దేవ్ దీపావళి

పాఠకులకు  దీపావళి శుభాకాంక్షలు. నిజమే మీరు సరిగానే విన్నారు  .ఇవి దీపావళి శుభాకాంక్షలే . అయితే దీన్ని  దేవ్ దీపావళి అంటారు . మనకు తెలిసిన దీపావళి కార్తీక అమావాస్యనాడు వస్తే ,ఇది కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే పండుగ  .ఈ పండుగను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో వైభవంగా జరుపుకుంటారు  .కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలు భు వికి దిగివచ్చి, గంగలో స్నానాలు చేస్తారట . అందుకే దీన్ని దేవ్  దీపావళి అంటారు . త్రిపుర పూర్ణిమ స్నానం అని కూడా అంటారు. ఈరోజు కాశీలోని ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఉన్న ఘాట్లన్నీ అంటే రవిదాస్ ఘాట్ నుండి రాజ్ఘాట్ వరకు అన్నమాట గంగకు ఇ రు  ప్రక్కల దీపాలను వెలిగిస్తారు . కోట్లాది దీపాల వెలుగులు   గంగలో ప్రతిఫలి స్తుంటే ఆ మెరుపులు యాత్రికులకు కళ్ళల్లో ప్రతిబింబిస్తుంటాయి .

వీటికి తోడు అందరి ఇల్లు, వాకిళ్లు దీపాల వెలుగులో  ప్రకాశిస్తుంటాయి  . ఆరోజు దేవతామూర్తులను  నగర వీధు లలో ఊరేగిస్తారు. గంగా పూజ , గంగా హారతి విశేషంగా జరుగుతాయి . ఈ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ఉన్నాయి  .కొందరి దృష్టిలో ఇది సుబ్రహ్మణయుని   జన్మదినం . మరికొందరు విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించింది ఈనాడే అంటారు  .

సాధారణంగా ఈ పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు . ప్రబోధిని ఏకాదశి నుండి పౌర్ణమి  వరకు అంటే ఐదు రోజులు. చాలామంది చీకటి తోటి కార్తీక స్నానాలు చేసి  ,దీప దానాలు చేస్తారు  .ఈ వేడుకను చూడ్డానికి ప్రాంతీయులతో పాటు , దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా యాత్రికులు వస్తారు.

ఎందరో సాధువులు కచ్చితంగా ఆ సమయానికి  వారణాసి  చేరుకుంటారు  . అయితే ముఖ్యంగా చూడాల్సింది మరొకటి ఉంది అమర జవాన్ జ్యోతి వద్ద గంగా సేవ నిధి దళం వారు ప్రత్యేక ప్రార్థనలు జరిపి పుష్ప గుచ్చాలు  ఉంచుతారు . రాజేంద్రప్రసాద్ ఘాట్ వద్ద పోలీస్ అధికారులు , గూర్ఖా  ట్రైనింగ్ సెంటర్  ,C R P F వారు ,AirForce ,N.C.C , బెనారస్ హిందూ యూనివర్సిటీ వారందరూ కవాతులు జరుపుతారు  .చివరిగా మిలిటరీ దళాల కవాతు జరుగుతుంది  .ఆ తర్వాత ఆకాశ దీపాలు వెలిగిస్తారు వీటికి తోడు ఈ మధ్యకాలంలో భగీరథ శౌర్య సన్మానాలు కూడా జత కలిసాయి  .

ఈ వేడుకలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది  .గంగ ఒడ్డున కోటి ప్రమిదల కాంతులు , దేశ విదేశీ సందర్శకులు  ,మిలిటరీ కవాతులు , గంగా స్నానాలు , దానాలు  ,అశేష జన సందోహం   .ఆనాటి గంగాహారతి చూడ్డానికి దేశమంతా కదిలి వచ్చిందా అన్నట్లు ఉంటుంది  . 21 మంది యువకులు 24 మంది యువతులు నిర్వహించే హారతి ఒక గొప్ప ఆనందాన్నిస్తుంది మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తుంది  . హారతి తో పాటు పాటలు , భజనలు , డప్పుల మో తలు  ,శంఖద్వానాలు  ,మేళ తాళాలు , హర హర మహాదేవ్ అనే ముక్త స్వరాలు   మనల్ని మరో లోకాలకు తీసుకెళ్తాయి.

 

నదికి ఇరువైపులా వేచి ఉన్న సందర్శకుల హర్షద్వానాల మధ్య దేవ్ దీపావళి సంబరాలు ముగుస్తాయి . భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం మన దేశానికి ప్రాణనాడి  .దాన్ని ఆరోగ్యకరంగా సంచరించనిద్దాం .

ఇదండీ దేవ్ దీపావళి సంగతి  .

మరోసారి దేవ దీపావళి శుభాభినందనలతో మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే వరకు సెలవా మరి.

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యూరోప్ ట్రిప్ – 5  

తులసి కళ్యాణం