధృవీకరించారు. గిరిజనుల అందరి జీవితాలు అధికారుల భయంకరమైన హింస అనే ఆపదతో నలుగుతూ ఉంటాయి.
చట్టంతో దాగుడుమూతలు ఆడటం తెలియకపోతే అడవి ప్రాంతంలో నివసించడం కష్టం. ప్రతి ఒక్కరు తమ ఒంటిపై చర్మాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలు మాట్లాడుతారు గొప్ప నమ్మకంగా. వారి జీవితాలలో సహజమైన నిజాయితీ, నిరాడంబరత, జీవితకాలపు భయంతో అభద్రతతో క్షీణించి పోయాయి.

సోమ్లా బోనులో నేరస్తునివలె నిలబడ్డాడు. ఒక అధికారి రాస్తూ ఉండగా చూస్తూన్న అతనికి పదునైన కత్తితో తన గుండె పై గీరినట్టుగా అనిపించింది. కాయితం పై రాసేది పెద్ద ముప్పని గిరిజనులలో ఉండే సహజమైన భయం. అంతేకాదు అధికారులు మాట్లాడుతున్న భాష వింటున్నా గిరిజనులకు అర్థం కాదు. ఆ అర్థం కాని తనం మరింత భయాన్ని పెంచుతుంది వారిలో. అందుకని తలలూపుతూ ఒప్పందాన్ని అంగీకరిస్తారు. సోమ్లా కొడుకులు నిశ్శబ్దంగా తడారిపోయిన గొంతులతో గుటకలు వేస్తూనే ఉన్నారు.
అప్పుడే తీర్పు వచ్చింది “సోమ్లా ఇప్పుడు నువ్వు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నావా ? రాజుగారి సంపదను నష్ట పరచినది, నలబై స్కోర్ల రూపాయల విలువైనది (వాళ్ళు చెప్పే స్కోరంటే 20 రూపాయలు అని అర్థం) మొత్తం 800 రూపాయలు నువ్వు చెల్లించాలి” అన్నాడు అధికారి.

” నేను ఏ తప్పు చేయలేదు ఓ ప్రభువా! నేను ఏ నేరం చేయలేదు. నేను నీ పుస్తకం మీద ప్రమాణం చేస్తాను. నేను అమాయకుడిని. మనుషులను తినే పులి మీద ప్రమాణం చేస్తున్నాను. పులి తోలు మీద నిలబడి ప్రమాణం చేస్తాను, మీరు ఏ ఒట్టు పెట్టమంటే ఆ ఒట్టు పెడతాను. నేను అమాయకుడిని” అంటూ ఉండగా..” మాట్లాడకు నువ్వు ఈ డబ్బు చెల్లిస్తున్నావా” అన్నాడు అధికారి.
“అంత పెద్ద మొత్తాన్ని నేనెలా చెల్లించ గలను. నాపై దయ చూపండి, జాలి చూపండి” అన్నాడు సోమ్లా.
” ఇంక నువ్వు వేసిన నాటకాలు ఆపు. నువ్వు ఎలా చెల్లించవో మేము చూస్తాం. గుర్తుపెట్టుకో ఇప్పుడు మేం వెళ్తున్నాం ”

సోమ్లా ఆశ్చర్యపోయాడు. కళ్ళముందే తన చిన్న గుడిసె గాలికి కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కొండ ప్రాంతాల్లో వచ్చే సుడిగాలిలో వరదలో కొట్టుకు పోయింది. ఒక నీలిమేఘం కమ్ముకుంది.
పొలాల్లో ఉండే ఎలుక జీవితమంతా సంపాదించిన దాన్ని ఒక గట్టిగాలి వచ్చి విధ్వంసం చేసినట్లుగా అనిపించింది.

సశేషం

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శ్రీనివాసు…!!!

భారతీయ ఋషి పరంపర