యమదీపము దాని ప్రత్యేకత

యమదీపము ఎప్పుడు వెలిగించాలి?
యమ దీపము ఎందుకు వెలిగించాలి?

దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. నరక చతుర్దశి కి ముందు వచ్చే త్రయోదశి లేదా, ఆశ్వయుజ మాస కృష్ణపక్షలో వచ్చే త్రయోదశి రోజు సాయంత్రం 6 గంటలకు ఈ యమదీపాన్ని వెలిగించాలి.

ఎందుకు వెలిగించాలి?
ఈ యమ దీపం వెలిగించడం వలన అపమృత్యు దోషాలు, మృత్యుభయాలు తొలగి కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని స్కాంద పురాణంలో చెప్పబడింది.
అంతేకాకుండా యమధర్మరాజు తన భటులతో ఎవరైతే యమ దీపాన్ని వెలిగించి దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేస్తారో వారికి ఎటువంటి ఆపదలు కలగకుండా వారికిసంపూర్ణ ఆయుష్షు తీరేవరకు వారి వద్దకు వెళ్లకూడదని చెప్తాడట. అందుకే ఈ యమ దీపం వెలిగించి యమధర్మరాజుకి నమస్కారం చేసుకున్న వారికి అకాల మృత్యు భయం ఉండదు అని చెప్తారు.

ఈ యమదీపాన్ని ఎప్పుడు ఎక్కడ వెలిగించాలి?

గోధూలి లగ్నంలో అనగా సాయంత్రం 6 గంటల నుండి 8 లోపు సింహద్వారం వద్ద మనం ఇంట్లోకి వెళ్లేటప్పుడు మనకు కుడివైపున దక్షిణముఖంగా ఈ దీపాన్ని వెలిగించాలి.

ఎలా వెలిగించాలి??
గుమ్మoముందు నీరు చల్లి శుద్ధి చేసి అక్కడ అష్టదళ పద్మం వేసి ,దానిపై ఒక విస్తరాకు గాని, అరిటాకును గాని ఈ రెండు లేని పక్షంలో ఒక ఇత్తడి పళ్ళెమును కానీ ఉంచి కొంత రాళ్ళ ఉప్పు అందులో పోసి దానిని సమంగా పరచి… దానిపై ఒక మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె గాని ,ఆవు నేతిని గాని పోసి 9 వత్తులు తీసుకొని మూడు మూడు చొప్పున తడిపి వాటిని తూర్పు, ఉత్తర, దక్షిణముఖంగా వేసుకొని ఒక ఏకాహారతిని తీసుకొని అందులో ఒక వత్తిని వెలిగించి దానితో ఈ యమదీపాన్ని కుడివైపు అనగా మనకు దక్షిణం వైపు ఉన్న దానిని
శుక్లాంబరధరం విష్ణుం
అనే గణపతి స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి తర్వాత మిగిలిన వత్తులను వెలిగిస్తూ…. ఈ శ్లోకాన్ని చదువుకొనవలెను.

మృత్యునాపాశ దండాభ్యం !
కాలేన చ యమా సహాo!!
త్రయోదహ్యాం దీప దానాత్ !
సూర్య జహాప్రియతామితే !!

పై శ్లోకము చదవలేని వారు ఈ యమదీపాన్ని వెలిగించి దీపానికి మూడు వైపులా గంధము, కుంకుమ పెట్టుకుని పూలు సమర్పించి ఓ యమ ధర్మరాజా!!!! నాకు, నా కుటుంబ సభ్యులకు అపమృత్యు దోషాలు తొలగి సుఖంగా ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి అని నమస్కరించి దీపమునకు ధూపము, పాలు ,పళ్ళు నివేదన చేసి నైవేద్యంగా సమర్పించి తాంబూలం సమర్పించి దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకొనిన ఆ యమధర్మరాజు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.

తరువాత ఆ ఉప్పును ఏమి చేయవలెను???

దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును నీటిలో కరిగించి మొక్కలలో పోయటం కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయటం కానీ చేయాలి. దీపం దగ్గర ఉంచిన తాంబూలం మన ఇంట్లో వారు ఎవరైనా వేసుకోవచ్చు.
ఈ ధన త్రయోదశి కి సంబంధించిన ఐతిహ్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం .

పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించడానికి దేవదానవులుచేస్తున్న ప్రయత్నంలో ముందుగా ధన్వంతరి ఆవిర్భవించటం జరిగిందని ….అతడు దేవతలకు వైద్యుడు కనుక దీనిని ధన త్రయోదశి అని చెప్పుకుంటారని ఐతిహ్యం. ఈ ధన త్రయోదశిని ధనవృద్ది కొరకు మాత్రమే జరుపుకుంటారని అనుకుంటారు కొందరు కానీ….. ఆరోగ్యము ఉంటే ఐశ్వర్యం ఉన్నట్లే కనుక దీనిని దేవ వైద్యుడు అయిన ధన్వంతరి పుట్టినరోజు కనుక ధన త్రయోదశి అని కూడా చెప్పటం జరిగింది. కొన్ని ప్రాంతాలలో కొంతమంది దంతేరాస్ గా కూడా చెప్పుకుంటారు. త్రయోదశి అన్న తేరాస్ అన్న 13 అని అర్థం కనుక దీనిని దంతేరాస్ అన్న, ధన త్రయోదశి అన్న ఒకే అర్థం గా పరిగణించవచ్చు. ఇదే కాకుండా ఈ యమదీపాలు వెలిగించడానికి కూడా ఒక చిన్న ఐతిహ్యం చెప్పబడింది. దానిని కూడా తెలుసుకుందాం.

పూర్వం హేమ రాజు అనే రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. జన్మించగానే అతని జాతకాన్ని రాజపురోహితులకు చూపించగా అతని జాతకంలో వివాహం జరిగిన నాలుగవ రోజు మరణం ప్రాప్తిస్తుందని చెప్తారట. అది విన్న రాజు తన కుమారుడిని అమ్మాయిలను చూడనీయకుండా… అమ్మాయిలకంట తన కుమారుడు పడకుండా… యమునా నది తీరంలో ఒక గుహలో దాచి ఉంచాడట. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యుక్త వయసుకు వచ్చిన హేమ రాజు గారి కుమారుడు అటుగా వచ్చిన ఒక రాకుమార్తెను చూసి మోహించి ఆ అమ్మాయిని గాంధర్వ వివాహం చేసుకోవడం జరుగుతుందట. పూర్వం రాజ పురోహితులు చెప్పినట్లుగానే హేమ రాజుకుమారుడు వివాహం అయిన నాలుగవ రోజు మరణించడం కూడా జరుగుతుందట. ఆ దృశ్యాన్ని చూసిన నూతన వధువు హృదయ విదారకంగా విలపిస్తుందట. అప్పుడు యమదూతలు ఆ విషయాన్ని యముడికి చెప్పగా యముడు దానికి ఒక తరుణోపాయాన్ని చెప్పాడని….. ధన త్రయోదశి రోజు దక్షిణం వైపు దీపాన్ని వెలిగించి యముని ప్రార్ధించిన ఎవరికైనా ఇటువంటి అప మృత్యు దోషాలు రావని… అపమృత్యు భయాలు తొలగుతాయని యమధర్మరాజు చెప్పటం జరిగిందట. అప్పటినుండి ఈ ధన త్రయోదశి రోజున యమదీపాన్ని వెలిగించటం ఆనవాయితీగా వస్తుందని ఐతిహ్యం.🙏🏻🙏🏻

ఇది యమ దీపం వెలిగించడంలోని అంతరార్థం.
సర్వేజనా సుఖినోభవంతు

(ప్రవచనకర్తల సౌజన్యంతో )

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బంగాళాఖాత తీరం చెన్నై

వీరనారి రాణీదుర్గావతి