ఒడిపిళ్ళు

నవల

ఈ నవలకు ఈ పేరు ఎందుకు ?

ఈ ప్రపంచంలో మనుషులే కాదు పక్షులు, జంతువులతో పాటు మొక్కలు, పువ్వులు, పంటలు కూడా వివక్షకు గురవుతాయి. కారణాలు ఏవైనప్పటికీ పక్షుల్లో కాకులు, జంతువుల్లో గాడిదలు, చెట్లలో తుమ్మలు, పువ్వుల్లో జిల్లేళ్ళు, పంటల్లో ఒడిపిళ్ళు వివక్షకు గురవుతున్నవే. ఒకప్పుడు ఆహార ధాన్యాలయిన ‘ఒడిపిళ్ళు’ వివక్షకు గురై కలుపు గింజలుగా భావించబడుతున్నాయి. వరి పంటలో కలుపు మొక్కగా గుర్తించబడుతున్నాయి. మనుషుల్లో ఆదివాసీలు మూలవాసీల వలెనే.. ఈ సమాజంలో గిరిజనులు ప్రకృతిలో మమేకమై కొండకోనల్లో నాగరికతకు దూరంగా వారి బ్రతికేదో వారు బ్రతుకుతుంటారు. అడవులను సంరక్షిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతుంటారు. కానీ అనాది నుండి వివక్షకు గురవుతూనే ఉంటారు. అటువంటి ఒక గిరిజన సముదాయం గురించి రాసిన కథ ‘ఒడిపిళ్ళు’ నవల. నాగరిక ప్రపంచానికి దూరంగా తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్నప్పటికీ వారిపై విద్యావంతులు అధికారులు నాగరికలు చేసినటువంటి దాస్టికాన్ని ఈ కథలో చర్చించడమైనది. ‘ఒడిపిళ్ళు’ ఒక అనుసృజన. ఇంకా దీనిని గురించిన సమాచారం తర్వాత వివరిస్తాను.

-రచయిత

 

అది మధ్యాహ్న సమయం గిరిజన గూడెపు ఆడవారికి వాగు వద్ద మలుపు తోపు స్నానాలకు, గుడ్డలు ఉతుక్కోవడానికి కొంచెం మరుగులో ఉంటుంది. మగ వారికి మరోవైపు బహిరంగంగా వాగు సాగే ప్రదేశంలో ఉంటుంది. ఒకే గ్రామంలో నివసించే వారైనా స్త్రీ పురుషులకు వేరువేరుగా ప్రత్యేకంగా స్నానాల తావులు ఉంటాయి. ఆ గిరిజన స్త్రీలు స్నానం చేసే చోటు వాగు ఒంపు తిరిగి, రెండు కొండల నడుమ గ్రామానికి అడవికి మధ్య దారిలో ఎగువన ఉంటుంది. అక్కడ సెలఏటి లోతు తక్కువ నీటి వేగం తక్కువ ఉండి, రాళ్ల మీదినుండి తోసుకుంటూ ప్రవహించే నీరు తెల్లటి నవ్వులతో కలిసి మెరుస్తూ లోతైన అడవిలోకి ప్రవహించేది. అందుకనే అక్కడ నీటి జలపాతాల శబ్దం క్రమంగా మోగుతూ ఒక వాయిద్యం లాగా వినపడేది. అందుకే వాటిని డుండుమా అని పిలిచేవారు. ఆ కొండల్లో అటువంటివి లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక పెద్ద మర్రిచెట్టు అక్కడ ఉన్న వాగువంపు వద్ద స్నానం చేసే ప్రదేశానికి నీడను కల్పిస్తుంది. ప్రవాహం పక్కన ఒడ్డు పై ఇరువైపులా అనేక పొలాలున్నాయి. లేత ఆకుపచ్చ రంగులో మాండియా పంట నీటిలో ప్రతిబింబించేది. ఒక సన్నటి ఇరుకైన దారి కొండ పైకి పాకుతూ మరో ఒడ్డుకు మర్రిచెట్టు కొమ్మలు వంగి ఉన్నాయి.

