అందరికీ శనార్థులు ఎట్లున్నరు.
త్యాగరాజు ఎర్కగని గీ త్యాగరాణులేంది అనుకుంటుండ్రా..!
వస్తున్న వస్తున్న గాడికే వస్తున్న. ఈ త్యాగరాణులు అందరి ఇండ్లల్ల ఉంటరు.
వీళ్ళ మీద వీళ్ళకి లాపర్వా ఎక్కువ అది నిజంగా త్యాగం అనుకుంటుండ్రు.
ఈ త్యాగరాణులు ఎవరో కాదు తమ్మి అందరి ఇండ్లల్ల ఉండే మన అమ్మలు, అక్కలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు…మొత్తం మీద మన ఇంట్ల ఉండే మన ఆడోళ్ళు!
వీళ్లే పెద్ద త్యాగరాణులు. గట్ల ఎట్ల అంటరా చెప్తున్నా!
పొద్దుగాల లేసినప్పటినుంచి ఆగమే! పిల్లలకు స్కూలు పంపియాలి భర్తని ఆఫీసుకు పంపాలె,ఇంట్ల అత్తమామలను చూసుకోవాలె,అమ్మ నాన్నలను చూసుకోవాలె,పూజలు చేసుకోవాలే! ఉద్యోగాలు కూడా చేస్తున్నరనుకోండి ఇంకా హంగామా అంతింతుండదు. ఇవన్నీ అయ్యేవరకు ఇగ 12 అయితది. చాయిలు తాగడు తప్ప, నాస్తా చేసుడు ఉండదు.
తమ మీద తనకు సోయే ఉండదు ఆడోళ్లకు. గిట్ల అంటున్నానని ఏమనుకోకండి అమ్మలు!!
మొగోళ్లకు కూడా వాళ్లకి ఏమైతుంది బీమార్ ఎందుకైతురున్నరు, గంత దొడ్డుగ ఎందుకైతుంది పెయ్యి అనే సోయి ఉండదు శానా మందికి. ఇక ఇంట్లనే కూసోని కూసోని టీవీ చూస్కుంట దొడ్డుగైతుంది అనుకుంటున్నరు. అది శానా తప్పు.
ఆడోళ్ళ బాడీ తీరు వేరు, మొగోల్ల బాడీ తీరు వేరు.ఆరోగ్యము వేరు.
ఇంట్ల ఇల్లాలు ఆరోగ్యంగ ఉంటే ఇల్లు మంచిగ ఉంటది. సల్లగ ఉంటది.
అమ్మ బీమారైతే ఇల్లు గడుసుడు కష్టం. ఆమెను చూసుకునుడు కష్టం.
అదే భర్తకు పిల్లలకు ఏమన్న అయితే ఆడది మంచిగ సగపెడతది. అందుకే ఇల్లాలు ఆరోగ్యం ఇంటికి చాన ప్రాధాన్యం.
నాకు ఎరుకున్నంత వరకు.. ఆడోల్లుకి సెల్ఫ్ కేరింగ్ ఉండదు. తమ శరీరాన్ని పట్టించుకోరు.అది పెద్ద త్యాగం బుద్ధి అనుకుంటరు కానీ అది రాంగ్!
పెండ్లి అయిన 10 ఏండ్లకు భర్త అట్లనే ఉంటడు నాజుగ్గ సన్నగా! ఈమెనే డ్రమ్ములెక్క అయితది. ఎందుకు అయితది అంటే గిదే శ్రద్ధ లేకపోవడం వల్ల.
పిల్లలు -కాన్పులు ఎన్ని ఉంటయి ఆడోల్ల బతుకుకు. ప్రతి నెల నెల వచ్చే సుట్టమైతే ఇగ తప్పదాయే!
ఇంకా కొందరు ఉంటరు పిల్లలు ఇడిచి పెట్టింది, భర్త ఇడిచిపెట్టింది ఎందుకు ఖరాబవుడని తమ పొట్టల యేస్తా ఉంటరు, ఆమె పొట్ట ఖరాబ్ అయినా సరే. ఇగ అది పొట్టనో, చెత్తకుండినో అర్థం కాదు. ఏమన్న అంటే త్యాగమంటరు.
మీ అందరికీ నేను చేసుకునే విన్నపాలు ఏందంటే .. మన మీద మనం శ్రద్ధ పట్టాలి. దేహం మనకి సిగ్నల్స్ ఇస్తది.
జర దాని మాట విని వయసు పెరుగుతుంటే ఎక్సర్సైజులు చేసుడు మంచి ఆహారం తీసుకునుడు, టైం కు వండుకునుడు, పొద్దుగాల లేసుడు, ప్రాణయము, యోగ లాంటివి చేసుడు చెయ్యాలి.
కుటుంబాన్ని ప్రేమించడం అంటే మనము ఆరోగ్యంగా ఉండడం అన్న ముచ్చట మర్చిపోవద్దు. ఇంట్ల మొగుళ్ళు గూడ ఆడోళ్ళల్ల మార్పులు వస్తుంటే గమనించి వాళ్ళకి కొంచెం, వాళ్ళ సాధన చేసుకోనికి టైం ఇయ్యాలె.
50 ఏండ్లు ఉన్న ఆడోల్లు ఆరోగ్య విషయముల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలె అంటరు డాక్టర్లు సుత. వయసు పెరుగుతుంటే శరీరంల రకరకాల మార్పులు వస్తయి. ఈ వయసుల ఆడోల్లకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తయి.
