కారులో కూర్చుంది అన్నమాటే కానీ సౌదామిని మనసు మనసులో లేదు… ఎందుకు నాన్నగారు ఇంత అర్జెంటుగా రమ్మంటున్నారు అనే విషయం అర్థం కాలేదు…
నీలాంబరి కూడా ఎందుకు ఇంత అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుందో ఊహించుకోలేకపోయింది… అలా ఆలోచనల మధ్య ఉన్న నీలాంబరికి సౌందర్య లహరి ఏడుపు విని మామూలు మనిషి అయింది…
పాకుతూ ఇల్లంతా తిరుగుతున్న సౌందర్యను చూస్తే ఎంతో ముచ్చట వేస్తుంది ప్రతి వస్తువు అందుకోవాలని చూస్తూ నోట్లో పెట్టుకుంటుంది…
” అలేఖ్యా! ఇక సౌందర్యకి పాకడం వచ్చేసింది దీన్ని పట్టుకోవడం మన తరం కాదు అప్పుడే అల్లరి మొదలు పెట్టింది” అన్నది మురిపంగా నీలాంబరి.
” అవునమ్మా రాత్రంతా కూడా నిద్రలేచి మంచం దిగాలని చూస్తుంది.. నాకు మంచం మీద పడుకుంటేనే భయమేస్తుంది.. ఎక్కడ కింద పడుతుందోనని అప్పటికి సుధీర్ ఒక చెయ్యి అడ్డం పెట్టి అలా పడుకున్నా కూడా తోసేసి దిగాలని చూస్తుంది.” అన్నది అలేఖ్య.
” అయితే వడ్రంగిని పిలిపించి మంచం చుట్టూ చెక్కతో కవర్ చేయిస్తాను ఈమధ్య చక్కని డిజైన్స్ తో మంచం చుట్టూ అమరుస్తున్నారు మనం వద్దనుకుంటే తీసివేయొచ్చు అప్పుడు ఏ వైపుకు వచ్చినా కూడా పిల్లలు పడకుండా ఉంటుంది” అన్నది నీలాంబరి.
” ఇప్పుడు అవన్నీ ఎందుకు లేమ్మా ఎలాగూ మరో పది రోజుల్లో వెళ్ళిపోతాము” అన్నది అలేఖ్య.
” మీరు వెళ్ళిపోతారు అనే మాట వింటేనే నాకు బాధగా ఉంది.. అయినా చేయిస్తే తప్పేంటి రేపు తమ్ముడి పిల్లలకైనా కావాల్సిందే కదా” అన్నది నీలాంబరి.
” అమ్మా! మనసంతా సౌదామిని మీదే ఉందమ్మా అసలు వాళ్లు ఎందుకు ఇంత తొందరగా పిలిపించారు! ఏవిషయం చెప్పలేక మనల్ని టెన్షన్ లో ఉంచారు” అన్నది అలేఖ్య.
” అయినా వాళ్ళిద్దరి ప్రేమ గురించి మనం మాత్రమే తెలుసుకున్నాము వాళ్లకు ఇంకా తెలియదు కదా! ఈ విషయం తెలిస్తే ఏమంటారో చూద్దాము” అన్నది నీలాంబరి.
సౌదామిని ఇంటికి చేరుకున్నది.. ఇంట్లోకి వెళ్లేసరికి సౌదామిని మేనత్త దుర్గ మరియు బావ కమల్ ఉన్నారు..” వీళ్ళు ఎందుకు వచ్చారు సడన్గా” అని మనసులో అనుకొని..
” అత్తా మీరెప్పుడొచ్చారు బావ బాగున్నావా” అని అడిగింది.
” మేము నిన్న వచ్చాము సౌదామిని” అని చెప్పింది దుర్గ.
” అవును నువ్వు ఒక్క మాటైనా చెప్పకుండా గోపాలపురంలో ఏదో పిల్లల సదనంలో డాక్టర్ గా చేస్తున్నవట” అన్నాడు కమల్ కొంచెం కళ్ళు ఎగిరేస్తూ..
“నేను జాయిన్ అవ్వడం గురించి ఇతనికి ఎందుకు చెప్పాలి ఏదో మాటల్లో తేడా ఉందే” అనుకున్నది సౌదామిని.
ఇంతలో సౌదామిని తల్లి విజయమ్మ వచ్చింది..
” వచ్చావా సౌదామిని ..బాగున్నావా తల్లీ! ఎప్పుడు తిన్నావో.. భోజనం చేద్దాము స్నానం చేసి రా!” అని అడిగింది.
” ముందు డ్రైవర్ కి భోజనం పెట్టి పంపించు అతను మళ్లీ చాలా దూరం వెళ్ళాలి నేను స్నానం చేసి వస్తాను” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సౌదామిని.
స్నానం చేసి వచ్చిన తర్వాత అందరికీ భోజనాలు వడ్డించింది విజయమ్మ ఇంతలో సౌదామిని తండ్రి కూడా వచ్చాడు…
” ఏంట్రా బంగారం బాగున్నావా” అని అడిగాడు.
