ఒడిపిళ్ళు

– 4వ భాగం

మరో నెల గడిచింది ఫారెస్ట్ గార్డ్ తనిఖీ కోసం మళ్ళీ వచ్చాడు తన తుపాకీతో సమూహంతో.
అడవంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఫారెస్ట్ గార్డ్ కళ్ళు మాత్రం స్నానం చేస్తున్న గిరిజన స్త్రీల అందాలను వాగుల వెంట వెతుకుతూ తిరుగుతున్నాయి.
ఆ కొండ ప్రాంతాల్లో నివసించే పిరికి గిరిజనులకు అతడొక రాజు వంటివాడు.. అతనికి ఎవరు ఎదురు చెప్పలేరు. అందువల్ల ఫారెస్ట్ గార్డ్ స్వయం తృప్తితో, తనకు తాను తెచ్చుకున్న ప్రాధాన్యతతో, గర్వపడుతూ గిరిజనుల మధ్య ముందుకు సాగుతున్నాడు.

” భెరికిపదర” అనే గ్రామంలో పొలాల్లో నుండి వెళ్తుండగా ఒక దృశ్యం కనపడింది అతనికి. పచ్చని మైదానంలో ఎర్రరంగు పూల వలె, ఎర్ర చీరలు కట్టుకున్న యువతులు పంటలను కోస్తూ కనపడ్డారు. ఫారెస్ట్ గార్డ్ వారిని దాటుకొని ముందుకు నడిచాడు. ఆ యువతుల బృందం పాటపాడటం మొదలుపెట్టారు. వారి మధురగానంలోని గమకాలు గాలికి కదులుతున్న మాండియా పంట వలె అతనిని ఆకర్షించింది.

వారి పాట ఇలా సాగుతోంది:
అపరిచితుడా..
“మా గ్రామాల నుండి నీవు ముందుకు సాగుతున్నావు
కానీ ఒక్క మాట కూడా మా గురించి మాట్లాడలేదు
వెళ్ళు వెళ్ళు నీ దారిన వెళ్ళు
నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము కానీ ఈనాటి సాయంత్రం
చంద్రోదయ సమయంలో
జింక అరుపు తర్వాత
బాధతో కూడిన ఆక్రందనల ఆగిన అనంతరం
మేము నీకోసం విచారంతో మరణిస్తాము”

ఒక అడుగు ఆగి పాట వినడానికి ప్రయత్నించాడు. ఆ పాట అతని మనుసును తాకింది. అతని సామాన్లు మోస్తున్న యువకులు “ఈ రాత్రికి ఈ పల్లెలో బస చేస్తారా దొరా” అని మర్మగర్భంగా అడిగారు. “లేదు, చెయ్యవలసిన పనులున్నాయి” అంటూ ముందుకు సాగాడు.

కొండ ఎగువన దూరంగా అడవికి ఒడ్డాణం వంటి “సరసుపదార్” కనపడింది, ఆ తరువాత దూరంగా గ్రామం.
ఒక్కసారిగా ఒక కోరిక అతనిని కదిలించింది. ధ్యాస సాలీ స్నానం చేసిన వాగు వైపు మళ్ళింది.

ఎప్పటివలనే గ్రామంలో “గ్రామ పెద్ద” నాయక్ ఇంటి వరండాలో బసచేశాడతను. అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లలు అతడిని చూసి భయంతో గబగబ దూరంగా పోయారు. చుట్టుపక్కల ఆడవాళ్ళంతా ఇంటిలోపలకు పోయి, తమ గుడిసెల ద్వారం వైపు మూగకళ్ళతో చూస్తున్నారు. కన్నాల్లో నుండి నక్కలు చూసినట్టు.
‘బారిక్’ మరోసారి గ్రామంలోని అన్ని వీధులకు వెళ్లి గ్రామస్తులు అందరినీ పోగేశాడు.
గ్రామ పెద్ద ఫారెస్ట్ గార్డ్ సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. మాంసం కోసం వధించడానికి ఒక మేకను తెచ్చారు, కోళ్లు కోడిగుడ్లు కూరగాయలు సేకరించబడ్డాయి.
గ్రామస్తులంతా వచ్చి వినయంగా నిలబడ్డారు. ఫారెష్ట్ గార్డ్ సౌకర్యంగా స్థిమితపడ్డాడు.

