రాచరిక వ్యవస్థలో స్త్రీలు ముఖ్యభూమిక పోషించిన సందర్భాలు ఎన్నో! జీవించిన కాలం తక్కువేఐనా ఎన్నో అద్భుతాలు సృష్టించి చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారు . ఇంకా ఎక్కువకాలం జీవించి ఉంటే మరెన్ని అద్భుతాలు సాధించేవారో కదా! రాణి ఝాన్సీ లక్ష్మీబాయిలా గుర్తొచ్చే వారిలో మరొకరు రాణి దుర్గావతి.
తమ ప్రతిభ, శక్తి యుక్తులతో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన రాణి దుర్గావతి అక్టోబర్ 5,15 24న ఉత్తర ప్రదేశ్ లోని బంధా జిల్లాలోని ‘కలైంజర్’ కోటలో జన్మించారు. చందేల్ఖండ్ సంస్థానంలో మొదటి వారైన చందేల్ వంశపు రాజు కీరత్ రాయ్ కమలావతి దంపతుల కుమార్తె.
( 11వ శతాబ్దంలో చందేల్ వంశపు రాజు విద్యాధర్ అత్యంత పరాక్రమశాలి. ఆయనకు శిల్పకళపై గల ఆసక్తికి నిదర్శనం ఖజరహో మరియు కలైంజర్ కోట శిల్పకళా నిర్మాణాలు. కళలు, సాంప్రదాయ పరిరక్షణను ప్రోత్సహించిన సుపరిపాలనాధ్యక్షుడుగా చరిత్రలో నిలిచిపోయారు. )
గోండ్వానా రాజు ‘సంగ్రామ్ షా’కుమారుడు ‘దళ్పత్ షా’ తో 1542 న ‘సింగోర్ఘర్ కోట’ లో కోయ సంస్కృతి ప్రకారం రాణి దుర్గావతి వివాహం జరిగింది. 1543 లో మామగారు ‘సంగ్రామ్ షా’ మరణించారు.
‘ షేర్షా సూరి’ తో జరిగిన యుద్ధంలో’ కీరత్ రాయ్’ ‘గోండులు’ మరియు అల్లుడు ‘దళ్పత్ షా’ సహాయం తీసుకుని సాగించిన సంగ్రామంలో విజయం సాధించారు.
1545లో రాణి దుర్గావతి దంపతులకు మగ పిల్లవాడు జన్మించాడు. బాలుడికి వీర్ నారాయణ్ (వీరాస) అని నామకరణం చేశారు. దుర్గావతి ఎనిమిది సంవత్సరాల వైవాహిక జీవితానంతరం సహచరున్ని కోల్పోయింది ,అప్పుడు దళ్పత్ షా కు 33 సంవత్సరాలు కాగా పిల్లవాడి వయసు ఐదు సంవత్సరాలు, దాంతో రాజ్యపాలన బాధ్యత చేపట్టాల్సిన అవసరం రాణి దుర్గావతికి ఏర్పడింది .వీరాసకు పట్టం కట్టి
రాజ ప్రతినిధిగా పాలన చేపట్టింది. అత్యంత దీక్షాదక్షతలతో
పరిపాలన చేస్తూ ప్రజలకు సుఖశాంతులనందిస్తూ , ధర్మబద్ధంగా పాలన సాగించారు. రాజ్యపాలనలో ఇద్దరు విధేయులైన మంత్రులు అధర్ కాయస్థ, మన్ ఠాకూర్ లు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. మహారాణి తన రాజధాని ‘సింగౌర్ ఘర్ ‘నుండి ‘చౌరాఘర్’కు మార్చింది. సాత్పురా కొండ శ్రేణుల్లో ముఖ్యమైనదీకోట.
షేర్ షా మరణం తరువాత బజ్ బహదూర్ 1556 ఏ.డి.లో అధికారం చేపట్టిన తర్వాత రాణి దుర్గావతిపై చేసిన దాడిలో చిత్తుగా ఓడిపోయాడు. అప్పటినుండి రాణి దుర్గావతి కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడించాయి. 1562లో అక్బర్, మాల్వా పాలకుడైన బజ్ బహదూర్ ను ఓడించి మాల్వాను మొగల్ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు .ఒక మహిళ అత్యంత ప్రజారంజకమైన పాలన అందించడం గిట్టని అక్బర్ చక్రవర్తి తనను శరణు వేడమనగా నిరాకరించిన కారణంతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు.