” బాగున్నాను కానీ ఎందుకు ఇంత సడన్గా రమ్మని చెప్పారు నాన్నా” అని అడిగింది సౌదామిని.
” ముందు భోజనం చెయ్ తర్వాత మాట్లాడుకుందాం” అని లోపలికి వెళ్ళిపోయాడు రవీంద్ర.
నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది సౌదామిని.. అప్పటికే దుర్గా కమల్ కూర్చుని ఉన్నారు. సౌదామినినిచూసిన కమల్..
” ఈ డ్రెస్ ఏంటి! చక్కగా చీరలు కట్టుకోవచ్చు కదా బాగుంటుంది” అన్నాడు.
” వేసుకొని లేరా తర్వాత మానేస్తుంది నీకు ఇష్టం లేకుంటే వేసుకుంటుందా ఏంటి” అన్నది దుర్గ.
అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సౌదామినికి అర్థం కాలేదు ఎప్పుడో లేనిది అన్నిటి గురించి కామెంట్ చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంది.
అటుకెలికి ఇటుకెలికి భోజనం చేసినట్టు చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది సౌదామిని.
కాసేపటికి కమల్ కనీసం డోర్ తట్టకుండా లోపలికి వచ్చాడు అప్పుడే మగతగా నిద్ర పడుతున్న సౌదామినికి కమల్ చేయితో తట్టుతూ లేపుతుండడం చూసింది..
ఒక్కసారి కోపంతో ముఖం ఎర్రబడింది…
అయినా కోపం దిగమింగుకొనీ ..
” ఏం కావాలి బావా” అని అడిగింది.
” నీ గదిలోకి వస్తే ఏం కావాలి అని అడుగుతావు ఏంటి నువ్వే కావాలి?” అన్నాడు కమల్.
” నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు” అన్నది సౌదామిని..
” సరేగాని అలా బయటకు వెళ్దాం పద” అన్నాడు కమల్
” రాత్రి అయింది ఇప్పుడు బయటకు వెళ్దామా బయటకు వెళ్లడం ఎందుకు” అన్నది సౌదామిని.
” అలా మేడ మీదకి వెళ్లి మాట్లాడుకుందాం రా” అంటూ చేయి పట్టుకుని లాగాడు కమల్.
అప్పుడు అనుకుంది సౌదామిని “సాగర్ కి ఇతనికే ఎంత వ్యత్యాసం ఉంది అతని ఎంత సంస్కారంగా ప్రవర్తిస్తాడు ఇతనేంటి చేయి పట్టుకొని లాగడం అమ్మాయి పడకున్న గదిలోకి తలుపు తట్టకుండా రావడం చాలా ఇబ్బందిగా ఉంది” అని అనుకొని..
” నువ్వు వెళ్ళిపో బావ నేను ఇప్పుడు బయటకు రాలేను చాలా అలసిపోయి ఉన్నాను” అని చెప్పి అటు తిరిగి పడుకుంది సౌదామిని.
చేసేదేమీ లేక బయటకు వచ్చాడు కమల్…
బయట కూర్చుని అందరూ మాట్లాడుకుంటున్నారు..
అర్థం అయ్యి కానట్లుగా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి సౌదామినికి..
సంభాషణ మొత్తంలో విషయం అర్థమైంది సౌదామినికి “తన పెళ్లి గురించే వీళ్ల తనను పిలిపించారని అందుకే కమల్ అతిగా ప్రవర్తిస్తున్నాడని.. అయినా తనను అడగనవసరం లేదా వాళ్లే ఎలా నిర్ణయం తీసుకుంటారు” అని అనుకొని తనకు ఏమీ వినపడనట్లుగా అలాగే పడుకుంది.
తెల్లవారి ప్రొద్దున కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంది సౌదామిని..
అప్పుడే నిద్ర నుండి లేచి వచ్చిన కమల్ సోఫాలో సౌదామిని పక్కన అతుక్కునట్లుగా వచ్చి కూర్చున్నాడు.
సౌదామినికి ఒక్కసారిగా చాలా చిరాకు వేసింది..
టక్కున అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది.
అందరూ కాఫీలు తాగడం అయిపోయిన తర్వాత సౌదామిని తండ్రి రవీంద్ర సౌదామిని పిలిచాడు..
సౌదామిని బయటకు వచ్చి నిలబడింది..
” ఇలా రామ్మా వచ్చి ఇక్కడ కూర్చో నీతో మాట్లాడాలి” అన్నాడు.
వచ్చి తండ్రి పక్కన కూర్చుంది సౌదామిని..
తల్లి విజయ ,అత్త దుర్గ, బావ కమల్ అందరూ అక్కడే కూర్చున్నారు.
” నీ పెళ్లి గురించి మాట్లాడడానికి పిలిపించాను నాకు నీ చిన్నప్పటినుండి నిన్ను కమల్ బావకు ఇచ్చి పెళ్లి చేయాలని ఇష్టంగా ఉంది అత్తకి కూడా నువ్వంటే చాలా ఇష్టం బయట కొత్త సంబంధాలు చూసి నిన్ను పంపించడం కంటే ఇలా మన వాళ్ళ ఇంటికి పంపిస్తే నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావని ఈ నిర్ణయం తీసుకున్నాము” అన్నాడు రవీంద్ర.
