కవితా సాగర మధనం

కవిత

కవిత గాఢంగా ప్రారంభించాలన్నా
గుట్టు విప్పి ముగించాలన్నా
భావాల తీవ్రత
అక్షరాల ఆర్ద్రత
సమతూకం చేయాలి !

కష్టాల కన్నీటి ఉప్పదనంలో
దుఃఖ సముద్ర లవణ శాతమెంతో‌ లెక్కించాలి !

నిట్టూర్పుల గుండె మంటల సెగలో
బాధాగ్ని శిఖ వేడి
ఎంతో గణించాలి !

ఆనందాల క్రీడా కేళిలో
గెలుపు మలుపు
గుట్టేమిటో విప్పి చెప్పాలి !

సంతోషాల వెన్నెల చినుకుల్లో
చిటపటల సందడి
ఎంతసేపో గుర్తించాలి !

భావోద్వేగాల ఆవేదన మూటలో
సమతౌల్యం ఎంతో
తూకమెయ్యాలి !

అనుభవాల క్రమ పరంపరలో
నేర్చుకున్న పాఠాల విలువ
నిగ్గు తేల్చాలి !

త్రుళ్ళిపడే
ఈర్ష్యాద్వేషాల కార్చిచ్చులో
దహించుకుపోయిన
స్వచ్ఛదనం ఎంతో
స్పష్టం చేయాలి !

ప్రతీ విషయాన్ని
సున్నితంగా స్పృశించాలి
నిశితంగా పరిశీలించాలి
సాలోచనగా వీక్షించాలి
ఆర్ద్రతగా శ్రవణించాలి !

అప్పుడే కదా
లోగుట్టు తెలిసేది
భావ సాగర మధనంలో
కవితామృతం పుట్టేది !

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎల్లమ్మ జాతర

కలల గూడు