బంగాళాఖాత తీరం చెన్నై

డా. కందేపి రాణీప్రసాద్

పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ వర్క్ షాపు మద్రాసులోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీలో జరుగుతున్నందున మేము జులై 12వ తేదీ 2024 న మద్రాసు బయల్దేరాము. 10 గంటలకు హైదరాబాదు నుండి ఇండిగో ఫ్లైట్లో బయలుదేరి 11:30కు కామరాజ్ డొమెస్టిక్ ఎయిర్ పోర్టుకు చేరాం. ఇండిగో వారి ఎయిర్ హెూస్టెస్ ల డ్రెస్ బావుంటుంది. నీలం రంగు టోపీ, అదే రంగు పెద్ద పువ్వున్న ‘టై’ కట్టుకొని అందంగా ఉన్నారు. మద్రాసు ఎయిర్ పోర్టు మొదట్లోనే తమిళనాడు సాంప్రదాయ వస్త్రధారణతో ఉన్న బొమ్మలున్నాయి. లగేజీ తీసుకున్నాక ఒక గుర్రం బొమ్మ వద్ద ఫొటో తీసుకున్నాం. కారెక్కి ఎస్ఆర్ఎంసి కి బయల్దేరాం. నల్లని రంగులో ఉన్న టాక్సీలు, తెల్లని షర్టు, లుంగీలతో వ్యక్తుల్ని చూస్తే పాత సినిమాలు గుర్తుకొచ్చాయి. మద్రాసుకు వచ్చి చాలా రోజులయింది. శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ (ఎస్ఆర్ఎంసి) పోరూర్ లో ఉన్నది. కారు గిండీ మీదుగా పోరూర్ చేరుకుంది. ఎస్ఆర్ఎంసి గెస్ట్ హౌస్ లోనే రూమ్ నెం: 218 లో దిగాము.
ఇక్కడ దిగగానే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి. 2004లో ఇదే ఎస్ఆర్ఎంసి ‘లో ‘పెడికాన్’ అనే జాతీయ సమావేశం జరిగింది. అప్పుడు వచ్చాం మేము. అప్పుడు పార్క్ షెరటాన్ లో దిగి కంచి, మహాబలిపురం, పాండిచ్చేరి కూడా చూశాం. అప్పటి నంచి మరలా మద్రాసు వచ్చినట్లు గుర్తు రావడం లేదు. నాకు మద్రాసుతో ఒక మంచి అనుభూతి ఉన్నది. నేను తొలిసారిగా రాష్ట్రం దాటి బయటికి వచ్చి చూసింది మద్రాసునే. ఆంధ్రప్రదేశ్ దాటి తమిళనాడు రాష్ట్రంలో అడుగుపెడుతూ ఎగ్జైటింగ్ గా చూశాను. 1993లో మొదటిసారిగా మేమే కారు డ్రైవ్ చేసుకుంటూ అర్ధరాత్రి టైంలో ఆంధ్రా బోర్డరు దాటి వెళుతూ ‘ఏముంటుందిక్కడ బోర్డర్లో’ అని చూస్తే ఏమీ లేదు. ‘తమిళనాడు రాష్ట్రం ప్రారంభం’ అనే బోర్డు తప్ప. నేను అప్పుడే కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. నేను ఎక్కువగా రాత్రిళ్ళే డ్రైవ్ చేసేదాన్ని. పగటి పూట జన సందోహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు రాత్రిపూట మాత్రమే కారు చేతికిచ్చేవారు మావారు. అప్పుడు మాకు మారుతి 800 కారు ఉండేది. మేము కొనుక్కున్న తొలి కారు అది. అలా ఆ అర్ధరాత్రి పూట కారు డ్రైవ్ చేసి ‘నేను ఆంధ్రప్రదేశ్లోనే కాదు తమిళనాడు రాష్ట్రంలోనూ డ్రైవ్ చేశాను’ అని తెగ సంతోషపడి పోయాను. ఆ రోజుల్లో మహిళలు కారు డ్రైవింగ్ చేయడం గొప్పగా ఉండేది. మద్రాసులో ‘ఫోర్ లైన్ వే” చూడటం మొదటిసారి కాబట్టి కంగారు అన్పించింది. అప్పటికి హైదరాబాదే పెద్ద సిటీ అనుకునే వాళ్ళం. మద్రాసు చూసేసరికి ఆశ్చర్యంగానూ, ‘భారతదేశంలోని ఐదు ప్రధాన నగరాలలోని రెండునగరాల్ని చూసేశాం’ అని సంతోషంగాను అన్పించింది. అప్పట్లో మా తమ్ముడు మద్రాసులోని ఎంజీఆర్ యూనివర్సిటీలో బి. ఫార్మసీ చదువుతుండేవాడు. కాబట్టి చాలా తరచుగా మద్రాసు వెళ్ళేవాళ్ళం. వాడి చదువు అయిపోయి అమెరికా వెళ్ళిపోయాక మేం మద్రాస్ వంక చూసిందే లేదు. ఇవీ మాకు మద్రాసుతో ఉన్న జ్ఞాపకాలు.
