మహిమాన్విత మాసం – కార్తీక మాసం

యద్దనపూడి దుర్గా కళావర్ణని

తెలుగు సంవత్సరాలలో ఎనిమిదో నెల కార్తీక మాసం. పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది. కార్తీక మాసం హరిహరుల కిద్దరికీ ప్రీతి పాత్రమైనది.

కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణు దేవుని కంటె సమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగ కంటె పుణ్యప్రదమైన తీర్థాలు లేవని స్కాందపురాణంలో పేర్కొన్నారు.

ఈ కార్తీక మాసంలో దేశమంతటా శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. శివుడు అభిషేకప్రియుడు, ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేస్తే శివుడు సంతోషంతో తాండవం చేస్తాడు. అలాగే, విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణాలు, విష్ణు సహస్రనామార్చన, పారాయణం చేస్తారు. ఇండ్లలో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారు. విష్ణువు అలంకార ప్రియుడు. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. అందువల్ల, ఈ మాసానికి కార్తీక దామోదర మాసమనే పేరు కూడా వుంది. పూజలు చేసేటప్పుడు, సంకల్పంలో “కార్తీక దామోదర ప్రీత్యర్థం” అని చెప్పుకుంటారు.

ఈ మాసంలో, ప్రతి రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి, శుచియై, పూజా కార్యక్రమాలు నిర్వర్తించి, కార్తీక పురాణము (రోజుకొక అధ్యాయం) పారాయణం చేయాలి. మహిళలు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, తులసి కోట వద్ద దీపారాధన చేసి, గౌరీపూజ చేస్తే పరమేశ్వరానుగ్రహము, సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.

ఈ మాసానికి కౌముది మాసం అని పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండవది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంట్లో వెలిగించేది కార్తీక దీపం, దేవాలయాల్లో, ధ్వజస్థంభం చివర వెలిగించేది ఆకాశదీపం.

ఈ మాసంలో చేయాల్సిన రెండు ప్రత్యేక పూజలు, గోపూజ, తులసి పూజ, దూడతో సహా ఉన్న ఆవుని పూజించడం, వాటికి కొంచెం గ్రాసాన్ని ఇవ్వడం శుభకరం. తులసికి పూజ చేయటం, తులసీ కళ్యాణం జరపటం శ్రేయస్కరం.

మాఘ, చైత్ర మరియు కార్తీక మాసాలలో సత్యనారాయణ వ్రతం చేయాలి. వీనిలో కార్తీక మాస పౌర్ణమిన చేయటం అత్యంత శ్రేష్టమైనది. అందుకు కారణం, ఈ మాసం కార్తీక దామోదర స్వరూపం.

కార్తీక మాసంలో దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. ఉసిరి కాయలను దీప సహితంగా దానం చేయటం, ఉసిరి కాయ మీద వత్తి వెలిగించి దానమివ్వటం మంచిది. కార్తీక వన భోజనాలు అందరికీ తెలిసినదే. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు, దాన ధర్మాలు చేస్తారు. ప్రశాంతంగా ఉండే వనానికి వెళ్ళి, అక్కడే వంటలు చేసుకొని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపటం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతి సంరక్షణ వంటివి కలుగుతాయి.

కార్తీక పురాణము స్కంద పురాణములోని ఒక భాగము. 30 అధ్యాయములు. కార్తీక మాసంలో, ప్రతి రోజు ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేయాలి. ఇది ఆకర్షణీయమైన, భక్తి కథలతో అలరారుతున్నది. కార్తీక మాస మహత్మ్యమ, దీపారాధన మహిమ, వన భోజన మహిమ ఇందులో వివరించబడినాయి. అజామిళోపాఖ్యానము, పురంజయుడు ముక్తి పొందుట, భక్త అంబరీషుని కథ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

మనది సనాతన హిందూ ధర్మము. దీనిని కొనసాగించడం, కాపాడుకోవడం మనందరి విధి. నిత్యపూజలు, దేవాలయాల దర్శనం, దానధర్మాలు చేయడం, నోములు వ్రతాలు ఆచరించటం, సరైన ఆచరణ, వస్త్ర ధారణ పాటించడం మనందరి కర్తవ్యం.

ఈ కార్తీక మాసం మనందరి జీవితాలలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

ఆడు మనిషి