నిజంగా చిన్నపిల్లాడే ఈ శ్రీనివాసు…!
కాసింత జ్వరానికే అమ్మ గుర్తొచ్చేస్తుంది …
చంటి పిల్లాడిలా అమ్మ ఒడిలో ఒదిగిపోతాడు!
నిన్నమొన్న పుట్టిన చిన్నారికి బీరువా తాళాలిచ్చి
అమ్మ అంటూ ఇంటిపెత్తనం కట్టేస్తాడు!
రోజూ ఏం కూర వండాలో కూడా ఆమె ఆర్డరుపైనే…
ఈ శ్రీనివాసుకి వాళ్ళ అమ్మ నామస్మరణ
ఆశీర్వాదాలే సుప్రభాతాలు మరీ..!
వాళ్ళమ్మ చేత్తో చేసిన మీల్ మేకర్ రైస్ అంటే
శ్రీనివాసు కి చాల ఇష్టం..
ఏం వండినా.. ఎలా ఉన్నా…
అమృతం లాగా ఉందంటూ లాగిస్తాడు
పసిబాలుడిలాగా…
ఈ కాల౦లో అంటే మన ట్రేడిషన్ కల్చర్ మంటలో
కలిసిపోయి సమాజం మారిపోయింది గానీ…
అప్పట్లో…అరకో కొరకో కొందరు ఇప్పట్లో కూడా…
ఏ భార్యా భర్తని పేరు పెట్టి పిలిచేది కాదు…
అది ఇరువురి మధ్య గౌరవాభిమానాలకి నిదర్శనం…
మా శ్రీనివాసు వాళ్ళ ఆవిడ తన శ్రీవారి ని
ఏమని పిలుస్తోందో తెలుసా?
వాళ్ళ అమ్మ పేరుతోనే…!!
మరో విషయం..
ఒకే బాణం..ఒకే భార్య అన్నట్లు…ఆ రామచంద్రుడే
ఈ శ్రీనివాసుకి వాళ్ళమ్మకి ఇష్ట దైవమూ..!
శనివారం నాడు ఏ పండుగొచ్చినా సరే
ఇద్దరికి సెపరేట్ మెను..
ఆరోజు వాళ్ళమ్మే చెఫ్!
ఏ కష్టం ఎరుగని ఆ బుజ్జి బుజ్జి పాదాలు కందిపోతాయని కాసింత కూడా
నడవనీయడు ఈ శ్రీనివాసు! ఎక్కడున్నా రయ్యున వచ్చేస్తాడు బైకుమీద దించడానికి…
చిట్టి చిట్టి చేతులతో హోంవర్క్ చేస్తున్నప్పుడు కాళ్లు వత్తుతూ…వాళ్లమ్మ కష్టపడుతుందని కలత చెందుతాడు పాపం…!!
ఒక్కోసారి సెలవుల్లో వరిచేనులోకి పోగా…మావ్వొచ్చింది ఇంక మనం గడ్డకు పడ్డట్లే ….ఈరోజే ఈ పని మొత్తం అయిపోతదని అనుకుంటూ…
ఆ కష్టాన్నంతా మర్చిపోతాడు…
ఏ చిన్ని సాయం చేసినా …..
ఆయన ఆనందానికి అవధులే ఉండవు!!
ఆయనకి..ఊరినిండా బంధువులే…”శీనయ్యా” అనే ఆప్యాయమైన పిలుపు ఆయనకే సొంతం మరి..!!
ఎప్పుడూ ఎంతటి ఈతిబాధలకైనా చెమ్మగిల్లని కనులు
వాళ్లమ్మ హాస్టల్ కు వెళ్లిన రోజు తడిచేవి..
వాళ్ళమ్మ లేని ఆ ఇల్లు వెన్నెల ఉన్నా నిండు నిశీధి తో సమానం శీనయ్య కి….
ప్రతీ నెలా రెండవ శనివారం నాడు పిల్లల్ని చూడడానికి తల్లిదండ్రుల్ని అనుమతించేవారు..
చాలా రోజులకి వాళ్లమ్మని చూసిన శ్రీనివాసు..ఇప్పటికీ… మునుపటిలాగే…ఎత్తుకొని గట్టిగా గుండెకి హత్తుకుని వీపు నిమిరి, ముద్దాడేవాడు…ఆయనకి వాళ్లమ్మ ఎప్పుడూ చిన్నపిల్లే..!!
ప్రతీ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎల్లప్పుడూ చంటిపిల్లలే కదా మరి!!
అప్పుడో ఇప్పుడో ఇవ్వగా దాచుకున్న పాకెట్ మనీ తో చిరుతిండ్లు..పండ్లు ఇంటికి తీస్కుపోగా….మా అవ్వ నాకోసం తెచ్చిందనే సంతసంలో ఆరోజు అన్నం కూడా తినకపోతుండే శ్రీనివాసు…
ఎక్కడున్నా సరే…నెలపొడుపు చూడగానే వాళ్ళమ్మని చూడాలని వచ్చే దార్లో ఎవ్వరిని చూడకుండా తల కిందికి వెస్కొనిమరీ వచ్చేస్తాడు!
హేమంతంలో చలికి ముడుచుకున్న మొగ్గ సూర్యుడు ముద్దాడినట్లు విచ్చుకునేది ఆయన మొఖం వాళ్ళమ్మని చూడగానే!!
ఏ ఇంట్లో అయిన పిల్లల్ని మందలిస్తారు గానీ…. వాళ్ళమ్మ శీనయ్యని మందలిస్తుంది..
నిజంగా…మా శ్రీనివాసు చంటిపిల్లాడే…..!!!
ఇంతకీ…వాళ్ళమ్మేవరో మీకు అర్ధమైందనుకుంటా…
ఆయన కూతురే…అవును…
తన తల్లి గుణరూపాలతో
జన్మించిన మరో అమ్మ!!!