Titany అనే క్యాంటిన్ పైననే గెస్ట్ హౌస్ రూములున్నాయి. టిఫిన్ చేయడానికి క్యాంటీన్ కు వెళ్ళాం. ఈ క్యాంటిన్ చాలా పెద్దది. దాదాపు 200 మంది ఒకేసారి తినవచ్చు. కాలేజీ స్టూడెంట్లు అందరూ తెల్లకోట్లు వేసుకుని గుంపులుగా వచ్చి మాట్లాడుకుంటూ తింటుంటే ఎక్కడో ముల్లు గుచ్చుకున్నట్లు కలుక్కుమన్నది. నేను మెడిసన్ చదవలేకపోయనే అని బాధ. టిఫిన్ తింటుంటే నాకు బెంగుళూరు లోని ‘నిమన్స్’ గుర్తొచ్చింది. అక్కడ చాలా చిన్నగా, జనం ఎక్కువగా ఒకర్నొకరు తోసుకుంటూ ఉన్నట్లుంటుంది. “రెండూ పెద్ద ఇన్ స్టిట్యూట్లే కదా! ఇక్కడ చాలా శుభ్రంగా, జనానికి సరిపోయే విధంగా క్లాస్ ఉన్నది. ‘నిమ్సన్స్’ గవర్నమెంటుది. ఎస్ఆర్ఎంసి ఏమో ప్రైవేటుది! అదీ కారణం” అన్నారు. కాన్ఫరెన్స్కు నేనూ వెళ్ళాను.
ఈ రోజు ‘వెంటిలేటర్ ఎక్స్ట్ బేటింగ్’ గురించి చెపుతున్నారు. wean off oxygenalion, wean off venlilation అనే వాటి గురించి డా.. ప్రకాష్ మాట్లాడారు. తర్వాత failure of weaning, recurrent extubation failurues అనే విషయాల మీద డా|॥శుభ మాట్లాడారు. కాన్ఫరెన్స్ అయిపోయాక డాక్టర్స్ అందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు. ఇందులో పాల్గొన్నందుకు గుర్తుగా అందరూ ఫొటోలు తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు నన్నూ పిలిచారు. “అయ్యో! నేను డాక్టర్ ను కాదు” అని సిగ్గుగా చెపుతుంటే “మాకు తెలుసు! కానీ ఇంత ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేసి మీ వారికి సహాయం చేస్తున్నందుకు మీకీ గిఫ్ట్” అని నన్ను స్టేజి మీదకు పిలిచి ఒక గిఫ్ట్ ఇచ్చి ఫొటో తీశారు. ‘మా వారికి నేను సహాయం చేయటమేమిటి?’ అనుకుంటున్నారా? డాక్టర్లు క్లాసు తీసుకునేటపుడు వాటికి సంబంధించిన ఫొటోలు, ఫార్ములాలు బోర్డుపై స్లైడ్ వలె వస్తుంటాయి. వాటన్నింటిని నేను ఐప్యాడ్ ఫొటోలు తీస్తాను. క్లాసు వినేటపుడు మావారికి డిస్ట్రబ్ లేకుండా ఉంటుందని. రాత్రికి ఈ ఫొటోలన్నీ చూసి అవసరమైన వాటిని రివ్యూ చేసుకుంటారు. అదీ కథ. ఇదంతా వాళ్ళు గుర్తించి నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషం అన్పించింది. ఇందాక మెడిసన్ చదవలేకపోయానే అన్న బాధ ఈ గిఫ్ట్స్ ఎగిరిపోయింది.
