దొరసాని

-54 వ భాగం

             లక్ష్మి మదన్

భోజనాల సమయం కావచ్చింది… అందరికీ టేబుల్ మీద కంచాలు మంచినీళ్లు పెట్టింది విజయమ్మ.

గదిలో ఉన్న దుర్గా మరియు కమల్ దగ్గరికి వెళ్లి భోజనానికి రమ్మని పిలిచింది.

” రండి వదినా! భోజనం చేద్దాం” అన్నది విజయమ్మ.

” ఇంతకీ సౌదామిని ఏమంటుంది పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం ఆలస్యమైన కొద్దీ కమల్ కి భోజనానికి కష్టమైపోతుంది వాడు సౌదామిని తప్ప ఎవరిని చేసుకోనని మొండిపట్టు పట్టాడు” అన్నది దుర్గ.

అక్కడే మంచం మీద కాళ్లు చాపుకొని కూర్చున్న కమల్ ఇటువైపు అయినా చూడలేదు మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు..

” ఏరా నువ్వేం మాట్లాడవు?” అన్నది దుర్గ.

” ఏం మాట్లాడాలి .. నేను ముందే చెప్పాను కదా ఎంత తొందరగా పెళ్లి జరిగితే అంత మంచిదని.. అక్కడ గోపాలపురంలో సౌదామినినీ రిజైన్ చేసి రమ్మని చెప్పండి జాబ్ చేయాల్సిన అవసరం కూడా మనకేం లేదు డబ్బుకు ఏం కొదవలేదు. నేను కూడా మంచి జాబ్ చేస్తున్నాను” అన్నాడు పొగరుగా.

విజయమ్మకు ఈ మాట వినగానే చాలా కోపం వచ్చింది చిన్నప్పటినుండి సౌదామినినీ చక్కగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలని వాళ్ళు అనుకున్నారు.. అంటే ఆడవాళ్ళ చదువుకు కెరీర్ కి ప్రాముఖ్యం లేదా? తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే సరిపోతుందా? తాను ఒక్కడు ఉద్యోగం చేస్తే సౌదామిని చేయకూడదా? ఉద్యోగాన్ని డబ్బుతో ముడిపెట్టే వాళ్లంటే అసహ్యం అనిపించింది విజయమ్మ కు.

” అదేంటి కమల్ అది మెడిసిన్ చేసి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ గా తాను గోపాలపురం లో ఉద్యోగం చేస్తుంది పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు మాత్రమే ఎందుకు ఉద్యోగం మానేయాలి అబ్బాయిలు చదివినంత కష్టపడి వాళ్ళు చదివారు చిన్నప్పటినుండి స్కూలుకు వెళ్లి మీతో పాటుగా కష్టపడ్డ ఆడపిల్లలే కదా మరి ఇంట్లో కూర్చునే దానికి ఆ రోజు నుంచే ఈ కష్టం లేకుండా ఇంట్లోనే కూర్చోబెట్టే వాళ్ళం కదా ! ఆడవాళ్లకు సంపాదన కోసం కాదు ఉద్యోగం వారి యొక్క వ్యక్తిత్వం కోసం తప్పకుండా ఉద్యోగం చేయాలి. అయినా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడం ఉండాలి. అంతేకానీ ఒకరి సంపాదన మీద ఆధారపడి ఉండే పరిస్థితి ఈ రోజుల్లో లేదు.. నువ్వు చదువుకున్న అబ్బాయివి ఇలా మాట్లాడటం నాకు అర్థం కావడం లేదు” అన్నది విజయమ్మ.

దుర్గకు కూడా పాత భావాలు పోలేదు.. ఎంతసేపు తన కొడుకు కష్టపడి పోతున్నాడు అతనికి వండి పెట్టే కోడలు కావాలి అని మాత్రమే ఆలోచిస్తుంది. ”

“మెడిసిన్ లో సీట్ రావడం ఒక ఎత్తు అయితే పీజీలో సీటు తెచ్చుకోవడం మరొక ఎత్తు. ఎంత కష్టపడితే ఒక డాక్టర్ తయారవుతాడు అలాంటిది ఇంత చదువు చదివి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా నా కూతురు ఇంట్లో ఉండాలా!”అన్నది విజయమ్మ.

” ఏంటి విజయా! నీ కూతురుకు నచ్చ చెప్పేది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావ్ తమ్ముడి కూతురు కదా సంబంధం కలుపుకుందాం అనుకున్నాను.. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లిఅయ్యి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో” అన్నది దుర్గ..

సంభాషణ పక్కదారి పట్టేలాగా ఉందని ఆలోచించిన విజయమ్మ “ముందు భోజనాలు చేద్దాము రండి వదినా తర్వాత మాట్లాడుకుందాం” అన్నది.

అందరూ భోజనాల బల్ల దగ్గరికి వచ్చారు సౌదామిని అప్పటికే అందరికీ వడ్డించడం మొదలు పెట్టింది చక్కని లంగా వోణీలో ముచ్చటగా ఉంది సౌదామిని.

కమల్ చూపు తిప్పకోకుండా చూస్తూనే ఉన్నాడు అదంతా గమనిస్తూనే ఉంది సౌదామిని. ఆ చూపులు అంటేనే కంపరంగా ఉన్నాయి సౌదామినికి..

అందరూ కూర్చున్నారు సౌదామిని అందరికీ నెయ్యి వడ్డిస్తుంటే మళ్ళీ కమల్ చేయి పట్టుకున్నాడు..

” నువ్వేం డాక్టర్ వి అసలు నెయ్యి ఇంత తింటారా ఎవరైనా… పాతకాలంలో పోసినట్టు పోసేస్తున్నావ్ అసలు నీ డాక్టర్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఏనా” అని ఏదో కుళ్ళు జోకులు వేసాడు.

ఇతనికి సమాధానం చెప్పడం వృధా అనిపించింది సౌదామికి చిన్న నవ్వు నవ్వి.. చెయ్యి విడిపించుకుని ఆ ప్లేట్ మార్చి వేరే ప్లేట్ పెట్టి అందులో నెయ్యి వేయకుండా నెయ్యి గిన్నె పక్కన పెట్టేసింది.

” అయితే మొత్తానికే నెయ్యి వేయవన్న మాట” అన్నాడు కమల్.

” మీరే వేసుకోండి అవసరం ఉన్నంత” అని చెప్పి మౌనంగా భోజనం చేయసాగింది సౌదామిని.

” ఏమే పిల్లా! నీకు వంటలు వచ్చా మళ్లీ నీకు వంట రాకుంటే నా కొడుకే చేయి కాల్చుకోవాలి” అన్నది దుర్గ.

” పెళ్ళికి ఇంకా టైం ఉంది కదమ్మా ఆ లోపల నేర్చుకుంటుంది ఒకవేళ రాకపోతే.. నేను చేయి కాల్చుకోవడమేంటి నాకసలు వంటనే రాదు” అన్నాడు కమల్.

” సౌదామినికి అవసరమున్న వంటలన్నీ వచ్చు అయినా కూడా తను కూడా నీలాగే చదువుకుంది కదా అమ్మాయిలు మాత్రమే వంట నేర్చుకోవాలా కమల్!” అన్నాడు రవీంద్ర.

” అంతే కదా మామయ్య లేకుంటే మనం వంటలు చేస్తామా”? అన్నాడు కమల్.

రవీంద్ర కమల్ ని చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇంతవరకు నేను ఈ అబ్బాయిని నిశితంగా గమనించలేదు.. కానీ ఇతనికి మగవాడిని అనే అహంకారం ఉంది అది కాక మాటల్లో సంస్కారం కూడా లేదు ఇన్ని రోజులు మేనల్లుడు అనే భావంతో చూడటం వల్ల అంత పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాడితో మేము గారాబంగా పెంచుకున్న నా తల్లి అడ్జస్ట్ కాగలదా!” అని మనసులో అనుకున్నాడు.

” మేము మా ఊరికి సాయంత్రం వెళ్ళిపోతున్నాము పురోహితులను పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టించండి మరి తర్వాత ఒకరోజు మీరు మా ఇంటికి వస్తే పెట్టుపోతలు మాట్లాడుకోవచ్చు మొన్నే కోటి రూపాయల కట్నం ఇస్తానని ఒక సంబంధం వచ్చింది కానీ మాకు మేనరికం ఉందని చెప్పాము పెళ్ళిలో లాంఛనాలు కట్నాలు ఏవి తక్కువ చేయొద్దు పెళ్లి కూడా ఘనంగా చేయాలి. నేను అదంతా లిస్టు రాసి చెప్తాను.. ఆ తర్వాత అయినా మీకు ఉన్నది ఒక్క అమ్మాయి కదా ఆస్తి వాడికి కాకుంటే ఎక్కడ పోతుంది” అన్నది ఒకరకంగా నవ్వుతూ దుర్గ.

ఇక రవీంద్ర స్థిర నిశ్చయం చేసుకున్నాడు… అందరి భోజనాలు అయ్యేవరకు ఉగ్గ పట్టుకొని ఊరుకున్నాడు భోజనం మధ్యలో ఏది మాట్లాడినా భోజనం చేయకుండా వెళ్తారని అనిపించింది అలా భోజనం నుంచి లేపడం మహా పాపం అందుకని మౌనంగా ఉన్నాడు…

అందరి భోజనాలుఅయ్యి చేతులు కడుక్కొని వచ్చి సోఫాల్లో కూర్చున్నారు…

రవీంద్ర వచ్చి అక్క దగ్గర కూర్చున్నాడు…

” అక్కా! ఒక మాట చెప్తాను ఏమీ అనుకోకు… నా పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. ఎందుకంటే నేను సౌదామినినీ ఏమీ అడగలేదు.. పెళ్లి గురించి వారి నిర్ణయం మనం అడగాలి కదా నాకు ఎందుకు ఆ ఆలోచన రాలేదొ.. సౌదామినికి ఇలా మేనరికం చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే తను డాక్టర్ కదా మేనరికం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయో తనకు తెలుసు మనకి కూడా ఆ విషయం తెలుసు కానీ సంబంధం కలుపుకోవాలని ఆలోచనతో మనం ఇదంతా ఆలోచించలేదు నన్ను క్షమించండి ఇదంతా నా వల్లే జరిగింది” అన్నాడు రవీంద్ర.

” మమ్మల్ని ఇక్కడి వరకు పిలిపించి ఇప్పుడు ఈ మాట చెప్తావా అయినా ఆడపిల్లలను అడిగేది ఏంటిరా మనం ఏం చెప్తే అది విని చేసుకోవాలి నేను నాన్న చెప్పినట్టు విని చేసుకోలేదా” అని గట్టిగా అరిచింది దుర్గ.

” అప్పటి రోజులు వేరక్కా! ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నేను సౌదామినినీ అలాగే పెంచాను.. కానీ పెళ్లి విషయంలో మాత్రమే పొరపాటు చేశాను” అని అన్నాడు.

అక్కడే ఉన్న కమల్..” మేనరికం అని ఇష్టం లేదా లేక ఏవైనా అఫైర్లు ఉన్నాయా! లేకుంటే నాలాంటి వాడిని ఎందుకు కాదంటుంది” అన్నాడు.

” ఆపు కమల్ ఇంకా మాట్లాడకు.. నీ మనసులో ఏది ఉంటే అది అనేయడమేనా ఒకవేళ నా కూతురు ఎవరినైనా ఇష్టపడితే నేను సంతోషంగా ఇచ్చి పెళ్లి చేస్తాను ఎందుకంటే తన నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు నేను ఆ స్వేచ్ఛను తనకు ఇచ్చాను” అన్నాడు కోపంగా.

గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ దుర్గ..

” పదరా ఇంకా ఇక్కడ ఎందుకు ఉండటం ఏ సంబంధానికైనా ఇచ్చుకోని… చూద్దాం ఎంత మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. నా కొడుకు కాలుగోటికైనా సరిపోరు ఎవ్వరు” అంటూ లోపలికి వెళ్లి వాళ్ళ బ్యాగులు తెచ్చుకొని బయటకు వెళ్లిపోయారు.

అందరి మనసులు ఒక్కసారిగా బాధకు లోనయ్యాయి వీళ్ళు ఇలా మాట్లాడుతారని ఏమాత్రం ఊహించుకోలేదు ఇంత సంస్కారహీనులకు తన కూతుర్ని ఇవ్వాలా అనుకున్నాడు రవీంద్ర..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వీరనారి రాణీదుర్గావతి

నమ్మకం