అవేందో కొన్ని సూద్దాం!
1. అస్థి బలహీనత (ఓస్టియోపోరోసిస్): వయసు పెరుగుతుంటే బొక్కలు బలహీనపడటం జరుగుతది. దాంతోని ఎప్పుడన్న పడ్డరనుకోండి, పుట్టుక్కున ఇరుగుతయి బొక్కలు. పైలంగుండాలి. అందుకే, క్యాల్షియం విటమిన్-డి అసొంటి పోషకాలను తీస్కోవాలె.
2. హార్మోన్ల మార్పులు: మెనోపాజ్, నెలసరి
ఆగిపోయే వయసు వచ్చినప్పుడు ఆడోల్లల్ల చాలా మార్పులు వస్తయి. కొందరు అయితే సచ్చిపోవాలనుకుంటరు ఏడుస్తుంటరు. ఎందుకు ఏడుస్తరో ఆల్లకే తెల్వది. ఇది హార్మోన్లల్ల మార్పు అని డాక్టర్లు చెబుతరు. చాన పరేషాన్ అయ్యి మానసికంగా బాగా వీకైనవాళ్ళను కూడా నేను చాలా మందిని చూసినా!
ఇట్ల జరిగినప్పుడు గాబర పడకుండి.
మంచిగ పొద్దున్నే లేసుడు,ప్రాణాయామము,యోగా ధ్యానము చేయాలి. అంత మన మంచికే.ఇది శరీరంల ఒక మార్పు. ఏమి కాదు అని మన మనసుకు, మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. బలమైన ఆహారము పండ్లు పాలు తీసుకోవాలి. కారము, ఉప్పు, మసాలాలు తగ్గిస్తే సరిపోతది. అక్క చెల్లెలు అందరికీ చెప్తున్నా రంది పడొద్దు.
3. గుండె సమస్యలు: వయసు పెరిగే కొద్దీ
గుండె సమస్యలు వచ్చే అవకాశాలు గూడ ఎక్కువనే ఉంటయి. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు, దీన్ని ఎల్ డి యల్ అంటరు ఇది పెరగకుండా చూసుకోవాలి ఇది
పెరుగొద్దు, అంటే కొవ్వు పదార్థాలు, ఆలుగడ్డలు, మాంసం స్వీట్లు,జంక్ ఫుడ్ లు తినొద్దు. మంచిగ నీళ్లు ఎక్కువ తాగుకుంట,శరీరం బరువు పెరగకుండ, కొలెస్ట్రాల్ పెరగకుండ చూసుకుంటే, గుండె సల్లగ పది కాలాలు ఉంటది. బి పి అంటరు కదా, రక్తపోటు. ఇది కూడా రాకుండ ఉంటది. ఇవన్నీ చేస్తే. ఎక్కువ స్థాయి, రక్తపోటు నియంత్రణ కోసం మంచి ఆహారం, సరైన నిద్ర, రోజువారీ వ్యాయామం చానా అవుసరం.
4. నిర్జలీకరణ: ఈ నిర్జలీకరణమంటే దేహంల నీటి శాతం తక్కువైపోవుడు. ఎంత చిన్న ముచ్చట. మంచిగా ఒక్కొక్కరు ఎంత బరువుంటే అంత దానికి సమానంగా నీళ్లు తాగాలి. ఎట్లా అంటే 20 కిలోల బరువుకు 1 లీటర్ వాటర్ తాగాలి. మనం ఎంత బరువు ఉంటే అన్ని లీటర్ల నీళ్లు తాగాలి. గంగమ్మ అంట మనం కదా! మనం గంగ పాలు కావద్దంటే గంగమ్మ ను కడుపునిండ తాగాలి.
వేళకు నిద్రబోవుడు, సరి అయిన టైంల మంచిగ మూడు పూటల ఆహారం తినుడు, పొద్దున్నే లేచి ప్రాణాయామము, ఎక్సర్సైజులు చేసుడు. టీవీల మంచి ప్రోగ్రాములు సూసుడు,పత్రికలు సదువుడు చెయ్యాలి. మంచి విషయాలు చూడాలి, మంచి విషయాలు చదవాలి. పుస్తకం చదవడం చాలా మంచి ఆరోగ్యం చిట్కా. పుస్తకాలు ఎంత మంచిగ సదివితే,మన మనసు బుద్ధి అంత మంచిగుంటది.
‘ హే…నామీద నాకు పట్టింపు లేదు, నాకు నా కుటుంబమే ముఖ్యమని,” పిచ్చి మాటలు చెప్పొద్దు. తల్లి ఆరోగ్యంగ ఉంటేనే కుటుంబము సల్లగ ఉంటది లేదా కుదేలై పోతది.
ఏదన్న త్యాగం చేయండి గాని, ఆరోగ్యం త్యాగం చేయకండి. మీ అందరికీ మరి మరీ వేడుకోలు తోని చెప్తున్న.
ఆరోగ్యమే మహాభాగ్యమని మీకు తెలువని ముచ్చటనా ఏంది? తెలుసుగాని సోయి పెట్టము గంతే.
మా తరుణులందరికీ… హెల్త్ కేర్ బాగా పెరగాలని కోరుకుంటూ ఉంట మరి!
మీ
రమక్క