కిందటి వారం 19వ తేదీ ఉదయం, మనం కార్ల్ మార్క్స్ సమాధి ఉన్న హైగేట్ సిమెట్రీకి వెళ్ళి, అక్కడి విషయాలు తెలుసుకున్నాం కదా! అక్కడ నుంచి, అదే రోజు మద్యాహ్నం, రాయల్ అబ్జర్ వేటరీ గ్రీన్విచ్ మెరీడియమ్ కి వెళ్ళాము.
సిమెట్రీ నుండి నేరుగా గ్రీన్విచ్ మెరీడియన్ కి బయలు దేరాము. దాదాపుగా గంటన్నర ప్రయాణ చేసాము. దారిలో హైస్ట్రీట్ కనబడింది. ప్రతీ ఏరియాకి ఇలాంటి షాపింగ్ సెంటర్స్ ఉంటాయట. యుఎస్ లో డౌన్ టౌన్ లాగా. అక్కడ ఇళ్ళన్ని బయటకు ఇటుకలు కనబడుతూన్నట్టుగా కట్టబడి ఉన్నాయి. గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ లు గానీ, కలర్ వేసి గాని ఎక్కడా కనబడ్డం లేదు. కొద్ది దూరం వెళ్ళాక, వీధిలో ట్రెడీష్నల్ టాప్ హాట్, లాంగ్ అంటే మోకాళ్ళు దాటేవరకు నల్లటి కోటు, ‘గార్టెల్‘ అనే బెల్ట్, షూజ్ వేసుకుని జనాలు కనబడ్డారు. మన హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో కనబడే ముస్లిమ్స్ వేసుకునే షేర్వాణి లాగా అనిపించింది వాళ్ళ సూట్. చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్దవారి దాక మగవారందరూ అలాంటి సాంప్రదాయక దుస్తులనే వేసుకుంటారని అక్షర్ వివరంగా చెప్పాడు. వారిని హాసిడిక్ గార్బ్ జూయిష్ లని అంటారని, ఆ గోల్డర్స గ్రీన్, ఫిన్స్ బరీ పార్క్ లలో జూయిస్ కమ్యూనిటీ ఎన్నో ఏళ్ళుగా నివసిస్తున్నారని చెప్పాడు. చాలా ట్రెడీష్ నల్ గా ఉంటారట. లాంగ్ హాట్స్ వేసుకోవటం తో వారే ప్రపంచం లో అన్నిట ఎత్తైనవారుగా వారు భావిస్తారట.
మద్యాహ్నం 2.20 కల్లా రాయల్ అబ్జర్వేటరీకి చేరుకున్నాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా! భూమి వృత్తాకారంలో ఉంటుంది, దానిపై నిలువుగాను అడ్డంగానూ ఊహారేఖలు ఏర్పాటు చేసారని. అడ్డంగా ఉన్న ఊహారేఖలు అక్షాంశాలు (latitudes). నిలువుగా ఉన్నవి రేఖాంశాలు (longitudes). ఈ రేఖలు భూమధ్యరేఖ (Equator) నుండి దూరాన్ని కొలవడానికి, ఏదైనా ప్రదేశం యొక్క దూరాన్ని కనుగొనడంలో అక్షాంశాలు మనకు సహాయపడతాయి. ఈ ఊహా జనిత రేఖాంశం, అక్షాంశ రేఖలు ఎన్నో విధాలుగా ఉపయోగ పడతాయి. భూమిపై ఏదైనా ప్రదేశం యొక్క స్థానాన్ని, వాతావరణాన్ని కనుగొనగలం. భూగోళ శాస్త్రజ్ఞులు పరిశోధకులు ఈ రేఖాంశం, అక్షాంశాలు ఆధారంగానే వారి పరిశోధనలు చేస్తారు. ముఖ్యంగా భూమధ్య రేఖ అంటే జీరో డిగ్రీ అక్షాంశం. ఇది భూమిని ఉత్తర దక్షిణ భాగాలు గా విభజిస్తుంది. దానికి ఉత్తరంగా 23½ డిగ్రీల కర్కట రేఖ, దక్షిణంగా 23½ డిగ్రీల మఖర రేఖ తదితర అక్షాంశాలు ఉన్నాయి. దీనివల్ల భూమిపై నున్న ఆయా దేశాల ఉష్ణోగ్రతలను, ఉనికిని మరెన్నో విషయాలు తెలియ చేస్తుంది. మన భారత దేశం మధ్య నుండి కర్కటరేఖ ఎనిమిది రాష్ట్రాలగుండా ప్రయాణిస్తుంది. దానివల్ల మన ఉత్తర భారతంలో చల్లగానూ, భూమధ్య రేఖకి దగ్గరగా ఉండటం వల్ల దక్షిణ భారతందేశం వేడిగా ఉంటుందని తెలుసుకోగలుగుతున్నాం.