అక్బర్ చక్రవర్తి యుద్ధ తంత్రంలో భాగంగా మొఘల్ సుబేదార్ అబ్దుల్ మజీద్ ఖాన్ దుర్గావతి రాజ్యాన్ని ఆక్రమించాడు. రాణి తన మంత్రి అధర్ ,మొఘల్ సేనల పరాక్రమాన్ని విపులంగా చెప్పినప్పటికీ తన శక్తి సామర్థ్యాలతో స్వరాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనుకుంది. “ఓడిపోయి పరాభవంతో తలదించుకుని బతకడం కంటే యుద్ధభూమిలో వీరమరణం ఎంతో గౌరవప్రదమని భావించిన ఆమె” సమర శంఖమూదింది. సుశిక్షితులైన ,ఆధునిక ఆయుధ సంపత్తిగల సైన్యంతో తలపడింది. తన ఫౌజ్దార్ అర్జున్ దాస్వాన్ మరణంతో సైన్యానికి నాయకత్వం వహించి మొఘల్ సైన్యాన్ని వెంబడించి లోయ నుండి బయటపడింది .రాణి తన వ్యూహంలో భాగంగా గెరిల్లా పోరాటం చేయాలనుకున్నప్పుడు ఆమె లెఫ్టినెంట్లు అందుకు అంగీకరించలేదు. మరుసటి రోజు రాణి దుర్గావతి తన ఏనుగు ‘సర్మన్’ పై ఎక్కి తన కుమారుడు వీరాస తో కలిసి యుద్ధ భూమిలోకి అడుగు పెట్టింది .అసఫ్ ఖాన్ పేల్చిన తుపాకీ గుండ్లతో గాయపడి స్పృహ కోల్పోయింది .ఆత్మ సంరక్షణకై మావటి యుద్దభూమి వదిలి వెళ్లాలంటూ కోరినా ఆత్మ సంరక్షణ కన్నా ఆత్మాభిమానమే గౌరవప్రదమని భావించి తన బాకుతో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె ప్రాణత్యాగానికి కృతజ్ఞతగా మన దేశంలో ప్రతి సంవత్సరం జూన్ 24 న , ‘బలిదాన్ దివస్’గా జరుపుతున్నారు.
రాణి దుర్గావతి విశిష్ట వ్యక్తిత్వంతో ధైర్య సాహసాలు కలిగిన సౌందర్యరాశిగా మనకు చరిత్ర చెబుతుంది .గొప్ప నాయకత్వ లక్షణాల కలిగి ఆత్మగౌరవంతో రాజ్యపాలన చేసిన ధీరవనిత. చారిత్రక ఆధారాల ప్రకారం 16 సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లు తెలుస్తుంది. తన పాలనలో ఎన్నో సరస్సులు నిర్మించింది, ప్రజాసంక్షేమమే పరమావధిగా పాలన సాగించారు. సంస్కృతీసాంప్రదాయాలను కాపాడుతూ ,పరమత సహనం కలిగి పండితులను ఆదరించారు. ‘వల్లభ సంఘా’నికి చెందిన ‘విఠల్ నాథ్ ‘ను ఆహ్వానించి వారినుండి ‘దీక్ష’ తీసుకున్నారు. ఎంతో మంది ముస్లిం మేధావులను తన కొలువులో ముఖ్య పదవులలో నియమించారు.
కళలు, సాంస్కృతిక వారసత్వ సంపద, యుద్దనీతి, పరిపాలనాదక్షత, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న నారీశక్తికి శత్రు రాజులు విస్మయమొందేలా చేసిన సమరాంగన. శత్రువుకు తలవంచక సమరంలో ఆత్మబలిదానం చేసుకున్న స్వాభిమానవతి. 50 సార్లకు పైగా యుద్ధభూమిలో అడుగుపెట్టి తన పోరాటపటిమతో శతృసైన్యాన్ని వణికించిన అరివీర భయంకరి. ఆమె ఆత్మ బలిదానం చేసుకున్న ప్రదేశం ఎంతోమంది పోరాట యోధులకు నేటికీ స్ఫూర్తిదాయకమే.
మొఘల్ లకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి రాణీ దుర్గావతిని తమ వారసురాలిగా గౌరవిస్తూ ,మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాణీదుర్గావతి ‘గౌరవ్ యాత్ర’ పేరిట ఆరు రోజుల ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని ,కృతజ్ఞతల్ని చాటుకుంది .
రాణి దుర్గావతి జ్ఞాపకార్థం 1983లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ విశ్వవిద్యాలయాన్ని ‘రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయం’ గా పేరు మార్చింది.
భారత ప్రభుత్వం జూన్ 24 1988న రాణి దుర్గావతి జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేసి ఘనమైన నివాళులర్పించింది.
రాణీదుర్గావతి ప్రాణత్యాగ దినమైన జూన్ 24 ను భారత ప్రభుత్వం ‘బలిదాన్ దివస్’ పేరుతో కృతజ్ఞతా పూర్వకంగా ఉత్సవాాలు నిర్వహిస్తుంది.