దివ్య వెలుగుల దీపావళి

భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దీపావళి జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీజ అమావాస్యనాడు వస్తుంది. జాతి,మత, కుల,వర్గ విభేదాలు విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి.దీపావళి పండుగ పెద్దలతో పాటు పిల్లలకు కూడా మహాదానందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారికి కావలసిన పిండి వంటలు, నూతన వస్త్రాలు, టపాసులు కాల్చడం, బంధువుల ఆగమనం వారికి సంతోషాన్ని కలిగి చేస్తాయి. జరుపుకోవడా ని అన్నిటిలో ముఖ్య ఉద్దేశము ఐకమత్యము, ఇచ్చిపుచ్చుకోవడాలతో సౌబ్రాతృత్వాన్ని నిలుపుకోవడమే.
దీప + ఆవలి= దీపావళి అనగా దీపముల వరుస. దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు హిందువులు. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవడమే దీనిలోని ముఖ్య ఉద్దేశం. మిగతా క్రియలు అన్ని బాహ్యమైనవే. నరకాసుడు అనే రాక్షను సంహరించి మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి జరుపుకుంటారని అనాదిగా వస్తున్న పురాణ గాధ. అలాగే రావణ సంహార అనంతరం సీతా సమేతంగ రాముడు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాలతో ఈ దీపావళి జరుపుకున్నట్లు రామాయణం చెబుతోంది. పెద్దల ద్వారానే కదా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేది భావితరాల వారికి . ఇక పురాణ ఇతిహాసాలు ఉండనే ఉన్నాయి.

ఈ పండుగ తెలుగు నాట ఐదు రోజులుగా జరుపుకుంటారు.1 ఆశ్వీజ బహుళ త్రయోదశి ధన త్రయోదశి. ఆరోజు లక్ష్మీ పూజ చేస్తారు 2 బహుళ చతుర్దశి నరక చతుర్దశి. నరకాసుర వధ జరిగిన రోజు. ఆరోజు అందరూ తెల్లవారుజామున అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు 3 ఆశ్వీజ అమావాస్య దీపావళి పండుగ. ప్రదోష వేళ ఇల్లంతా దీపములతో అలకరించి, లక్ష్మీ పూజ చేసి, పిల్లల చేత బాణసంచా కల్పిస్తారు. యమ దీపం వెలిగించి పితృదేవోభవతలకు నివాళులర్పిస్తారు 4 కార్తీక శుద్ధ పాడ్యమి బలిపాడ్దమి అంటారు. బలి చక్రవర్తి పాతాళం నుండి భూమికి వస్తాడట.5 కార్తీక శుద్ధ విదియ భగినీ హస్తభోజనం అని సోదరి ఇంటికి భోజనానికి వెళతారు.
‌ ఈ సాంప్రదాయాలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో ఐదు రోజులు పండగ చేసుకుంటారు. ఈ పండుగ అస్సాం బెంగాల్ రాష్ట్రాల్లో కాళీ పూజగా జరుపుకుంటారు. బెంగాల్ రాష్ట్రంలో ఈరోజు” కలి పూజ “కూడా చేస్తారు. కలి ప్రభావం తమ మీద పడకుండా ఉండడానికి. ఒరిస్సా లో ఈ పండుగను కుమార పౌర్ణమిగా త్రయోదశి నుండి అమావాస్య వరకు జరుపుకుంటారు.రాజస్థాన్లో ఈ పండుగను ” ధన్తెరాస్” గా జరుపుకుంటారు. పిల్లిని లక్ష్మీదేవి భావించి పూజిస్తారు. గుజరాతి మార్వాడీలు దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పద్దుల పుస్తకాలను ప్రారంభిస్తారు. కేరళీయులు ఈ దీపావళిని” బలి అమావాస్య”గా జరుపుకుంటారు. వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి పంపినది దీపావళి రోజే అని భావిస్తారు. బౌద్ధ మతస్తులు 18 సంవత్సరాల తరువాత బుద్ధుడు తన జన్మస్థలమైన కపిలవస్తుకు తిరిగి వచ్చిన సందర్భంగా ఆయన అనుయాయులు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు అని ప్రతితి. అప్పటినుండి బౌద్ధ మతానికి చెందిన ప్రజలు దీపావళి రోజున దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటారు. జైనులో 24వ తీర్థంకరుడైన మహావీరుడు దీపావళి రోజున మోక్షం పొందాడని నమ్ముతారు. ఈ ఆనందంలో జైనులు దీపాలు వెలిగించి భగవంతుని పూజిస్తారు.
‌ ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకనే దీపావళి అంటే ఇంత ఆకర్షణ, ఆనందము. దీప రూపంలోనూ, బాణసంచా రూపంలోనూ అగ్ని ఉంటాడు. అందుకే వాటితో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు బాణసంచా కాల్చాలనే హడావుడే కానీ ప్రమాదం కనిపెట్టలేరు. ఇల్లు,ఒళ్ళు కాల్చుకోకుండా బాణసంచా కాల్చే విషయంలో పెద్దలు శ్రద్ధ వహించాలి. అవసరానికి తగిన నీరు దగ్గరగా పెట్టుకోవాలి. పాదరక్షలు ధరించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం?విపరీతమైన ఆర్భాటాలు పోయి ఆపదలు కొని తెచ్చుకోకూడదు. ఇప్పుడు వచ్చే బాణసంచాలలో కల్తీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ వచ్చే పొగ నుండి పిల్లలు పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ ధరించడం మంచిది.( కరోనా మహమ్మారి వచ్చి నేర్పించింది కదా) కొంతవరకు కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పాత రోజుల్లో ప్రకృతిలో దొరికే వాటితోనే బాణసంచా తయారు చేసుకునేవారు. అది అంత ప్రమాదకరం కాదు. బాహ్య ఆనందం కంటే అంతర ఆనందమే సౌఖ్యము.ఇది పరస్పర నిస్వారప్రేమ వల్లసాధ్యమవుతుంది. పెద్దలను గౌరవించండి,పిన్నలను దీవించండి, దీనులకు ధర్మం చేయండి, భగవంతుని సద్బుద్ధి ఇవ్వమని మనసారా ప్రార్థించండి. ఈ సద్గుణాలనే మనము దీపాలుగా అమర్చుకుని నిత్య దీపావళిని చేసుకుందాం.
‌ *లోక సమస్త సుఖినోభవంతు *

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జాతర

మా ఇంట దీపావళి