అలాగే నిలువుగా గీసిన ఊహా రేఖలు రేఖాంశాలు. భూమికి మధ్యగా అడ్డంగా గీసిన ఊహా రేఖ భూమధ్య రేఖలాగే, భూమికి మధ్య నిలువుగా ఉన్న జీరో డిగ్రీ రేఖాంశం గ్రీన్విచ్ సిటీ లో ఉండడం వల్ల ఈ రేఖాంశాన్ని ఆ పేరుతోనే గుర్తింపబడింది. మొత్తం భూమిని తూర్పు పడమరలగా విభజిస్తుంది ఈ జీరో డిగ్రీ గ్రీన్విచ్ రేఖాంశము. ఇక్కడనుంచే మనం ఇప్పుడు ఉపయోగించే కాలమానం ప్రారంభం అన్నమాట. భూమి ఆంటీ క్లాక్వైజ్ పడమర నుండి తూర్పు వేపు తిరుగుతుంది. దీన్నే ప్రొగ్రేడ్ రొటేషన్ అంటారు. అందువల్ల ఈ జీరో డిగ్రీ రేఖాంశం నుండి తూర్పువేపుకి టైమ్ ప్లస్ అవుతుంది. ప్రతీ ఒక్క రేఖాంశం నుండి మరో రేఖాంశం వరకు నాలుగు నిముషాల్లో సూర్యుడు ప్రయాణిస్తాడు. మనదేశం తూర్పున 82.30 డిగ్రీల రేఖాంశం పరిధిలో ఉంది. అందుకని మన సమయం గ్రీన్నిచ్ జీరో డిగ్రీ మెరీడియమ్ నుండి అయిదు గంటలు తరువాత ఉంటుంది. అంటే అక్కడ మద్యాహ్నం పన్నెండు అయితే మనకు సాయంత్రం ఐదవుతుందన్నమాట. ఇది మన దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తిస్ గడ్, ఒడిస్సా, మన ఆంధ్రప్రదేశ్ ఐదు రాష్టాల గుండా నిలువుగా ప్రయాణిస్తుంది. అందుచేత ఆ రేఖాంశం వద్దనున్న టైమ్ జోన్ ను మన దేశ ప్రామాణిక సమయంగా అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ గా నిర్దేసించబడింది. గ్రీన్విచ్ రేఖ జీరో డిగ్రీ టైమ్ జోన్ తెలిపేదైతే సరిగ్గా దానికి వెనుకవేపున ఉన్న180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ తేదీ రేఖ అంటారు. ఇది పసిఫిక్ మహా సముద్రం గుండా నిలువుగా పయనిస్తుంది. ఇది కాలెండర్ రోజును నిర్ణయిస్తుంది. ఎంతోమంది శాస్త్రీయ పరిశోధకుల నిరంతర శ్రమ ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న సమయాలు, తేదీలు ప్రపంచపురోగతులు. ఆ పరిశోధనలకు ఆలవాలమైందే ఇప్పుడు మనం చూడబోతున్న రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ మెరీడియం, ఆ జీరో డిగ్రీ రేఖాంశం.
