ఒడిపిళ్ళు

3వ భాగం

మరుసటి రోజు పొద్దు పొడవక ముందే సోమ్లా అతని కొడుకులు భూక్యా టిక్యాలతో కలిసి వారి గొడ్డళ్లు తీసుకొని “మాలి ధమాకా కొండ”కు బయల్దేరారు. వారికి దారిలో ఫారెస్ట్ గార్డ్ కలిశాడు. అతడు వేరే గ్రామంలో తనిఖీలు ముగించుకొని, ఆ గ్రామంలో ఇచ్చిన బహుమతులను, గుంపులు గుంపులుగా యువకులు మోస్తూ ఉండగా వస్తున్నాడు. ఫారెస్ట్ గార్డ్ సోమ్లా వద్దకు కను సైగ చేస్తూ వచ్చి “నీకు కావలసినది నేను ఇచ్చాను ముసలోడా! ఈసారి నేను వచ్చినప్పుడు నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వాలి” అన్నాడు.
దానికి సోమ్లా ముఖం కృతజ్ఞతతో వెలిగిపోయింది. ఫారెస్ట్ గార్డ్ ఎంత మంచి వాడు అనుకున్నాడు. ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులు జోడించి నుదుటికి తాకించుకున్నాడు. దానికి అర్థం దేవుడే సాక్ష్యమని.
“ఓ గొప్ప ప్రభువా! నువ్వు ఎట్లా అనుకుంటే అట్లాగే జరుగుతుంది. ఈ రాజ్యాన్ని పాలించే అధికారివి నీవే. మాకు నువ్వే తల్లి తండ్రి. తమరు ఆజ్ఞాపించారు మేము పాటించాలి. నీవు కోరిన దానిని ‘కాదు’ అని ఎట్లా చెప్పగలము మేము” అన్నాడు సోమ్లా.
ఫారెస్ట్ గార్డ్ అత్యంత ఆనందంగా అతని వైపు చూసి, తన దారిన వెళ్ళిపోయాడు.
సోమ్లా అతని కుమారులు తాము ఎంచుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. చెట్లు నరకడం మొదలుపెట్టారు. వారి గొడ్డళ్ళు పిచ్చి పట్టినట్టు నరుకుతూనే ఉన్నాయి. అది చాలా కష్టమైన పని. నడుములు చేతులు నొప్పులు పెడుతున్నది. చెవుల్లోకి నెత్తురు పొంగుతోంది. కానీ వారు పని చేస్తూనే ఉన్నారు. సొరకాయ బుర్రల నుండి ఆకులతో చేసిన కప్పులోకి మాండియా గంజి వంచుకొని తాగడానికి మాత్రమే ఆపుతున్నారు. మళ్లీ పని మొదలు పెడుతున్నారు, ఎండ పెరిగి అడవంత కమిలిపోయింది. మధ్యాహ్నం వేడి పెరిగి అడవి కాలిపోతుందా అన్నట్టున్నది. పావురాల గుంపు గూళ్ళ నుండి కూస్తున్నాయి. పరుగెత్తుతున్న జింక కాళ్ళ కింద ఎండిన ఆకులు నలుగుతున్న చప్పుడు విని నెమళ్ళ గుంపు తొంగి చూసి మళ్ళీ దాక్కున్నాయి తమకు తామే. కానీ ఆ ముగ్గురికీ ఇవేవి పట్టిలేదు. వారి పని తప్ప అడివిలో ఉన్న మిగిలినదంతా వారికి సంబంధం లేనిది.

తండ్రీ కొడుకులు కలిసి నెల రోజులు శ్రమించిన తర్వాత వారి ముందు విశాలమైన భూమి ఏర్పడింది. అక్కడ చెట్లు నరికిన కట్టెలను తన ఇంటి ముందు గుట్టలుగా పేర్చాడు సోమ్లా. అయినా అతనికి తృప్తి కలగ లేదు. చెట్లను నరకడం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వారి శరీరాల పై చెమట కాలువలు కట్టింది. సోమ్లా తన రెండు చేతులను చాతికి అడ్డంగా పెట్టుకుని నిలబడ్డాడు. అతని పనిని లెక్కకడుతున్నట్టు కొండలు అతని ముందు నిలబడ్డాయి.