సాలీ, మాలీ అక్కచెల్లెళ్ళు ఒక గిరిజన గృహస్తు సోమ్లా బిడ్డలు. సోమ్లాకు నలుగురు సంతానం. ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు బిడ్డల కంటే పెద్దవాళ్ళు. వాళ్ళ పేర్లుబీక్యా, టీక్యా. సాలీ, మాలీ ఇద్దరూ స్నానం కోసం కాలువలోకి దిగారు. సాలీ పదిహేడు ఏళ్ల వయసుది, ఆమె చెల్లెకు పద్నాలుగు ఏళ్ల వయసు. సరసంతా వారి కోసమే అన్నట్టున్నారు. మిగిలిన  గిరిజన స్త్రీల వలె నగ్నంగా స్నానం చేస్తున్నారు. సాలీ సరస్సు వైపు తిరిగి తన చీరను ఎదురుగా ఉన్న బండపై బాదుతూ ఉతుకుతున్నది. మాలీ మోకాలు లోతు నీళ్లల్లో కూర్చొని సియాలి గింజల నుండి తీసిన రసంతో తన వెంట్రుకలను రుద్దుతూ తల స్నానం చేస్తుంది. ఆ సమయంలో తన తలలో నీటిలో ముంచి చేతులతో నీటిని తలపై విసురుకుంటోంది. తాము తెచ్చిన మట్టి కుండ సెలయేటి తీరంపై ఉన్నది.

అక్క చెల్లెళ్ళు ఇద్దరూ స్నానం చేస్తుండగా ఇద్దరు  గిరిజన పురుషులు మట్టి దిబ్బ పక్కనుండి నడుస్తూ వెళ్ళా‌రు. వారిద్దరూ తమ భుజాలపై వెదురు బొంగులకు కట్టిన బరువులను మోస్తూ నడుస్తున్నందున చెమటలో తడిచిపోయి ముందుకు సాగుతున్నారు. అటు ఇటు చూడకుండా నడుస్తున్నారు. మట్టి దిబ్బ మొదట్లో మరొక మనిషి కూర్చొని సరస్సు వైపు చూస్తు కాలక్షేపం చేస్తున్నాడు. అతని భుజంపై తుపాకీ ఉన్నది. చూసేవారికి ఆకుపచ్చ పావురాలను వేటాడుతున్నట్టు కనిపిస్తాడు.

కానీ అతని చూపులన్నీ సెలయేటిలో స్నానం చేస్తున్న వారిని పరిశీలిస్తూ ఉంటాయి. ఎవరైనా తనను గమనిస్తే పెళ్లి పోయినట్టు అడుగుల శబ్దం చేస్తాడు గాని అక్కడి నుండి కదలడు పొదల చాటుకు జరుగుతాడు .

అతనిని చూడగానే నగరం నుంచి వచ్చిన నాగరికునిగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతంలో గిరిజనులంతా అరకొర బట్టలతో అర్ధనగ్నంగా ఉంటారు. కానీ అతను పొట్టి లాగు(నిక్కరు), అంగీ వేసుకొని ఉంటాడు. ఆ కొండ ప్రాంతం లోని అమాయక ప్రజలకు అతడు ఒక పెద్ద అధికారి. ఎందుకంటే అతడు ఫారెస్ట్ గార్డ్ అడవిలో చెట్లు నరికే వారిని పట్టుకోవడం అతని ఉద్యోగం. అతడు తరచూ వారిని విచారిస్తూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అతడిని వారు “గారడ్” లేదా ‘జమాన్’ అంటారు అతని హోదా అల్పమైనదే అయినా వారు అతని పట్ల భయభక్తులతో ఉంటారు.

ఆ ఫారెస్ట్ గార్డ్ ఇప్పుడు అడవిలో తిరుగుతున్నాడు.