సాయంకాలం తనకు ఇష్టమైన ప్రదేశాన్ని వెతుకుతూ బయల్దేరాడు. వాగు తీరాన ఎవరూ లేరు అతనికి అసంతృప్తి కలిగింది. “ఒకవేళ సాలీ వచ్చే సమయం ఇది కాదేమో , వేచి చూడాలి” అనుకున్నాడు. సాలీ కోసం పొదలచాటున మాటు వేసి ఉన్నాడు. కొందరు అమ్మాయిల గుంపు సరస్సు వద్దకు వచ్చి వెళ్ళారు, కానీ అందులో సాలీ లేదు. చీకట్లు కమ్మాయి , అయినా అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి చాలాసేపటికి దూరం నుండి ఎవరో ఒంటరిగా కొండ దిగువలో మట్టికుండతో నడుస్తూ కనిపించింది. అది సాలీనే.
ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా చాటు నుండి ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు, నవ్వుతూ మీసాలు దువ్వుతూ.
“నన్ను గుర్తుపట్టావా అమ్మాయి” అంటూ మాటలు కలిపాడు.
“ఔ తెలుసు” సాలీ సమాధానం ఇచ్చింది.
“నువ్వు ఎంత అందంగా ఉన్నావు” అంటూ ఆమెకు సైగ చేశాడు.
ఆమె “మీకు మీరు అందంగా లేరా ” అని చురక వేసింది చిరునవ్వుతో .
అతను కొన్ని అడుగులు ముందుకు వేసి ఆమెతో సరసమాడాడు. ఆమె కూడా అదే పద్ధతిలో సరసంగా సమాధానమిచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని ఏ అమ్మాయి తమపై ఎటువంటి చతురులాడినా అందుకు గొడవ పడదు.

“నేను నిన్ను “ప్రియమైన పుష్పమా’ అని పిలవచ్చా ప్రియురాలా”.
” ఓ పిలవచ్చు. కానీ నీవు నాకు ‘ఎరుపు రంగు ఇసుక’ వైతే నీకు నేను ‘ప్రియమైన పుష్పము’ అవుతాను”

ఆ రెండు పేర్లు పరజ జాతి స్త్రీ పురుషులకు ఉపయోగిస్తారు. వారు ఒకరినొకరు ఇష్టపడ్డప్పుడు. అదే పద్ధతి లో వేరు వేరు పేర్లు ఉంటాయి. ఇసుక పుష్పము, మంచి ఇసుక, ప్రియమైన బియ్యము వంటివి.
” నేను ఈ రాత్రికి ఇక్కడే బస చేస్తున్నాను” అంటూ ఫారెస్ట్ గార్డ్ ఆమెకు నిర్ధారించాడు.
” ఈ సాయంత్రం నాట్యం సంగతి ఏమిటి ? నువ్వు వస్తావా” అన్నాడు.
” తప్పకుండా వస్తాను.. నాట్యమంటే చాలా ఇష్టం నాకు, నువ్వు డుంగుడుంగా వాయిస్తూ పాట పాడితే, నేను డాన్స్ చేస్తూ ఎగురుతాను” అన్నదామె. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు.
పరజ భాషలోని ఒక పాత జానపద గీతాన్ని ఫారెస్ట్ గార్డ్ రెండు చరణాలు పాడాడు.

పరజ పాట :
“ఇప్పుడే రావోయి ఓ నా ప్రియురాలా
దిట్టంగా కట్టిన ఇంటి గోడల వలె
నువ్వు బలంగా ఉన్నావా !
మద్యం కాసేవాడి ఇంటి వరండా వలె
నువ్వు బలంగా ఉన్నావా !
రావోయి రా నన్ను చూడ నివ్వు
నీ యవ్వనం ఎంత దృఢమైనదో” పాడుతూ..

ఒక్కసారిగా అతడు ఆమె ముందుకు దూకి ఆమె భుజాలపై రెండు చేతులు ఉంచి, ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. సాలీ తనకు తాను విదిలించుకుని ముందుకు నడిచింది.
ఒక కొండ జాతి అమ్మాయి లేచి పోతే ఎవరు తప్పు పట్టరు. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక అపరిచితుడు తన పరిధులను దాటి అవివేకంగా ప్రవర్తిస్తున్నాడు. సాలీ ఆశ్చర్యపోయింది అవాక్కయింది. కానీ తన తిరస్కారాన్ని ఫారెస్ట్ గార్డ్ ముందు బయట పెట్టలేదు. ఆమె నల్లటి కళ్ళు అయిష్టాన్ని మాత్రం వ్యక్త పరిచాయి.
గ్రామస్తుల గుంపు ఒకటి జునాగఢ్ వారాంతపు సంత నుండి తిరిగి వస్తూ చెరువు అవతలివైపు, గట్టు మీద నడుస్తూ వారిలో వారు గట్టిగా మాట్లాడుకుంటున్నారు.
అది చూసి ఫారెస్ట్ గార్డ్ వెనుకకు తగ్గాడు. వారు కనుమరుగు కాగానే, మళ్లీ “ప్రియమైన పుష్పమా” అంటూ గొణుగుతూ సాలీ వైపు వచ్చాడు.
ఆమె సమాధానం చెప్పలేదు.
పక్షులను వేటాడేవాడు జిగురు పూసిన కర్రను కొద్దికొద్దిగా పక్షుల వైపు ముందుకు చాపి, అనుమానం రాకుండా దానికున్న ఎరను పక్షి రెక్కలకు పూస్తాడు. ఫారెష్ట్ గార్డు కూడా వేటగాడి వలె ఆమెను వెంటాడుతూ, ఆమెను తన వైపు లాగాలని చూస్తున్నాడు. “ఇక్కడ మనని ఎవరూ చూడరు ఎందుకు భయపడుతున్నావు” అంటూ గట్టిగా సణగడం మొదలు పెట్టాడు. అతని కళ్ళు మండుతున్నాయి.
” ఇక్కడ ఎవరూ లేరు, భయం ఎందుకు ? నాతో రా సాలీ , మనమిద్దరమూ ఈ నది దాటి అవతలి వైపు పోదాం, అక్కడ ఆకుపచ్చ పావురాలను నా తుపాకీతో వేటాడుదాము రా” అంటూ, అతని రెండు చేతులూ వెడల్పుగా చాపుతూ ఆత్రంగా ఆమె వైపు రెండు అడుగులు వేసాడు.