ఈ విశాలమైన దట్టమైన అడవి అంతా నరికేసి వ్యవసాయం చేసి వరి పండిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. తమకు కావలసింది భూమి కదా. అడవి నరుకుతే కావలసినంత భూమి లభిస్తుంది. ఆ కొండ పై మడులలో తైదలు, మక్కలు (మొక్కజొన్న), ఆముదాలు, కందులు పండించొచ్చు. అక్కడ భూమిలో దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆ లోతైన లోయల దిగువన దట్టమైన అడవులున్న చోటు వరి పంట అధిక దిగుబడికి ఉత్తమమైన నేల. వాగుల ఒడ్డున రెండు వైపుల నేలలకు ఎండ సోకకుండా అడవి చాలా దట్టంగా, నేల మాత్రం పల్లంలో ఉంటుంది. కనుక ఒకటి తరువాత ఒకటి అనేక రకాల పండ్లతోటలు పెంచవచ్చు. అరటి, అనాస, నారింజ వంటి పండ్లను సాగు చేయవచ్చు. అది ఎంతో సారవంతమైన నల్లని నేల. అనేక సంవత్సరాలుగా ఇక్కడ చెట్ల ఆకులు రాలుతున్నాయి. ఆ ఆకులు కుప్పలుగా తడి నేలలో పొరలుపొరలుగా చేరి కుళ్ళి భూమిలో కలిసిపోతున్నాయి. ఆ విధంగా అదెంతో సారవంతమైన నేలగా తయారయింది. అక్కడ ఒక కంది మొక్కను నాటితే సాధారణ జామ చెట్టు కంటే ఎత్తు పెరుగుతుంది. ఆముదం మొక్క బలంగా విస్తరిస్తుంది. ఎంత అందమైన నేలది. ఈ అడవిలోని భూమంతా బాగు చేయాలి. అప్పుడు మంచి పంటలు పండుతాయి. ఎవరికి పనికి రానప్పుడు ఈ అడవులు ఎందుకు ? పంటలు పండ లేని అడవులను ఎవరు సొంతం చేసుకోలేరు. అదే చదును నేల అయితే ఎవరైనా సొంతం చేసుకొని పంటలు పండిస్తారు. దేవుడు ఈ భూమిని ప్రాణుల కోసం సృష్టించాడు. కానీ సిగ్గు లేని మనిషి తోటి మనిషిని వీటిని సరిగా ఉపయోగించకుండా ఆపుతున్నాడు. అని అనుకున్నాడు సోమ్లా.
అతనికి అడవులు నరికి వేయడం వల్ల కలిగే నష్టాలు తెలియదు. అటువంటి అవగాహన అతని మంద బుద్ధికి చేరదు. కేవలం తాత్కాలికమైన, వ్యక్తిగతమైన స్వార్థం అతనిది. అందుకే ఫారెస్ట్ గార్డ్ మహానుభావుడుగా కనపడ్డాడు అతనికి. ఎందుకంటే చెట్లు నరకడానికి పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి.

సోమ్లా తన పెద్ద కొడుకు భూక్యాను ఉద్దేశించి “రేపు మనమంతా బల్లపరుపు బండ వైపు వెళదాము. అక్కడ దట్టమైన సాల్ చెట్లు, సాహజ్ చెట్లు ఉంటాయి, వాటిని నరకాలి” అన్నాడు.
సాయం చీకట్లు కమ్ముకున్నాయి. అతని కలలకు రూపం వస్తుంది అనుకున్నాడు సోమ్లా.