చాలా రోజులుగా అతని చూపులు స్నానం చేస్తున్న స్త్రీలను గమనిస్తూన్నాయి, చెట్లపై పక్షులను వేటాడుతున్నట్టు నటిస్తున్నాడు.

ఆ సమయంలో ఒక్కసారిగా సాలీ అతన్ని చూసింది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కంగారు పడ్డారు. సాలీ వెంటనే తన చీరతో తడిసిన తన ఒంటిని కప్పుకుంది. మాలీ తన అక్క చాటుకు చేరింది. నెమ్మదిగా నడుస్తూ చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉన్న తన చీరను అందుకొని చుట్టుకున్నది.

తర్వాత వారిద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. చెట్టు చాటున ఫారెస్ట్ గార్డ్ కూడా నవ్వుకున్నాడు.

చాలా సేపటి నుండి అతడు వారిని చెట్ల చాటునుండి చూస్తూ ఉన్నాడు.

అక్కచెల్లెళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ గార్డ్ చాలాసార్లు పొదల చాటు నుండి వారి తడి దేహాలను చూస్తూ సొల్లు కారుస్తూండే వాడు. ఆ విషయాన్ని అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ గమనించలేదు.

త్వరగా స్నానాలు ముగించుకొన్న వారు మట్టి కుండల్లో నీరు నింపుకొని ఒక్కరిపక్కన మరొకరు ఊరి వైపు వంపులోకి నడుస్తున్నారు. తడిచిన వారి దుస్తులు వారి శరీరాలకు రాసుకుంటూ శబ్దం చేస్తూన్నాయి. ఫారెస్ట్ గార్డ్ ముక్కులు ఉబ్బిస్తూ, వారు కనుమరుగు అయ్యేవరకు వారినే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత అడవి వైపు తిరిగాడు అప్పటికే పావురాలన్నీ ఎగిరి పోయాయి. ఏ వేట దొరకని ఫారెస్ట్ గార్డుకు భుజంపై తుపాకీ బరువెక్కినట్లు అనిపించి. వేరే దారి వెంట నడుస్తూ ఊరు చేరుకున్నాడు.

ఆ గిరిజన గ్రామానికి ముఖ్యమైన పెద్ద మనిషిని “నాయక” అని పిలుస్తారు. అతడు తన ఏకాంతం కోసం ప్రత్యేకమైన ఒక గదిని నిర్మించుకున్నాడు. ఎవరైనా ముఖ్యమైన వారు వచ్చినప్పుడు దానిని కేటాయిస్తాడు. గ్రామస్తుల పశువుల పాకలను కొన్నింటిని కూల్చి ఆ వస్తువులతో తన ఇంటి ముందు ఒక గదిని నిర్మించుకున్నాడు. గ్రామ పెద్ద  ఆజాతి గిరిజనుడే అయినప్పటికీ రాజప్రతినిధిగా అన్ని రకాల అద్దెలను, పన్నులను వసూలు చేస్తూ ఉంటాడు. అతనికి ఎవరూ ఎదురు చెప్పరు. గ్రామానికి ఏ అధికారి వచ్చినా ముందు అతన్నే కలుస్తారు. కొత్త వారెవరికైనా అతడే బస ఏర్పాటు చేస్తాడు.

ఇప్పుడు కూడా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతనితో ఉన్నాడు అతనిని “రెబిని” అంటారు .

ఆ అధికారి “నాయక” ఇంటి వద్ద ఉన్నాడు అధికారులు వచ్చినప్పుడు గ్రామపెద్ద చాలా మర్యాదగా దుస్తులు ధరిస్తాడు. సాధారణంగా నడుముకు ఒక గుడ్డ మాత్రమే ధరించే గ్రామపెద్ద. ఒంటిపై కోటు ధరించి, తలకు తలపాగా చుడతాడు. సాల్ ఆకులతో చేసిన చుట్ట తలపాగా నుండి తొంగిచూస్తూన్నది. అప్పుడతను చాలా సంస్కారంగా ప్రవర్తిస్తాడు. సందర్శనకు వచ్చిన అధికారుల ముందు తన ప్రత్యేకతను చాటుకుంటాడు. ఆ విధంగా గ్రామ పెద్ద అ ప్రత్యేకమైన దుస్తులతో ముఖ్యమైన వ్యక్తులను వినయంగా ఆహ్వానిస్తాడు. అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ వద్దకు కూడా వెళ్లి వినయంగా ముందుకు వంగి పాదాలను తాకి తన తలను తాకాడు. నెమ్మదిగా ఏవో మంత్రాలు కూడా చదివాడు.

“ఓ ప్రభువా నేను నీకు విధేయుడిని “గారడ్” నీవే నాకు యజమానివి. నీ పాదాలు చల్లగా ఉండాలి” అన్నాడు.

గ్రామమంతా ఫారెస్ట్ గాడ్ వచ్చిన వార్త చాటింపంయ్యింది. ఫారెస్ట్ గార్డు వచ్చాడని అందరూ కంగారు కంగారుగా మాట్లాడుతూ ఉన్నారు. జమాన్ జమాన్ గార్డ్ గార్డ్ అని కేకలు వినబడుతున్నాయి.

గిరిజన గ్రామాల్లో నాయక్ తో పాటు” బారిక్” అనే గ్రామ కాపలాదారు మరో తెగకు చెందినవాడు ఉంటాడు. నాయక్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉంటాడు. గ్రామ పెద్ద సూచన మేరకు ఒక పెద్ద వెదురు చేతి కర్ర పట్టుకొని ఊరంతా తిరుగుతూ గ్రామస్థులకు గ్రామ పెద్ద ఇంటి వద్ద సమావేశమున్నదని తెలియపరుస్తాడు.

గ్రామస్తులంతా కూరగాయలు చిరుధాన్యాలు తెచ్చి ఫారెస్ట్ గార్డ్ కోసం గ్రామ పెద్ద ఇంటిముందు కుప్ప పోస్తారు.

ఆ గిరిజన ప్రజలకు ప్రభువు అంటే ఫారెస్ట్ గార్డ్. ఆ గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబానికి ఒక జత ఎద్దులు ఉంటాయి . అడవిలో ఎద్దులను మేపినందుకు రుసుము, నాగలి పన్ను వసూలు చేసేవాడు. వ్యవసాయం కోసం కొన్ని చెట్లను పొదలను నరికి కాలుస్తారు గిరిజనులు. అది భూమిని సారవంతం చేస్తుంది. ఆ విధంగా వారు పోడు వ్యవసాయం చేస్తారు. చెట్లు కాల్చిన ఆనవాళ్లను బట్టి ఫారెస్ట్ గార్డ్ గిరిజనులను విచారించి జరిమానా వేస్తాడు. అదేవిధంగా అడవిలో అనుమతి లేకుండా తేనెను సేకరించిన ఇల్లు కట్టుకునేందుకు కలప కోసం చెట్లను నరికినా ఫారెస్ట్ గార్డ్ కు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అందుకోసం అతడు అడవంతా కలియతిరుగుతూ, నేరస్తులను వెతుకుతూ ఉంటాడు. అడవి ప్రాంతంలో కొండల్లో లోయల్లో అతడొక్కడే తన భుజాలపై చట్టాన్ని కాపాడుతున్నట్టు భావిస్తాడు. పులులు ఎలుగులు తిరిగే ముప్పది మైళ్ల విస్తీర్ణంలోని అడవిని సంరక్షణ చేసినందుకు, అతని వేతనం నెలకు ఎనిమిదివందల రూపాయలు మాత్రమే. అతడంటే గిరిజనులకు మృత్యువు కంటే ఎక్కువ భయం.

గిరిజనులంతా కోడి మాంసం కోడిగుడ్లు కూరగాయలు సమర్పించి వాటిని స్వీకరించ వలసిందిగా అతని కాళ్లపై బడి ప్రార్థిస్తారు. అతడు వాటిని స్వీకరించి వారి విన్నపాలు వింటాడు.

సోమ్లా వ్యవసాయం చేసేందుకు ఇంకా ఎక్కువ భూమి అవసరం ఉన్నది. భూక్యా టీక్యాల పెళ్లిళ్లు చేయాలి. వారికి ప్రత్యేకంగా గుడిసెలు కాస్త దూరంగా ఏర్పాటు చేయాలి. తమ పొరుగు వాళ్లైన మరో తెగకు చెందిన సల్మాన్, ఇమ్రాన్ ఫారెస్ట్ గార్డ్ దయతో, పదిఎకరాల కంటే ఎక్కువ భూమిని, కొండ ప్రాంతంలో అడవిని నరికి సాగు చేసుకుంటున్నారు. వారిద్దరూ ఫారెస్ట్ గార్డ్ కు సన్నిహితులు సోమ్లా చేతులు అడవిని నరికేందుకు దురద పెడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లను నరికి వాటితో కొడుకులకు ఇల్లు కట్టించాలి. గిరిజన సంప్రదాయం ప్రకారం కొడుకులు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత తల్లిదండ్రులతో కలిసి ఉండరు. వారికి ప్రత్యేకంగా సొంత ఇల్లు ఉండవలసిందే.

ఒకరోజు మధ్యాహ్నం సోమ్లా ఫారెస్ట్ గార్డ్ వద్దకు వెళ్ళాడు. రెండు లావుపాటి కోళ్లను, మూడు పనస పళ్ళను పట్టుకొని వాటిని గ్రహించమని అతడి పాదాలపై పడి, “ఓ ప్రభువా నా మీద దయ చూపించు. లేదంటే నేను చచ్చిపోతాను” అన్నాడు.

కానీ ఫారెస్ట్ వాడు సమాధానం చెప్పలేదు. నడుము గుడ్డలో ఉన్న రెండు రూపాయల నోటును ఫారెష్ట్ గార్డ్ కాళ్ల మీద ఉంచి.

మళ్లీ “ఓ ప్రభువా” అని వేడుకున్నాడు సోమ్లా.

” నీకేం కావాలి” అంటూ ఫారెస్ట్ గార్డ్ అరిచాడు. “నేను కొండపై అడవిని నరకాలి అనుకుంటున్నాను”

” సరే చేసుకో పో” అన్నాడు ప్రభువు వంటి గార్డ్. అది విని సోమ్లొ అతని ప్రార్థనలను ఆలకించినందుకు ఆనందంతో తొందరగా పరుగందుకున్నాడు ఇంటికి.

కోళ్లను వండుకొని తిన్న తర్వాత ఫారెస్ట్ గార్డ్ మరో గ్రామానికి బయలుదేరాడు. అతని సామానులను సరుకులను మోసేందుకు బారిక్ నలుగురు యువకులను పొలంలో పని చేసుకునే వాళ్లను గుంజుకొచ్చాడు. గార్డు సామాన్లను మోస్తూ ఆ గిరిజన యువకులు ముందుకు నడిచారు. వారి వెంట ఫారెస్ట్ గార్డ్ తీరిగ్గా తుపాకీని భుజంపై పెట్టుకుని గ్రామస్తులంతా గుంపులుగా తన వెనుక రాగా ప్రయాణం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం దాటిన తర్వాత దారిలో సెలయేటి వద్దకు వారు చేరే సమయానికి సాలీ అడవి ఆకుకూరలను శుభ్రం చేస్తోంది. అక్కడికి చేరుకునే సమయానికి ఫారెస్ట్ గార్డ్ బుద్ధిపూర్వకంగా వెనుకబడి మిగిలిన వారిని ముందుకు నడవనిచ్చాడు. తర్వాత మెల్లగా వాగు ఒడ్డు వద్దకు చేరి, వెక్కిరిస్తున్నట్టుగా అడిగాడు “ఏం చేస్తున్నావ్ అమ్మాయి” అంటూ.

“ఈ ఆకులు వండుకోడానికి” సమాధానం చెప్పింది.

” నాకు కొన్ని ఇస్తావా” అన్నాడు మరో అర్థం వచ్చేట్టు నవ్వుతూ.

” గ్రామస్తులు ఇచ్చిన కూరగాయలు సరిపోలేదా, ఈ అడవిలో ఆకులు ఏం చేసుకుంటావు” అన్నది. అతడు దూరం నుండి వాగు వద్దకు కొందరు అమ్మాయిలు రావడం చూసి, మడమతిప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వాగులో చేరిన అమ్మాయిలందరూ నవ్వుకుంటూ చతురులాడుకుంటూ దూరం నుండి ఫారెస్ట్ గార్డ్ ని చూశామని, అతనిమీద చెణుకులు వేసుకున్నారు. వారికి అడవిని నరకడం ధాన్యాన్ని నాటడం వంటి వాటితో సంబంధం లేదు. వారి పెద్దలే అవన్నీ చూసుకుంటారు కనుక. గార్డు వారిని ఎలా వేధించాడో ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అతని పట్ల ఎవరికీ సదభిప్రాయం లేదు.

” వాడొక జంతువు” అన్నారొకరు.

” అవును” అన్నది ఒక అమ్మాయి..

” నీకు తెలుసా నాతో ఏమన్నాడో” అన్నది ఇంకొక ఆమె.

“నా వెంట పడ్డాడు” అన్నది ఇంకొక ఆమె.

“వాడికి సిగ్గు లేదు” అని ఇంకొకామె అంటే,

నవ్వుతూ “ఎంత అందగాడు ఎండిపోయిన సన్న కట్టెపుల్ల వలె ఉంటాడు. గానీ వాడి కళ్ళల్లో ఎంత కోరికో” అన్నది ఒక ఆమె.

“ఎట్లా అరుస్తాడు కదా” నాకైతే చాలా భయం అన్నది ఒక అమ్మాయి.

“మా నాన్న ఒక నల్లటి కోడిని వాడి కోసం వదిలేశాడు. ఆ కోడి ఇప్పుడు గుడ్లు పెడుతుంది” అన్నారొకరు.

వారంతా చాలాసేపు అతని గురించి మాట్లాడుకున్నారు. తర్వాత మర్చిపోయారు. వారిలో కమ్లీ కూడా ఉన్నది. ఆమె తండ్రి వాల్యా. సాలీ ప్రియనేస్తం కమ్లీ. సాలీ సోదరుడు భూక్యా తో కమ్లీకి నిశ్చితార్థం జరిగింది. సాలీ కూడా రంగ్లా కొడుకు హేమ్లాతో ప్రేమలో పడిందని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని, ఊర్లో ఒక పుకారు నడుస్తూన్నది. అది కమ్లీ కూడా విన్నది. కమ్లీ నవ్వుతూ సాలీ పై సరసంగా నీళ్లు చల్లింది.

” ఇదిగో ఇప్పుడు చూడు శ్రీమతి హేమ్లా” అంటూ. మరిన్ని నీటిని చల్లుతూ “ఎవరిని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు శ్రీమతి హేమ్లా నాకు చెప్పు” అన్నది.

” ఏ నోరు మూసుకో” అన్నది సాలీ.

” కాదు కాదు నువ్వు చెప్పు నాకు” అంటూ వెంటపడింది కమ్లీ.

అప్పుడు సాలీ నవ్వుతూ “ముందు నువ్వు చెప్పు నీకేం కావాలో ప్రియమైన వదినా” అంటూ సరసమాడింది.

“నీకు వదిన ఎవరు అవుతారు” అంటూ నీళ్ళలో మునిగింది కమ్లీ.

“ఎవరు కావాలనుకుంటున్నారో వారే”అంటూ చురక పెట్టింది సాలీ.

” నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగదు” అంటూ కమ్లీ కోపంగా తల ఊపింది.

కానీ రోజుకు పది సార్లు వారిద్దరూ అట్లనే సరసాలు ఆడుకుంటారు.

ఊరి మధ్యలో పెళ్లికాని యువతులకు కోసం ఒక వసతి గృహం వంటిది ఉన్నది. దానికి కొద్ది దూరంలోనే యువకుల కోసం కూడా ఒకటి ఉన్నది. ప్రాచీన గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లి కానీ యువతి యువకులు తమ కుటుంబాలతో కాక యువతులంతా ఒకచోట యువకులంతా ఒకచోట , వేరు వేరు వసతి గృహాల్లో(డార్మిటరీ) సామూహికంగా నిద్రిస్తారు.

కానీ కొన్నిసార్లు సాలీ అర్థరాత్రి దాటినా యువతుల డార్మిటరీకి రావడం లేదు.

ఇప్పుడు కమ్లీకి అవకాశం దొరికింది ” సాలీ నువ్వెందుకు వసతిగృహంలోకి పడుకోడానికి రావడం లేదు. వేరే అమ్మాయిలు ఉన్నారా ఆ దారిలో” అని అడిగింది.

“ఎందుకు ఉంటారు ? వేరే అమ్మాయిలు. నేను ఎవరి గురించి ఆలోచించను” అన్నది సాలీ.

” ఇది నిజం కాదేమో ” అన్నది కమ్లీ.

“మనం ఒకరికి ఎందుకు భయపడాలి, కానీ నువ్వు రాత్రి రావాల్సింది సాలీ, పాపం హేమ్లా రాత్రంతా నీకోసం డుంగుడుంగా మీటుతూ పాడుతూనే ఉన్నాడు “ఓ నా సాలీ. సాలీ సాలీ నీ పేరును పెదవులపై మోగిస్తూ చచ్చి పోతాను అంటున్నాడు” అన్నది కమ్లీ.

పదేపదే ఆ పాట పాడుతూ సరస మాడింది తరువాత గొంతు మార్చి మధురంగా

“రాత్రిపూట నువ్వు రావాలి” అన్నది కమ్లీ.

“అవును” అన్నది సాలీ.

కమ్లీ ఒక నవ్వు నవ్వి తన దారిన వెళ్ళిపోయింది.

సాలీ ఆకుకూరలను కడుగుతూన్నది.

సూర్యుడు ఆకాశంలో ఒక కవితలా మిగిలిపోయాడు, సెలయేటి అంచున ఎడారిలా సాలీ మనసు విచారంలో మునిగింది. ఆమె తన ప్రియుని గురించి

ఆలోచించడం మొదలు పెట్టింది. అతని శక్తివంతమైన జింక వంటి కళ్ళు పులి వంటి ముఖము ఆమెకెంతో ఇష్టం. వారిద్దరూ బాల్య స్నేహితులు కొన్ని సంవత్సరాలుగా కలిసి ఆడుకుంటూ పెరిగారు. ఇద్దరూ పొడవైన సాల్ వృక్షాల వలె ఎత్తుగా పెరిగారు. సియాలీ తీగల వలె ఒకరిపై ఒకరు ఆలోచనలు పెంచుకున్నారు. చాలాసార్లు అతని సమక్షంలో అడవంతా పువ్వులతో పులకించినట్లనిపించేది ఆమెకు. అవన్నీ గుర్తు చేసుకుంటుంది ఆమె. తన ఊహల్లో తన కోసం పాడే పాట గుర్తు చేసుకుంది. డుంగుడుంగా మీటుతూ ఆనందాన్ని విషాదాన్ని ప్రేమను కలిపి తన ప్రేయసి కోసం పాడే పాట అడివంతా ప్రతిధ్వనించినట్టు ఉంటుంది.

ఉన్నట్టుండి ఒక జింక అరిచింది వాగు అటువైపు ఒడ్డున పొదల నుండి. సాలీ ఆలోచనలనుండి బయటకు వచ్చింది. సాయంత్రం అయిందని గమనించి ఇంటి దారి పట్టింది తొందర తొందరగా.

*** *** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

సుద్దులు