చిన్నన్నయ్య రాముడు ఎన్నో సైంటిఫిక్ విషయాలు చెప్పేవాడు. బహుశా ఓ పదిహేను సంవత్సరాలకిందట ఆయన లండన్ కి వెళ్ళాడు. అప్పుడు ఈ గ్రీన్విచ్ జీరో డిగ్రీ రేఖాంశం గురించి చెప్పటం, ఆయన ఆ జీరో డిగ్రీ గీత మీద నిలుచుని దిగిన ఫోటోలను చూసా. అప్పటినుండి ఈ ప్రదేశాన్ని చూడాలనే బలమైన కోరిక కలిగింది. అది ఇప్పుడు నెరవేర బోతోందనే ఎగ్జైట్మెంట్. ఈ ఆలోచనలతో గమ్యం చేరాము. కాబ్ పైవరకు తీసుకెళ్ళింది. అదంతా కొండ ప్రాంతం మైనందున సిటీ చాలా వరుకు కనబడుతుందిట. ఆ సుందర దృశ్యం చాలా అద్భుతంగా ఉంది.
రాయల్ అబ్జర్వేటరీ ముందు ఎత్తుగా ఒక పీఠం పై జనరల్ జేమ్స్ వోల్ఫ్ (1727-59) విగ్రహముంది. లాంగ్ కోట్ తలపై టోపి, ఆచేతిలో బైనాక్యులర్స్ తో నిలుచుని ఉన్న విగ్రహం. కెనడియన్ శిల్పి అయిన టైట్ మెకెంజీ, జనరల్ వోల్ఫ్ విగ్రహం కాంస్యచే తయారు చేసాడు. మార్క్విస్ డి మోంట్‌కాల్మ్ అనే అక్కడి జనరల్ ఆవిష్కరించినట్టుగా రాసారు. జనరల్ జేమ్స్ వోల్ఫ్ యొక్క కాంస్య బొమ్మ థేమ్స్ నది వేపు చూస్తున్నట్టుగా కనబడుతుంది.
నావికుడి దుస్తులలో ఉన్న జేమ్స్ వోల్ఫ్ స్మారక చిహ్నం వెనుక ‘ఈ విగ్రహం 1930లో స్థాపించబడింది, ఈ స్మారక చిహ్నం, కెనడియన్ ప్రజల బహుమతి, మార్క్విస్ డి మోంట్‌కాల్మ్ ద్వారా ఆవిష్కరించబడింది” అనే శాసనాన్ని రాశారు. విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతం గ్రీన్‌విచ్‌పై గొప్ప ఆకర్షణగా కనబడుతుంది.
వోల్ఫ్ విగ్రహం అబ్జర్వేటరీ వెలుపల కాపలాగా ఉన్నట్టుగా ఉంది. జనరల్ వోల్ఫ్ 14 సంవత్సరాల వయస్సులో సైన్యంలో చేరి అంచెలంచెలుగా ర్యాంక్‌లను అధిరోహించాడు – 1759లో 32 సంవత్సరాల వయస్సులో మేజర్ జనరల్ అయ్యాడు. ఆ సమయంలో, బ్రిటన్ ఐదు సంవత్సరాలు ఫ్రాన్స్‌తో యుద్ధం చేసింది, వోల్ఫ్ వెంటనే కెనడాకు పంపబడ్డాడు. ఫ్రెంచ్ కాలనీ క్యూబెక్‌పై ముట్టడి చేసింది.