“నాన్నా” అని పిలిచింది సౌదామిని.
” నా మాట నువ్వు కాదనవని నాకు తెలుసు తల్లి కానీ ఒక మాట నీకు చెప్పాలి కదా అందుకనే నిన్ను పిలిపించాను అప్పటికి అమ్మ చెప్పింది ముహూర్తం పెట్టిన తర్వాత నీకు చెప్పాలని కానీ నాకు అలా ఇష్టం లేదు అందుకే నిన్ను పిలిపించాను” అన్నాడు రవీంద్ర.
” అవునే కోడలా నిన్నే చేసుకోవాలని కమల్ బావ పట్టుబడుతున్నాడు” అన్నది నవ్వుతూ దుర్గ.
” అవును మరదలా! ఎంత తొందరగా మన పెళ్లయితే అంత బాగుంటుంది” అన్నాడు కమల్ వెకిలిగా గా నవ్వుతూ..
” అందులో వాడికి వంటకు కష్టమైతుందే పెళ్లయితే నువ్వు చేసి పెడతావు కదా” అన్నది దుర్గ.
” ఏంటి వీళ్లు వంట కోసం నన్ను పెళ్లి చేసుకుంటారా భోజనం కావాలంటే ఓ వంట మనిషిని పెట్టుకోవాలి కదా అతనే నా ఉద్యోగం చేస్తుంది నేను కూడా డాక్టర్ని కదా నేను కూడా బయటకు వెళ్ళేదాన్ని ఇంకా పాత ఆలోచనలు వీళ్ళకి పోలేదన్నమాట” అని మనసులో అనుకొని…
ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. “తల్లి తండ్రి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడూ తనని అడగకుండా ఏదీ ..చేయని వాళ్ళు పెళ్లి విషయంలో మాత్రం ఇలా .నిర్ణయం తీసుకున్నారు ఎందుకు” అని అనుకున్నది.
మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సౌదామిని మెడిసిన్ కు సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ హాల్లో కూర్చుంది. అందరూ భోజనాలు చేసి గదుల్లో పడుకున్నారు.
కమల్ సౌదామిని చూసి..
” ఒక్కదానివే కూర్చున్నావ్ ఏంటి నన్ను పిలవచ్చు కదా” అని పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు.
ఇక ఓర్చుకోలేని సౌదామి ని..
” భుజం నుంచి చేయి తీసేయ్ బావ” అని కాస్త గట్టిగా అరిచింది.
” ఏంటి సిగ్గా నీకు కాబోయే భర్తనే కదా “అని మరింత గట్టిగా బిగించాడు.
ఒక్కసారిగా చేతిలో పుస్తకాలను కింద పడేసి..
” ఆడపిల్లలతో ప్రవర్తించే విధానం నేర్చుకో ఏంటి అప్పుడే పెళ్ళాన్ని అయినట్లు చేస్తున్నావ్… పెళ్లయిన భార్యనైనా పద్ధతిగా చూసుకోవాలి కనీసం నీకు ఇష్టమా అని కూడా నన్ను అడగలేదు నువ్వే డిసైడ్ చేసుకుంటావా” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.
అలా ప్రవర్తిస్తుందని ఊహించని కమల్ ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది…
తల్లి దగ్గరికి వచ్చి జరిగింది చెప్పాడు.
దుర్గ తమ్ముడిని పిలిచి “ఇలా చేసింది రా సౌదామిని “అని చెప్పింది..
రవీంద్ర కూడా ఏమీ ఆలోచించకుండా సౌదామినినీ పిలిచి తిట్టాడు..
” ఏంటి సౌదామిని ఎందుకు బావని తిట్టావు నువ్వు” అని అడిగాడు.
” ఎందుకు తిట్టానో అతన్ని అడుగు” అన్నది కోపంగా సౌదామిని..
” నువ్వు అలా తిట్టడం తప్పు .. బావకు సారి చెప్పు” అన్నాడు రవీంద్ర..
చూచాయిగా విషయం తెలుసుకున్న విజయమ్మ ఇంకా ఓర్చుకోలేకపోయింది..
” సౌదామినీ! ఇలా రా నువ్వు” అని పిలిచింది..
తల్లి కూడా తనను తిడుతుందేమో అని అనుకొని తల్లి దగ్గరికి వెళ్ళింది సౌదామిని.
కూతురు చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది విజయమ్మ.
” సౌదామినీ! నాకు విషయం అర్థమైంది నీ పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను నువ్వు బాధపడకు తొందరపడకు అమ్మగా నీకు నేనున్నాను” అని దగ్గరకు తీసుకుంది.
ఒక్కసారిగా కళ్ళకు నీళ్లు వచ్చాయి సౌదామినికి.
తల్లిని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది…
ఇంకా ఉంది