సోమ్లా అడవి నుండి వచ్చిన తర్వాత ఫారెస్ట్ గార్డ్ తన ఇంట్లో జొరబడి తనిఖీ చేసినట్టు తెలుసుకొని ఆశ్చర్య పడలేదు. ఎందుకంటే గిరిజన గ్రామాల్లో ఇది చాలా సామాన్యమైన విషయం. వారలా తనిఖీ చేయడానికి వారికి కొన్ని వేతనాలు చెల్లించబడతాయి. చట్టానికి విరుద్ధంగా ఏమైనా జరుగుతుందేమో తెలుసుకోవడం వారి విధి. ఫారెస్ట్ గార్డ్ అటువంటి తనిఖీ చేయడానికి వంద కారణాలు చెప్తాడు. సారా కాస్తున్నారని, తేనె వంటి అడవి ఉత్పత్తులను తెచ్చుకుంటున్నారని, ఖరీదైన కలపను ఇల్లు కట్టుకునేందుకు దాచుకున్నారని అభియోగాలు. ఫారెస్ట్ గార్డ్ అంటే సోమ్లా పాలిటీ ప్రభువు కూడా. అందుకని “మనం ఎంత అదృష్టవంతులం, ఫారెస్ట్ అధికారి మన ఇంటికి వచ్చాడు. మనకు తల్లి తండ్రి దైవం అన్ని ఆయనే కదా” అని అంటాడు.
అప్పుడు మాలీ ఒక్కతే “అవునవును” అంటుంది. “ఎంత విషాదకరమైన విషయం అతను వచ్చినప్పుడు, స్వాగతించడానికి మనం ఎవ్వరమూ లేము, ఇంటికి వచ్చిన అతిథికి ఏ కానుక ఇవ్వలేకపోయాము ” అంటూ సోమ్లా బాధపడ్డాడు.
“సరేలే ఇప్పుడు సాయంత్రం అయింది. రేపు పొద్దున ఒక అరటి గెలను తీసుకొని అతనికి కానుకగా ఇచ్చి రావాలి, ఏమంటారు పిల్లలూ” అని అడిగాడు.
సాలీ అక్కడ లేదు అతనికి సమాధానం చెప్పడానికి.
ఆరోజు రాత్రి ఒక విషయం జరిగింది రాత్రిపూట మాండ్యగంజి సేవించి గిరిజనులంతా నిద్రించిన తర్వాత గ్రామమంతా అన్ని పనులు ముగించుకొని సద్దుమణిగింది. సోమ్లా తన ఇంటి ముందు అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. రోడ్డుపై చీకట్లో ఒక కాలుతున్న చుట్ట వెలుతురు కొద్దికొద్దిగా ముందుకు వస్తూ అతని ఇంటి వద్దకు వచ్చింది. అతడు గ్రామ పెద్ద వద్ద ఉండే గోటీ (ఋణగ్రస్త బానిస) కావు పరజా అని గుర్తుపట్టాడు సోమ్లా. ఎవరైనా అప్పు తీసుకొని చెల్లించలేక పనులను చేస్తారు. చాలాకాలం అప్పు తీరక చివరికి బానిసగా మిగులుతారు. వారిని గోటీ అంటారు. వచ్చిన గోటీ సోమ్లాని పక్కకు పిలిచి గుసగుసగా ఏదో చెప్పాడు. శుక్రుజాని పెదవుల నుండి అసమ్మతిగా హుంకారం వచ్చింది.
కానీ కావూ పరజ పట్టుదలగా చెప్తూనే ఉన్నాడు.
” అవును… అవును…( అంటూ గొణుగుతూ) ఫారెష్ట్ గార్డ్ … సాలీ కోసమే… నన్ను నమ్ము.. అతడు అదే కోరుకుంటున్నాడు… నా కళ్ళ మీద ఒట్టు… నేను కాదు… అతడే ఆమెను… నీ బిడ్డను సాలీని ఫారెస్ట్ గార్డ్ ” అంటూ ఆపి ఆపి మాట్లాడుతుంటే.
సోమ్లా ఆగ్రహంతో ఉన్న జంతువు వలె గర్జిస్తూ “నీచుడా ! చూడు ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో?” అని అరిచాడు.
” నీ ఎముకలు అన్నీ విరగ కొడతాను, నువ్వు ఆగు నువ్వు బతికుండగానే నీ తోలు వొలుస్తాను” అని అరిచాడు.
“పిచ్చివాడిలా నామీద అరవకు” అంటూ కావుపరజా ఏడుస్తూ “నేను కేవలం ఫారెస్ట్ గార్డ్ పంపితే వచ్చాను. నీకు తెలుసు అతని మాట వినకపోతే ఏం జరుగుతుందో. అదే నీకు కూడా జరుగుతుంది అన్నా. నీకే కాదు మన అందరికీ అదే జరుగుతుంది. అధికారులు అడిగిన దానిని తిరస్కరించ లేము. అది వారికి సమర్పించాల్సిందే. ఒకవేళ వారి కోరిక మన భార్యా పిల్లలు అయినా సరే. ఏదో ఒక వంకన మనను చేతికి బేడీలు వేస్తారు. ఎప్పుడో ఒకసారి క్షమిస్తారు గాని ప్రతిసారి కాదు. ఒకరి పొరపాటు గిరిజనులంతా తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది” అన్నాడు కావుపరజా.