… … …

తూర్పు కనుమలలోని ప్రచండమైన పర్వతశ్రేణుల్లో ‘సత్య మార్గం’గా పిలువబడే “ధరమ్ ధౌర్” వంకర తిరిగిన రోడ్లతో కనిపిస్తోంది. ఒక హింసాత్మక చారిత్రాత్మక భూపోరాటానికి సాక్ష్యము ఆ ప్రదేశం. అక్కడి పర్వతాలు రెండు వరుసలుగా ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నాయి. ఒక వరుసలో నలబై కొండలు, మరొక వరసలో యాబైకొండలు మల్లయుద్ధం సమయంలో ప్రత్యర్ధులు నిలబడినట్లుగా కనిపిస్తాయి. ఉత్తరం వైపు మూడు మైళ్ళ దూరంలో ఎత్తైన కొండవాలు మధ్యలో ఒక చిన్నపల్లె నక్కి ఉంటుంది. తూర్పు కనుమలలోని ఆ గ్రామం పేరు “సరసుపదార్”. కోరాపుట్, రాయగడ్ అనే రెండు పట్టణాలను కలుపుతూ సాగే రోడ్డు ధరమ్-ధోర్ వైపు ఎక్కుతుండగా ముందుగా మూడుమైళ్ళ దూరంలో లచ్చింపూర్ వస్తుంది.

రెండు గుంపులుగా ఏర్పడిన ఈ పల్లెలో గడ్డితోకప్పిన గుడెసెలు చెట్లనీడలలో గుమిగూడి ఉంటాయి. రెండు వేరు వేరు వీధులుగా ఉన్న ఈ గిరిజన గూడెంలో ఒక వీధిలో పరజ తెగ, రెండవ వీధిలో డోంబ్ తెగ జీవిస్తున్నారు.

ఒకదానికొకటి సమాంతరంగా ఉన్న రెండు వరుసల్లో గుడెసెలున్న ఈ గ్రామం పక్కనే పచ్చగా తాపడం పెట్టినట్టు చిన్నచిన్న మళ్ళలో మొక్కజొన్న, మిరప, పొగాకు పంటలు వేస్తారు. వాటి చుట్టూ అడవి తానియా పొదలతో కంచెలు ఉంటాయి. కంచెలు నాటిన పొలాల్లో రాగులు, అవిసెలు, కందులు వంటి చిరుధాన్యాలు పండిస్తారు. అవి ఆ గిరిజనుల ప్రధాన ఆహారధాన్యాలు.

కేవలం ఇరవై రెండు కుటుంబాల గిరిజనులు నివసిస్తున్నారు ఆ గ్రామంలో. సోమ్లా పరజ ఆ వీధిలో తన చిన్న కుటుంబంతో తన గుడిసెలో ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతున్నాడు. అతడి అవసరాలు, రెండు పూటలా ఒక గిన్నెడు మాండ్యా గటక , బెత్తెడు వెడల్పున్న గుడ్డ నడుముకు చుట్టుకోవడానికి అతనికి చాలు. అతనికి వాటి కొరతలేదు.

మూడు సంవత్సరాల కింద ఒక ఒకరోజు పొద్దుపొడవకముందే అడవిలో ఆకు కూరల కోసం “ఎలుగుల పోడు”(Bear Gorge)కు పోయిన అతని భార్య సంచారి తిరిగి రాలేదు. మనుషులను తినే పెద్ద చారల ‘మహాబల’ జాతి పులి ఒకటి అక్కడ లోయల్లో దట్టమైన పొదల్లో పొంచి ఆమె పై దాడిచేసి ఆమెను ఈడ్చుకు పోయింది. అప్పటినుండి సోమ్లా తన ఇద్దరు కొడుకులు భూక్యా, టిక్యా , ఇద్దరు బిడ్డలు సాలీ , మాలీలతో బతుకుతున్నాడు.

సశేషం

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా పల్లె…

స్ఫూర్తి ప్రదాత ఇందిరా గాంధీ The iron lady