జనరల్ వోల్ఫ్ ఫ్రెంచ్ సైన్యాన్ని అధిగమించేందుకు సాహసోపేతమైన వ్యూహాలను అవలంబించాడు. వారి దళాలను ఓడించి బ్రిటన్ కోసం కెనడాను విజయవంతంగా సాధించాడు. విషాదకరంగా, మస్కెట్ ఫైర్ యొక్క మొదటి వాలీలలో జనరల్ వోల్ఫ్ ప్రాణాపాయంగా గాయపడ్డాడు, అయితే విజయం అతనిదేనని తెలుసుకోవడానికి చాలా కాలం జీవించాడు. సైన్యం లో చేరక ముందు అతను గ్రీన్విచ్ లోనే గడిపాడట. అందుకని ఆయన మృతదేహాన్ని తిరిగి గ్రీన్‌విచ్‌కు తీసుకువచ్చి, సెయింట్ ఆల్ఫెజ్ చర్చి యొక్క సొరంగాలలో ఖననం చేసారు. ఆ గొప్పదనం వల్లే అతను జాతీయ హీరోగా కీర్తించబడ్డాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, ఒక బాంబు అబ్జర్వేటరీపై పడింది, దీని వలన బయటి భవనాలకు చాలానే నష్టం జరిగింది. పేలుడు నుండి ష్రాప్నెల్ విగ్రహం వెనుక భాగంలో తాకింది, మరియు మచ్చలు ఇప్పటికీ పునాదిపై కనబడతాయి.
అక్కడున్న జనరల్ జోన్స్ వోల్ఫ్ యుద్ద వీరుని గురించి తెలుసుకున్నాక, రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ భవనం వైపు వెళ్ళాము. అక్కడ చాలా మంది ఆ భవనం గోడ నుంచి ముందు వేపు ఒక గీత గీయబడి ఉంది. అదే జీరో డిగ్రీ రేఖాంశము. ఈ భవనం గ్రీన్విచ్ ప్రైమ్ మెరిడియన్ జన్మస్థానం. ముందు భాగంలో ఇత్తడి స్ట్రిప్‌తో గుర్తించబడింది. పైకప్పు యొక్క శిఖరం తెల్లటి నిలువు స్ట్రిప్స్‌పై ఎడమ వైపున తెరుచుకుంటుంది (ఈవ్స్‌లోని కీళ్ళు కనిపిస్తాయి), టెలిస్కోపిక్ నక్షత్రాల వీక్షణలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.
ఆ రేఖ మీద రెండు వేపులా చెరో కాలునుంచి నిలుచుని పొటోలు దిగుతున్నారు జనాలు. అంటే భూమిపై ఒకకాలు తూర్పు గోళం మీద, మరోటి పడమటి గోళం మీద నిలబడి నట్టుగా. భూమి మీద ఉన్న జీరో డిగ్రీ రేఖాంశం చూడ్డం, దానిమీద నిలబడడం ఎంతో ఆనందం, ఉద్వేగం కలిగింది. ఆ రేఖ రెండువేపుల ఆ వేపున ఉన్న దేశాలు, ఆ రేఖ నుండి ఆ యా దేశాల కాలమానాలు రాయబడి ఉన్నాయి.
ఆ భవనం లోని అష్టభుజి గది మీద టైమ్ బాల్ ఎరుపు బంతిని అమర్చారు. దాన్ని గ్రీన్విచ్ టైమ్ బాల్ అంటారు. అది పడిపోయినప్పుడు నిర్దిష్ట సమయం సూచించబడుతుంది. ఇది చాలా ఖచ్చితమైన టైమ్. దూరం నుండి గడియారాలను సెట్ చేయడానికి, ముఖ్యంగా నౌకాయానానికి ముందు థేమ్స్ నదిపై ఉన్న ఓడల క్రోనోమీటర్లుకు వీలుగా ఏర్పరిచారు. అబ్జర్వేటరీ మొదట నక్షత్ర పరిశీలనల ద్వారా సమయాన్ని నిర్ణయిస్తుంది. గ్రీన్విచ్ యొక్క రెడ్ టైమ్ బాల్ 1833లో స్థాపించబడింది. ఇది పబ్లిక్ టైమ్ సిగ్నల్‌గా గుర్తించబడింది. ప్రస్తుతం టైమ్ బాల్ సాధారణంగా కిందికి దిగిన స్థితిలో ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం 12:55 గంటలకు బంతి పైకి వెళ్ళడం ప్రారంభమవుతుంది, తర్వాత 12:58కి అది పైకి చేరుతుంది; మధ్యాహ్నం 1 గంటలకు బంతి పడిపోతుంది.