బంగాళాఖాతం తీరాన ఉన్న మహాపట్టణం చెన్నై. 1639 వ సంవత్సరంలో ఏర్పడిన పట్టణం విద్యకు వైద్యానికీ పేరుగాంచినది. భారతదేశంలోని ఐదు ప్రధాన నగరాలలో మద్రాసు నాల్గవది. ఈ రాష్ట్రం 70 లక్షల జనాభాతో టెక్నాలజీతో ఐటీ హబ్ పేరు గాంచినది. తెలుగు పాలకుడైన చెన్నప్ప నాయకుడి మూలంగా ఈ రాష్ట్రం పేరు చెన్నైగా రూపు దిద్దుకుంది. హుండాయ్ కంపెనీకి చెన్నై హెూమ్ టౌను. ఇంకా సినీ పరిశ్రమకు చెన్నై ఎంత పేరుగాంచినదో అందరకూ తెలుసు. మాంబళం, టీ నగర్, పాండీ జబార్, రాజా పానగల్ రోడ్ కారులో వెళుతూ ఈ ప్రాంతాల పేర్లు చదువుతుంటే సినిమా వాళ్ళ ఇంటర్య్వూలు గుర్తొచ్చాయి. ఆయా ప్రాంతాలు సినిమా వాళ్ళ మాటల్లో వినిపిస్తుంటాయి కదా! ఇప్పుడు చెన్నై ఎయిర్ పోర్టుగా పిలవబడుతున్న ఈ ఎయిర్ పోర్టు ఒకప్పటి పేరు ‘పాలం విమానాశ్రయం’. అలాగే కోడంబాక్కం, శాంతాక్రజ్, పాలం అనే విమానాశ్రయాల పేర్లు గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు చదివిన షాడో నవలలు గుర్తొస్తాయి. చాలా హెూటళ్ళ ముందు ‘తాలకట్టు’ అనే పేరు కనిపిస్తోంది. మన స్వగృహ ఫుడ్స్ లాంటి షాపులకు ‘బోలిస్టోర్’ అనే బోర్డు కనిపిస్తోంది. ‘ఎప్పడి ఇరిక్కి’ అని తమిళంలో అంటే బావున్నారా అని అర్ధమట. పొంగా, వాంగా, కుడు, ఎడు, ముడియావ్, మాలిగై ఇలా కొన్ని మాటలకు అర్ధాలు తెలుసుకున్నాము. లంచ్ టైములో ‘ఇడియప్పమ్’, ‘పనియారమ్’ అంటూ ఏవేవో పేర్లు కనిపించాయి. పనియారమ్ అంటే ఇక్కడ గుంట పునుగులుగా పిలిచే వంటకం.
కాన్ఫరెన్స్ అయిపోయాక ఎస్ఆర్ఎంసి వాళ్ళ లైబ్రరీ చూసి వచ్చాను. చాలా బాగుంది. సాయంత్రం ఎస్ఆర్ఎంసి మొత్తం తిరిగి ఎన్ని డిపార్టుమెంట్లు ఉన్నాయో, ఏఏ కోర్సులు ఉన్నాయో చూద్దామని వాకింగ్ చేశాము. ఈ ఎస్ఆర్ఎంసి 92 రకాల కోర్సులు, 45 రకాల డిపార్టుమెంట్లతో 3500 మంది విద్యార్థులతో మంచి పేరు తెచ్చుకున్నది. 1985లో ఈ కాలేజీ స్థాపించబడింది. ఎన్.పి.వి రామస్వామి ఉదయార్ ఈ శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ను స్థాపించారు. 1994లో ఈ కాలేజీ డిమ్డ్ యూనివర్సిటీగా మారింది. నర్సింగ్, ఫార్మసీ, డెంటల్, మెడికల్, ఫిజియోథెరపీ, బయోమెడికల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, మానేజిమెంట్ మొదలైన డిపార్టుమెంట్లకు సంబంధించిన అనేక కోర్సులున్నాయి. మా రూమ్ ఎదురుగా మధుర మీనాక్షి అమ్మవారి తంజావూరు పెయింటింగ్ ఉన్నది. నాకెప్పటినుంచో తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవాలని కోరిక. ఈ పటం చూడగానే ఆ విషయం గుర్తొచ్చింది.
తెల్లవారి మధ్యాహ్నానికి కాన్ఫరెన్స్ అయిపోయింది. ఈసారి సైట్ సీయింగ్ వెళ్ళకపోయినా ఏమీ అనిపించలేదు. ఎస్ఆర్ఎంసి మొత్తం తిరిగి చూడటం, పేషెంట్లు కూర్చునే ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం ఇదో రకమైన అనుభవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భక్తిపాట

యమదీపము దాని ప్రత్యేకత