ప్రతి మతానికి ఒక కాల మానం ఉంటుంది. వాటికి పేర్లు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. నేడు అందరూ పాటించేది ఆంగ్లమానం అయినా ప్రతి మతానికి,జాతికి కాలానికి ఒక లెక్కింపు ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఉత్తర భారత దేశంలో సూర్యమానము, దక్షిణ భారతదేశంలో చంద్రమానము పాటిస్తారు. 64 సంవత్సరాల పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరంలో 12 నెలలు వస్తూ ఉంటాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో ఎనిమిదవ నెల కార్తీక మాసం. శరదృతువులో రెండవ మాసం. కార్తీక మాసంలో చేసే స్నానాలు, దీపాలు, పూజ, దానము విశిష్ట ఫలితాలను ఇస్తాయని హైందవుల నమ్మకం. చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసానికి సమమైన మాసం కానీ, విష్ణువుతో సమానమైన దేవుడు కానీ, వేదాలతో సమానమైన శాస్త్రము గాని, గంగతో సమానమైన తీర్థం గాని లేదని పెద్దలు అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల ఈ నాలుగు నెలలు చతుర్మాస దీక్ష అని పీఠాధిపతులు యోగులు మరెన్నో వారందరూ విశిష్టంగా ఆచరిస్తారు.
ముఖ్యంగా వర్ష ఋతువు వెళ్లి శరదృతువు ప్రవేశిస్తుంది. వర్షాలు వెనుక పడతాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అంతా సోయగాలను నింపుకొని ఉంటుంది. కానీ కాస్త అనారోగ్య బాధలు వెంటాడుతాయి. అందుకే ఈ నెల అంతా నోములు వ్రతాలు పేరట ఉపవాస దీక్షలు, ఏకబుక్తాలు చేస్తూ ఉంటారు. ఈ ఆరోగ్యపరమైన ఆచారాన్ని దేవునితో ముడి పెడితే భక్తి శ్రద్ధలతో చేస్తారని మన పురాణాల ద్వారా ఋషులు మనకి అందించారు. అది కాలక్రమేనా మన పెద్దల ద్వారా ఇప్పటివరకు సాగుతూ వస్తోంది.
ఈ కార్తీకమాసము హరిహరులకు ఇరువురికి పూజనీయమైనది. శివుని ప్రీత్యర్థం సోమవారాలు, మాస శివరాత్రి చేస్తారు. విష్ణువుని కార్తీక దామోదరునిగా నిత్యం పూజిస్తారు. ఈ మాసం ప్రాతస్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. తెల్లవారుజామున స్నానం చేయడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రా తకాలమున నేతి, తైల దీపములు వెలిగించడం వలన వాతావరణం శుద్ధి అవుతుంది. క్రిమి కీటకాదులు కూడా నశిస్తాయి. రోజు దేవాలయ దర్శనం కూడా ఈ మాసంలో చేస్తారు. దానధర్మాలు చేయడం వలన పుణ్యప్రాప్తి కలుగుతుంది.
ఈ మాసంలో వచ్చే నాగుల చవితి, కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, అమావాస్య దినాలు విశిష్టమైనవి. కొందరు కేదార వ్రతాలు కూడా ఆచరిస్తారు. పూజలు, ఉపవాసాలు చేస్తారు ఆ రోజుల్లో. దీనివలన వంటికి ఆరోగ్యంతో పాటు, ఒకరికి ఒకరు పంచుకోవడం కూడా తెలుస్తుంది. కార్తీక పురాణం కూడా నిత్యము వినటమో, చదవడం చేస్తుంటారు. భగవంతుని మీద భక్తితోనో,భయంతోనో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాడడానికి అవకాశం ఉంది. షడ్ గుణ సంపత్తి అలవర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. చాలామంది పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తారు. పుణ్య నదులలో స్నానాలు చేస్తారు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం.
ఈ ఆధునిక కాలంలో కూడా ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలు కొద్దిగా మిగిలే ఉన్నాయి అని చెప్పవచ్చు. వీటి వల్లే కదా నాగరికతలు నిలిచి ఉండేది. తను నివసించే దేశానికి ప్రాంతానికి జాతికి తన కుటుంబానికి సంబంధించిన ఆచార్య వ్యవహారాలు ఉంటాయి. వాటిని సంస్కృతి సాంప్రదాయాలు అంటాము. అవి నిలుపుకోవడమే ఆ మతంలో ఉండే వారి ప్రాథమిక లక్ష్యం. ప్రకృతితో మనం నిత్యము సహజీవనం చేస్తున్నాము. చెట్టుని, పుట్టని కూడా పూజిస్తాం. ( మర్రి, రావి, మారేడు, శమీ వృక్షాలు ) నాగుల చవితినాడు పుట్టలో పాలు పోస్తాం కడుపు చలవ కోసం, పిల్లలు బాగుండాలని కోరుకుంటూ. ప్రకృతి ఏ కాలంలో ఏ పళ్ళు ఏ పుష్పాలు ఇవ్వాలో అందిస్తూనే ఉంది. మనమే వాటిని కాలుష్యాలతో నింపి ధ్వంసం చేసుకుంటున్నాం. సేంద్రీయం పోయి హైబ్రిడ్ పంటలను పండిస్తున్నాము దురాశతో. మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. పంచభూతాలను కూడా కాలుష్యం చేస్తున్నాము. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలను కూడా చూస్తూ అనుభవిస్తున్నావు. మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకున్న చందాన ఉన్నది. అందుకే ఏ కాలంలో పనులు ఆ కాలంలో చేయాలి. ఇప్పుడిప్పుడే కొందరికి ఆ జ్ఞానం కలుగుతుంది. ఏ మాసంలో వచ్చే విధులను ఆ మాసంలో ఆచరించి సత్ఫలితాలను పొందుదాం.
సర్వేషాం స్వస్తిర్భవతు
సర్వేషాం పూర్ణం భవతు
సర్వేషాం శాంతిర్భవతు