” తలకాయలేని మాటలు ఇవి” అంటూ సోమ్లా గట్టిగా అరిచాడు.
” అవును నాకు తెలుసు ఫారెస్ట్ గార్డ్ చాలా శక్తిమంతుడు. మనందరినీ నలిపేస్తాడు కానీ
ఆ శక్తిగల వృక్షం నా అమాయక సాలీనే ఎందుకు ఎంచుకున్నాడు. అతనంటే చాలా మంది పడిచస్తారు. డోంబ్ తెగ వారు , వారి భార్యలను ఫారెస్ట్ గార్డ్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళు వెళ్లి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. కేవలం రెండు రూపాయలకే అతను కోరుకున్న ఆడవారిని అందరిన పొందగలడు. వారంతా ఫైల్మాన్, జోహాన్, ఆలిసాండర్ వంటి వారి ఇంటి నుండి పరిగెత్తు కొస్తారు. గత నెల వేరే అధికారులు వచ్చినప్పుడు అదే చేశారు. వెళ్లి అతనికి చెప్పు పరజ స్త్రీలు అమ్మకానికి లేరని. మన కోళ్లను మన ధాన్యాన్ని అన్ని తీసుకున్నారు. ఇంకా ఏమి మిగిలి లేదు” అన్నాడు శుక్రజానీ.
” అంత ధైర్యం చేయలేను సోదరా” అన్నాడు కావు పరజా విచారంగా.
“అతడు సాలీ పట్ల పిచ్చి కోరికతో ఉన్నాడు. ఫారెస్ట్ గార్డ్ నాతో ఏమన్నాడో తెలుసా? అటువంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదని, ఆమె అవయవాలు మృదువుగా వెన్న వలె ఉంటాయని, ఆమె రొమ్ములు కొండలవలె ఉంటాయని, వెళ్లి ఆమె తండ్రికి చెప్పు. ఆమె నాకు కావాలని, ఇంకా
సోమ్లాకి ఈ పది రాగినాణాలను ఇవ్వు. అతని కోసం పొగాకు కొనుక్కోమను” అని కావు పరజా చెప్తూ ఉండగానే శుక్రుజాని లేచి అతని మీద పడి పిడి గుద్దులు కురిపించాడు పెద్దగా అరుస్తూ.
ఓరి దుర్మార్గుడా ఇదిగో ఇదిగో వాడికి మీ దేవుడికి ఆ మురికి కుక్కకు ఫారెస్ట్ గార్డ్ కు ఇవ్వు. ఇది అడవికి అద్దె, అతని నుండి తీసుకున్న దానికి ఇవి, కొలతలు వేసినందుకు. చాలా ఇంకా కావాలా దరిద్రుడా ముందు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో నిన్ను చంపక ముందే ఇక్కడి నుండి కదులు” అంటూ అరిచాడు. ఒక గిరిజనుడికి కోపం వస్తే మృగంలా మారతాడు. శుక్రు కోపంతో ఊగిపోతున్నాడు. అతని చూపు మసకబారింది. అతని చేతులు చాలా వేగంగా చెట్లు నరికి, రాళ్ళు ఎత్తి దృఢంగా అయినాయి.
కావుపరజా నొప్పులతో ఏడుస్తూ చీకటిలో కలిసిపోయాడు, నెమ్మదిగా గుంటనక్కలా.
ఆ తర్వాత సోమ్లా అవమానంతో కుంగిపోయాడు. మొదటిసారి ఫారెస్ట్ గార్డ్ మీద అసహ్యం కలిగింది. వెంటనే పోయి లెక్క తేల్చుకోవాలనుకున్నాడు. కానీ ఆలోచిస్తే “ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ” అని అనుకోగానే క్రమంగా ఆవేశంగా ఎగురుతున్న తల కిందికి వాలింది. అతడు మట్టి ముద్దలా నిలబడి నెమ్మదిగా పక్కన గోడకు ఆనుకొని నేలమీద కూలబడ్డాడు. తల రెండు చేతులతో పట్టుకొని, అంతవరకు జరిగిన సంఘటన మళ్లీ గుర్తు చేసుకున్నాడు. సోమ్లా తాను చాలా దూరం వెళ్లినట్టు గ్రహించాడు. “ఇది ఎక్కడ ముగుస్తుంది” అంటూ తనను తాను ప్రశ్నించుకున్నాడు. అది ఒక పరిష్కారం లేని సమస్యగా బాధపడ్డాడు .
*సశేషం*