నౌకాశ్రయంలోని నావికులు, ఇతరులు తమ గడియారాలను GMTకి సమకాలీకరించడానికి అబ్జర్వేటరీకి సహాయం చేయడానికి, ఖగోళ శాస్త్రవేత్త రాయల్ జాన్ పాండ్ 1833లో అబ్జర్వేటరీ పైన ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటలకు (13:00) పడే అందరికి కనిపించే టైమ్ బాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఇది ఆపరేటర్ ద్వారా పని చేసేది. 1852 నుండి ఇది షెపర్డ్ మాస్టర్ క్లాక్ నుండి విద్యుత్ ద్వారా ఆటోమేటిక్ గా బంతి పనిచేసే విధంగా మార్చారు. బంతి ఇప్పటికీ ప్రతిరోజూ 13:00 (GMT శీతాకాలంలో, BST వేసవిలో) వేయబడుతుంది. మధ్యాహ్నం 12 గంటలు ఎంచుకోకపోవడానికి కారణం ఏమిటంటే, అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు ఆ రోజున సూర్యుడు ఆ సమయంలో మెరిడియన్‌ను దాటినప్పుడు రికార్డ్ చేస్తారు. ఐసింగ్ లేదా మంచు కారణంగా బంతి చిక్కుకుపోయే అరుదైన సందర్భాల్లో, గాలి మరీ ఎక్కువగా ఉంటే అది కిందపడదు. 1852లో, టెలిగ్రాఫ్ వైర్ల ద్వారా కూడా సమయ సంకేతాన్ని పంపిణీ చేయడానికి ఇది స్థాపించబడింది. టైమ్ బాల్ ప్రజలలో, క్రోనోమీటర్‌లు, రైల్వేలు, మెరైనర్‌లలో బాగా ప్రాచుర్యం పొందింది. సౌతాంప్టన్‌లో కూడా మరొక టైమ్ బాల్‌ను ఏర్పాటు చేయాలని ఒక పిటిషన్ కూడా ఉంది.
బయట చూసిన తరువాత అక్కడే ఉన్న దాని చరిత్ర చెప్పే మ్యూజియం లోకి వెళ్ళాము. అబ్జర్వేటరీ రాయల్ పరిశోధకులు ఈ భవనంలోనే నివసించి ఇక్కడనుంచే తమ పశోధనలు జరిపారు. మొదటి శాస్త్రజ్ఞుడు ఫ్లామ్ స్టీడ్ పేరుతో, ఆ పరిశోధకుల జ్ఞాపకార్థం దీన్ని ప్రదర్శనశాలగా మార్చారు.
1676 నుండి 1948 మధ్యకాలంలో పది మంది పరిశోధకులు ఫ్లామ్ స్టీడ్ హౌజ్ లో నివసించిన భవనాన్ని అప్పటి ఫొటోలు పరిశోధనా రచనల్ని ప్రదర్శనకు పెట్టారు. వారు వాడిన వస్తుసామాగ్రి కూడా ఉంది. భవనంలోని వాళ్ళు వాడిన ప్రతీ గదిని పేరు పేరునా తెలిపే నేమ్ బోర్డ్స్ ఉన్నాయి. 19 వ శతాబ్దానికి ముందు అస్ట్రానమర్ రాయల్ వొంటరిగా నే ఒక సహాయకుడితో పాటు తన రిసెర్చ్ వర్క్ చేశాడు. చాలా క్లిస్టమైన పని, సముద్రాల వద్ద పనిచేసే ఇతర పరిశోధకుల నుండి నావికుల వద్దనుండి అబ్జర్వేటరీ డాటా ని కలెక్ట్ చేయవలసి రావటం. కొన్ని శతాబ్దాల తరువాత వాటి పై పని చేసిన పరిశోధకుల టీమ్స్ నుండి కావలసినంత సహాయాన్ని రాయల్ పరిశోధకలు పొందారు.
