ఇప్పుడు సమాజం ఎంత వేగంగా మార్పు జరుగుతున్నదో అందరికీ తెలిసిందే!
” అమ్మా నా డ్రస్ కనబడట్లేదు”, “నాన్నా నా పెన్ తీసావా? నా బుక్ కూడా లేదిక్కడ ” ……..
ఇవీ ఇప్పటి పిల్లలు మాట్లాడే మాటలు.
మాటలు కాదు అరుపులు… గోల… లొల్లి…..!!
ఇంటి పని ఓ కళ ! కళాకారులెవరంటే… పనిమంతులు! యువతరం
ఎప్పుడైనా నలుగురు తమని ఆకర్షించాలని ోఆరాటపడుతుంటారు. డ్రెస్సింగ్ స్టైల్, నవ్వే స్టైల్, కొత్త కొత్త పదాలతో మాట్లాడుతూ … ఏమంత వివరాలు తెలియకున్నా అన్నీ తెలిసినట్టు పోజుకొట్టడం ఇలా… ఒకటా రెండా చాలా మంది లేనిపోని గొప్పలకుపోతూ అందరిలో స్పెషల్ గా కనబడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. పర్లేదు అలాగే ఇష్టమున్నట్టే ఉండొచ్చు. మరి ఎందుకు ఇవన్ని?
మీరెప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నలు వేసుకున్నారా?
వేసుకోవాలి. ఇవ్వేకాదు బాగా చదవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలనీ, ఉద్యోగం లో పేరు పొందాలని కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. బహుశా ఈ లక్షణాలు అందరినీ ఆకట్టుకోవేమో గాని…
ఇదికూడా పర్లేదు. అన్నీ అందరూ ఫాలో అవ్వక్కర్లేదు. కానీ….
ఈ కానీ తోనే చిక్కొచ్చిపడింది!!
సరే అవేంటంటే…. యువకులతో మాట్లాడుదాం… ఇవి ప్రత్యేకంగా యువతీయువకులకేగాని కొన్ని విషయాలు తల్లిదండ్రుల కు కూడా కావాలి… వాళ్ళూ వినాలి ! వినండి! వింటున్నారా? ఓ … చదువుతున్నారా? మరి మీరు ఇంత ముఖ్యమైన విషయం కదా చదివి వదిలేయకండి! నలుగురితో డిస్కస్ చేయండి ok !!
‘ పని‘ ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ? చూద్దాం…
మీ బ్రతుకకు కారణభూతమైన కన్న తల్లిదండ్రులు జీవితంలో ప్రథమ స్థానంలో ఉంటారు .. ఉండాలి.
ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు నీ అస్తిత్వానికి ప్రథమ మూలం తల్లిదండ్రులే కాబట్టి ముందు వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అమ్మానాన్నలను గౌరవించడం ఏంటి అమ్మానాన్నలను ప్రేమించాలి కదా ? అనే వితండ వాదులు ఉంటారు. ప్రేమ వేరే గౌరవం వేరే కాదు ప్రేమలోంచే గౌరవము గౌరవాలనుంచి ప్రేమ పుట్టుకొస్తాయి. అంటే వాళ్లకు కీర్తి కిరీటాలు తొడగాలని కాదు. కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకోవాలనీ కాదు . ఓపికగా సమాధానం ఇవ్వడం చెప్పిన పని చేసి పెట్టడం చెప్పక ముందే కొన్ని పనులను చేసి సహాయం చేయడం వంటివి! ఇవి ముఖ్యం!!
ఏ పొద్దు ఎక్కడ పొడచినా ఎట్లా పొడిచిన.. ఇక్కడ నీ దగ్గర ఎలా పొడుస్తుందో చూడు.
ఇందుకోసం కొన్ని ముచ్చట్లు…
నీలో దాగిన శక్తిని అంచనా వేసుకుంటూ
ముళ్ళ దారిని పూలదారిగా చేసుకోవాల్సిన కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ పెద్ద పెద్ద మాటల్లో చూస్తుండవచ్చు. ఒక చిన్న ఉదాహరణ…. ఆలస్యంగా లేవడం ఈరోజుల్లో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తెల్లవారుజామున లేచి స్నానం చేసి పనులు చేసుకోవడం అనేది ఈ కాలం లోనా…అని ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు యువకులు. లేట్ నైట్ పడుకోవాలి లేటుగా లేవాలి.. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. వీటితోనే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. లేటుగా లేస్తే ఏంటి ఆకలికి లేట్ ఉండదు కదా. ఆకలేసేసరికి అన్నం.. అమ్మ గుర్తుకొస్తాయి. వంటింటికి కాళ్ళు నడుస్తాయి. ఇక్కడే వచ్చింది చిక్కంతా! ఎంతకని అమ్మ వంట చేస్తుంది ? ఆఫ్ కోర్స్ కొంతమంది ఇళ్లల్లో ఈ మధ్య నాన్నలు కూడా వంటపని చేస్తున్నారు . విచ్ వన్ ఈజ్ వెరీ గుడ్…. ఎవరు చేస్తే ఏమి కానీ అమ్మనో నాన్ననో వంటమనిషి అయినా వచ్చి చేయాలి మరి నువ్వేం చేస్తావు ? భుజిస్తావ్ బొజ్జ నిండా తిండి తింటావ్!! అదేంటి ? నేను కాదా సంపాదించడం లేదా అని మాట కూడా అనేస్తావు… ATM కార్డులు రూపాయి నోట్ల గిన్నెలో అన్నం అవ్వవు. దానికో పద్ధతి అనేది ఉంటుంది వంట చేయాలంటే ఎన్నో సమకూర్చుకోవాలి. ఇవేవీ చేయకుండా వాళ్ళని ఒక్క మాట అనే హక్కు లేదు.
బట్టలు ఉతకడం….మడత పెట్టడం… వేరే అర్థం తీసుకోవద్దు! బట్టలను ఉతికి శుభ్రంగా మడిచి దాచడం అనేది చాలా అవసరం అబ్బో ఇవి కూడానా..!! కోపం చిరాకు. ఇస్త్రీ చేసి లేవని టైం కు అందివ్వట్లేదని అమ్మ మీద కేకలేస్తారు… ఇదీ వరస ఇప్పుడు. ఒక్కసారైనా అమ్మ బట్టలు మడత ఉతికి పెడదాం, నాన్నకు కంచంలో అన్నం పెడదాం , చెల్లాయికో,తమ్ముడికో చదువు చెబుదాం..అనే ఆలోచన వచ్చి ఉంటుందా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి.
ఇలాంటివి కంప్లైంట్స్ చాలానే ఉంటున్నాయి. మహాకవి శ్రీశ్రీ అన్నాడెప్పుడో” కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు ” అని ఇది నిజం చేస్తున్నారిప్పుడు.
కాకపోతే చేయాలనుకుంటే ఇంతటి కష్టమైన పని అయినా చేయగలరు చేస్తారని ఆశిస్తున్నారు. మొక్క వంగుతుంది… మాను వంగదు! ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. ఈ మొక్కని రేపు మాను అవుతుంది ఇది అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి స్టోరీ విలటడజ రిపీట్ రిపీట్ అండ్ రిపీట్ బి కేర్ ఫుల్.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి ఎడిటర్