ఆధునిక యుగంలో ఆడ మగా కలిసి తమ మనుగడ కోసం చాలా కష్ట పడుతున్న మాట నిర్వివాదాంశం! జీవనం కొనసాగించడం కోసం పూర్వం ఒక పురుషులే అవిశ్రాంతంగా శ్రమించేవారు.
కానీ ఈరోజుల్లో అది సాధ్యం కానిపని. ఇప్పుడు భార్య భర్త ఇద్దరూ కూడా శ్రమించవలసిన పరిస్థితులు నెల కొన్నాయి. అందు వల్ల ఈరోజులలో మహిళలు ఇంటా బైటా సమర్ధించుకోలేక పోతున్నారు. పురుషులు వాళ్ళు చేసే ఉద్యోగాల వల్ల ఎంత మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారో అంతే ఒత్తిడికి స్త్రీలుకూడా గురి కావడం కూడా ఒక కారణమే. అందువల్ల ఈనాటి స్త్రీలు ముఖ్యంగా ఉన్నత పదవులలో ఉన్నవాళ్లు ఆ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఇంట్లో పూర్వపు స్త్రీలకుమల్లే వంటా వార్పూ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఇప్పుడు సంసారుల ఇళ్లల్లోకూడ స్వీగ్గీలు, జోమేటోలే శరణ్యం అయినాయంటే అతిశయోక్తి కాదు.
ఇటువంటి సున్నితవిషయాన్ని అర్ధం చేసుకోకుండా కొంతమంది పెద్దలు ఇప్పటి ఉద్యోగస్తులయిన వనితల మీద విమర్శలు గుప్పించటం ఎంత వరకు సమంజసం అన్నదే నా ప్రశ్న!
వారి మాటల్లోనే వినండి. …” వంటా వార్పూ చేయటం ఇష్టం లేనప్పుడు ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకమ్మా….హాయిగా సింగిల్ గానే ఉంటూ జోమేటో నుంచి తెప్పించుకుంటూ ఉద్యోగం చేసుకుని బ్రతక వచ్చు కదా !” అంటూ వ్యాంగ్యా స్ట్రాలు విసరడం న్యాయమేనా చెప్పండి? పైగా అలా అన్నది ఎవరనుకున్నారు. .. ఎవరో అయితే నేనెందుకంటాను? మహాఘనత వహించిన శ్రీ గరికపాటి గారే సెలవిచచ్చారు సుమండీ. …! ఆధునిక భావాలు కలిగి, ఎంతో బాధ్యతాయుతమైన రంగంలో ఉండి కూడా వీరు ఇలా అనడం భావ్యం కాదు. అంటే ఆయన మాటలను బట్టి మనం ఏం అర్ధం చేసుకోవాలంటే, వంటా వార్పూ వచ్చి ఉండి భర్తకు వండి పెట్టగల స్త్రీలే వివాహానికి అర్హులన్నమాట…..ఏమండోయి పొరపాటున స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడం వెనుక ఉద్దేశ్యం మరేదో ఉందనుకుంటున్నారా. …! అబ్బే పొరపాటు పొరపాటండోయ్!!అదేంతమాత్రం కానే కాదు సుమా. ..! వివాహనికి పరమార్ధం వంటా వార్పే. …అది తప్ప ఇంకేం పనుంటుంది చెప్పండి….వివాహితులకి? మనకి ఇన్నాళ్లు తెలీలేదే. …అయ్యో ఎంత అజ్ఞానంలో ఉన్నాం ఇన్నాళ్లు. ..!
అది సరే గానీ పూర్వం ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయనప్పుడు మగవాళ్ళు అఫీసు నుంచి ఇంటికి వచ్చి ఎన్ని వేషాలు వేసేవారండీ? ఎన్ని డ్రామాలు ఆడేవారు? ఓ .. అంత అలసిపోయాను ఇంత అలిసిపోయాను అంటూ స్పెషల్ అటెన్షన్ డిమాండ్ చేసారో..! ఎంత బిల్డప్ ఇచ్చేవాళ్లో..! మన సృష్టి కర్త పుణ్యమా అని అంత శరీర దారుఢ్యం కలిగి ఉండి కూడా మీరు మీ మీ భార్యలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించారే మరిచి పోయారా. ..? మరి ఈ రోజు మీతో సమాన స్థాయికి చేరుకొని మీ మీద ఆధారపడకుండా (ఆర్ధికంగా) జీవించాలన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో మీలాగా శరీర దారుఢ్యం లేకపోయినా, ఇన్ని మైనస్ పాయింట్లు.. ఆరోగ్య రీత్యా.. శరీరం రీత్యా ఎంతో తేడాలున్నా ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని కూడా కష్ట పడి చదువుకుని ఉన్నత పదవులను అలంకరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ తరుణంలో ఇటువంటి పాతచింతకాయ పచ్చడిలాంటి మాటలను వినవలసి రావడం నిజంగా ఈ కాలం స్త్రీల దురదృష్టమని చెప్పక తప్పదు.
అసలు ఈ మగమహారాజులు ఎప్పటికి మారతారో అర్ధం కాదు. అబలలైన ఆడవాళ్లే ఇన్ని పనులు చేయగాలేంది మగ ధీరుల కేమోచ్చిందిటా! వాళ్ళు గనుక రంగంలోకి దిగి ఆడవాళ్ళ కు తమ సహాయ సహకారాలాందిస్తే ఈ స్విగ్గీలు, జోమేటోల అవసరం వొస్తుందా అని ఈ పురుషులు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. …!
అలా కాకుండా తేరగా దొరికారు కదా అని స్త్రీలను ఆడిపోసుకోవడం ఈ పురుషపుంగవులు ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది!