ఒడిపిళ్ళు

ధారావాహికం -2వ భాగం

సూర్యుణ్ణి చల్లార్చి సాయంసంధ్య ముసిముసిగా నవ్వుతూంటే..

ఆ బజారులోని అందరి ఇళ్లల్లో చిన్నచిన్న మంటలు వెలగడం మొదలుపెట్టాయి. ఆ వీధిలో ఉన్న సోమ్లా ఇంట్లో కూడా సాయంత్రం వంట కోసం మంట వెలిగించారు.

సోమ్లా చాలా ఆనందంగా ఉన్నాడు. అతని చుట్టూ అతని కొడుకులు భూక్యా, టీక్యా, బిడ్డలు సాలీ, మాలీ కూర్చుని ఉన్నారు. అప్పుడు వారితో సోమ్లా జరిగిన విషయాన్ని చెప్పాడు. “చూడండి పిల్లలు రేపు పొద్దున్నే మాలి ధమాకా కొండమీద పని మొదలు పెట్టాలి. ఫారెస్ట్ గార్డ్ మనకు అనుమతి ఇచ్చాడు. మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. మీకు అర్థం అవుతుంది కదా” అన్నాడు.

ఆ తర్వాత అతను చుట్ట వెలిగించుకొని, ఆ సాయంత్రం తన ఆలోచనలలో మునిగిపోయాడు. అతని దృష్టంతా అడవిని నరికి కొడుకుల కోసం ఏర్పాటు చేయబోయే భూమి గురించే, అతనికి కలగబోయే మనవళ్ళ కోసం నిర్మించే గృహాల గురించి.

” వెళ్లండి వెళ్లి మీ పడకిళ్ళల్లో ఈరోజు పడుకోండి” అని తన పిల్లలకు చెప్పాడు.

అతని ప్రోత్సాహంతో కూడిన పలకరింపు వారికి ఆనందాన్ని ఇచ్చింది. అంతా కలిసి కూర్చుని నవ్వులతో కబుర్లు ఆడుకున్నారు.

సాలీ చీకట్లో కూర్చొని ఉన్నది, ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తలకు ఆముదం నూనెను పట్టించి చక్కగా తల దువ్వు కుంది. భూక్యా ఇంటి చూరులో దోపిన అతని డుంగుడుంగాను బయటికి తీశాడు. ఒక మూల కూర్చుని ఒక రకమైన భావోద్వేగంతో దానిని మీటడం మొదలుపెట్టాడు.

అందరూ రాత్రి భోజనం ముగించిన తర్వాత సాలీ, భూక్యా తమతమ వసతి గృహాలకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. వారిద్దరూ చీకట్లో నడుస్తున్నప్పుడు భూక్యా తన చెల్లిని “ఎక్కడికి వెళుతున్నావు” అని అడిగాడు.

“నువ్వు ఎక్కడికి వెళుతున్నావు” అని ప్రశ్న ఎక్కు పెట్టింది ఆమె.

రెండు పెద్ద పెద్ద (సామూహిక పడకిళ్ళు) వసతిగృహాలు గ్రామం మధ్యలో ఒకదానికొకటి కొద్ది దూరంలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అవి ప్రత్యేకంగా యువకులకు వేరు యువతులకు వేరుగా ఏర్పాటు చేయబడినవి. కొంత వయసు వచ్చిన తర్వాత గిరిజన తెగలో యువత తల్లిదండ్రులతో కలిసి నిద్రించరు. వారిపై ఎటువంటి నిబంధనలు నిర్బంధాలు ఉండవు. ఆ గిరిజనుల చరిత్రలోనే సంప్రదాయం ప్రకారం విశాలమైన వసతి గృహాలు ఊరి మధ్యలో నిలబడి ఉన్నాయి. యువతీ యువకులు ఒకరి కోసం ఒకరు ఇక్కడ ఉన్న మైదానంలో పాటలు పాడుకుంటారు. ఏదైనా పొరపాటు జరిగితే తెల్లవారి పొద్దున పెద్దలు కూర్చొని విచారిస్తారు. తప్పుగా ప్రవర్తించిన వారిని జరిమానాతో శిక్షిస్తారు. నాలుగు వేల జరిమానాతో గ్రామస్తులందరికీ మద్యం కోసం ఆ డబ్బు సరిపోతుంది. తర్వాత వారంతా కలిసి తాగి డాన్స్ చేస్తారు. దానికంటే ముందు భూదేవత గురించి పాటలు పాడతారు. అంతటితో ఆ విషయం అయిపోతుంది. యువత తప్పు చేస్తే వేసే శిక్ష అది మాత్రమే. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని పరవశంలో రహస్యంగా పారిపోయే హక్కు వారి తెగలో ఉన్నది. అప్పుడప్పుడు అలా జరుగుతుంది కూడా ఆ తర్వాతే ఆ సంబంధం న్యాయబద్ధం చేయడానికి నలబై వేల రూపాయల కన్యాశుల్కాన్ని వరుడు వధువు తండ్రికి సంప్రదాయంగా చెల్లిస్తాడు.

చాలా రాత్రి గడిచిపోయింది గుహ లోని గబ్బిలాల రెక్కల చప్పుడు వినిపించే సమయం. ఊరి మధ్యలోరావి చెట్టు నిలబడి ఉన్నది. చీకటి ఆకాశంలో నక్షత్రాలు నిశ్శబ్దంగా ఆ రెండు వసతిగృహాల వైపు చూస్తున్నాయి. ఉన్నట్టుండి యువకుల వసతి గృహం నుండి డుంగుడుంగా శబ్దం మొదలైంది. తన వాయిద్యం లోని ఒక తీగను మాత్రమే పదే పదే తన ఎడమచేతి ఉంగరపు వేలితో మీటుతూ ఉన్నాడు హేమ్లా. అతని కుడిచేతి వేళ్ళకు ఉన్న అనేక ఉంగరాలతో సొరకాయ బుర్రను లయబద్ధంగా మోగిస్తున్నాడు. ఆ విధంగా మధురమైన ధ్వని క్రమంగా మోగుతూ ఉన్నది. దానికి తోడు హేమ్లా తమ గిరిజనుల పురాతన బల్లాడని పాడడం మొదలు పెట్టాడు.

” మొక్కజొన్న కంకి కాలుతున్న శబ్దం
లేదా ఉడుకుతున్నదో
అదే నేను పాడుతున్న పాట తీరు
ఓ ప్రియా ఎవరు తమ మాట నిలబెట్టుకున్నారు
అందమైన బంగారు నీ ముక్కుపోగా
నా డుంగుడుంగా వాయిద్యానికున్నవి ఇత్తడి తీగలు మాత్రమే
కానీ అవి సొగసైన సంగీతాన్ని అందిస్తూన్నాయి
ఒక బిడ్డ హృదయవిదారకంగా ఏడుస్తుంటే
భర్తలేని తన తల్లిని లేపుకు పోయాడు మరొకభర్త
నా భయంకరమైన విచారము దుఃఖము నీకోసమే
ఓ నా ప్రియురాలా నీ మాటలు నిలబెట్టుకో
నన్ను రక్షించు నీ పేరును నా పెదవులపై స్మరిస్తూ నీకోసం నేను చనిపోతాను
ఓ సాలీ…”

ఆ పాట వినగానే సాలీ ఊపిరి బిగబట్టింది. ఆమె పక్కనే పడుకుని వున్న కమ్లీ నిద్రలో దీర్ఘశ్వాస తీస్తోంది.
ఇలా హేమ్లా తన పాట పూర్తి చేయకముందే భూక్యా పాట మొదలెట్టాడు.

“ఇది నా పాట
మూడు లెక్కలతో కూడినది
భూక్యా పాట నాలుగు కొలతలు కలిగిన
మెత్తని మృదువైన కోస్లా
రావోయి నా ప్రియురాలా
మనం కలిసి ఆడుకుందాం
త్వరగా రా నా ప్రియురాలా
గుమ్మడి తీగ అల్లుకున్నట్టు వచ్చి నన్ను చుట్టుకో మనం ఆడుకుందాం
చూడు అదిగో వస్తోంది నా కమ్లీ
ఎద ఒంపుల కమ్లీ
మనం ఆడుకుందాం రా
నా పాటలోని నిజమైన అర్థాన్ని గ్రహించు పండులోని గుజ్జు వంటి సమాచారాన్ని గ్రహించు పరుగులు పెడుతూరా
పరిగెత్తుకొని రా
మనం కలిసి ఆడుకుందాం”

సాలీ కమ్లీని కుదుపుతూ లేపింది.

“విను విను నా సోదరుని భార్యా, నా అన్న పాట విన్నావా! నువ్వు తప్పకుండా ఈ పాట వినాలి. అతడు నిన్ను పిలుస్తున్నాడు లే లే” అంటూ కమ్లీకి గిలిగింతలు పెడుతూ గిల్లింది.

ఇద్దరు స్నేహితులు పడీపడీ బాగా నవ్వారు.

ఆ తర్వాత కమ్లీ సాలీ ఇద్దరూ కలిసి, యువకుల పాటకు సమాధానంగా మరొక పురాతన గిరిజన బల్లాడ్ మొదలుపెట్టారు.

” నేను నా కులం వలలో ఉన్నాను

విభిన్నమైన వలలు ఉన్నాయి నాకు

నేను ఒక చేపను చూశాను

తరువాత ఒక పీతని చూశాను

ఆపై మా అమ్మ తమ్ముడిని చూశాను

ఆ తరువాత మా తాతని చూశాను

నేను చాలా భయపడ్డాను నేను వచ్చేసాను

గ్రామంలో తియ్యటి మామిడి పళ్ళను

వారు లెక్కించే చోటికి

వారు పుల్లటి ఆంబ్డా పళ్ళను లెక్కించే చోటుకి

నా పాట ఈ కొండలది అంటే

నేనిప్పుడు ఈ కొండల వెంట ఉరకాలని అర్థమేమో”

అటువైపు యువకుల వసతిగృహం నుండి మళ్ళీ హేమ్లా తన డుంగుడంగాను మీటటం మొదలు పెట్టాడు. వెంటనే అతనితో పాటు మరో మూడు నాలుగు డుంగుడుంగాలు ఒకేసారి మోగటం మొదలయ్యాయి. ఆ విధంగా సంగీత ధ్వని పెద్దదయింది. చీకటి చెట్ల ఆకుల నుండి జారుతూ నేలపై రాలుతోంది. పెద్ద అర్థపూర్ణ చంద్రుడు కొండల శిఖరం వెనుక నుండి పైకి పాకుతూ హేమ్లా పాటకు సహకరిస్తూన్నాడు.

“నువ్వు ధరించిన రంగురంగుల దుస్తులు

ఆ చీర దిగువ మాలి గూడలో నేశారు

దానిని శుభ్రంగా ఉతుకు త్వరగా శుభ్రంగా ఉతుకు

నా ప్రియురాలా నీకిష్టమైన దుస్తులు ధరించి నాకోసం రా

నీ చేతులకు గాజులు వేసుకొని రా

తొందరగా నా కోసం రా

ఓ ప్రేయసీ మనిద్దరం కలిసి పాడుదాం ఆడుదాం

ఈ గ్రామంలో మన ముత్తాతలకు

గ్రామంలోని తల్లులకు అన్నలకు

తాతలకు ఎవరికీ సిగ్గు అనేది తెలవదు

వారికి భయమూ తెలియదు

నిన్ను ఏ చేప పట్టుకోదు

నిన్ను ఎటువంటి పీత పట్టుకోదు”

ఆ పాటలోని అన్ని రకాల ఆలోచనలు సాలీ మనసును కదిలించాయి. ఆమె తన పడకపై పడుకున్నది. కమ్లీ ఎంతగా వెక్కిరించినా లేవడానికి తిరస్కరించింది. గంటలు గడిచిపోయాయి డుంగుడుంగ శబ్దం ఆగిపోయింది. చాలా సమయం తర్వాత ఆ రాత్రి చంద్రుడు రావి చెట్టు ఆకుల నుండి నీడలోకి జారుకున్నాడు. సాలీ లేచి కూర్చుంది. తన కళ్ళను నలుపుకుంది, ఆమె తల తిరుగుతోంది, ఆమె హృదయం వేగంగా కొట్టుకుంటోంది, కదలకుండా మగతగా అలాగే కూర్చుని ఉండిపోయింది. కొంత విశ్రాంతి తర్వాత ఆవేశంలేకుండా అప్పుడు కచ్చితమైన నిర్ణయాన్ని తనకు తానుగా చెప్పుకుంది.

” కాదు, ఈ రాత్రి కాదు” అని.

ఆ తర్వాత ఆమె పక్కనే పడుకున్న కమ్లీ పై చేతులు వేసి పడుకొని నిద్ర పోయింది.

….   ….  …

ఒకరోజు సాయంత్రం తమ ఇంటి వసారాలో కణకణమనే నిప్పుల మీద రాత్రికి తినవలసిన వంట చేస్తున్నది సాలీ. మట్టికుండలో కొంచెం మక్కల పొడి  మామిడి పొడి కొన్ని ఆకులు వేసి అవి మునిగే వరకు నీళ్ళు నింపి పొయ్యి మీద పెట్టింది. తర్వాత కాళ్ళు చాచుకొని వరండాలో కూర్చున్నదామె. ఆమె తన నల్లని జుట్టుకు బాగా నూనె పట్టించి నున్నగా దువ్వి కొప్పు పెట్టింది. దానిలో ఒక ఎర్రటి పువ్వును కుచ్చింది. ఆమె చెల్లి మాలీ కూడా అక్కలాగే తన కొప్పులో ఎర్రమందారాన్ని పెట్టి, అక్క పక్కన కూర్చుంది. వారు పొయ్యి మీద పెట్టినది ఎప్పుడు ఉడుకుతుందా అని ఎదురు చూస్తూ కూచున్నారు. పొలం పనికి అడివికిపోయిన తండ్రి అన్నలు రోజంతా కొండల పై పనిచేసి వచ్చారు. ప్రతి ఒక్కరి భుజాలపై పార , గొడ్డలి ఉన్నాయి. వారంతా కలిసి వరండాలో కూర్చున్నారు.

సోమ్లా చిన్నపొగాకు ముక్కతో చుట్టచుట్టి పొగతాగుతాడు. ఆ విధంగా విశ్రాంతిగా కూర్చొని తృప్తి పొందుతాడు. అతని నలుగురు పిల్లలు ఎదగుతుండటం చూసి, తనది చిన్న గుడిసైనా గర్వాన్ని‌, నమ్మకాన్ని కలిగిస్తుంది అతనికి. అతడు చుట్టూ చూసుకున్నప్పుడు ఆశ్చర్యపరిచే కొండల సమూహాలు, అడవులు వాటిపైన అంతమే లేని పెద్ద ఆకాశం. కానీ అతడెప్పుడూ హద్దులులేని ప్రపంచంలో నష్టపోయినట్లు భావించలేదు. ఇప్పటికీ తనకు ఎప్పుడు ఏది కావాలి అనిపిస్తే అది పొందగలడు. ఆ విధంగా అతడి జీవితం సాగుతోంది.

సోమ్లా ఇల్లు గడ్డితో కట్టిన ఒకగది కలిగిన గుడిసె. అది మూడు భాగాలుగా ఉంది. మధ్య భాగంలో పడకకు, కూర్చొనేందుకు, సామాన్లగదిగా ఉపయోగిస్తారు. మిగిలిన రెండూ చాలాచిన్నవి.

ఒక వైపు మూలకు మామిడి పిక్కల కుప్పలు పొడిచేసి వండుకొని తినేందుకు. మరొక మూల అడవి నూనెగింజలు కుప్పలు పోసి ఉన్నాయి. వాటి నుండి నూనె తీస్తారు. ఆకులతో కుట్టిన పది బస్తాలలో రాగులు నింపి ఉన్నాయి. మిగిలిన నేలంతా మట్టితో అలికి ఉన్నది. గదిలో రెండు మూడు ఖాళీ మట్టి కుండలున్నాయి. పైకప్పు నుండి రెండు నూలు చీరలు, పురుషులు ధరించే దుస్తులు(నడుముకు చుట్టుకునే గుడ్డపేలికలు ) వేలాడుతున్నాయి. అడవికి పోయేప్పుడు నీళ్లు, రాగులగంజి తీసుకుపోయే ఫ్లాస్కుల వలె ఉపయోగించే డజన్ల కొద్దీ ఎండిన సొరకాయ బుర్రలు ఉన్నాయి. ఎండు తాటాకులతో చేసిన మోటు గొడుగులు గుడిసెచుట్టూ పడి ఉన్నాయి.

ఇదీ సోమ్లా ఇంటిలో కలిగి ఉన్నదంతా. ఇంతకు మించి ఏమీ లేదు. వస్తువులన్నీ కుప్పలేసి, క్రమం లేకుండా ఉంటాయి. అట్లా ఉండటమే అతనికి ఇష్టం, అలవాటు కూడా. వంట చేసేప్పుడు పొయ్యి నుంచి వచ్చే పొగ ఇల్లంతా ఊపిరాడకుండా నిండి పోవడం అతనికి ఇష్టం. ఇంటి గోడలకు కిటికీలు లేవు. చిన్న పగుళ్ళు కూడా లేవు. అతడి ఇంటిని, అతడు తనకున్న ప్రతి దానిని ప్రేమిస్తాడు.

సూర్యాస్తమయ సమయంలో సోమ్లా తన గుడిసె ముందు వరండాలో కూర్చుని ఉన్నాడు. ఉన్నట్టుండి తన ఎదురుగా ఉన్న కొండలు రంగులజల్లులో ఖననం అవుతున్నట్టూ, ఆ కొండ శిఖరమంతా ఎర్రని మంటలా వ్యాపిస్తూ, ఆ సింధూరం రంగు ఒకరి తలపై మరొకరు చల్లుకున్నట్టు నిండిపోయింది వసంతోత్సవంలో కుంకుమపొడి అంతటా వెదజల్లి ఉన్నట్టు. కొండలపక్కనంతా పసుపుపొడి వెదజల్లినట్టు పసుపు పచ్చగా ఉత్సాహం కలిగిస్తూ ఉన్నది. కొండ దిగువన లోతైన లోయలతో దట్టమైన అడవి వ్యాపించి, చిక్కటి నీలపు సముద్రపు రంగులో కనిపిస్తున్నది. వాటిని తదేకంగా చూస్తూ అద్భుతమైన అటవీ సౌందర్య రహస్యానికి ఆశ్చర్య పోతున్నాడు అతడు. అడవీ, కొండలూ, ప్రపంచమంతా అదృశ్య శక్తుల యొక్క అద్భుతమైన రచననీ, అతడు పొందే శాంతి సంతృప్తి, అంతా మాయాశక్తుల వల్ల కలిగిందే కావచ్చునని , ఈ ఆకాశము, భూమి, అడవులు, పర్వతాలు, లో’యలు , సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సంతోషాలు, అదృష్టాలు, కరువు కాటకాలు, కష్ట సమయాలు అన్నీ ఆగొప్ప సృష్టిలో భాగాలని అతని నమ్మకం. అదే తన గిరిజనులందరికి చెప్తూంటాడు సోమ్లా.

దూరంగా కనిపిస్తున్న కొండలు శిఖరం నుండి పర్వత పాదం వరకు ఏటవాలుగా వ్యాపించిన పంటలు కోయబడి , అవరోహణగా మెట్లదారి వలె లోయలోకి ఏర్పడింది. పొలాలన్నీ పంటతో నిండి ఉన్నాయి. కొండవాగు లోయలోకి చేరే తొందరలో ఉంది , అతడి కంటికి కనిపించక పోయినా ఆ దృశ్యాన్ని ఊహించగలడు. కొండ రాళ్లపై నాట్యం చేస్తూ నీటి ప్రవాహం బుడబుడ శబ్దం చేస్తూ కింద లోయల్లోకి దుముకుతున్నది. పక్కకు తిరిగితే అతని ముందు ఒక మైదానం అది పచ్చటి కార్పెట్ పరిచినట్టు వరిపంట చేలు. వంకలు తిరిగిన పచ్చటిపొలాలు. ఒక పచ్చటిపాము వలె గ్రామ ప్రజల వరిచేలు. మైదానాన్ని ఆనుకొని ఎత్తయిన పురాతన పర్వతాలు దట్టమైన అడవులతో.

వివిధ ఎత్తులలో కొండలు వరసగా పెరుగుతూ రింగులు రింగులుగా చుట్టుకొని, విడదీయలేనంతగా మూసుకుపోయి మిగిలిన ప్రపంచానికి కనిపించట్లేదు.

సోమ్లా కళ్ళకు ఈ దృశ్యాలన్నీ విందు చేస్తున్నాయి. క్రమంగా అతని కళ్ళలో దృశ్యం మారింది. ఒక చిన్న పర్వత ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద పెద్ద చెట్లతో ఉన్న ఆడవి, ఇప్పుడు దాదాపు ఖాళీగా మారి అడవి స్థానంలో వ్యవసాయభూములతో మచ్చలుగా మారింది. అతనికి కూడా అక్కడొక పొలం ఉన్నది. అతనికి ఇప్పటికీ గుర్తున్నది వర్షం కుండపోతగా కురుస్తూ తుఫాను సమయంలో ‘లోబో’ అనే కొండతెగ గిరిజనుడితో కలిసి చెట్లు నరికి మొదటిసారి ఆ కొండ పై నేలను పొలంగా మార్చారు.

అతనికి జీవతం సంతోషంగా అనిపిస్తుంది. అటువంటి జీవితమే కొనసాగేలా దయాళువైన ధర్మబుద్ధిగల సృష్టికారకుడు అతని జీవితాన్ని అందంగా ప్రకాశవంతంగా చేశాడు..

అతడు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు సందేహం లేకుండా దేదీప్యమానంగా కనిపిస్తుందతనికి. అతడు చూడను కూడా లేనంత దూరం అతని జీవితం గురించి ఊహించుకుంటాడు. తనకు, తన కొడుకులకు, తన మనుమలకు లెక్క లేనన్ని ఇళ్ళు కట్టాలని. భూక్యా, టిక్యాలకు పెళ్ళిళ్ళు అవుతాయి వారికి పిల్లలు కలుగుతారు. అతడి మనవళ్ళు కూడా తండ్రులవుతారు. పాబుగ్గలతో తుంటరి మునిమనవళ్ళ సమూహాలు తనచుట్టూ ఉంటారు. అతని సంతతి గుణించబడింది. ఒక పెద్ద మంద పశువులు సంపాదించాడు. వాటిలో అరవై ఉత్తమ పశువులను లెక్కించాడు. పొడవైన తమ ఇళ్ళ వరుస ముందు పేద్ద పశువుల కొట్టం. ఆ వరుసలో ఇళ్ళన్నీ తనవే పశువుల కొట్టం తనదే. ఆవుల పేడ వేసేందుకు లోతైన పేద్ద కందకం తవ్వించాడు. అది పొలాలకు ఎరువు కూడా. ఇప్పుడు ఆ కందకం ఆవుపేడతో నిండి పోయి బయటకు పొర్లుతోంది. ఆ వాసనంతా చుట్టుపక్కల అంతా నిండిపోయింది. దానిని పీలుస్తూ అతడు ఆనందిస్తాడు. అతని కొడుకులు మనవళ్ళు సాగు చేస్తున్న భూములను అతడు పరిశీలిస్తూ చుట్టూ చూస్తూంటాడు. ఆ పొలాలన్నీ కొండలమీద ఉన్నాయి. గ్రామం చుట్టూ ఉన్న కొండలపై చెట్లన్నీ నరికి పొలాలగా మార్చారు విస్తారంగా పంటలు పండేందుకు. అవన్నీ తనవే‌, ఎటుచూసినా కనుచూపు మేరా అతని పంట పొలాలే కనబడుతున్నట్టు ఊహించుకున్నాడు.

సోమ్లా కళ్ళు తెరిచే అక్కడ కూర్చున్నాడు. కానీ భవిష్యత్తు గురించి కలలు కన్నాడు. చివరకు మిగిలింది ఏమిటి. తాను ముసలివాడయ్యాడు, నీరసించి పోయాడు, ఇప్పుడు చావబోతున్నాడు ఏమి సాధించలేదు. అప్పుడు కూడా అతడి ఊహలు ఆగలేదు. గిరిజనులు చనిపోతే చేసే కర్మల గురించి ఆలోచిస్తూన్నాడు. ఊరి మధ్యలో కాళీ ప్రదేశంలో ఒక మూలలో గిరిజనులు అంతా సమావేశం అవుతారు‌, ఆడుకుంటారు, నాట్యాలు చేస్తారు. అక్కడ ఉన్న ఒక మామిడి చెట్టు నీడన ఆడుకుంటారు గిరిజనులు. చనిపోయిన వారిని అక్కడే పాతిపెడతారు. గుర్తుగా దానిపై రాళ్ళను పెడతారు. చనిపోయింది మగవాళ్ళైతే నిలువుగా ఆడవాళ్ళయితే రాయిని అడ్డంగా పెడతారు. తన పూర్వికులను కూడా ఆ మామిడి చెట్టుకిందే పూడ్చిపెట్టారు. దానిపై నిలబెట్టిన రాయి నుండి వారి శక్తంతా తనలోకి ప్రవేశించింది అదే కొనసాగుతున్నదనీ, తాను కూడా అటువంటి రాతినుండి తన మనవళ్ళను మునిమనవళ్ళను మెరుస్తున్న కళ్ళతో చూస్తాడు. తన శక్తిని కిరణాలుగా వారి పై ప్రసరిస్తాననుకుంటాడు సోమ్లా. అతడక్కడే కూర్చుని ఉండగా కలలు చుట్టేశాయి. రాత్రి అయింది ఆ దృశ్యాలను కప్పేసింది.

అతని బలమైన మోటు శరీరంపై అతనికెంతో నమ్మకం. దేని మీద ఆధారపడడు. అతను కొండపై అడవిని నరకడం మొదలు పెడితే పూర్తిగా బోడిగా అయ్యేవరకు, పొలంలో పంటను మునుం పట్టి కోసినట్టు, తన గొడ్డలిని ఆపకుండా ఐదారుగంటలు విరామం లేకుండా చెట్లునరుకుతూనే ఉండేవాడు. గతంలో అధికారుల కోసం పెద్దపెద్ద బరువులను మోస్తూ ఎంత దూరమైనా అడవుల్లో కొండలపై డొంకల్లో నడిచేవాడు. అధికారుల బంగ్లాలున్న ‘కాకిరిగుమ్మ,’ లేదా ‘మాంకొడ్జుల్లా’ వరకు బరువులు మోసేవాడు. వంద పౌండ్ల బరువు వెదురు కావడితో తన భుజాలపై మోసినందుకు ప్రతి రెండు మైళ్ళకు ఒక రాగినాణాన్ని కూలీగా తీసుకునేవాడు. బలమైన కండరాలు రాతివంటి అరచేతులు ఎండవాన చలికి చలించని అతని చర్మంతో అలసట విసుగు లేకుండా శ్రమిస్తున్నాడు. యాబై సంవత్సరాల వయసులో కూడా అతనికి చిన్న అనారోగ్యం తెలవదు.

భూక్యా అతని పెద్ద కొడుకు. వయసులో ఉన్నప్పుడు అచ్చం తనున్నట్టే తన కొడుకు భూక్యా ఉన్నాడిప్పుడు. ఆకలి దప్పుల యావలేకుండా పసిపిల్లాడిలా నవ్వుతూ ఎంత కష్టమైన అలసట లేకుండా, విసుగులో కూడా నవ్వుతూ పని చేస్తాడు భూక్యా. కానీ చిన్నకొడుకు టీక్యా మాత్రం తేడా మనిషి. పెద్దకళ్ళతో తొందరగా మాట్లాడుతూ చనిపోయిన సోమ్లా భార్య సంచారి వలె ఉంటాడు.

సాయంత్రం సమయంలో కుటుంబమంతా ఆనందంగా మంటచుట్టూ గుండ్రంగా కూర్చుంటారు. సాలీ, మాలీలు మట్టికుండలతో సెలఏటి నుండి నీళ్ళుతెస్తారు నిటారుగా ఉన్న కొండవాలును ఎక్కి , నీటిలో తడిచిన వారి నడక లయాత్మకంగా ఉంటుంది. వారిద్దరూ నవ్వుతూ ఆనందంగా కబుర్లాడుతుంటారు.

సోమ్లా చెవిపక్కన ఇరికించిన, సగంకాల్చి ఆర్పిన చుట్టను తీసి వెలిగించి పొగతాగుతున్నాడు. ఒక రకమైన శాంతి, విశ్రాంతి కలిగిన భావన ఆ నిశ్శబ్ద సాయంత్రం ఎతైనకొండలలో ఆస్వాదిస్తూ ఉన్నాడు.

*** *** ** *** ***

     జ్వలిత

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పది కంటే ఎక్కువ సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి.

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పోరాడితే పోయేదేముంది? We are warriors!!

నేటి భారతీయమ్” (కాలమ్)