సాలీ కదలలేదు అతడి ముఖం సమాధి రాయిలా ఉంది. ఆమె అతని వైపు కింది నుండి పైకి పరిశీలించింది ఇంతవరకు ఆమె చూడని వ్యక్తిని చూసినట్టు.
పొడవుగా, బక్కగా, ముదిరి గిడసబారినట్టు వింతగా ఉన్నాడు. అతని చెంపలు లోపలికి పీక్కుపోయి గుంటలు పడి ఉన్నాయి. కాళ్లు చేతులు బలహీనంగా ఎండిపోయాయి పదే పదే మలేరియా బారిన పడిన వాడి వలె. గాలి కోసం అతడు గసపెడుతున్నాడు. అతను గొణిగినట్టుగా పళ్ళు కరచుకొని “మనం పోదాం రా.. పోదాం రా..” అంటున్నాడు.

ఆమె అతడిని అంచనావేసింది పోల్చుకుంది తప్పించుకునేందుకు. ఇది ఎంత విచిత్రం భూమి మీద ఉన్న విచిత్రమైన ప్రాణి స్త్రీ. వీళ్ళు అందరూ ఆమెకు ప్రియులు కావాలనుకుంటారు. ఎంత సిగ్గుచేటు అనుకొని హేమ్లాను గుర్తు చేసుకుంది. కానీ ఈ వింతప్రాణి తో అతడిని పోల్చడం తెలివితక్కువతనంతో హేమ్లాను అవమానించడం అనుకుంది. చిరాకుగా వెనుకకు తిరిగి ఇంటి దారి పట్టింది.
ఫారెస్ట్ గార్డ్ కుక్క వలె ఆమె అడుగులను అనుసరించాడు.
దాదాపు ఇంటి వరకు వచ్చిన తరువాత
” ఇది ఎవరి ఇల్లు ?” అని గట్టిగా అరిచాడు.
ఆమె వెనుకకు తిరగకుండా “ఇది మా ఇల్లు” అని సమాధానం చెప్పింది.
” మీ నాన్న పేరేంటి ?”
“సోమ్లా”
” అవునా” అన్నాడతను.
సాలీ ఇంటి లోపలికి వెళ్ళింది.
తలుపు దగ్గర మాలీని చూసిన ఫారెస్ట్ గార్డ్ “మీ నాన్న ఎక్కడ” అన్నాడు.
“ కొండ పైకి వెళ్ళాడు” అన్నదామె.
“నేను ఇల్లు శుభ్రంగా ఉందో లేదో చూడాలి.
నేను మీ ఇంట్లోకి వచ్చి చూస్తాను” అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుడిసెలో జొరబడ్డాడు.
“ఇది ఏంటి? ఇది ఏంటి?” అంటూ చీకటిగా ఉన్న గుడిసెలో సాలీ కోసం తడుముతూ వెతికాడు.
ఎవరు సమాధానం చెప్పలేదు కారణం అతడి కళ్ళు కామంతో మూసుకుపోయాయి. మాలీ కూడా అతనిని అనుసరించింది లోపలికి వచ్చింది.

అంతలో మనసు మార్చుకుని ఫారెస్ట్ గార్డ్ వెనక్కు తిరిగి వెళుతూ ‘మీ తండ్రి రాగానే నన్ను కలవమనండి, నేను ఫారెస్ట్ గార్డును, ఒక ఆఫీసర్ని వచ్చాను, అని చెప్పండి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు.

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్క తో ముచ్చట్లు -15

చైనా మహాకుడ్యం