ఇది గ్రీన్‌విచ్ పార్క్‌లోని కొండపై ఉన్న ఒక అబ్జర్వేటరీ. ఆగ్నేయ లండన్, ఉత్తరాన థేమ్స్ నదికి అభిముఖంగా ఉంది. ఇది ఖగోళ శాస్త్రం, నావిగేషన్ చరిత్రలో ప్రధాన పాత్ర పోషించింది. ప్రైమ్ మెరిడియన్ దాని గుండా వెళ్ళినందున, ఇది గ్రీన్‌విచ్ మీన్ టైమ్ అని పేరుగాంచింది. నేషనల్ మారిటైమ్ మ్యూజియం, క్వీన్స్ హౌస్ మరియు క్లిప్పర్ షిప్ కట్టీ సార్క్‌లు సమిష్టిగా రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్‌విచ్‌గా గుర్తించబడ్డాయి.
ఈ అబ్జర్వేటరీ 1675లో కింగ్ చార్లెస్ II చేత ప్రారంభించబడింది, ఆగస్టు 10న పునాది రాయి వేశారు. ఖగోళ శాస్త్రవేత్త రాయల్ స్థానాన్ని కూడా సృష్టించాడు. స్థిర నక్షత్రాలు, తద్వారా నావిగేషన్ కళ యొక్క పరిపూర్ణత కోసం స్థలాల యొక్క కావలసిన రేఖాంశాన్ని కనుగొనడానికి. అతను జాన్ ఫ్లామ్‌స్టీడ్‌ను మొదటి ఖగోళ శాస్త్రవేత్త రాయల్‌గా నియమించాడు. ఈ భవనం 1676 వేసవిలో పూర్తయింది. ఈ భవనాన్ని తరచుగా “ఫ్లామ్‌స్టీడ్ హౌస్” అని పిలిచేవారు, అతను ఈ భవనంలో ప్రథమంగా నివసించాడు.
గ్రీన్విచ్ సైట్ ఇప్పుడు దాదాపు ప్రత్యేకంగా మ్యూజియంగా నిర్వహించబడుతోంది, అయినప్పటికీ AMAT టెలిస్కోప్ 2018లో ఖగోళ పరిశోధన కోసం పనిచేసింది. గ్రీన్విచ్‌లోని అబ్జర్వేటరీ భవనాలు ఖగోళ మరియు నావిగేషనల్ సాధనాల మ్యూజియంగా మారాయి, ఇది రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్‌విచ్‌లో భాగమైంది.
1676లో అబ్జర్వేటరీ యొక్క ప్రధాన భవనం, అబ్జర్వేటరీ యొక్క అసలు భాగం అయిన ఫ్లామ్‌స్టీడ్ హౌస్‌ను సర్ క్రిస్టోఫర్ రెన్ రూపొందించారు, బ్రిటన్‌లో ఉన్న మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధనా కేంద్రం. ఇది £520 (2023లో £99,000కి సమానం) ఖర్చుతో నిర్మించబడింది,
రాయల్ గ్రీన్విచ్ అబ్జర్వేటరీ యొక్క గేట్ల వద్ద షెపర్డ్ గేట్ క్లాక్. ఈ గడియారం ఏడాది పొడవునా గ్రీన్‌విచ్ మీన్ సమయాన్ని చూపుతుంది, అనగా. ఇది వేసవిలో బ్రిటిష్ వేసవి సమయానికి సెట్ చేయబడలేదు.
ఈ భవనంలో ఐదవ పరిశోధకుడు నెవిల్ మాస్కెలిన్ కుటుంభం వాడిన పాత్రలు, వారి వంట రెసిపీలు అక్కడ ఉన్నాయి. అప్పుడు వారు వాడే సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు తలనొప్పులకు కావలసిన హోమ్ రెమెడీలు ఒక పుస్తకంగాను, ఆ టేబుల్ మీద రాయబడి ఉన్నాయి.
ఆ శాస్త్రజ్ఞులు 1844 లో పిల్లల కోసం వాడిన టెలిస్కోప్లు, స్కేల్స్, అయస్కాంత సూచి ఉన్నాయి. మాన్స్కిప్ట్ ని చదవటానికి వీలుగా ఒక చిన్న రైటింగ్ టేబుల్ కి స్టాండ్ తో అమర్చబడ్డ బూతద్దం కనబడింది. (1801-92) ఏడవ రాయల్ జార్జ్ బిడ్డెల్ ఎయిరీ కి వారి కుటుంభం పట్ల ఉన్న అభిమానానికి గుర్తుగా ఆయన స్వహస్తాలతో రాసిన వారి ఫామిలీ హిస్టరీ, అతనికి తన భార్యపిల్లల పట్ల గల ప్రేమను, తన పరిశోధన అనుభవాలను ఆ పుస్తకం తెలియచేస్తుంది. అతని చేతితో గీసిన మాప్లు, పిల్లలకోసం గీసిన డ్రాయింగ్స్ లున్నాయి. అంతేకాక ఆ శాస్త్రవేత్తలకు అందిన బహుమతులను కూడా అక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.
ఆరోజుల్లో వారికి లబ్యమైన వస్తువుల తోనే వారు పరిశోధనలు చేసారు. అవన్ని అక్కడ కనబడుతున్నాయి. నక్షత్రాల, గ్రహాల గురించి రిసెర్చ్ చేయటానికి ఉపయోగించ్న వస్తువులు, గ్లోబులూ ఉన్నాయి. ఒక పెద్ద ప్రపంచ గ్లోబ్ స్టాండ్ కు ఫిక్స్ చేయబడి ఉంది. దాని చుట్టూ ఆయా దేశాల సమయాలను తెలుపుతూన్న ఒక బెల్ట్ అమర్చబడి ఉంది. ఒక గది గోడలకు అంతా వారు ఏర్పరచుకున్న పెద్ద గడియారంలోని అంతర్భాగాలున్నాయి.
ఇలా చాలా గొప్ప విషయాలను తెలుసుకున్నాను. అన్ని మీకు చెప్పాలని ఉంది. (అక్కడ ప్రదర్శనలో ఉంచిన విషయాలను చదవటానికి టైమ్ లేక ఎన్నో ఫొటోలు, విడియోలు తీసాను). కాని ఇక్కడ సాధ్యం కావటం లేదు. ఇంకా ఎంతోతెలుసుకోవాలనే ఆరాటం ఉన్నా, తనివి తీరకున్నా సమయాభావం వల్ల అక్కడనుంచి బయటకు రావలసి వచ్చింది.
ఆ ఫ్లామ్స్టీడ్ హౌజ్ నుంచి బయటకు రావటానికి కిందకు వెళ్ళాలి. అక్కడ కొంచెం స్లోప్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం పడిపోతానని భయంతో నెమ్మదిగా దిగాను. అక్కడ నుండి నడుస్తూ కింగ్స్ దర్బార్ అనే లండన్ స్టీట్ మార్కెట్ లోకి వెళ్ళాము. మన దగ్గర రోడ్డుమీద ఉండే తినుబండారాల బండ్లలాగానే అక్కడ కూడా అన్నిరకాల లోకల్ తినుబండారాలు ఉన్నాయి. అన్నీ నాన్ వెజ్. ప్రణయ్, అక్షర్, అవినాశ్, ఏవో నాకు పేర్లు తెలియని స్నాక్స్ తిన్నారు. అక్కడ ఫిష్ అండ్ చిప్స్ అని చాలా ఫేమస్ అట. ముళ్ళు లేని చేప ముక్కలను బజ్జీల మాదిరిగా వేసి ఆలూ చిప్స్ తో పాటు ఇస్తారట. చాలా బాగుంటుందని తినిపిస్తానని చాలా వెతికారు కాని దొరకలేదు.
కాబ్లో కొంతదూరం వచ్చి ఒక ఇండియన్ హోటల్లో లంచ్ ఐదింటికి చేసాము. ఫ్రైడే రైస్, వెజ్ మంచూరియా చాలా రుచిగానే అనిపించాయి. అక్కడ్నుంచి హోటల్ రూముకి వచ్చి, ఇండియానుంచి అక్షర్ కోసమని పెట్టె నిండుగా వదిన పంపిన తినే పదార్థాలు కవర్లో సర్ది ఇచ్చాను. ఆ రోజు రాఖీ పూర్ణిమ అని మా అన్నయ్య మనుమరాళ్ళు ఆరోహి, ఆయుషి పంపిన రాఖీలు ఇచ్చాను. అక్షర్ కి వాళ్ళిద్దరే చెల్లెళ్ళు. ఆ ఆడపిల్లలిద్దరూ మా అన్నయ్య రెండో కొడుకు కొడుకు శ్రీధర్ పిల్లలు. మూడో కొడుకు వాసు అబ్బాయే ఈ అక్షర్. లక్కీగా రాఖీ పూర్ణిమ రావటంతో, నేను వచ్చేటప్పుడు వాడికి రాఖీ పంపారు. పదిహేనేళ్ళుగా వాడికి కట్టుకునే అవకాశమే లేకపోయింది.
నన్ను రాఖీ కట్టమన్నాడు. ఎప్పుడో, మా నాన్న ఉన్న జమానాలో మా అన్నయ్యలకు కట్టిన గుర్తు. ఇంకోసారి రంగనాథం జైల్లో ఉన్నప్పుడు, మిగిలిన రచయితలందర్ని చూడ్డం కోసం, రాఖీలు కట్టాలనే కారణం చెప్పి వాళ్ళందర్ని బయట ఇంటర్వూ హాల్ లోకి పిలిపించాము. ఆ ములాఖాత్ కోసమే చెరబండరాజు, ఎమ్ టి ఖాన్, కె.వి.రమణారెడ్డి గార్లకు కట్టాను. మళ్ళీ ఇన్నాళ్ళకు అక్షర్కి కట్టాను. ఫొటోలు అవినాష్ తీశాడు. వాటిని అవి పంపిన ఆర్తి కి ఆరోహికి పంపాను. తెల్లవారి మాడమ్ తుస్సాడ్ లో కలుస్తానని అక్షర్, వాడి ఫ్రెండ్ అవినాశ్ వెళ్ళిపోయారు. వాడు పనిచేసేది అక్కడే కాబట్టి మమ్మల్ని మళ్ళీ కలిసే అవకాశం దొరికింది. నేను ప్రణయ్ స్నానం చేసి కింద డైనింగ్ హాల్లోకి వెళ్ళాము. ఆకలి లేకపోయినా, అప్పటికే యూరోప్ ట్రిప్ గ్రూప్ వాళ్ళు వచ్చారని, రాత్రికి డిన్నర్ హాల్లో కలవాలని ట్రూప్ మేనేజర్ వైదేహి మెసేజ్ పెట్టింది.
అక్కడ వైదేహిని, పూనా నుంచి వచ్చిన జ్యోతి, వాళ్ళ అమ్మ జూలీగారిని కలిసాను. బాగా మాట్లాడారు. ఇంకా రావలసిన వారికోసం మళ్ళీ ఏర్పోర్ట్కి వైదేహి వెళ్ళింది. రూంకి వచ్చి పడుకున్నాము. పొద్దుట 8.30 కల్లా బస్ లో ఉండాలని లండన్ సైట్ సీయింగ్ కి బయలు దేరాలని మెసేజ్ వచ్చింది.
అలా లండన్ లోని మా ప్రత్యేకమైన సైట్సీయింగ్, ప్రపంచ ప్రసిద్దిగాంచిన తత్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త, ఆర్థికవేత్త, దాస్ కాపిటల్ రచయిత, చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు అయిన గ్రేట్ కార్ల్ మార్క్స్ సిమెట్రీ, గ్రీన్విచ్ రాయల్ అబ్జర్వేటరీ సందర్శన పూర్తిచేసి నా చిరకాల వాంఛ తీర్చుకున్నాను. రేపటినుండి థామస్ కుక్ వాళ్ళ ప్రోగ్రాం ప్రకారం, ట్రూప్ వాళ్ళందరితో కలిసి మా యూకే, యూరప్ ప్రయాణం ప్రారంభం కానుంది.
లండన్ సిటీ టూర్ విశేషాలతో మరో వారం కలుద్దాం